భారత్‌లో ఉంటూ విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చా | Are Global Mutual Funds A Good Investment? | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఉంటూ విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చా

Published Mon, Oct 31 2022 9:24 AM | Last Updated on Mon, Oct 31 2022 10:42 AM

Are Global Mutual Funds A Good Investment? - Sakshi

నేను కొత్తగా ఫండ్స్‌లో పెట్టుబడులు ఆరంభించాను. యూఎస్‌ లేదా గ్లోబల్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను. మరి ఇందుకోసం ఫండ్స్‌ ఎంపిక విషయంలో ఎటువంటి విధానాన్ని అనుసరించాలి? వాటిల్లో ఎంత మేర ఇన్వెస్ట్‌ చేయాలి? –  వరుణ్‌ శర్మ
 
దేశం వెలుపలి ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాలను ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ అని పిలుస్తారు. భారతీయులకు దేశంలో ఉన్నత విద్య చదవాలనుకునే పిల్లలు ఉండొచ్చు. అటువంటి వారు విదేశీ కరెన్సీలో అయ్యే వ్యయాలకు ముందు నుంచే ఈ రూపంలో ప్రణాళిక రూపొందించుకోవచ్చు. పిల్లలు స్కూల్‌లో చేరినప్పటి నుంచి వారి భవిష్యత్‌ విదేశీ విద్య కోసం ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ వైపు చూడొచ్చు. దేశీ ఫండ్స్‌ మంచి రాబడులను ఇస్తున్నప్పటికీ.. మంచి రాబడినిచ్చే అంతర్జాతీయ పథకాలను కూడా పరిశీలించొచ్చు. ఈ పథకాల ఎంపికకు చూడాల్సిన అంశాలను గమనిస్తే.. 

వివిధ రంగాలు, కంపెనీల్లో పెట్టుబడుల వైవిధ్యంతో ఉన్న ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మనం భారత్‌లో నివసిస్తున్నప్పుడు, మన ఆదాయం, వ్యయాలు, ఆస్తులన్నీ ఇక్కడే ఉంటాయి. అంతర్జాతీయ పెట్టుబడులు అన్నవి మన మార్కెట్‌తో సంబంధం కలిగి ఉండవు. కాకపోతే ఈ మార్గం ద్వారా తగినంత వైవిధ్యాన్ని పాటించొచ్చు. దేశీయ మార్కెట్లో పెట్టుబడులపై ప్రభావాల నుంచి, ఈ రకమైన పెట్టుబడులతో కొంత రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చు.

అలాగే, కేవలం ఒకే రంగంలో పెట్టుబడులు పెట్టే ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ దూరంగా ఉండాలి. ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ థీమ్యాటిక్‌ ఫండ్‌ లేదా కమోడిటీ ఫండ్‌ లేదా ఓ దేశానికే సంబంధించి పెట్టబడులతో కూడిన పథకంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఈ విధమైన సంకుచిత పెట్టుబడుల విధానం అస్థిరతలతో కూడుకుని ఉంటుంది. అప్పటి వరకు సానుకూలంగా ఉన్న రాబడులు ప్రతికూలంగా మారిపోవచ్చు. అందుకని వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో ఉన్న పథకాలను ఎంపిక చేసుకోవాలి.  

అంతర్జాతీయ ఫండ్స్‌లో పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి మారకం విలువ. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో ముఖ్యంగా డాలర్‌ ఏటేటా బలపడుతోంది. 2017లో యూఎస్‌ డాలర్‌ రూపాయితో 65 దగ్గర ఉంటే, ఇప్పుడు 82కు చేరింది. ఐదేళ్లలో ఏటా 4 శాతానికి పైనే డాలర్‌ బలపడింది. ఈ విధమైన కరెన్సీ విలువ ప్రయోజనానికి అదనంగా, పథకంలో పెట్టుబడులపై ప్రతిఫలంతో మెరుగైన రాబడి అందుకోవచ్చు.

డాలర్‌ మారకంతో కూడిన ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా క్షీణించే రూపాయి విలువ పరంగా రక్షణ ఉంటుంది. అలాగే, ఈక్విటీ పథకాల మాదిరే ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌లోనూ దీర్ఘకాలం దృష్టితోనే పెట్టుబడులు పెట్టాలి. లేదంటే ఆశించిన రాబడులు రాకపోవచ్చు. ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌ను మన ఆదాయపన్ను చట్టం నాన్‌ ఈక్వటీ పథకాలుగా పరిగణిస్తుంది. ఇండెక్సేషన్‌ ప్రయోజనం పొందాలంటే మూడేళ్లకు పైగా కలిగి ఉండాలి. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ పథకాల్లోకి గత ఏడాది, మూడేళ్ల కాల పనితీరు చూసి పెట్టుబడులు పెట్టకూడదు.  

నేను మోర్గాన్‌ స్టాన్లీ గ్రోత్‌ ఫండ్‌లో 1994లో పెట్టుబడులు పెట్టాను. ఇందుకు సంబంధించి నా వద్ద భౌతిక పత్రాలు ఉన్నాయి.  ఈ పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలో సూచించగలరు? పేరు రాయలేదు
 
2014లో మోర్గాన్‌ స్టాన్లీ భారత్‌ నుంచి వెళ్లిపోయింది. ఈ వ్యాపారాన్ని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. మోర్గాన్‌ స్టాన్లీకి సంబంధించి ఎనిమిది పథకాలు హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కిందకు వచ్చేశాయి. మోర్గాన్‌ స్టాన్లీ గ్రోత్‌ ఫండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ కిందకు మారిపోయింది. 2009 వరకు క్లోజ్‌ ఎండ్‌ ఫండ్‌గా ఉన్న ఇది 15 ఏళ్ల లాకిన్‌ కాల వ్యవధి ముగియడంతో, ఓపెన్‌ ఎండెడ్‌ పథకంగా మారింది. 

మోర్గాన్‌స్టాన్లీ గ్రోత్‌ ఫండ్‌లో ఉన్న యూనిట్లను విక్రయించాలంటే మీ దగ్గరున్న ఆధారాలతో హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని సంప్రదించాలి. పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు కావాల్సిన సహకారాన్ని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సిబ్బంది అందిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement