సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను చెల్లించాలని యాజమాన్యానికి సూచించాలని కోరుతూ జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభులకు గురువారం లేఖ రాశారు.
జెట్ ఎయిర్‌వేస్ దివాళా అంచున ఉందని, ఈ సంస్థ ఉనికిని కోల్పోతే వేలాది మంది ఉద్యోగులు వీధినపడతారని తాము ఆందోళన చెందుతున్నామని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లతో కూడిన ట్రేడ్ యూనియన్ సంస్థ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్‌ఏజీ) పేర్కొంది. మార్చి 31లోగా తమ వేతనాలను పూర్తిగా చెల్లించకుంటే ఏప్రిల్ 1 నుంచి విధులకు దూరంగా ఉంటామని, విమాన సేవలను నిలిపివేస్తామని వారు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా తమకు సంస్థ జీతాల చెల్లింపులను నిలిపివేసిందని, జీతాలు చెల్లించాలంటూ తాము పలుమార్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ప్రధానికి రాసిన లేఖలో పైలట్లు పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలతో పాటు రోజువారీ చెల్లింపులనూ చేపట్టలేక చేతులెత్తేసింది. పలు విమాన సర్వీసులను జెట్ ఎయిర్‌వేస్ నిలిపివేయడంతో విమాన ప్రయాణీకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు బ్యాంకులు తమ రుణాలను వాటాలుగా మార్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు అనుగుణంగా బ్యాంకులు బెయిలవుట్ ప్యాకేజ్‌కు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment