ముంబై, సాక్షి: మార్కెట్లు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఫలితంగా రికార్డ్ గరిష్టాలను తాకాయి. ఈ నేపథ్యంలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) కారణంగా పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మరోపక్క వచ్చే జనవరి 1 నుంచి వివిధ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి పీఎన్‌బీ కౌంటర్ నష్టాలతో డీలాపడగా..ఎంఅండ్‌ఎం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ)
పంజాబ్ నేషనల్ బ్యాంక్
మంగళవారం సమావేశమైన మూలధన పెట్టుబడుల సమీకరణ కమిటీ క్విప్ ఇష్యూకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. ఇందుకు రూ. 37.35 ఫ్లోర్ ధరను ప్రకటించింది. క్విప్‌లో భాగంగా అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్ ఇప్పటికే అనుమతులు పొందింది. అయితే ఫ్లోర్ ధరకు 5 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వబోమని బ్యాంక్ తెలియజేసింది. క్విప్ ధర, షేర్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్‌ఎస్ఈలో పీఎన్‌బీ షేరు 8.3 శాతం పతనమై రూ. 37.25ను తాకింది. ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ. 38.60 వద్ద ట్రేడవుతోంది. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్)
మహీంద్రా అండ్ మహీంద్రా
జనవరి 1 నుంచి ప్రయాణికుల, వాణిజ్య వాహన ధరలను పెంచనున్నట్లు ఎంఅండ్‌ఎం తాజాగా వెల్లడించింది. ముడిసరుకులు, తదితర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. పెంపు వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు తొలుత ఎన్‌ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 746ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 740 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment