సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ వేతన చెల్లింపులపై చేతులెత్తేసింది. డిసెంబర్ వరకూ ఉన్న వేతన బకాయిలే చెల్లిస్తామని స్పష్టం చేసింది. వేతన బకాయిలను పూర్తిగా పరిష్కరించకుంటే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలను నిలిపివేస్తామని పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఇంజనీర్లు, సీనియర్ సిబ్బంది సహా పైలట్లకు నాలుగు నెలల నుంచి వేతన చెల్లింపు నిలిచిపోయింది. మార్చి 31 నాటికి బకాయిలు చెల్లించడంతో పాటు రానున్న మాసాల్లో వేతన చెల్లింపులపై రోడ్‌మ్యాప్ ప్రకటించని పక్షంలో విమానాలను ఎగరనీయమని సిబ్బంది అల్టిమేటం జారీ చేశారు.
ఇక డిసెంబర్ వేతనంలోనే 87.50 శాతం బకాయిని చెల్లించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం ఇంతవరకే చెల్లిస్తామని, సంస్థను గాడిలో పెట్టే ప్రక్రియ కొనసాగుతున్నందున సిబ్బంది డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆశించిన సమయం కంటే మరికొంత సమయం పడుతుందని జెట్ ఎయిర్‌వేస్ సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. మరోవైపు జెట్ ఎయిర్‌వేస్‌లో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు వాటా కల్పించేందుకు సంస్థ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనిత బోర్డు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment