ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఎన్నో విధానాలు ఉన్నాయి. అందులో స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్ కూడా ఒకటి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని కంపెనీల ధరలు ఆకర్షణీయమైన స్థాయిలకు, చౌక విలువకు దిగి వస్తాయి. అలాంటప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించడమే స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్‌లో కనిపిస్తుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ కూడా ఇదే మాదిరి పనిచేస్తుంటుంది. ఈ పథకానికి మెరుగైన రాబడుల చరిత్ర ఉంది.
రాబడులు
ఈ పథకంలో ఐదేళ్ల క్రితం ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఇప్పుడు అది రూ.2.8 లక్షలుగా మారి ఉండేది. ఈ పథకానికి ఐదేళ్ల చరిత్ర ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో శంకరన్ నరేన్‌తోపాటు, రోషన్ చట్కే దీని నిర్వహణ వ్యవహరాలు చూస్తున్నారు. ఈ పథకం 2019 జనవరి 15న మొదలైంది. ఆరంభం నుంచి చూస్తే ఈ పథకం ఏటా 22.9 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక రాబడులు (సీఏజీఆర్) అందించింది.
ఈ పథకం పనితీరుకు బెంచ్‌మార్క్‌గా పరిగణించే నిఫ్టీ 500 టీఆర్‌ఐ ఇదే కాలంలో ఇచ్చిన రాబడి 19 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో ఏటా 37.7 శాతం చొప్పున రాబడి అందించగా, నిఫ్టీ 500 టీఆర్‌ఐ రాబడి 19.8 శాతంగానే ఉంది. సూచీ కంటే 17.9 శాతం అధిక రాబడిని అందించినట్టు తెలుస్తోంది. ఏడాది కాల రాబడి చూసినా 38 శాతంగా ఉంది. ఇదే కాలంలో సూచీ రాబడి 30 శాతమే కావడం గమనించాలి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఈ పథకంలో సిప్ చేస్తూ వచ్చి ఉంటే, రూ.12.58 లక్షలు సమకూరి ఉండేది.
పెట్టుబడుల విధానం
ముందు చెప్పినట్టుగానే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా అపార్చునిటీస్ అన్నది స్పెషల్ సిచ్యుయేషన్స్ థీమ్‌తో నడిచే పథకం. ఏదైనా ఒక కంపెనీ లేదా రంగంలో కొన్ని సమస్యల వల్ల షేరు ధర గణనీయంగా దిద్దుబాటుకు గురైనప్పుడు, ఆ కంపెనీ/రంగం దీర్ఘకాల వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయన్నది ఈ పథకం అంచనా వేస్తుంది. దీర్ఘకాలంలో బలమైన, మెరుగైన పనితీరుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫండ్ మేనేజర్ భావిస్తే వెంటనే దిద్దుబాటుకు గురైన కంపెనీల్లో, రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, పెట్టుబడిదారులకు మంచి రాబడులను ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. సకాలంలో లాభాలు స్వీకరించడం, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కంపెనీలపై దృష్టి సారించడం వంటివి మంచి పనితీరుకు దోహదం చేస్తున్న అంశాలు.
పోర్ట్‌ఫోలియో
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.15,205 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 92.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 1.53 శాతం డెట్ సాధనాలకు కేటాయించగా, మిగిలినది నగదు రూపంలో ఉంది. ఈక్విటీల్లో 78 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 20 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ కేటాయింపులు 1.78 శాతంగా ఉన్నా యి. ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఫార్మాస్యూటికల్స్, టెలికం సర్వీసెస్ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉంది.
టాప్ ఈక్విటీ హోల్డింగ్స్
కంపెనీ పెట్టుబడుల శాతం
భారతీ ఎయిర్‌టెల్ 6.74
ఐసీఐసీఐ బ్యాంక్ 6.40
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4.64
సన్‌ఫార్మా 4.43
ఇన్ఫోసిస్ 3.96
కోటక్ బ్యాంక్ 3.92
ఓఎన్‌జీసీ 3.81
ఎన్‌టీపీసీ 3.75
టాటా స్టీల్ 2.93
హీరో మోటో 2.82
Comments
Please login to add a commentAdd a comment