
కోవిడ్-19 నేపథ్యంలోనూ జూన్‌లో కొత్త బిజినెస్ ప్రీమియం(ఎన్‌బీపీ)లపై పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించకపోవడంతో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఏప్రిల్- మే నెలల స్థాయిలోనే ఎన్‌బీపీలు క్షీణించడంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కౌంటర్లో మాత్రం అమ్మకాలు తలెత్తాయి. ఇతర వివరాలు చూద్దాం..
రికవరీ బాట
కరోనా వైరస్ సవాళ్ల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జీవిత బీమా కంపెనీల ఎన్‌బీపీలు వార్షిక ప్రాతిపదికన 32.6 శాతం క్షీణించాయి. మే నెలలోనూ 25.4 శాతం వెనకడుగు వేయగా.. జూన్‌లో 10.5 శాతమే తగ్గాయి. వెరసి జూన్‌లో జీవిత బీమా కంపెనీల మొత్తం ఎన్‌బీపీలు రూ. 28,869 కోట్లను తాకాయి.
లాభాలలో
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 2.2 శాతం లాభంతో రూ. 858 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 872 వరకూ జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.3 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 600 వరకూ జంప్‌చేసింది.
నేలచూపు..
జూన్‌లో ఎన్‌బీపీలు 37 శాతం క్షీణించి రూ. 565 కోట్లను తాకినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇవి 32.6 శాతం తక్కువగా రూ. 1499 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐసీఐసీఐ ప్రు లైఫ్ షేరు 3.5 శాతం పతనమై రూ. 418 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 416 వరకూ నీరసించింది.
Comments
Please login to add a commentAdd a comment