కుటుంబానికి ధీమా.. జీవిత బీమా
జీవిత బీమా పాలసీలను ఇతర ఆర్థిక సాధనాలతో పోలుస్తూ తరచుగా పేపర్లలోనూ, మ్యాగజైన్లలోనూ మనకు కథనాలు కనిపిస్తుంటాయి. బీమా పాలసీ తీసుకునేందుకు పెట్టే పెట్టుబడిపై ఎంత వస్తుంది, అదే ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుందీ లాంటి అంశాలను కూడా కొన్ని కథనాల్లో విశ్లేషిస్తుంటారు. అయితే, ఈ క్రమంలో బీమా పాలసీల ప్రధానోద్దేశాన్ని విస్మరిస్తుంటారు. పాలసీదారు ఉన్నా లేకపోయినా.. వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా భరోసా కల్పించేది బీమా పాలసీ అన్నది తెలుసుకోరు.
మనం ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఎలాంటి కష్టాలు పడకూడదని మనం జీవితాంతం శ్రమిస్తుంటాం. మనం ఉన్నా లేకున్నా వారు ఇబ్బందిపడకుండా సాధ్యమైనంత నిధిని వారికి అందించాలని తాపత్రయపడతాం. కనుక, పాలసీదారు లేకపోయినా.. రుణ బకాయిలు మొదలుకుని ఇతరత్రా వ్యయాల దాకా ఏదీ కూడా భారం కాకుండా కుటుంబసభ్యులను ఆదుకోగలిగే శక్తిమంతమైన సాధనాలు జీవిత బీమా పాలసీలు. కనుక, వీటిపై ఇన్వెస్ట్ చేసే ప్రతి పైసా ఎంతో ఉపయోగకరమైనదే. ఆర్థిక లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో ఇన్వెస్ట్ చేస్తే జీవిత బీమా పాలసీలకోసం వెచ్చించేది కచ్చితంగా వివేకవంతమైన పెట్టుబడే.
బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ తీసుకుంటున్న చర్యలతో గతంతో పోలిస్తే బీమా పాలసీల ప్రీమియంలు ప్రస్తుతం గణనీయంగా తగ్గాయి. అందుబాటు ప్రీమియంలతో పాలసీలు లభిస్తున్నాయి. సంప్రదాయ బీమా పథకాలు మరింత అధిక డెత్ కవరేజీ ఇచ్చేలా ఈ మధ్యే నిబంధనలు కూడా మారాయి. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా సరైన పథకాన్ని ఎంచుకోగలిగితే నిశ్చింతగా రిటైర్ అయ్యేందుకు, కుటుంబానికి ఆర్థికపరమైన భరోసానిచ్చేందుకు బీమా పాలసీలు తోడ్పడగలవు. అదనపు ధీమా కోసం వివిధ రకాల రైడర్లు కూడా కావాలంటే వీటికి జతగా తీసుకోవచ్చు.