ముంబై: భారత్‌పై అమెరికా, యూరప్‌లోని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆశావహంగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు ఈక్విటీల్లోకి 9.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు తిరిగి రావడమే ఇందుకు నిదర్శనమని స్విస్ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అంతక్రితం మూడు నెలల్లో 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయని వివరించింది.
చాలా మంది గ్లోబల్ ఇన్వెస్టర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి గెలుస్తారని విశ్వసిస్తున్నారని, డిసెంబర్ త్రైమాసికంలో పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదని పేర్కొంది. 50 పైగా అమెరికన్, యూరోపియన్ ఎఫ్‌పీఐలతో సమావేశాల అనంతరం యూబీఎస్ ఈ నివేదికను రూపొందించింది. ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు పెట్టుబడులు మెరుగ్గా ఉండటం .. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణికి కారణమని పేర్కొంది. అయితే, బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ప్రజలు తమ సొమ్మును ఈక్విటీల్లో కాకుండా ఇతరత్రా సాధనాల్లో దాచుకోవడం, వృద్ధి బలహీనపడటం తదితర రిస్కులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిఫ్టీ 18,000 స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment