ఎల్‌ఐసీ నుంచి తొలి ఆన్‌లైన్ టర్మ్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న ఆన్‌లైన్ టర్మ్ పాలసీ విభాగంలోకి దేశీయ అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ ప్రవేశించింది. ‘ఈ టర్మ్’ పేరుతో తొలి ఆన్‌లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా ఎల్‌ఐసీ కేవలం తక్షణం పెన్షన్ అందించే జీవన్ అక్షయ-6 మాత్రమే అందుబాటులో ఉండేది. తొలిసారిగా బీమా రక్షణతో కూడిన పాలసీని ప్రవేశపెట్టినా, ఇతర ప్రైవేటు బీమా కంపెనీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్లకు టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారుగా రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే చాలా ప్రైవేటు కంపెనీలు ఇదే మొత్తానికి రూ.5,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వరంగ కంపెనీ అయి ఉండటం, క్లెయిమ్ సెటిలిమెంట్స్‌లో 97.73 శాతంతో అందరికంటే మొదటి స్థానంలో ఉండటం వంటి కారణాలు ప్రీమియం ధరను అధికంగా నిర్ణయించడానికి కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం బీమా రక్షణ తప్ప ఎటువంటి మెచ్యూర్టీ ఉండని చౌకగా ఉండే విధంగా టర్మ్ పాలసీలను ఆన్‌లైన్‌లో తొలిసారిగా 2009లో ప్రవేశపెట్టారు. సాధారణ టర్మ్ పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండటం, అధిక బీమా రక్షణ ఉండటంతో సహజంగానే వీటికి డిమాండ్ పెరిగింది.
పాలసీలోని ఆకర్షణలు
ధూమపానం అలవాటు లేనివారికి ప్రీమియంలో సుమారు 30% తగ్గింపును ఈ టర్మ్ పాలసీ ఆఫర్ చేస్తోంది. 18 ఏళ్లు నిండిన వారి నుంచి 60 ఏళ్ల వారు వరకు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కనీస కాలపరిమితి 10-35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస బీమా రక్షణ మొత్తం రూ.25 లక్షలు, అదే ధూమపానం అలవాటు లేని వారికి రూ.50 లక్షలుగా నిర్దేశించారు. ఏడాది ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా నేరుగా నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం చెల్లించొచ్చు. కాని ఈ పాలసీ తీసుకునే ముందు ఇప్పటి వరకు మీ పేరు మీద ఉన్న అన్ని బీమా పాలసీ వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది.