రిస్క్‌ తక్కువ,.. రాబడి ఎక్కువ... | ICICI Prudential MNC Fund Review | Sakshi
Sakshi News home page

రిస్క్‌ తక్కువ,.. రాబడి ఎక్కువ...

Published Mon, Jul 26 2021 10:08 AM | Last Updated on Mon, Jul 26 2021 5:06 PM

ICICI Prudential MNC Fund Review - Sakshi

మన రోజువారి అవసరాలు తీర్చే బహుల జాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) పెట్టుబడుల విషయంలో.. ఎంతో విశ్వసనీయంగా ఉంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంఎన్‌సీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేసే (థీమ్యాటిక్‌) పథకాలను ఇందుకు ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎన్‌ఎసీ ఫండ్‌ కూడా ఒకటి. ఈక్విటీల్లో తక్కువ రిస్క్‌ కోరుకునే వారికి ఎంఎన్‌సీ పథకాలు అనుకూలంగా ఉంటాయి. 

పెట్టుబడుల విధానం..  
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎన్‌సీ ఫండ్‌ పెట్టుబడుల విషయంలో మూడు రకాల విధానాలను అనుసరిస్తుంటుంది. భారత్‌కు చెందిన బహుళజాతి సంస్థలు (మన దేశంలో లిస్ట్‌ అయ్యి విదేశాలకూ వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన కంపెనీలు), భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఇక్కడి స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్‌ అయిన విదేశీ కంపెనీలు, భారత్‌లో లిస్ట్‌ కాకుండా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలను ఈ పథకం పెట్టబడులకు ఎంపిక చేసుకుంటుంది. వినియోగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, పారిశ్రామిక తయారీ, మెటల్స్, ఐటీ, సిమెంట్, ఫార్మాస్యూటికల్స్‌ రంగాలకు సంబంధించిన ఎంఎన్‌సీ కంపెనీలు పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉంటాయి. బహుళజాతి సంస్థలు కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తుంటాయి. నిపుణుల ఆధ్వర్యంలో డైనమిక్‌గా పనిచేస్తుంటాయి. లాభాల నుంచి వాటాదారులకు ఎక్కువ డివిడెండ్‌ కూడా పంచుతుంటాయి. కనుక స్థిరమైన రాబడులకు వీటిని మార్గంగా నిపుణులు పరిగణిస్తుంటారు. బలమైన బ్రాండ్, దండిగా నగదు నిల్వలు ఎంఎన్‌సీ కంపెనీల్లో చూడొచ్చు. అందుకే పరిణతి కలిగిన ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఎంఎన్‌సీ కంపెనీలకు చోటిస్తుంటారు.

ఈ తరహా లక్షణాలు ఉండడం వల్ల ఇతర రంగాల థీమ్యాటిక్‌ పథకాలతో పోలిస్తే ఎంఎన్‌సీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్‌ తక్కువ అస్థిరతలను ఎదుర్కొంటుంటాయి. సెబీ నిబంధనల మేరరు ఎంఎన్‌సీ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతం పెట్టుబడులను బహుళజాతి కంపెనీలకే కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని ఫండ్‌ మేనేజర్లు తమ స్వేచ్ఛ మేరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎంఎన్‌సీ పథకాల్లోనూ సైక్లికల్‌ (రాబడుల్లో స్థిరత్వం లేని), డిఫెన్సివ్‌ (స్థిరమైన రాబడులతో రక్షణాత్మకమైనవి) ఉంటాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాల కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ ఏడాది జూన్‌ నాటికి చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎన్‌సీ పథకం 20 శాతం పెట్టుబడులను అంతర్జాతీయ ఎంఎన్‌సీలకు కేటాయించింది. వీటిల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కన్జ్యూమర్‌ నాన్‌ డ్యురబుల్స్, ఆయిల్‌ అండ్‌ పెట్రోలియం కంపెనీలున్నాయి. దేశీయ ఎంఎన్‌సీ కంపెనీల విషయానికొస్తే.. ఈ పథకం పెట్టుబడుల్లో 61 శాతాన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత 26.5 శాతం మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. పోర్ట్‌ఫోలియో మొత్తం మీద వైవిధ్యంతో కూడుకుని ఉంది. దేశీయ కంపెనీల్లో కన్జ్యూమర్‌ నాన్‌ డ్యురబుల్స్, సాఫ్ట్‌వేర్, ఆటో, పారిశ్రామిక ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్‌ రంగానికి చెందినవి ఉన్నాయి. 

రాబడులు
పెట్టుబడుల విషయంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎన్‌సీ ఫండ్‌ మంచి పనితీరే చూపిస్తోంది. ఈ పథకానికి దీర్ఘకాల రాబడుల చరిత్ర లేదు. ఎందుకంటే 2019 జూన్‌లో ప్రారంభమైంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 28 శాతంగా ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 62 శాతం రాబడులను ఇచ్చింది. మెరుగైన రాబడులుగానే వీటిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బెంచ్‌మార్క్‌తో పోల్చి చూసినా లేక ఎంఎన్‌సీ థీమ్యాటిక్‌ విభాగం రాబడులతో చూసినా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎన్‌సీ రాబడులు ఎంతో మెరుగ్గా ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement