విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈడీ సందీప్ బాత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ.6 వేల కోట్లు సమీకరించడానికి ఉద్దేశించిన ఐపీవోకు సంబంధించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బుధవారమిక్కడ రోడ్‌షో నిర్వహించింది. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐపీవో 21న ముగుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. ప్రమోటరు ఐసీఐసీఐ బ్యాంకు వాటాలతో కలిపి సుమారు 18.13 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇది నికరంగా సంస్థ పెయిడప్ షేర్ క్యాపిటల్‌లో 11.37 శాతం వాటా.
కనీసం 44 షేర్ల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుందని బాత్రా తెలియజేశారు. షేరు ధరల శ్రేణిని రూ. 300-334గా నిర్ణయించినట్లు చెప్పారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ మొత్తం ప్రీమియం వసూళ్లు సుమారు రూ. 19,164 కోట్ల మేర నమోదయ్యాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) దాదాపు రూ. 1.09 లక్షల కోట్లు కాగా, ప్రైవేట్ రంగ బీమా సంస్థల మార్కెట్లో దీనికి 11.3 శాతం వాటా ఉంది.