జీతాల కోసం సెక్యూరిటీ గార్డుల ధర్నా
జీతాల కోసం సెక్యూరిటీ గార్డుల ధర్నా
Published Thu, Sep 29 2016 1:28 AM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM
నెల్లూరు(అర్బన్):
పనిలో చేరి నాలుగు నెలలైనా ఒక్క నెల జీతం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పెద్దాసుపత్రి వద్ద 100 మంది సెక్యూరిటీ గార్డులు తమ విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. అనంతరం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవా«ధ్యక్షుడు నరమాల సతీష్ మాట్లాడారు. నాలుగు నెలలుగా జీతాలివ్వక పోయేసరికి పలువురు సిబ్బంది అర్ధాకలితో పనిచేసి ఇంటికి వెళుతున్నారన్నారు. ఇదే సమయానికి అటుగా వచ్చిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావుకి కూడా ఖాళీ క్యారియర్ బాక్సులు చూపించి బాధపడ్డారు. జీతాల విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ భారతిని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించగా తనకు సంబంధం లేదని, ఏజెన్సీ వారిని అడిగి తీసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. జేపీ ఇంతియాజ్‌కు తమ బాధలు విన్నవించుకోవడంతో సూపరింటెండెంట్‌ను పిలిచి జీతాల ఆగిన విషయమై వివరణ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అల్లాడి గోపాల్, యూనియన్ నాయకులు సందానిబాష, ఉస్మాన్, అహ్మద్ బాష, రమణయ్య పాల్గొన్నారు.
సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం
సెక్యూరిటీ గార్డుల విషయాన్ని విజయవాడలో ఉన్న కలెక్టర్ ముత్యాలరాజు తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ భారతికి ఫోన్ చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీతాలు రాకపోతే అధికారిగా ఏమి చర్యలు చేపట్టావో వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో దిగొచ్చిన ఆమె కార్మికుల వద్దకి వచ్చి జీతాలు రెండు రోజుల్లో ఏర్పాటు చేయిస్తానన్నారు. దీంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.
Advertisement