QIP issues
-
అదానీకి కొత్త ఊపు.. రూ.4200 కోట్ల నిధులు
న్యూఢిల్లీ: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) ఇష్యూ ద్వారా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,200 కోట్లు) సమీకరించినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. కార్యకలాపాల విస్తరణ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. క్విప్ ఇష్యూకి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు, దేశీ మ్యుచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి 4.2 రెట్లు బిడ్లు వచ్చినట్లు సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: సగానికి పడిపోయిన టాటా కంపెనీ లాభంఅదానీ ఎంటర్ప్రైజెస్ గతేడాది జనవరిలోనే రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ప్రకటించినప్పటికీ, సరిగ్గా అదే సమయంలో గ్రూప్ కార్యకలాపాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదల చేయడం ప్రతికూల పరిణామాలకు దారి తీసింది. ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ, కంపెనీ దాన్ని రద్దు చేసుకుని, ఇన్వెస్టర్లకు సొమ్ము వాపసు చేసింది. -
పీఎన్బీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 103.75 ధరలో 48.19 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఫ్లోర్ ధర రూ. 109.16తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌గా పీఎన్బీ పేర్కొంది. ఈ నెల 23–26 మధ్య క్విప్ సబ్ర్స్కిప్షన్ పూర్తయినట్లు వెల్లడించింది.మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, బీమా కంపెనీలు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి రూ. 41,734 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. ఇవి క్విప్ ప్రాథమిక పరిమాణం రూ. 2,500 కోట్లకు 16.7 రెట్లు అధికంకాగా.. మొత్తం సమీకరణ పరిమాణం రూ. 5,000 కోట్లకు 8.3 రెట్లు అధికమని వివరించింది. క్విప్ నిధులను బ్యాంక్ సీఈటీ–1 నిష్పత్తి మెరుగుకు, కనీస మూలధన నిష్పత్తి పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. -
మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించింది. దాంతో రూ.3,000 కోట్లు సమీకరించింది.సంస్థ ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు చెల్లించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను చెల్లించలేదనే వాదనలున్నాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే కంపెనీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించేందుకు పూనుకుంది. ఫలితంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఈ సొమ్ములోని కొంత మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, టీడీఎస్ చెల్లించేందుకు వినియోగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!కంపెనీ ప్రకటించిన క్యూఐపీలో దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఈ ఇష్యూను సబ్స్క్రయిబ్ చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, డీజీసీఏ డేటా ప్రకారం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తగ్గిపోతోంది. జనవరిలో ఈ వాటా 5.6 శాతంగా ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతూ ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా 10.5 శాతంగా నమోదవ్వడం గమనార్హం. సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74గా ఉండేది. 2024లో వీటి సంఖ్య 28కి చేరింది. -
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3,000 కోట్ల క్యూఐపీ
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ కోసం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ/సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ) ప్రారంభించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. వ్యాపార వృద్ధికి, నియంత్రణపరమైన కనీస అవసరాలను చేరుకునేందుకు నిధుల సమీకరణ చేపట్టనుంది. క్యూఐపీ ఫ్లోర్‌ప్రైస్‌గా (షేరు ధర) రూ.66.19 నిర్ణయించింది. క్యూఐపీ కోసం ఈ నెల 10–23 మధ్య బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్‌షో కూడా నిర్వహించింది. యస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ట్రెజరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎడెల్వీజ్, ఎస్బీఐ లైఫ్, మిరే, కోటక్ లైఫ్, ఫెడరల్ బ్యాంకు తదితర ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఫ్లోర్ ప్రైస్‌పై గరిష్టంగా 5 శాతం మించకుండా తగ్గింపును ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు తెలిపింది. క్యూఐపీ కింద షేరు కేటాయింపు ధర (తుది)పై ఈ నెల 30న క్యాపిటల్ ఇష్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న కేంద్ర సర్కారుకు ప్రస్తుతం 90 శాతానికిపైనే వాటా ఉంది. తాజా క్యూఐపీ అనంతరం ప్రభుత్వ వాటా చెప్పుకోతగ్గంత దిగిరానుంది. దీంతో కనీస ప్రజల వాటా విషయంలో నిబంధనలను పాటించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
కరోనాతో స్పైస్‌జెట్- క్విప్‌తో ఐడీబీఐ బోర్లా
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో తొలుత 400 పాయింట్లవరకూ పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 150 పాయింట్లు క్షీణించి 45,404 వద్ద కదులుతోంది. కాగా.. కొత్త రూపు సంతరించుకుని వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా యూకేకు అన్ని దేశాలూ విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక మరోపక్క క్విప్‌లో భాగంగా జారీ చేసిన షేర్లు తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావడంతో ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో పతన బాట పట్టాయి. వివరాలు ఇలా.. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) స్పైస్‌జెట్ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో యూకేకు నడుపుతున్న అన్ని విమాన సర్వీసులనూ ఈ నెల 31వరకూ దేశీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ బాటలో నడుస్తున్నాయి. వందే భారత్ మిషన్‌లో భాగంగా స్పైస్‌జెట్ సైతం యూరోపియన్ దేశాలకు 30 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. లండన్, ఆమ్స్టర్డామ్, టొరంటో, రోమ్, మిలన్‌లకు విమానాలను నడుపుతోంది. అంతేకాకుండా యూరప్, ఆఫ్రికా, అమెరికా తదితర దేశాలతో కనెక్టవిటీకి వీలుగా ఇటీవలే ఎమిరేట్స్‌తో అవగాహనా ఒప్పందాన్ని సైతం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో తొలుత స్పైస్‌జెట్ షేరు దాదాపు 10 శాతం పతనమై రూ. 82.35ను తాకింది. ప్రస్తుతం 8.5 శాతం నష్టంతో రూ. 84 దిగువన ట్రేడవుతోంది. సోమవారం సైతం ఇదే స్థాయిలో నష్టపోవడం గమనార్హం! ఐడీబీఐ బ్యాంక్ క్విప్‌లో భాగంగా ఐడీబీఐ బ్యాంక్ సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్) జారీ చేసిన 37.18 కోట్ల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీలలో నేటి నుంచి లిస్టయ్యాయి. 44 సంస్థలకు షేరుకి రూ. 38.60 ధరలో బ్యాంక్ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,435 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఫ్లోర్ ధర రూ. 40.63తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో షేర్లను కేటాయించింది. ఇక మరోపక్క బ్యాంకులో మెజారిటీ వాటా కలిగిన పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ నుంచి రూ. 1,500 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 20 శాతం కుప్పకూలింది. రూ. 30.75ను తాకింది. ప్రస్తుతం 13.4 శాతం నష్టంతో రూ. 33 వద్ద ట్రేడవుతోంది. -
పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్
ముంబై, సాక్షి: మార్కెట్లు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఫలితంగా రికార్డ్ గరిష్టాలను తాకాయి. ఈ నేపథ్యంలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) కారణంగా పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మరోపక్క వచ్చే జనవరి 1 నుంచి వివిధ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి పీఎన్బీ కౌంటర్ నష్టాలతో డీలాపడగా..ఎంఅండ్ఎం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం సమావేశమైన మూలధన పెట్టుబడుల సమీకరణ కమిటీ క్విప్ ఇష్యూకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఇందుకు రూ. 37.35 ఫ్లోర్ ధరను ప్రకటించింది. క్విప్‌లో భాగంగా అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్ ఇప్పటికే అనుమతులు పొందింది. అయితే ఫ్లోర్ ధరకు 5 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వబోమని బ్యాంక్ తెలియజేసింది. క్విప్ ధర, షేర్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో పీఎన్బీ షేరు 8.3 శాతం పతనమై రూ. 37.25ను తాకింది. ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ. 38.60 వద్ద ట్రేడవుతోంది. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్) మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 1 నుంచి ప్రయాణికుల, వాణిజ్య వాహన ధరలను పెంచనున్నట్లు ఎంఅండ్ఎం తాజాగా వెల్లడించింది. ముడిసరుకులు, తదితర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. పెంపు వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు తొలుత ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 746ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. -
యాంబర్ పతనం- జూబిలెంట్ ఫుడ్ జోరు
మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ట్రేడవుతున్నాయి. కాగా.. క్విప్ ముగిసిన నేపథ్యంలో యాంబర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలపై ఆశావహ అంచనాల కారణంగా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ప్రైజెస్ షేరు నష్టాలతో డీలాపడగా.. ఫాస్ట్‌ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. యాంబర్ ఎంటర్ప్రైజెస్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా యాంబర్ ఎంటర్ప్రైజెస్ రూ. 400 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 1,780 ధరలో చేపట్టిన క్విప్ గురువారం(10న) ముగిసింది. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 9.6 శాతం కుప్పకూలి రూ. 1,723ను తాకింది. ప్రస్తుతం 8 శాతం నష్టంతో రూ. 1,757 వద్ద ట్రేడవుతోంది. వెరసి మంగళవారం నమోదైన ఇంట్రాడే గరిష్టం రూ. 1,997తో పోలిస్తే 12 శాతం నీరసించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో మెరుగైన ఫలితాలు ప్రకటించగలదన్న అంచనాలతో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కౌంటర్ మరోసారి బలపడింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,378వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 2.5 శాతం లాభంతో రూ. 2,322 వద్ద ట్రేడవుతోంది. క్యూ1 ఫలితాల సందర్భంగా కంపెనీ జులై, ఆగస్ట్‌లలో అమ్మకాలు సగటున 77 శాతం చొప్పున పుంజుకున్నట్లు వెల్లడించింది. -
యాక్సిస్ బ్యాంక్ క్విప్ షురూ- షేరు అప్
ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్ ధరగా ఒక్కో షేరుకి రూ. 442.19ను బ్యాంకు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇది మంగళవారం ముగింపు ధర రూ. 429తో పోలిస్తే 3 శాతం అధికం. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత నెల 31న జరిగిన వార్షిక సమావేశంలోనే యాక్సిస్ బ్యాంకు బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన హోల్‌టైమ్ డైరెక్టర్ల కమిటీ క్విప్ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 8,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూకి అధిక స్పందన లభిస్తే మరో రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. గతంలో యాక్సిస్ బ్యాంక్ ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో క్విప్ ద్వారా రూ. 12,500 కోట్లు సమీకరించింది. కాగా.. ఈ జూన్‌కల్లా బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.29 శాతంగా నమోదైంది. తాజా నిధుల సమీకరణతో బ్యాంక్ టైర్-1 క్యాపిటల్ 1.5 శాతంమేర మెరుగుపడనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు క్విప్, తదితర అంశాలపై తిరిగి ఈ నెల 10న నిర్వహించనున్న సమావేశంలో సమీక్షను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3.6 శాతం ఎగసి రూ. 445 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 447 వరకూ జంప్ చేసింది. కోవిడ్-19 కారణంగా దేశ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు(ఎన్పీఏలు) సగటున 11.5 శాతంవరకూ ఎగసే వీలున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ అంచనా వేసిన విషయం విదితమే. దీంతో బ్యాంకులు తాజా పెట్టుబడుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సగటున గతేడాది మొండిరుణాలు 8.3 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. -
ఇన్ఫో ఎడ్జ్- ఐసీఐసీఐ ప్రు లైఫ్.. జోరు
దేశీయంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 164 పాయింట్లు పుంజుకుని 35,075కు చేరింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 35,000 పాయింట్ల మైలురాయి ఎగువన కదులుతోంది. ఇక నిఫ్టీ 55 పాయింట్లు బలపడి 10,386 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆన్లైన్ క్లాసిఫైడ్ సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్, బీమా రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఆన్లైన్ క్లాసిఫైడ్ సేవల కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా పేర్కొంది. తద్వారా రూ. 1,875 కోట్లవరకూ సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వాటాదారుల నుంచి ఈవోటింగ్ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది(2019-20) క్యూ4లో కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 63 శాతం క్షీణించి రూ. 119 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం పెరిగి రూ. 327 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇన్ఫో ఎడ్జ్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,907 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2962 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 1.5 శాతం వాటాకు సమానమైన 21.5 మిలియన్ షేర్లను సోమవారం మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ విక్రయించింది. తద్వారా సమకూర్చకున్న రూ. 840 కోట్లను బ్యాలన్స్‌షీట్‌ను పటిష్టపరచుకునేందుకు వినియోగించనుంది. కాగా.. ప్రయివేట్ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో 1.14 శాతం వాటాను సింగపూర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ. 391.6 ధరలో 16.43 మిలియన్ షేర్లను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 419 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 424 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. వెరసి రెండు రోజుల్లో ఈ షేరు 7 శాతం బలపడింది. -
‘క్విప్’తో రెండేళ్లదాకా నిధుల కొరత ఉండదు: ఎస్బీఐ
ముంబై: త్వరలో చేపట్టనున్న క్విప్ ఇష్యూ తరువాత రెండేళ్ల వరకూ కొత్త పెట్టుబడుల అవసరం ఉండబోదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం(క్విప్) ద్వారా రూ. 11,500 కోట్లను సమీకరించేందుకు బ్యాంకు ఇప్పటికే అనుమతులు పొందింది. క్విప్ తరువాత మాత్రమే నిధుల సమీకరణకు విదేశీ బాండ్ల జారీ వంటివి చేపట్టే అవకాశమున్నదని అరుంధతి తెలిపారు. క్విప్ తరువాత బ్యాంకులో ప్రభుత్వ వాటా 58%కు పరిమితం కానుంది. కాగా, ప్రభుత్వం రూ.2,000 కోట్ల పెట్టుబడుల ను అందించేందుకు గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేసింది. మార్చికల్లా క్విప్ ఇష్యూ పూర్తికానుంది. -
క్విప్ ఇష్యూలకు బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్‌బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టనున్నాయి. తద్వారా రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నాయి. క్విప్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సైతం ఉన్నాయి. ఈ బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల సమీకరణకు వీలుగా ఆయా బోర్డుల అనుమతిని కోరనున్నాయి. రానున్న జనవరి-మార్చి క్వార్టర్లో క్విప్ ద్వారా స్టేట్‌బ్యాంక్ రూ. 9,576 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కూడా పొందింది. ఇక ఐడీబీఐ బ్యాంక్ రూ. 1,200 కోట్లను, దేనా బ్యాంక్ రూ. 800 కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా షేర్ల అమ్మకం ద్వారా ఐవోబీ రూ. 350 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 320 కోట్లను అందుకోవాలని చూస్తున్నాయి. కాగా, 2013లో క్విప్‌ల ద్వారా దేశీయ కంపెనీలు రూ. 12,000 కోట్లను సమీకరించాయి. -
క్విప్ ఇష్యూలకు బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్‌బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టనున్నాయి. తద్వారా రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నాయి. క్విప్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సైతం ఉన్నాయి. ఈ బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల సమీకరణకు వీలుగా ఆయా బోర్డుల అనుమతిని కోరనున్నాయి. రానున్న జనవరి-మార్చి క్వార్టర్లో క్విప్ ద్వారా స్టేట్‌బ్యాంక్ రూ. 9,576 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కూడా పొందింది. ఇక ఐడీబీఐ బ్యాంక్ రూ. 1,200 కోట్లను, దేనా బ్యాంక్ రూ. 800 కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా షేర్ల అమ్మకం ద్వారా ఐవోబీ రూ. 350 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 320 కోట్లను అందుకోవాలని చూస్తున్నాయి. కాగా, 2013లో క్విప్‌ల ద్వారా దేశీయ కంపెనీలు రూ. 12,000 కోట్లను సమీకరించాయి.