ICICI Prudential Equity And Debt Fund: రాబడులు కావాలి. పెట్టుబడులు పూర్తిగా ప్రమాదంలో పడకూడదు. అంటే రిస్క్ కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ కిందకు వస్తుంది. అంటే తన నిర్వహణలోని మొత్తం ఆస్తుల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెట్ సాధనాల్లో 20 శాతం నుంచి 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది.
రాబడులు
ఈ పథకం 1999 నవంబర్ 3న మొదలు కాగా, ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి అది రూ.21.76 లక్షలు సమకూరి ఉండేది. అంటే కాంపౌండెడ్‌గా ఏటా 15.03 శాతం రాబడిని ఇచ్చింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ కాంపౌండెడ్‌గా వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం (సీఏజీఆర్) 14.04 శాతంగానే ఉంది. అంటే నిఫ్టీలో రూ.లక్ష పెట్టుబడి రూ.18.01 లక్షలు అయి ఉండేది. నూరు శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్ని డెట్‌లో పెడుతూ ఈక్విటీ సూచీ కంటే అధిక రాబడిని ఇవ్వడం అన్నది కచ్చితంగా మెరుగైన పనితీరుగానే చూడాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ పథకంలో ప్రతీ పెలా రూ.10,000 చొప్పున ఆరంభం నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మొత్తం పెట్టుబడి ఇన్నేళ్లలో రూ.26.4 లక్షలు కాగా, సమకూరిన మొత్తం రూ.2.11 కోట్లుగా ఉండేది. సిప్ మార్గంలో సీఏజీఆర్ 16.22 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై 53 శాతం ప్రతిఫలం లభించింది. మూడేళ్లలో వార్షికంగా 19 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 15.58 శాతం, ఏడేళ్లలో 13.49 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఒక హైబ్రిడ్ ఫండ్ ఇంత నిలకడైన పనితీరు చూపించడం అరుదైనది. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను ఎస్.నరేన్ చూస్తున్నారు. గడిచిన 18 నెలల్లో వ్యాల్యూ స్టాక్స్‌కు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాల స్టాక్స్ పాల్గొనడంతో వ్యాల్యూ స్టాక్స్ మంచి రాబడులను ఇచ్చాయి.
పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.18,740 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అన్ని విభాగాల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ పథకానికి ఉంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మొత్తం నిర్వహణ ఆస్తుల్లో ఈక్విటీ విభాగంలో 74.4 శాతం పెట్టుబడులు ఉన్నాయి. డెట్ సాధనాల్లో 17.1 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 90 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు చెరో 5 శాతం కేటాయింపులు చేసింది. ప్రైస్ టు బుక్ విధానంలో స్టాక్స్ ఎంపిక ఉంటుంది. టాప్ డౌన్, బోటమ్ అప్ విధానాలను అనుసరిస్తుంటుంది. విద్యుత్, టెలికం, ఆయిల్, నాన్ ఫెర్రస్ మెటల్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంకులు, సాఫ్ట్‌వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్ కంపెనీల పట్ల తక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈక్విటీలకు సంబంధించి విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ ఆప్షన్ కూడా ఈ పథకంలో భాగంగా ఉంది. మార్కెట్ల దిద్దుబాట్లలో పెట్టుబడుల విలువకు రక్షణ కోసం గాను డెరివేటివ్స్‌లో హెడ్జింగ్ కూడా చేస్తుంది. డెట్ విభాగంలో దీర్ఘకాల ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలను, ఏఏ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటుంది.
టాప్ ఈక్విటీ హోల్డింగ్స్
కంపెనీ పెట్టుబడుల శాతం
ఐసీఐసీఐ బ్యాంకు 8.46
ఎన్‌టీపీసీ 7.69
భారతీ ఎయిర్‌టెల్ 7.32
ఓఎన్‌జీసీ 5.17
హిందాల్కో ఇండస్ట్రీస్ 4.35
సన్‌ఫార్మా 3.97
టాటా మోటార్స్ డీవీఆర్ 3.93
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3.19
ఇన్ఫోసిస్ 2.67
ఐటీసీ 2.36
గొప్ప రాబడుల చరిత్ర
Published Mon, Nov 29 2021 9:10 AM | Last Updated on Mon, Nov 29 2021 9:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment