లైఫ్‌ ఈజీ చేసుకుందాం ఇలా... | Financial Investment on Planning in New Year | Sakshi
Sakshi News home page

లైఫ్‌ ఈజీ చేసుకుందాం ఇలా...

Published Mon, Jan 18 2021 5:39 AM | Last Updated on Mon, Jan 18 2021 8:23 AM

Financial Investment on Planning in New Year - Sakshi

కొత్తగా ఏదో ఒకటి చేయాలి.. ఏటా నూతన సంవత్సరంలోకి ప్రవేశించే సమయంలో చాలా మంది అనుకునే సంకల్పమే ఇది. కానీ, కొద్ది మందే అనుకున్నవి ఆచరణలో పెడుతుంటారు. 2020 ఎన్నో పాఠాలు చెప్పి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరావన్న హెచ్చరికలు కూడా ఇచ్చి వెళ్లింది. అందుకే 2021లో అయినా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రణాళికలపై దృష్టి పెట్టి.. అమల్లో పెట్టడం ద్వారా ఎంతో స్థైర్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందే అవకాశాన్ని కోల్పోవద్దు. ఇందుకు ఏం చేయవచ్చంటే..?

ఆపద్బాంధవ.. బీమా
ఆరోగ్య బీమా, జీవిత బీమా తమకు అంతగా అవసరం లేదనుకునే వారు ఎందరో ఉన్నారు. వీటి ప్రాధాన్యం ఎంతన్నది కరోనా వైరస్‌ చాలా మందికి తెలిసేలా చేసింది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన వారు రూ.లక్షల్లో ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. బీమా పాలసీ లేని వారు తమ కష్టార్జితాన్ని వైద్య చికిత్సల కోసం ధారపోయాల్సి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్‌ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వారి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఎటువంటి జీవిత బీమా పాలసీ లేకుండా కరోనాతో మరణించినట్టయితే.. పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించాలి. ఒకవేళ జీవిత బీమా పాలసీ ఉన్నా తగినంత కవరేజీ లేని కుటుంబాలకు వాస్తవంలో రక్షణ లేనట్టుగానే భావించాలి. కట్టిన ప్రీమియం రాదన్న ప్రతికూల ధోరణితో టర్మ్‌ ప్లాన్‌లకు బదులు.. మరణించినా లేదా మెచ్యూరిటీ తీరినా రాబడులతో వెనక్కిచ్చే ఎండోమెంట్‌ ప్లాన్‌లు తీసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ, రూ.1–5 లక్షల ఎండోమెంట్‌ ప్లాన్‌ ఓ కుటుంబ అవసరాలను ఏ మాత్రం తీర్చగలదో ఆలోచించండి.

అందుకే హెల్త్, లైఫ్‌ ప్లాన్‌లు లేని వారు వెంటనే వాటిని తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఎండోమెంట్‌ ప్లాన్‌ తీసుకున్న వారు.. వీలు చేసుకుని టర్మ్‌ ప్లాన్‌ తీసుకునేందుకు ప్రయత్నించాలి. తమ వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ 10 రెట్ల మేర అయినా బీమా తీసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు ఉంటే ఆ మొత్తాన్ని కూడా కవరేజీకి కలిపి అధిక మొత్తంలో బీమా తీసుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తాము లేని లోటును తీర్చే రక్షణ ఏర్పాటు చేసిన వారు అవుతారు. అనారోగ్యం, ప్రమాదాలు చెప్పి రావు. వయసులో ఉన్న వారికి కూడా ఇటువంటివి ఎదురుకావచ్చు. ఒకవేళ హెల్త్‌ పాలసీ ఉన్నా కేవలం రూ.2–3లక్షల కవరేజీయే ఉంటే.. దానికి టాపప్‌ తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాలి. టాపప్‌కు ప్రీమియం తక్కువే ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల హెల్త్‌ కవరేజీ అయినా ఉండాలి. దీనికి అదనంగా టాపప్‌ కూడా జోడించుకోవాలన్నది నిపుణుల సూచన.

సాయం కోసం ఎదురుచూడొద్దు
అనుకోని అవసరం ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక సాయం కోసం బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఆశ్రయించడం కంటే.. ఒక ప్రత్యేక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మనశ్శాంతిని, ధైర్యాన్నిస్తుంది. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ప్రమాదానికి గురి కావడం ఇటువంటివన్నీ అత్యవసర పరిస్థితులే. అందుకే కనీసం 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇందులో రుణాలకు చేసే చెల్లింపులు కూడా భాగంగా ఉండాలి. ఈ మొత్తాన్ని బ్యాంకు ఎఫ్‌డీలు లేదా లిక్విడ్‌ ఫండ్స్‌ రూపంలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అవసరం ఏర్పడినప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ప్రత్యేక నిధిని సమకూర్చుకోవడమే కాదు.. అత్యవసరాలు ఎదురైతే తప్పించి చిన్న అవసరాలకు కదపకూడదు.

భిన్న సాధనాలకు కేటాయింపులు
పెట్టుబడులన్నింటినీ ఒకటే సాధనంలో కాకుండా భిన్న సాధనాలకు కేటాయించుకోవడం కూడా ఆర్థిక ప్రణాళికలో ఒక భాగమే. ఉదాహరణకు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి.. అప్పుడు మీరు చాలా రిస్క్‌ తీసుకున్నట్టు అవుతుంది. పెట్టుబడుల పరంగా మీ నిర్ణయాల్లో తప్పిదం చోటు చేసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఈక్విటీలు, డెట్, బంగారం ఇలా వీలైనన్ని సాధనాల మధ్య పెట్టుబడులను వేరు చేసుకోవాలి. దీనివల్ల రిస్క్‌ను మించి రాబడులు వస్తాయి. మీ రిస్క్‌ సామర్థ్యం, ఆశిస్తున్న రాబడులు, పెట్టుబడులకు ఉన్న వ్యవధి వీటి ఆధారంగా ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలన్నది ఆర్థిక సలహాదారుల సాయంతో నిర్ణయిం చుకోవాలి. ఒక్కో విభాగం అద్భుత పనితీరుతో అందులోని పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగిపోతే.. అందుకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్‌ చేసుకోవాలి. ఈక్విటీలకు 50% కేటాయించాలన్నది మీ ప్రణాళిక అయితే.. మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 60 శాతానికి చేరితే.. అప్పుడు 10% మేర ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకోవాలి.

ఇన్వెస్ట్‌మెంట్‌ ఆగొద్దు
పెట్టుబడులు ఎప్పుడూ లక్ష్యాలకు అనుగుణంగా సాగిపోవాలి. మధ్యలో వచ్చే ఆటుపోట్లను చూసి పెట్టుబడుల ప్రణాళికలు ఆగిపోకూడదు. గతేడాది మార్చి చివరికి మార్కెట్లు కనిష్టాలకు పడిపోయినప్పుడు కంగారుపడిపోయి స్టాక్స్‌ను అమ్ముకున్న వారు.. డిసెంబర్‌ వచ్చే సరికి ఎంతో విచారించి ఉంటారు. ఎందుకంటే తొమ్మిది నెలల్లో మార్కెట్లు కొత్త గరిష్టాలకు వెళ్లిపోయాయి. మార్కెట్లు ఎప్పుడూ పడి లేచే కెరటాలు. అలాగే, స్టాక్స్‌ విక్రయించకుండా.. అదనంగా ఇన్వెస్ట్‌ చేసిన వారు భారీ లాభాలను కళ్లచూసి ఉంటారు. అందుకే ఈక్విటీ పెట్టుబడులు కనీసం ఐదేళ్లకు మించిన కాలానికే సముచితం. అందులోనూ నేరుగా స్టాక్స్‌లో కాకుండా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో, అందులోనూ ప్రతీ నెలా ఇంతచొప్పున సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం.. సగటున అధిక రాబడులను సమకూర్చుకునేందుకు, రిస్క్‌ను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఇరువైపులా ప్రయోజనాలను తెచ్చిపెట్టే సాధనమే సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌). ఇక బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో ఎక్కువ మొత్తాలను అలాగే ఉంచేయవద్దు. సేవింగ్స్‌ వడ్డీ రేటు 4–5 శాతం అన్నది ద్రవ్యోల్బణానికే సరిపోతుంది. కనుక అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్లుగా మార్చే ఆటోస్వీప్‌ సదుపాయాన్ని ఎంచుకోవాలి.

నామినీని, విల్లును మర్చిపోవద్దు
ఒక వ్యక్తి మరణానంతరం అతని పేరిట ఉన్న ఆస్తులు, పెట్టుబడులు కుటుంబ సభ్యులకు సులభంగా అందేలా చేసేదే విల్లు. ఎవరికి ఏవి, ఏ మేరకు చెందాలన్నదీ విల్లులో నిర్దేశించుకోవచ్చు. తమ పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు, బీమా పాలసీల వివరాలు కుటుంబ సభ్యులకు తప్పకుండా తెలియజేయాలి. బీమా ప్లాన్లు, పెట్టుబడుల్లో నామినీని చేర్చాలి.

ఖర్చు/పొదుపు
కరోనా, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా గతంతో పోలిస్తే కొన్ని అనవసర వ్యయాలు తగ్గాయి. వీకెండ్‌లో బయటకు వెళ్లి రెస్టారెంట్లలో తినడం, సినిమాలు, పర్యటనలు వంటివి చాలా వరకు తగ్గాయి. వేతనాల్లో కోతలు పడిన వారికి ఈ విధంగా తగ్గిన వ్యయాలు కాస్త ఊరటనిచ్చాయి. అదే సమయంలో వేతన కోతల్లేని వారికి మిగిలిన మేర అదనంగా ఇన్వెస్ట్‌ చేసుకునే మంచి అవకాశం లభించిందనే చెప్పుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా.. ఎంత పొదుపు చేశారన్నదే మీ ఆర్థిక పరిస్థితులను మార్చే సూత్రం అవుతుంది. కనుక పరిమితుల్లోపే ఖర్చు చేసుకోవాలి. అందుకే నెలవారీ బడ్జెట్‌ రూపొందించుకుని దాని ప్రకారం ఖర్చు, ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. అప్పుడు మీ వ్యయాలపై మీకు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతగా అవసరం లేని వాటి కోసం రుణాలపై కొనుగోళ్లకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ తరహా అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి.

కొత్త ఏడాది ప్లానింగ్‌
► జనవరి: బీమా కవరేజీ మీకు సరిపడా ఉన్నదీ, లేనిదీ ఒక్కసారి సరిచూసుకోవాలి. అలాగే, బీమా ప్రీమియం, ఈఎంఐ చెల్లింపుల తేదీల కోసం రిమైండర్‌ పెట్టుకోవాలి.  

► ఫిబ్రవరి: కేంద్ర బడ్జెట్‌లో కొత్త నిబంధనల వల్ల మీ ఆదాయం, పన్నులు, పెట్టుబడుల ప్రణాళికలను మార్చుకోవాలేమో సరిచూసుకోవాలి.  

► మార్చి: 2020–21 సంవత్సరం అడ్వాన్స్‌ ట్యాక్స్‌ నాలుగో విడత చెల్లింపుల గడువు మార్చి 15తో ముగుస్తుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఈలోపు ఆ పనిచేసేయాలి. పన్ను ఆదా కోసం పెట్టుబడులకు మార్చితో గడువు ముగిసిపోతుంది. ఫాస్టాగ్‌ 2021 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.

► ఏప్రిల్‌: 2021–22 నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభం కనుక.. ఆర్థిక నిపుణుల సాయంతో పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుని లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. సొంతంగా ఆ పరిజ్ఞానం ఉంటే తామే ఆ పనిచేసుకోవచ్చు.  

► మే: ఈ నెలలో 14న అక్షయ తృతీయ ఉంది. ఆ రోజు బంగారం కొనుగోలు చేసుకోవాలని అనుకుంటే అందుకు కావాల్సిన మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి.  

► జూన్‌: 2021–22 మొదటి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ గడువు జూన్‌ 15. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్నులు వేసేందుకు గాను పనిచేస్తున్న సంస్థ వద్ద ఫామ్‌ 16 కోసం దరఖాస్తు చేసుకోవాలి.  

► జూలై: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకు గడువు. ఆ లోపు రిటర్నులు ఫైల్‌ చేయాలి.

► ఆగస్టు: పెట్టుబడులపై మధ్యంతర సమీక్ష మంచిది.    

► సెప్టెంబర్‌: 2021–22 రెండో విడత అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను 15వ తేదీలోపు చెల్లించాలి.  

► అక్టోబర్‌: దసరా పండుగ భారీ ఆఫర్ల సమయంలో కొనుగోళ్లకు ముందుగానే సన్నద్ధం అయితే మంచిది.  

► నవంబర్‌: ఈ నెలలో దీపావళి పండుగ 4న వస్తోంది. ఆ సందర్భంలో కొనుగోళ్లకు సన్నద్ధులు కావాలి.  

► డిసెంబర్‌: మూడో విడత అడ్వాన్స్‌ ట్యాక్స్‌ (2021–22)కు 15 వరకు గడువు ఉంది. 25న క్రిస్‌మస్‌ పండుగ వేడుకలకు బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement