ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించింది. దాంతో రూ.3,000 కోట్లు సమీకరించింది.
సంస్థ ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు చెల్లించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను చెల్లించలేదనే వాదనలున్నాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే కంపెనీ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించేందుకు పూనుకుంది. ఫలితంగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఈ సొమ్ములోని కొంత మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, టీడీఎస్ చెల్లించేందుకు వినియోగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
కంపెనీ ప్రకటించిన క్యూఐపీలో దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఈ ఇష్యూను సబ్‌స్క్రయిబ్ చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, డీజీసీఏ డేటా ప్రకారం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తగ్గిపోతోంది. జనవరిలో ఈ వాటా 5.6 శాతంగా ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతూ ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా 10.5 శాతంగా నమోదవ్వడం గమనార్హం. సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74గా ఉండేది. 2024లో వీటి సంఖ్య 28కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment