‘గుడ్లు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టరాదు’ అని ఇన్వెస్ట్‌మెంట్‌లో ప్రాథమిక సూత్రం ఒకటి ఉంది. ఇన్వెస్టర్లు అందరూ పాటించాల్సిన సూత్రం ఇది. కానీ, పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని అందరూ పాటించరు. కొంత మంది మాత్రం ఈక్విటీల్లో, బాండ్లలో, బంగారంలో ఇలా భిన్నమైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించుకునే సూత్రాన్ని అనుసరిస్తుంటారు. ఇలా పెట్టుబడులను ఒకటికి మించిన వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఒక్కో సమయంలో ఒక్కో సాధనం చూపించే అసాధారణ పనితీరు నుంచి ప్రయోజనం పొందొచ్చు. పైగా కొన్ని సందర్భాల్లో ఒక్కో విభాగం నష్టాలను చూడాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో రిస్క్‌ను తగ్గించుకున్నవారు అవుతారు. ఈక్విటీ పెట్టుబడులను సైతం అన్నింటినీ మన మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేయడం కాకుండా, కొంత భాగాన్ని యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కూడా వైవిధ్యమే అవుతుంది. ఒకప్పుడు లేని ఈ అవకాశాన్ని నేడు పలు బ్రోకరేజీ సంస్థలు తమ ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి.
భౌగోళికంగా భిన్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒకే మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడంతో పోలిస్తే ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది. పైగా మన ఈక్విటీ మార్కెట్లలో అందుబాటులో లేని వినూత్న అవకాశాలు యూఎస్ ఈక్విటీల్లో ఉన్నాయి. ఫేస్‌బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఈ తరహా సంస్థలు మన మార్కెట్లలో లిస్ట్ అయి లేవు. కానీ, ఈ దిగ్గజాలు ఎప్పటికప్పుడు మరింత బలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూజర్లను కలిగి ఉన్నవి కావడంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వృద్ధి ఫలాలను పొందొచ్చు. అమెరికాలో సెక్యూరిటీల నియంత్రణ మండలి అయిన ‘ఎస్‌ఈసీ’ ఫ్రాక్షనల్ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. ఉదాహరణకు చాలా ఖరీదైన షేరును కొనుగోలు చేయాలనుకునే వారి దగ్గర తక్కువ పెట్టుబడే ఉన్నట్టయితే.. అప్పుడు ఆ స్టాక్‌లో కొంత భాగాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. తమవద్దనున్న ఫ్రాక్షనల్ షేర్ల విలువకు తగినట్టు ఓటింగ్ హక్కులతోపాటు డివిడెండ్‌కు అర్హులవుతారు. తమ పిల్లలను అమెరికాలో ఉన్నత విద్యకు పంపించాలనుకుంటుంటే అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన అవుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా వారి విద్యకు అవసరమైన మొత్తాన్ని స్టాక్స్ పెట్టుబడుల రూపంలో సమకూర్చుకోవచ్చు.
ఇన్వెస్ట్ చేయడం ఎలా..?
దేశీయంగా ఈక్విటీల్లో నేరుగాను, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నట్టే.. యూఎస్ స్టాక్ మార్కెట్లలోనూ నేరుగా స్టాక్స్ కొనుగోలు చేసుకోవచ్చు. లేదా అక్కడి స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ వేదికలు అయిన వెస్టెడ్ ఫైనాన్స్, స్టాకాల్, విన్‌వెస్టా ఉన్నాయి. భారత్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థలు ఐసీఐసీఐ డైరెక్ట్, యాక్సిస్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యూఎస్ బ్రోకరేజీ సంస్థలతో ఒప్పందం చేసుకుని అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడుల సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో ఐసీఐసీఐ డైరెక్ట్.. ఇంటరాక్టివ్ బ్రోకర్స్ ఎల్‌ఎల్‌సీతోను, యాక్సిస్ సెక్యూరిటీస్ వెస్టెడ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి విదేశాల్లో ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభానికి కేవైసీ డాక్యుమెంట్లతోపాటు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
పాన్, గుర్తింపు ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం అవుతాయి. అకౌంట్ ఓపెనింగ్ చార్జీలు, బ్రోకరేజీ చార్జీలు, కమీషన్లు సంస్థలను బట్టి మారిపోతాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌పై అకౌంట్ ప్రారంభానికి ఎటువంటి చార్జీలను వసూలు చేయడం లేదు. కానీ, వార్షిక సబ్‌స్క్రిప్షన్ చార్జీగా రూ.999–9,999 మధ్య చెల్లించుకోవాలి. బ్రోకరేజీ కింద ఒక షేరుకు యూఎస్ సెంట్ నుంచి 2.99 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. అంటే కస్టమర్లు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా చార్జీల్లో మార్పు ఉంటుంది. ఐసీఐసీఐ డైరెక్ట్ కస్టమర్లకు ‘గ్లోబల్ స్టార్టర్’, ‘గ్లోబల్ అడ్వాంటేజ్’ అనే రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వెస్టెడ్ ఫైనాన్స్ బేసిక్ ప్లాన్ అకౌంట్ ప్రారంభానికి రూ.399 చార్జీ వసూలు చేస్తోంది. ఇది మినహా ఇతరత్రా బ్రోకరేజీ లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. మోడల్ పోర్ట్‌ఫోలియో తదితర విలువ ఆధారిత సేవలతో కూడినప్రీమియం ప్లాన్‌ను ఎంచుకున్న వారికి అకౌంట్ ప్రారంభ చార్జీల మినహాయింపు ఉంటుంది.
నిధుల బదిలీ..
ఆర్‌బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశాల్లో తమ ట్రేడింగ్ ఖాతాలకు నిధులను బదిలీ చేసుకోవచ్చు. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2,50,000 డాలర్లను పంపుకునేందుకు అనుమతి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్ మార్గంలో నిధుల బదిలీ సేవలను చాలా వరకు బ్రోకర్లు అందిస్తున్నారు. మరి ఒకవేళ అక్కడి స్టాక్స్‌ను విక్రయించి ఆ నిధులను తిరిగి వెనక్కి పొందాలంటే అందుకు కొంత సమయం తీసుకుంటుంది. బ్యాంకుల వద్ద ప్రాసెసింగ్‌కు పట్టే సమయంతోపాటు, అమెరికాలో టీ ప్లస్ 3 సెటిల్‌మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే విక్రయించిన నాటి నుంచి నాలుగో రోజు నిధులు అకౌంట్‌లో జమ అవుతాయి. మన దేశంలో టీప్లస్ 2 విధానం అమల్లో ఉంది.
మినహాయింపులు..
భారతీయ ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి యూఎస్ ఈక్విటీల్లో, లిస్టెడ్ బాండ్లలో, ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అమెరికన్ స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో ఇతర దేశాల కంపెనీల లిస్టింగ్‌కు కూడా అనుమతి ఉంది. ప్రస్తుతానికి 465 అమెరికాయేతర కంపెనీలు యూఎస్ ఎక్సే్చంజ్‌ల్లో క్రాస్‌లిస్డ్ అయి ఉన్నాయి. వీటిల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో వచ్చే ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే అవకాశం మాత్రం లేదు. భారత్‌లో నివసించే వారు అంతర్జాతీయ మార్కెట్లలో మార్జిన్ ట్రేడింగ్, లెవరేజీ ట్రేడింగ్‌కు ఆర్‌బీఐ అనుమతించడం లేదు. దీనికి అదనంగా కొన్ని బ్రోకరేజీ సంస్థలు అదనపు నియంత్రణలు పెడుతున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ అయితే అంతర్జాతీయ ట్రేడింగ్ అకౌంట్ ప్రారంభించే ఇన్వెస్టర్‌కు కనీసం 5,000 డాలర్ల నెట్‌వర్త్ ఉండాలంటూ నిబంధన అమలు చేస్తోంది. అంటే కనీసం రూ.3.7 లక్షల నెట్‌వర్త్ అయినా ఉండాలన్నమాట. ఇక రాబడులపై పన్నుల భారం కూడా మోయాల్సి ఉంటుంది. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడులపై అందుకునే డివిడెండ్‌పై 25 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్ పడుతుంది. అయితే, ఇటువంటి పన్నులను ఫామ్ 67ను దాఖలు చేయడం ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్
నేరుగా యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు తగినంత నైపుణ్యం ఉంటే ఫర్వాలేదు. లేకుంటే చేతులు కాల్చుకున్నట్లే. కనుక కొత్త ఇన్వెస్టర్లు, తగినంత సమయం వెచ్చించలేని వారికి ఫండ్స్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే పథకాలు) అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, నిప్పన్ ఇండియా యూఎస్ ఈక్విటీ అపార్చునిటీస్ ఫండ్, డీఎస్‌పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, ఎడెల్‌వీజ్ యూఎస్ వ్యాల్యూ ఈక్విటీ ఆఫ్‌షోర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఇలా ఎన్నో పథకాలు అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి
అవకాశాలను అందిస్తున్నాయి.
టీసీఎస్ పడుతుంది..
విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు నిజంగా మంచి అవకాశమే. ఇందులో సందేహం లేదు. కానీ పైన చెప్పుకొన్నట్టు పన్నుల భారాన్ని కూడా గమనించాలి. అక్టోబర్ 1 నుంచి ఒక ఏడాదిలో రూ.7లక్షలకు మించి నిధులు పంపించుకుంటే (విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌కు పంపుకునే నిధులపైనా) 5 శాతం మూలం వద్ద పన్నును బ్యాంకులు వసూలు చేయాలని (టీసీఎస్) కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఆధార్, పాన్ కార్డు ఇవ్వని వారి విషయంలో టీసీఎస్ 10 శాతం అమలవుతుంది. ‘‘ఈ నిబంధన తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం పన్ను పరిధిని పెంచడమే. ప్రభుత్వం వద్దనున్న సమాచారం ప్రకారం చూస్తే చాలా మంది వ్యక్తులు ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ఉపయోగించుకుని ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు’’ అని వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్ షా పేర్కొన్నారు.
విదేశీ స్టాక్స్, బాండ్లు, ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసే భారతీయులకు ఈ నిబంధన వల్ల వ్యయాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, నిజాయితీపరులైన వారు రిటర్నులు దాఖలు చేసి టీసీఎస్‌ను రిఫండ్‌గా పొందొచ్చని సూచిస్తున్నారు. ‘‘విదేశీ లావాదేవీల ప్రారంభ వ్యయాలను ఇది అధికం చేస్తుంది. అయితే, ఈ వ్యయాలను పన్ను రిటర్నులను దాఖలు చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఏడాదిలో రూ.7లక్షల్లోపు నగదు పంపుకునే ఇన్వెస్టర్లపై ఈ నిబంధనలు ఎటువంటి ప్రభావం చూపించవు’’ అని విన్‌వెస్టా సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ తెలిపారు. విదేశీ విద్య కోసం, విదేశీ పర్యటనల కోసం నిధుల వ్యయాలపై నిబంధనల్లో మార్పు ఉంది. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకులో రుణం తీసుకుని పంపిస్తున్నట్టు అయితే.. అది కూడా రూ.7లక్షలు మించిన సందర్భంలో 0.5 శాతాన్ని టీసీఎస్‌గా మినహాయిస్తారు. అదే విదేశీ పర్యాటక ప్యాకేజీలను బుక్ చేసుకుంటే ఎంత విలువ అన్నదానితో సంబంధం లేకుండా 5 శాతం టీసీఎస్ అమలవుతుంది. ఒకవేళ సొంతంగా విదేశీ పర్యటనను (ట్రావెల్ ఏజెన్సీలతో సంబంధం లేకుండా) బుక్ చేసుకుంటే ఈ పన్ను పడదు.
Comments
Please login to add a commentAdd a comment