అక్షరాలను నేర్చుకుంటున్న నిరక్షరాస్యులు (ఫైల్)
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యంతో సాక్షరభారత్ ప్రాజెక్టును ప్రారంభించారు. సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా ప్రారంభించిన సాక్షరభారత్ పథకంలో పని చేస్తున్న కోఆర్డినేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాది కాలంలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లను అనేక కార్యక్రమాలలో ఉపయోగించుకున్నారు. వీరికి 8 నెలల జీతాల బకాయిలు అందాల్సి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తున్న సాక్షర భారత్ కోఆర్డినేటర్లను తొలగిస్తు న్నట్లు వయోజన విద్యా సంచాలకులకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యాప్తంగా 2010 సెప్టెంబర్ 8న సాక్షర భారత్ ప్రాజెక్టు ప్రారంభమైంది. జిల్లాలోని 789 పంచాయతీల్లో 1580 మంది గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు.
మండలానికి ఒకరు చొప్పున 50 మంది మండల కోఆర్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరిని మార్చి 31 నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో జీతాల విషయం ఎక్కడా పొందపరచలేదు. కోఆర్డినేటర్లు గ్రామాల్లోని వయోజనులను అక్షరాస్యులుగా చేయడంలో వీరు యజ్ఞంలా పనిచేశారు. సాక్షర భారత్ మొదటి నుంచి చివరి దశ వరకు మందకొడిగా సాగింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్ష్యరాస్యతలో జిల్లా వెనుకబడిఉంది. అయితే ప్రభుత్వం సాక్షరభారత్ వ్యవస్థను రద్దు చేసింది.
సామగ్రిని సమీప ప్రభుత్వ ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అందించాలని జీవోలో ప్రస్తావించారు. రాత్రి వేళ అక్షరాలు నేర్పించడం, ఉదయం పత్రికలు, కథల పుస్తకాలు చదివించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.. మండల స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌ను, గ్రామ స్థాయిలో మరో కోఆర్డినేటర్లను నియమించారు. మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ.6000 వేతనం, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లకు రూ. 2వేలు చెల్లించేవారు. అలాగే కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.300 చొప్పున మంజూరు చేసేవారు. వయోజనులకు అక్షరాలు నేర్పిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కోఆర్డినేటర్లను ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే
సాక్షర భారత్ కోఆర్డినేటర్లతో పనులు చేయించుకొని 10 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. గ్రామాల్లో, మండలాల్లో పెన్షన్‌లు, తదితర పనుల్లో పనులు చేయించుకొని మా పొట్ట కొట్టారు. బాబు వస్తే జాబు వస్తుందనుకొన్నాం, కానీ బాబు వస్తే ఉన్న జాబు ఊడిపోతుందని ఇప్పుడు అర్థమైంది. ప్రభుత్వం మాకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలి.
–బాబు సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment