హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కస్టమర్లలో అధిక కవరేజీ ఉండే ప్లాన్ల వైపు మొగ్గు చూపే ధోరణి పెరిగిందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రోడక్ట్స్ విభాగం హెడ్ శ్రీనివాస్ బాలసుబ్రమణియన్ తెలిపారు. యాక్సిడెంటల్ డిజేబిలిటీ, ప్రీమియం వెయివర్, క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉండే టర్మ్ ప్లాన్లకు, జీవితంలోని వివిధ దశల్లో అవసరాలకు అనుగుణమైన కవరేజీనిచ్చే వినూత్న ప్లాన్లకు ఆదరణ పెరుగుతోందని వివరించారు.
పొదుపునకు సంబంధించి కచ్చితమైన రాబడినిచ్చే సాధనాలపై ఆసక్తి ఏర్పడిందన్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా భరోసా కల్పిస్తూ జీవితకాలం ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఐసీఐసీఐ ప్రూ ఐప్రొటెక్ట్ స్మార్ట్, ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ రిటర్వ్ ఆఫ్ ప్రీమియం వంటి వినూత్న పథకాలను తాము అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు కచ్చితమైన రాబడులిచ్చే పథకాలను కస్టమర్లు ఇష్టపడుతుండటంతో సుఖ్ సమృద్ధిలాంటి పథకాలు ఉన్నాయన్నారు. ఇవి కచ్చితమైన రాబడులతో పాటు బోనస్‌ల వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయని శ్రీనివాస్ చెప్పారు.
రిటైర్మెంట్ ప్లానింగ్ ముఖ్యం..
జీవన ప్రమాణాలు మెరుగుపడి జీవిత కాలం పెరుగుతున్న నేపథ్యంలో రిటైర్మెంట్ కోసం తగిన ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటోందని శ్రీనివాస్ చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుందని, ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్నదొక్కటే ఆదాయ మార్గంగా ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ఆర్థికంగా ఒత్తిడి లేని రిటైర్మెంట్ జీవితం గడపాలంటే సరైన ప్రణాళిక వేసుకుని, తగిన సాధనాల్లో సాధ్యమైనంత ముందు నుంచీ ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరమని శ్రీనివాస్ వివరించారు.
రిటైర్మెంట్ ప్రణాళికను ప్రధానంగా రెండు దశలుగా వర్గీకరించవచ్చని ఆయన చెప్పారు. మొదటి దశలో నిధిని ఏర్పాటు చేసుకోవడం, రెండో దశలో దాన్ని వినియోగించుకోవడం ఉంటుందన్నారు. జీవిత బీమా కంపెనీలు అందించే యులిప్స్, సాంప్రదాయ సేవింగ్స్ సాధనాల్లాంటివి దీర్ఘకాలికంగా రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకునేందుకు ఉపయోగపడగలవని శ్రీనివాస్ వివరించారు. అధిక రిస్కును భరించగలిగే వారు యులిప్‌లను ఎంచుకోవచ్చని, రిస్కులను ఎక్కువగా ఇష్టపడని వారు సాంప్రదాయ సేవింగ్స్ పథకాలను ఎంచుకోవచ్చన్నారు. యాన్యుటీలకు సంబంధించి జాయింట్ లైఫ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం స్థిరమైన ఆదాయం లభించగలదని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment