షేర్లలో పెట్టుబడికి మంచి తరుణమిది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికలొస్తున్న ప్రస్తుత తరుణంలో ఈక్విటీలకు మరింత కేటాయించాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫండ్ మేనేజర్ వెంకటేష్ సంజీవి సూచించారు. ఎలక్షన్ల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతే.. స్థూల ఆర్థిక పరిస్థితులతో పాటు మార్కెట్లు కూడా మరింత మెరుగుపడగలవని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో మార్కెట్లు 15-20 శాతం పెరిగాక ఇన్వెస్ట్ చేయడం కన్నా కాస్త ముందుగానే నిర్ణయాలు తీసుకుంటే గణనీయంగా లాభపడొచ్చని చెప్పారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్తగా ప్రారంభించిన ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ సిరీస్ 1 గురించి వివరించేందుకు మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకటేష్ ఈ విషయాలు తెలిపారు. చాలా మటుకు దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా వంటి కొన్ని రంగాలు మినహా చాలా రంగాల పీఈ నిష్పత్తి గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. టెలికం, సిమెంటు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాల షేర్లలో గణనీయ వృద్ధికి ఆస్కారం ఉందని వెంకటేష్ పేర్కొన్నారు. మరోవైపు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు కూడా దిగిరావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురుకు డిమాండ్ అదుపులో ఉన్నంత దాకా దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగియకపోవచ్చని చెప్పారు.
అందుబాటులో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ - సిరీస్1
ఈ క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ ప్రధానంగా వచ్చే మూడేళ్లలో అధిక రాబడులు అందించే అవకాశమున్న 20-25 కంపెనీల షేర్లపై దృష్టి సారిస్తుందని వెంకటేష్ చెప్పారు. కొత్త ఇన్వెస్టర్లకు పన్ను పరమైన ప్రయోజనాలు అందించే.. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్‌జీఈఎస్‌ఎస్)కి అర్హమైన కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తామని వివరించారు. ఈ నెల 20న మొదలైన ఈ న్యూ ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ. 5,000 కాగా, కనీస లాకిన్ వ్యవధి మూడేళ్లు ఉంటుందని వెంకటేష్ పేర్కొన్నారు.