19న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇష్యూ
21న ముగింపు ఇష్యూ సైజు 18.13 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగం నుంచి తొలిసారిగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రాబోతుంది. ఈ ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణిని రూ.300 - రూ.334గా నిర్ణయించారు. ఐపీవోలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు తన వాటాల్లోంచి 12.65 శాతం వాటాకు సమానమైన 18,13,41,058 ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా సుమారు రూ.6,000 కోట్ల నిధులను సమీకరించనుంది. గత ఆరేళ్లలో ఈ స్థాయిలో నిధులు సమీకరిస్తున్న ఐపీవో ఇదే కావడం విశేషం.
ఈ సంస్థ జూలై 18న సెబీ వద్ద ఐపీవో పత్రాలను దాఖలు చేయగా ఈ నెల 2న అనుమతి లభించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకుకు 68 శాతం, యూకేకు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్‌కు 26 శాతం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు 4 శాతం, సింగపూర్‌కు చెందిన తెమసెక్ హోల్డింగ్స్‌కు 2 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో జారీ చేసే షేర్లలో పది శాతం షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు షేర్ హోల్డర్లకు రిజర్వ్ చేశారు.
గరిష్టంగా 50 శాతం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ప్రభుత్వరంగ కోల్ ఇండియా 2010లో రూ.15వేల కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించగా, ఆ తర్వాత మళ్లీ భారీ స్థాయిలో నిధులు సమీకరిస్తున్న ఐపీవో ఇదే. కాగా, పెప్సీకో కంపెనీ సాఫ్ట్ డ్రింక్స్ తయారీ, మార్కెటింగ్ వ్యవహారాలను చూసే వరుణ్ బెవరేజెస్, సీవేస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ ఐపీవోలకు సైతం సెబీ ఇటీవలే ఆమోదం తెలిపింది.