ఆరేళ్లలో దేశంలో అతిపెద్ద ఐపీవో ఇదే
ముంబై : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఐపీవో సోమవారం లాంచ్ కానుంది. దేశంలో గత ఆరేళ్లలో ఇదే అతిపెద్ద, జీవితబీమా రంగంనుంచి మొట్టమొదటి పబ్లిక్ ఇష్యూగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఐపీవో బుధవారం(21న) ముగియనుంది. సుమారు రూ. 1,635 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్న ఇష్యూకి ప్రైస్‌బ్యాండ్ ను రూ. 300-334గా కంపెనీ నిర్ణయించింది. దీనికోసం ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ. 10 ముఖవిలువగల 181.34 మిలియన్ల షేర్లను విక్రయించనుంది. మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ విక్రయిస్తున్న ఈ షేర్లు ఇష్యూ తరువాత కంపెనీ ఈక్విటీ క్యాపిటల్‌లో 12.63 శాతం వాటాకు సమానంగా నిలవనున్నాయి. సహ ప్రమోటర్ ప్రుడెన్షియల్ సంస్థ ఎలాంటి వాటాను విక్రయించదని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ తెలిపింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇప్పటికే 38 యాంకర్ ఇన్వెస్టర్లకు 4.89 కోట్ల షేర్లను విక్రయించింది. షేరుకి రూ. 334 ధరలో అమ్మకాలతో రూ. 1,635 కోట్లను సమీకరించింది. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, నోమురా ఇండియా ఇన్వెస్ట్ మెంట్ లతోపాటు మానెటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ తదితర వెల్త్, మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో ఉన్నాయి. కాగా మోర్గాన్ స్టాన్లీ అత్యధికంగా 6.2 మిలియన్ షేర్లను కొనుగోలుచేయగా, సింగపూర్ సావరిన్ సంస్థ 4.3 మిలియన్ షేర్లను సొంతం చేసుకుంది. అలాగే రిటైల్ విభాగంలో 5.72 కోట్ల షేర్లు, సంపన్న వర్గాల(హెచ్‌ఎన్‌ఐ) కోటాలో 2.44 కోట్ల షేర్లు దక్కించుకున్నాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం(క్విబ్)లో 8.16 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. క్విబ్ కోటాలో ఇప్పటికే 4.9 కోట్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది.