న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి విలువ 2023 మార్చి నాటికి 3 శాతం తగ్గి రూ.68,321గా ఉంది. 2022 మార్చి నాటికి ఇది రూ.70,199గా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో ఒక్కో ఇనిస్టిట్యూషన్ ఖాతా సగటు పెట్టుబడి రూ.10.11 కోట్లుగా ఉంది. లిక్విడ్ ఫండ్స్‌తోపాటు ఇతర డెట్ ఆధారిత పథకాల్లో సగటు పెట్టుబడి ఎక్కువగా ఉంది. డెట్ ఆధారిత పథకాల్లో సగటు టికెట్ సైజు రూ.14.53 లక్షలుగా ఉంది. అదే ఈక్విటీ పథకాల్లో సగటున ఇది రూ.1.54 లక్షలుగా ఉంది. సాధారణంగా ఈక్విటీ పెట్టుబడులు ఎక్కువ కాలం పాటు ఉంటుంటాయి.
45 శాతం ఈక్విటీ పెట్టుబడులు రెండేళ్లకు పైగా కొనసాగుతున్నవి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో రెండేళ్లకు మించి కొనసాగిస్తున్నవి 56.5 శాతంగా ఉన్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) క్రమంగా పెరుగుతూనే వస్తుండడం గమనించొచ్చు. ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల పెరుగుతున్న అవగాహన, డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం ఇందుకు సానుకూలతలుగా చెప్పుకోవచ్చు. మొత్తం 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో ఇన్వెస్టర్ ఫోలియోలు గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 1.62 కోట్లు కొత్తగా ప్రారంభమయ్యాయి.
2014 డిసెంబర్ నాటికి 4.03 కోట్లుగా ఉన్న ఫోలియోలు 2023 మార్చి నాటికి 14.57 కోట్లకు చేరాయి. ఒక ఇన్వెస్టర్‌కు ఒక పథకంలో పెట్టుబడికి గుర్తుగా కేటాయించే నంబర్‌ను ఫోలియోగా చెబుతారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు 7 శాతం పెరిగి రూ.40.05 లక్షల కోట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment