HDFC Life
-
గిఫ్ట్ సిటీలో హెచ్డీఎఫ్సీ లైఫ్ సేవలు
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) నుంచి హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సేవలను ఆరంభించాయి. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ గ్రూప్ గురువారం ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థ ఐఎఫ్ఎస్సీలో ‘హెచ్డీఎఫ్సీ ఇంటర్నేషనల్ లైఫ్ అండ్ ఆర్ఈ’ని ఏర్పాటు చేసింది. ఇదే కేంద్రంలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ను హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ప్రారంభించింది. డాలర్ డినామినేటెడ్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఎన్ఆర్ఐలకు ఆఫర్ చేయనున్నట్టు హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. ఇదే మాదిరి హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఫండ్ సొల్యూషన్లను అందించనుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇంటర్నేషనల్ తన తొలి ఉత్పత్తిని సైతం ప్రకటించింది. ‘యూఎస్ డాలర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్లాన్’ పెట్టుబడులకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. పిల్లల విదేశీ విద్యకు నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారికి ఇది అనుకూలమని తెలిపింది. కరెన్సీ మారకంలో అస్థిరతలను ఇది నివారిస్తుందని పేర్కొంది. మరోవైపు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సైతం ఆరు కొత్త పథకాలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపింది. -
14 నెలల్లోనే ఎక్సైడ్ లైఫ్ విలీనం పూర్తి
ముంబై: తమ అనుబంధ సంస్థ ఎౖక్సైడ్ లైఫ్‌ను రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో విలీనం చేసుకున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో విభా పదల్కర్ తెలిపారు. సకాలంలో అనుమతులు ఇచ్చి తమకు ప్రోత్సాహం, మద్దతుగా నిలిచినందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ)తోపాటు, ఇతర నియంత్రణ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన వ్యాపార వృద్ధిని నమోదు చేసినట్టు ప్రకటించారు. ఎక్సైడ్ లైఫ్ విలీనానికి ముందు ఏపీఈ 11% వృద్ధి సాధించినట్టు చెప్పారు. పరిశ్రమకు అనుగుణంగానే తమ పనితీరు ఉందంటూ, లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించామని, మార్కెట్ వాటాను 14.6 శాతంనుంచి 15%పెంచుకున్నట్టు తెలిపారు. -
కరోనాతో ఆర్ధిక అవగాహన పెరిగింది
న్యూఢిల్లీ: భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక సన్నద్ధత విషయమై గడిచిన రెండేళ్ల కాలంలో వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లినట్టు హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఆర్థిక అవగాహన, బీమా ప్రాధాన్యం పెరిగినట్టు పేర్కొంది. ‘లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021’ పేరుతో ఒక నివేదికను సోమవారం విడుదల చేసింది. తమ ఆర్థిక ప్రణాళికలు సరిపడా లేనట్టు ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపింది. ఈ సూచీ 2019తో పోలిస్తే 4.5 పాయింట్లు తగ్గినట్టు పేర్కొంది.‘‘ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఉద్యోగ భద్రత, ఆదాయ క్షీణతతో రుణ భయం ఈ మూడు ప్రధాన అంశాలు విశ్వాసం సన్నగిల్లేందుకు కారణం’’ అని ఈ నివేదిక తెలియజేసింది. ముఖ్యాంశాలు... టైర్–1, టైర్–2 పట్టణాలతో పోలిస్తే మెట్రోలలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కుగా ఉంది. చిన్న కుటుంబాలు మరింత ఇబ్బందులు పడ్డాయి. సంక్షోభ సమయంలో ఉమ్మడి కుటుంబాలు (మద్దతు వల్ల) కొంచెం గట్టిగా నిలబడ్డాయి.90 శాతం మంది వేతనకోతలు, వ్యాపార నష్టాన్ని ఎదుర్కొన్నారు. కరోనాతో జీవితానికి రక్షణ అవసరమన్న అవగాహన పెరిగింది. టర్మ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన 11 పాయింట్లు పెరగ్గా.. ఎండోమెంట్, యులిప్‌ల విషయంలో 10 పాయింట్లు పెరిగింది. కరోనా మొదటి దశ తర్వాత 41 శాతం మంది (సర్వేలో పాల్గొన్న 1987 మందిలో) టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. చదవండి : ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం -
విజయా బ్యాంక్‌తో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఒప్పందం
న్యూఢిల్లీ: బీమా సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్ విజయా బ్యాంక్ ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది. దేశవ్యాప్తంగా 2,129 శాఖలను కలిగిన విజయా బ్యాంక్ తమ ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ బీమా సేవలను అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు విజయా బ్యాంక్ సీఈఓ ఆర్ఏ శంకర నారాయణన్ చెప్పారు. దీర్ఘకాలంలో ఇరు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కు పోటీగా...?
ముంబై : హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్ లు రెండూ జతకట్టి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైఫ్ ఇన్సూరర్ గా ఉద్భవించబోతున్నాయి. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తో విలీనం అయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులు విలీన చర్చలు జరపడానికి ముంబైలో సమావేశం కాబోతున్నారని వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఈ సమావేశానికి అధ్యక్షత కాబోతున్నారని పేర్కొన్నారు. ఈ విలీన వార్త మార్కెట్లకి అందగానే శుక్రవారం ఉదయం ట్రేడింగ్ లో మ్యాక్స్ ఫైనాన్సియల్ సర్వీస్ లిమిటెడ్ షేర్లు, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. మ్యాక్స్ ఫైనాన్సియల్ షేర్లు 20శాతం, హెచ్ డీఎఫ్ సీ షేర్లు 1.5శాతం పుంజుకున్నాయి. ఈ రెండు కంపెనీలు విలీనమై అతిపెద్ద ప్రైవేట్ సంస్థగా ఉన్న ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ కంటే దూసుకుపోయేందుకు సన్నద్ధ మవుతున్నాయని తెలుస్తోంది. అదేవిధంగా దేశంలో ఉన్న ఇన్సూరెన్స్ సంస్థలకు ఈ విలీనం గట్టి పోటీని ఇవ్వనుందని సమాచారం. మార్కెట్ షేర్ ను, లాభాలను పెంచుకోవడానికి కంపెనీలు కొత్త మార్గాలను చేపడుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రణాళిక గురించి కంపెనీలు అధికారికంగా ఇంకో కొన్ని రోజుల్లో వెల్లడించనున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, దాదాపు దశాబ్దం తర్వాత లైఫ్ ఇన్సూరర్స్ లో జరగబోయే మొదటి విలీనం ఇదే కానుంది. ఈ రెండు కంపెనీలు విలీనమై ఒకటిగా సేవలు అందించేందుకు షేర్ హోల్డర్స్ సైతం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ డీల్ ఎలా ఉండబోతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. హెచ్డీఎఫ్ లిమిటెడ్ కు, స్టాండర్డ్ లైఫ్ కు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్. ఈ కంపెనీ 61శాతం యాజమాన్య వాటా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, 35శాతం యాజమాన్య వాటా స్టాండర్డ్ లైఫ్ కలిగి ఉన్నాయి. అదేవిధంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మెజార్టి యాజమాన్య వాటా అంటే 68శాతం మ్యాక్స్ ఫైనాన్సియల్ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ విలీనంపై స్పందించడానికి హెచ్డీఎఫ్సీ, మ్యాక్స్ లు తిరస్కరించాయి. -
హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్ బ్రాంచ్ మూసివేత
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ శాఖ మూతపడింది. ఇక్కడి గంగానమ్మపేటలోని ఉన్న హెచ్డీఎఫ్సీ లైఫ్ కార్యాలయం రెండు మూడు రోజులుగా తీయడం లేదని పాలసీదారులు పలువురు తెలిపారు. దీనిపై పాలసీదారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలిసింది. పట్టణంతోపాటు సమీప ప్రాంతాల ప్రజల బీమా అవసరాల కోసం 2008లో ఇక్కడ సంస్థ శాఖను ఆరంభించారు. హెచ్డీఎఫ్సీ సంస్థకు గల బ్రాండ్ విలువ, స్థానికంగా అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో పాలసీదారులు ఆదరించారు. ఏడేళ్లు కార్యకలాపాలు సాగించిన తర్వాత మూసివేయడంతో పాలసీదారుల్లో అయోమయం నెలకొంది. -
యులిప్ అమ్మకాలు పెరుగుతున్నాయ్
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి - నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ వాటా 49%కి - వచ్చే ఏడాది మార్కెట్లో లిస్టయ్యే అవకాశం - పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిరేటు నమోదు - ఈ ఏడాది 17వేల ఏజెంట్ల నియామకాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : గత కొంత కాలంగా సంస్కరణలు, ఆర్థిక వృద్ధిరేటు నెమ్మదించడంతో కష్టాలను ఎదుర్కొన్న జీవిత బీమా రంగం క్రమేపీ గాడిలో పడుతోందని ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. ఈ ఏడాది పరిశ్రమ రెండంకెల వృద్ధిరేటు నమోదు చేయడంతో పాటు, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యులిప్ అమ్మకాలు పెరిగాయంటున్న హెచ్డీఎఫ్సీ లైఫ్ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరితో ఇంటర్వ్యూ... ఈ ఏడాది జీవిత బీమా పరిశ్రమ వృద్ధి ఏవిధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? హెచ్డీఎఫ్సీ లైఫ్ వృద్ధిరేటు ఏ విధంగా ఉండొచ్చు? ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో ఆశావాహకమైన పరిస్థితులు కనపడుతున్నాయి. పాలసీ నిబంధనలు, అమ్మకాల్లో జరిగిన మార్పుల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జీవిత బీమా వ్యాపారంలో 8-10 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏడాది మొత్తం మీద ఇంతకంటే ఎక్కువ వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. ఇక మా విషయానికి వస్తే గత ఐదేళ్లు మాదిరిగానే ఈ సారి కూడా పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేస్తాం. స్టాక్ సూచీలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత యులిప్ అమ్మకాలు ఏమైనా పెరిగాయా? మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యులిప్ (యూనిట్ లింక్డ్ పాలసీలు) అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మా అమ్మకాల్లో యులిప్స్ వాటా 60 శాతం దాటింది. మొత్తం పాలసీ అమ్మకాల్లో యులిప్ వాటా 50 నుంచి 60 శాతం లోపు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాల వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ వ్యాపారంపై ఏమైనా ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉందా? కేంద్రం ప్రవేశపెట్టిన బీమా పథకాలు అద్భుతమైన విజయం సాధించాయి. వీటి వల్ల బీమా కంపెనీల వ్యాపారం దెబ్బతింటోందన్న వాదనతో నేను ఏకీభవించటం లేదు. వీటి వల్ల ప్రజల్లో బీమాపై మరింత అవగాహన పెరిగింది. మారిన కాలపరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న రెండు లక్షల బీమా సరిపోదు. అందుకోసం ప్రజలు అదనపు బీమా రక్షణ కోసం బీమా కంపెనీలను ఆశ్రయిస్తారు. ఈ విధంగా బీమా వ్యాపారం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. వ్యాపార విస్తరణకు సంబంధించి ఏమైనా మూలధనం సేకరించే అవకాశం ఉందా? హెచ్డీఎఫ్సీ లైఫ్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది? మా వాటాదారుల నుంచి వ్యాపార విస్తరణ కోసం గత నాలుగేళ్లుగా ఎటువంటి మూలధనాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి మూలధనం అవసరం లేదు. ఇక ఐపీవో విషయానికి వస్తే ప్రమోటర్ల మాటను బట్టి ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నాలుగు వారాల్లో స్టాండర్డ్ లైఫ్ తన వాటాను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుకోనుంది. ఈ వాటా పెంచుకోవడం తర్వాతనే ఐపీవో ఉండొచ్చు. వచ్చే ఏడాది స్టాక్ మార్కెట్లో నమోదైనా కొత్తగా మూలధనం సేకరించాలని లేదు. వాటాదారులు తమ వాటాలను విక్రయించుకోవచ్చు. వ్యాపార విస్తరణ, ఏజెంట్ల నియామకాల గురించి వివరిస్తారా? ఆర్థిక పథకాల విషయంలో ఆన్లైన్లో పాలసీలు అందుబాటులో ఉన్నా చాలా మంది పాలసీలను తీసుకోవడానికి ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. అందుకే ఏజెంట్ల నియామకంపై దృష్టిసారిస్తున్నాం. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీలో 70,000 ఏజెంట్లు ఉంటే ఈ ఏడాది అదనంగా 15 నుంచి 17 వేల మంది ఏజెంట్లను నియమించుకోవాలని నిర్ణయించుకున్నాం. కొత్తగా ప్రవేశపెట్టిన సీఎస్సీ బీమా పథకం ప్రయోజనం ఏమిటి? మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే ఆలోచన ఉందా? అల్పాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రీమియంతో కూడిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ‘సీఎస్సీ సురక్ష’ను ప్రారంభించాం. ఈ-సేవ కేంద్రాల ద్వారా కేవలం రెండు నిమిషాల్లో జారీ చేసే విధంగా దీన్ని రూపొందించాం. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం విజయవంతమయితే మరిన్ని పథకాలను ప్రవేశపెడతాం. -
హెచ్డీఎఫ్సీ నుంచి కేన్సర్ బీమా పాలసీ
బీమా రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్ తాజాగా కేన్సర్ కేర్ బీమా పాలసీని ప్రవేశపెట్టింది. ఆరంభ, తదనంతర దశల కేన్సర్‌కు సంబంధించి పాలసీదారుకు ఆర్థిక రక్షణ అందించేలా దీన్ని రూపొందించింది. 18-65 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. దీని కాల వ్యవధి 10 నుంచి 20 ఏళ్లు ఉంటుంది. రూ.10 లక్షల నుంచి రూ. 40 లక్షల దాకా సమ్ అష్యూర్డ్‌ను ఎంచుకోవచ్చు. కవరేజీ ప్రయోజనాలను బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం అంటూ మూడు ప్లాన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. 35 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల కాలవ్యవధి కోసం రూ. 20 లక్షల కవరేజీ ఎంచుకుంటే ఏడాదికి రూ. 1,800 కంటే తక్కువ ప్రీమియం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్‌కు సమ్ అష్యూర్డ్‌ను 10 శాతం మేర పెంచుకోవచ్చని వివరించింది. కేన్సర్ నిర్ధారణ అయితే, ప్రీమియం వెయివర్ ఆప్షన్ ఉంటుందని తెలిపింది. మేజర్ కేన్సర్ చికిత్సకు సంబంధించి కుటుంబానికి అయిదేళ్ల పాటు ఆదాయ ప్రయోజనం కూడా ఉంటుందని హెచ్డీఎఫ్సీ లైఫ్ పేర్కొంది. కేన్సర్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదయిన నేపథ్యంలో (రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షల పైగా) ఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ఎండీ అమితాబ్ చౌదరి తెలిపారు. ఇది ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చని వివరించారు. -
ఎల్ఐసీ నుంచి తొలి ఆన్లైన్ టర్మ్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న ఆన్లైన్ టర్మ్ పాలసీ విభాగంలోకి దేశీయ అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ ప్రవేశించింది. ‘ఈ టర్మ్’ పేరుతో తొలి ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా ఎల్ఐసీ కేవలం తక్షణం పెన్షన్ అందించే జీవన్ అక్షయ-6 మాత్రమే అందుబాటులో ఉండేది. తొలిసారిగా బీమా రక్షణతో కూడిన పాలసీని ప్రవేశపెట్టినా, ఇతర ప్రైవేటు బీమా కంపెనీలతో పోలిస్తే ప్రీమియం అధికంగా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్లకు టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారుగా రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే చాలా ప్రైవేటు కంపెనీలు ఇదే మొత్తానికి రూ.5,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీ అయి ఉండటం, క్లెయిమ్ సెటిలిమెంట్స్లో 97.73 శాతంతో అందరికంటే మొదటి స్థానంలో ఉండటం వంటి కారణాలు ప్రీమియం ధరను అధికంగా నిర్ణయించడానికి కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం బీమా రక్షణ తప్ప ఎటువంటి మెచ్యూర్టీ ఉండని చౌకగా ఉండే విధంగా టర్మ్ పాలసీలను ఆన్లైన్లో తొలిసారిగా 2009లో ప్రవేశపెట్టారు. సాధారణ టర్మ్ పాలసీల కంటే ప్రీమియం తక్కువగా ఉండటం, అధిక బీమా రక్షణ ఉండటంతో సహజంగానే వీటికి డిమాండ్ పెరిగింది. పాలసీలోని ఆకర్షణలు ధూమపానం అలవాటు లేనివారికి ప్రీమియంలో సుమారు 30% తగ్గింపును ఈ టర్మ్ పాలసీ ఆఫర్ చేస్తోంది. 18 ఏళ్లు నిండిన వారి నుంచి 60 ఏళ్ల వారు వరకు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ కనీస కాలపరిమితి 10-35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస బీమా రక్షణ మొత్తం రూ.25 లక్షలు, అదే ధూమపానం అలవాటు లేని వారికి రూ.50 లక్షలుగా నిర్దేశించారు. ఏడాది ప్రీమియాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా నేరుగా నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం చెల్లించొచ్చు. కాని ఈ పాలసీ తీసుకునే ముందు ఇప్పటి వరకు మీ పేరు మీద ఉన్న అన్ని బీమా పాలసీ వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది.