చిత్తూరు: చిత్తూరు నగరంలోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ జీవిత బీమా శాఖలో ఓ ఉద్యోగిని సంస్థకు రూ.31 లక్షల మేర టోకరా పెట్టింది. ఈ శాఖలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా కోడూరుకు చెందిన అలేఖ్య(26) పాలసీ దారుల నుంచి సుమారు రూ.31 లక్షల మేర ప్రీమియంను వసూలు చేసి సంస్థకు జమచేయకుండా తన తల్లిదండ్రుల ఖాతాల్లో వేసుకుంది. ఆ తర్వాత జనవరి 19న ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయింది.
అయితే, తన పాలసీకి సంబంధించిన సొమ్ము తన ఖాతాలో జమ కాలేదని జనవరి 23న రత్నకుమార్ అనే వ్యక్తి శాఖ మేనేజర్ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ప్రీమియం చెల్లించాలంటూ పాలసీదారులకు సంస్థ నుంచి నోటీసులు వెళ్లడంతో పలువురు చిత్తూరులోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ శాఖకు వచ్చి మేనేజర్‌ను నిలదీశారు. తాము ప్రీమియం చెల్లించినప్పటికీ నోటీసులు రావడం ఏంటని ప్రశ్నించారు. దీంతో అకౌంటెంట్ అలేఖ్య రూ.31 లక్షల వరకు స్వాహా చేసినట్లు గుర్తించిన శాఖా మేనేజర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అలేఖ్యపై చిత్తూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది.