క్విప్ ఇష్యూలకు బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు స్టేట్‌బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టనున్నాయి. తద్వారా రూ. 15,000 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నాయి. క్విప్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న జాబితాలో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐవోబీ), దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సైతం ఉన్నాయి.
ఈ బాటలో మరికొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిధుల సమీకరణకు వీలుగా ఆయా బోర్డుల అనుమతిని కోరనున్నాయి. రానున్న జనవరి-మార్చి క్వార్టర్‌లో క్విప్ ద్వారా స్టేట్‌బ్యాంక్ రూ. 9,576 కోట్లను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతిని కూడా పొందింది. ఇక ఐడీబీఐ బ్యాంక్ రూ. 1,200 కోట్లను, దేనా బ్యాంక్ రూ. 800 కోట్లను సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా షేర్ల అమ్మకం ద్వారా ఐవోబీ రూ. 350 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ. 320 కోట్లను అందుకోవాలని చూస్తున్నాయి. కాగా, 2013లో క్విప్‌ల ద్వారా దేశీయ కంపెనీలు రూ. 12,000 కోట్లను సమీకరించాయి.