
సమ్మె సంకేతాలు పంపిన ఎయిర్ ఇండియా పైలెట్లు (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలతో సతమతమవుతున్న జాతీయ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నిరసిస్తూ యాజమాన్యానికి ఇక సహకరించబోమని పైలెట్లు తేల్చిచెప్పారు. ఎయిర్ ఇండియా మూడు నెలలుగా 11,000 మంది ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. వేతనాలను సక్రమంగా చెల్లిస్తూ ఎయిర్‌లైన్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ యాజమాన్యంతో సహకరించే ప్రసక్తి లేదని భారత వాణజ్య పైలెట్ల అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ కమిటీకి రాసిన లేఖలో ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఆర్‌ఈసీ) స్పష్టం చేసింది.
వేతన చెల్లింపులు సహా స్వల్పకాలిక పెట్టుబడి వ్యయాల కోసం ఎయిర్ ఇండియా రూ 1000 కోట్ల రుణం కోరిన నేపథ్యంలో పైలెట్ల సమ్మె సంకేతాలు వెలువడటం గమనార్హం. ఎయిర్ ఇండియా విక్రయం కోసం ఇటీవల చేపట్టిన బిడ్డింగ్‌లో ఏ ఒక్కరూ బిడ్ దాఖలు చేయకపోవడం తెలిసిందే. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఇది వారి పనితీరుపైనా ప్రభావం చూపుతోందని ఈనెల 6న ఢిల్లీలో నిర్వహించిన ఆర్‌ఈసీ సమావేశంలో పైలెట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment