salaries delay
-
మూడు నెలల వేతన బకాయిలు చెల్లింపు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ గురువారం ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు కంపెనీ క్యూఐపీ ద్వారా నిధులు సేకరించింది. దాంతో రూ.3,000 కోట్లు సమీకరించింది.సంస్థ ఉద్యోగులకు జూన్ నుంచి వేతనాలు చెల్లించడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. దాంతోపాటు ఏప్రిల్ 2020-ఆగస్టు 2023 మధ్య ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.220 కోట్ల టీడీఎస్(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను చెల్లించలేదనే వాదనలున్నాయి. ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే కంపెనీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా నిధులు సేకరించేందుకు పూనుకుంది. ఫలితంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) నుంచి రూ.3,000 కోట్లను సమీకరించింది. ఈ సొమ్ములోని కొంత మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలు, టీడీఎస్ చెల్లించేందుకు వినియోగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!కంపెనీ ప్రకటించిన క్యూఐపీలో దాదాపు 87 దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొని ఈ ఇష్యూను సబ్స్క్రయిబ్ చేసుకున్నాయి. ఇదిలా ఉండగా, డీజీసీఏ డేటా ప్రకారం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తగ్గిపోతోంది. జనవరిలో ఈ వాటా 5.6 శాతంగా ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతూ ఆగస్టులో 2.3 శాతానికి చేరింది. 2021లో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా 10.5 శాతంగా నమోదవ్వడం గమనార్హం. సంస్థ పరిధిలోని విమానాల సంఖ్య 2019లో 74గా ఉండేది. 2024లో వీటి సంఖ్య 28కి చేరింది. -
జెట్ బాటలో మరో సంస్థ..
సాక్షి, న్యూఢిల్లీ : సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మూసివేతకు దారితీసిన జెట్ ఎయిర్వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాటలో మరో విమానయాన సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఏప్రిల్ వేతనాలు చెల్లించలేమని పవన్ హంస్ యాజమాన్యం ఉద్యోగులకు పంపిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కంపెనీ సామర్ధ్యాన్ని పూర్తిగా సమీక్షించిన మీదట సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడైందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తగ్గి నికర నష్టం రూ 89 కోట్లుగా నమోదైందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పౌరవిమానయాన రంగంలో పరిస్థితులు సైతం భవిష్యత్ వృద్ధికి ఏ మాత్రం సానుకూలంగా లేవని స్పష్టం చేసింది. కాగా, కంపెనీ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నందున వేతనాలు చెల్లించలేమని యాజమాన్యం పేర్కొనడం పట్ల పవన్ హంస్ ఉద్యోగుల సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీ చర్య అమానవీయమైనదని ఆక్షేపించింది. వేతన సవరణ కోసం వేచిచూస్తున్న ఉద్యోగుల వేతనాలను నిలిపివేయడం తగదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు పెరిగిన వేతనాలను అందుకుంటున్న క్రమంలో యాజమాన్యం చర్య తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. యాజమాన్యం చర్యకు నిరసనగా తాము నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతామని పేర్కొంది. మరోవైపు ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాలను నిలిపివేయలేదని, ఏప్రిల్ వేతనాలు అందని ఉద్యోగుల సంఖ్య పరిమితమని పవన్‌హంస్ ప్రతినిధి స్పష్టం చేశారు. -
ప్రధానికి జెట్ ఎయిర్వేస్ పైలట్ల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను చెల్లించాలని యాజమాన్యానికి సూచించాలని కోరుతూ జెట్ ఎయిర్వేస్ పైలట్లు ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభులకు గురువారం లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ దివాళా అంచున ఉందని, ఈ సంస్థ ఉనికిని కోల్పోతే వేలాది మంది ఉద్యోగులు వీధినపడతారని తాము ఆందోళన చెందుతున్నామని జెట్ ఎయిర్వేస్ పైలట్లతో కూడిన ట్రేడ్ యూనియన్ సంస్థ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) పేర్కొంది. మార్చి 31లోగా తమ వేతనాలను పూర్తిగా చెల్లించకుంటే ఏప్రిల్ 1 నుంచి విధులకు దూరంగా ఉంటామని, విమాన సేవలను నిలిపివేస్తామని వారు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా తమకు సంస్థ జీతాల చెల్లింపులను నిలిపివేసిందని, జీతాలు చెల్లించాలంటూ తాము పలుమార్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ప్రధానికి రాసిన లేఖలో పైలట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలతో పాటు రోజువారీ చెల్లింపులనూ చేపట్టలేక చేతులెత్తేసింది. పలు విమాన సర్వీసులను జెట్ ఎయిర్వేస్ నిలిపివేయడంతో విమాన ప్రయాణీకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు బ్యాంకులు తమ రుణాలను వాటాలుగా మార్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు అనుగుణంగా బ్యాంకులు బెయిలవుట్ ప్యాకేజ్‌కు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. -
జీతాల సమస్య: క్షమాపణలు చెప్పిన కంపెనీ
న్యూఢిల్లీ : నరేష్ గోయల్‌కు చెందిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గత రెండు నెలల నుంచి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తోంది. సెప్టెంబర్ వేతనాలను కూడా జెట్ ఎయిర్వేస్ ఇంకా తన ఉద్యోగులకు చెల్లించలేదు. సీనియర్ మేనేజ్మెంట్కు, పైలెట్లకు, ఇంజనీర్లకు వేతనాలను ఆలస్యం చేస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నట్టు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. క్షమాపణలు ప్రకటించిన మేనేజ్మెంట్, ఎప్పుడు ఆ వేతనాలను ఇస్తారో మాత్రం వెల్లడించలేదు. ఆగస్టు నెల వేతనాలను ఆలస్యం చేసిన తర్వాత ఈ కంపెనీ, తన మూడు కేటగిరీ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు వేతనాలను రెండు విడతలు చెల్లించనున్నట్టు పేర్కొంది. ఆగస్టు నెల వేతనాన్ని సెప్టెంబర్ 11, 26వ తేదీల్లో చెల్లించనున్నట్టు ప్రకటించింది. దానిలో కూడా రెండో విడతను కూడా మరో రెండు ఇన్స్టాల్మెంట్స్గా చేసింది. సెప్టెంబర్ 26, అక్టోబర్ 9న చెల్లించనున్నట్టు పేర్కొంది. అదేమాదిరి సెప్టెంబర్ నెల వేతనాన్ని అక్టోబర్ 11, 26 తేదీల్లో చెల్లించాల్సి ఉంది. కానీ ముందుగా నిర్ణయించిన తుది గడువు ముగిసినప్పటికీ సెప్టెంబర్ నెల వేతనాన్ని కంపెనీ ఇంకా అందించలేదు. త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన జెట్ ఎయిర్వేస్, చెల్లింపుల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘వేతనాలు చెల్లించకుండా ఆపుతున్నందుకు ముందుగా మీకు క్షమాపణలు. ఈ విషయంలో మీ సహనాన్ని మెచ్చుకోవాలి. మీరు మీ డ్యూటీలను అంకితభావంతో చేస్తున్నారు. కంపెనీ తరఫున ఉద్యోగులకు కృతజ్ఞతలు’ అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా అన్నారు. అయితే యూనియన్‌లో ఉన్న నాయకులపై జెట్ ఎయిర్వేస్ పైలెట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు వేతనాలు చెల్లించాలని మేనేజ్మెంట్పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపిస్తున్నారు. -
సాక్షర భారత్‌కు మంగళం
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యంతో సాక్షరభారత్ ప్రాజెక్టును ప్రారంభించారు. సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా ప్రారంభించిన సాక్షరభారత్ పథకంలో పని చేస్తున్న కోఆర్డినేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాది కాలంలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లను అనేక కార్యక్రమాలలో ఉపయోగించుకున్నారు. వీరికి 8 నెలల జీతాల బకాయిలు అందాల్సి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తున్న సాక్షర భారత్ కోఆర్డినేటర్లను తొలగిస్తు న్నట్లు వయోజన విద్యా సంచాలకులకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యాప్తంగా 2010 సెప్టెంబర్ 8న సాక్షర భారత్ ప్రాజెక్టు ప్రారంభమైంది. జిల్లాలోని 789 పంచాయతీల్లో 1580 మంది గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండలానికి ఒకరు చొప్పున 50 మంది మండల కోఆర్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరిని మార్చి 31 నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో జీతాల విషయం ఎక్కడా పొందపరచలేదు. కోఆర్డినేటర్లు గ్రామాల్లోని వయోజనులను అక్షరాస్యులుగా చేయడంలో వీరు యజ్ఞంలా పనిచేశారు. సాక్షర భారత్ మొదటి నుంచి చివరి దశ వరకు మందకొడిగా సాగింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్ష్యరాస్యతలో జిల్లా వెనుకబడిఉంది. అయితే ప్రభుత్వం సాక్షరభారత్ వ్యవస్థను రద్దు చేసింది. సామగ్రిని సమీప ప్రభుత్వ ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అందించాలని జీవోలో ప్రస్తావించారు. రాత్రి వేళ అక్షరాలు నేర్పించడం, ఉదయం పత్రికలు, కథల పుస్తకాలు చదివించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.. మండల స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌ను, గ్రామ స్థాయిలో మరో కోఆర్డినేటర్లను నియమించారు. మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ.6000 వేతనం, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లకు రూ. 2వేలు చెల్లించేవారు. అలాగే కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.300 చొప్పున మంజూరు చేసేవారు. వయోజనులకు అక్షరాలు నేర్పిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కోఆర్డినేటర్లను ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే సాక్షర భారత్ కోఆర్డినేటర్లతో పనులు చేయించుకొని 10 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. గ్రామాల్లో, మండలాల్లో పెన్షన్లు, తదితర పనుల్లో పనులు చేయించుకొని మా పొట్ట కొట్టారు. బాబు వస్తే జాబు వస్తుందనుకొన్నాం, కానీ బాబు వస్తే ఉన్న జాబు ఊడిపోతుందని ఇప్పుడు అర్థమైంది. ప్రభుత్వం మాకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలి. –బాబు సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ -
ఎయిర్ ఇండియాకు పైలెట్ల షాక్
సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలతో సతమతమవుతున్న జాతీయ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నిరసిస్తూ యాజమాన్యానికి ఇక సహకరించబోమని పైలెట్లు తేల్చిచెప్పారు. ఎయిర్ ఇండియా మూడు నెలలుగా 11,000 మంది ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. వేతనాలను సక్రమంగా చెల్లిస్తూ ఎయిర్‌లైన్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ యాజమాన్యంతో సహకరించే ప్రసక్తి లేదని భారత వాణజ్య పైలెట్ల అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ కమిటీకి రాసిన లేఖలో ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఆర్ఈసీ) స్పష్టం చేసింది. వేతన చెల్లింపులు సహా స్వల్పకాలిక పెట్టుబడి వ్యయాల కోసం ఎయిర్ ఇండియా రూ 1000 కోట్ల రుణం కోరిన నేపథ్యంలో పైలెట్ల సమ్మె సంకేతాలు వెలువడటం గమనార్హం. ఎయిర్ ఇండియా విక్రయం కోసం ఇటీవల చేపట్టిన బిడ్డింగ్‌లో ఏ ఒక్కరూ బిడ్ దాఖలు చేయకపోవడం తెలిసిందే. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఇది వారి పనితీరుపైనా ప్రభావం చూపుతోందని ఈనెల 6న ఢిల్లీలో నిర్వహించిన ఆర్ఈసీ సమావేశంలో పైలెట్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
జీతాల కోసం సెక్యూరిటీ గార్డుల ధర్నా
నెల్లూరు(అర్బన్): పనిలో చేరి నాలుగు నెలలైనా ఒక్క నెల జీతం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పెద్దాసుపత్రి వద్ద 100 మంది సెక్యూరిటీ గార్డులు తమ విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. అనంతరం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవా«ధ్యక్షుడు నరమాల సతీష్ మాట్లాడారు. నాలుగు నెలలుగా జీతాలివ్వక పోయేసరికి పలువురు సిబ్బంది అర్ధాకలితో పనిచేసి ఇంటికి వెళుతున్నారన్నారు. ఇదే సమయానికి అటుగా వచ్చిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావుకి కూడా ఖాళీ క్యారియర్ బాక్సులు చూపించి బాధపడ్డారు. జీతాల విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ భారతిని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించగా తనకు సంబంధం లేదని, ఏజెన్సీ వారిని అడిగి తీసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. జేపీ ఇంతియాజ్‌కు తమ బాధలు విన్నవించుకోవడంతో సూపరింటెండెంట్‌ను పిలిచి జీతాల ఆగిన విషయమై వివరణ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అల్లాడి గోపాల్, యూనియన్ నాయకులు సందానిబాష, ఉస్మాన్, అహ్మద్ బాష, రమణయ్య పాల్గొన్నారు. సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం సెక్యూరిటీ గార్డుల విషయాన్ని విజయవాడలో ఉన్న కలెక్టర్ ముత్యాలరాజు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతికి ఫోన్ చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీతాలు రాకపోతే అధికారిగా ఏమి చర్యలు చేపట్టావో వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దిగొచ్చిన ఆమె కార్మికుల వద్దకి వచ్చి జీతాలు రెండు రోజుల్లో ఏర్పాటు చేయిస్తానన్నారు. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.