మన మార్కెట్లతో పోలిస్తే అమెరికా స్టాక్ మార్కెట్లలో పరిపక్వత ఎక్కువ. అలాగే అస్థిరతలు కొంచెం తక్కువ. ప్రపంచంలో ఆర్థికంగా బలీయమైన స్థానంలో ఉన్న అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమే అవుతుంది. పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. ఆ విధంగా చూసినా అమెరికా ఈక్విటీలకు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచిది. ఇలా అమెరికా స్టాక్ ఎక్సేంజ్‌ల్లోని లిస్టెడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్న ఫండ్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి.
పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం సూచనీయం కాదు. ఈక్విటీ, డెట్ రెండు రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు వర్గీకరించుకోవడం వైవిధ్యం అవుతుంది. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇక ఈక్విటీల్లోనూ వైవిధ్యం కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ వీలు కల్పిస్తుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి మన ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు, కొంత మేర అమెరికా స్టాక్స్‌కూ కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే గత రెండేళ్లుగా మన స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో కేవలం ఎంపిక చేసిన బ్లూచిప్ స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేశాయి. కానీ, ఇదే కాలంలో అమెరికా స్టాక్స్ మంచి పనితీరు ప్రదర్శించాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
పెట్టుబడుల విధానం..
ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వడమనే విధానంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పథకం తన పెట్టుబడులను అమెరికా స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టెడ్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, భారత్, ఇతర విదేశీ కంపెనీలు జారీ చేసే ఏడీఆర్, జీడీఆర్‌లలోనూ పెట్టుబడులు పెడుతుంది. అందులోనూ లార్జ్ క్యాప్ కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేస్తుంది. ప్రస్తుతం ఈ పథకం తన దగ్గరున్న నిధుల్లో 95.1 శాతం మేర స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఇక ఈక్విటీ మొత్తం పెట్టుబడుల్లో 94 శాతం మెగాక్యాప్, 6 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. మనదేశంలో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక శాతం (సెక్టార్ ఫండ్స్ కాకుండా) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కే అగ్ర ప్రాధాన్యం ఇస్తాయి. కానీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ అమెరికా స్టాక్స్‌లో హెల్త్‌కేర్ రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లో 25% ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 18% పెట్టుబడులను టెక్నాలజీ కంపెనీల్లో, 12% ఎఫ్‌ఎంసీజీలకు కేటాయించగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 7 శాతం కేటాయింపులు చేసింది.
రాబడులు
ఆరంభం నుంచి ఆకర్షణీయంగానే ఉంది. ఏడాది కాలంలో 9.71% రాబడులను ఇచ్చింది. గడిచిన మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 12.52 శాతం. ఐదేళ్లలో 11.54%, ఏడేళ్లలో 15.35% చొప్పున వార్షిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు, ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అప్పుడే ఆశించిన రాబడులకు అవకాశం ఉంటుంది. లార్జ్‌క్యాప్ ఫండ్ కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకాస్త మెరుగైన రాబడులకు వీలుంటుంది.
అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల కోసం
Published Mon, Mar 2 2020 6:22 AM | Last Updated on Mon, Mar 2 2020 6:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment