బాండ్లలో స్థిరమైన రాబడులు  | Fixed Returns From ICICI Prudential Allocation Bond Fund | Sakshi
Sakshi News home page

బాండ్లలో స్థిరమైన రాబడులు 

Jan 20 2020 3:26 AM | Updated on Jan 20 2020 3:26 AM

Fixed Returns From ICICI Prudential Allocation Bond Fund - Sakshi

దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు చేరింది. అదే సమయంలో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గడం ద్రవ్యలోటుపై భారాన్ని మోపేదే. ఇదంతా బాండ్‌ మార్కెట్‌పై ప్రతిఫలిస్తుంది. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ బాండ్ల పరంగా అధిక సరఫరా నెలకొనే పరిస్థితులు ఉన్నాయని అంచనా. అంటే ప్రభుత్వం అధికంగా రుణ సమీకరణ చేస్తే అది బాండ్‌ మార్కెట్‌పై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ద్రవ్యలోటు అంచనాలను మించే అవకాశాలు, అలాగే, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం బాండ్‌ ఈల్డ్స్‌ను నిర్ణయించనున్నాయి.

స్వల్పకాల బాండ్లలో ర్యాలీ నెలకొనే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో దీర్ఘకాల గిల్డ్‌ ఫండ్స్‌ తీసుకోవడం కొంత రిస్కే అవుతుంది. కనుక ఈ విధమైన పరిస్థితుల్లో అన్ని రకాల కాల వ్యవధులు కలిగిన బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను పెట్టుబడులకు పరిశీలించడం అనుకూలం అవుతుంది. మార్కెట్లలో రేట్లకు అనుగుణంగా డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ మేనేజర్లు తమ పోర్ట్‌ఫోలియోలోని బాండ్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో ఉంటారు. కనుక ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు.

పనితీరు..: డైనమిక్‌ బాండ్స్‌ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఆల్‌సీజన్స్‌ బాండ్‌ పథకం నిలకడైన పనితీరు చూపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై రాబడులు 10.4 శాతం. కానీ, ఈ కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 7.8 శాతమే. అలాగే, మూడేళ్లలో వార్షిక రాబడులు 6.9 శాతంగా ఉంటే, ఐదేళ్లలో సగటు వార్షిక రాబడులు 8.8 శాతంగా ఉండడం బాండ్లలో మెరుగైన పనితీరుగానే చూడాల్సి ఉంటుంది. మూడేళ్లలో డైనమిక్‌ బాండ్స్‌ విభాగం సగటు వార్షిక రాబడులు 5.1 శాతం, ఐదేళ్ల కాలంలో 7.1 శాతంతో పోలిస్తే ఈ పథకం పనితీరు బాగానే ఉంది.  కొంత రిస్క్‌ తీసుకునే సామర్థ్యం కలిగిన వారికి మంచి ఫండ్‌.

పెట్టుబడుల విధానం..
డిసెంబర్‌లో ఆర్‌బీఐ ఎంపీసీ విధాన ప్రకటన తర్వాత పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌ వేగంగా పెరిగాయి. 30 బేసిస్‌ పాయింట్ల వరకు పెరిగి 6.7–6.8 శాతాన్ని చేరాయి. కానీ, ఆర్‌బీఐ ట్విస్ట్, ఓఎంవో చర్యలతో మళ్లీ ఈల్డ్స్‌ తగ్గాయి. అయితే, దీర్ఘకాలిక బాండ్‌ ఈల్డ్స్‌ మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా. సాధారణంగా దీర్ఘకాలిక బాండ్లు వడ్డీ రేట్ల పరంగా సున్నితంగా ఉంటాయి. కనుక అప్పటి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా అనుకూలమైన కాలానికి బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement