Investment policy
-
AP: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది
సాక్షి, అమరావతి: ఏపీలోని పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుందని జపాన్ పారిశ్రామికవేత్తల బృందం కొనియాడింది. జపాన్ కాన్సుల్ జనరల్(చెన్నై) తగ మసయుకి నేతృత్వంలోని ఆ దేశ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను, ఏపీఐఐసీ ఉన్నతాధికారి సృజనను కలిసింది. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను వివరించారు. జపాన్‌కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయని వివరించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. సమావేశంలో జపాన్‌కు చెందిన ఇసుజు, యూనిచార్మ్, కొబెల్కో, వన్స్టీల్ ప్లేట్, పియోలాక్స్, మియామా ఎలక్ట్రిక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎస్‌తోనూ భేటీ.. జపాన్ కాన్సుల్ జనరల్(చెన్నై) తగ మసయుకి సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జపాన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
Telangana: రెరా లేకుండానే విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, పెట్టుబడులకు రక్షణ కల్పించే టీఎస్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) లక్ష్యానికి కొందరు డెవలపర్లు తూట్లు పొడుస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్) కింద య«థేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. కొందరు డెవలపర్లయితే స్థల యజమానితో ఒప్పందం చేసుకొని.. తనది కాని స్థలంలో ఆకాశహర్మ్యం నిర్మిస్తామని మాయమాటలు చెప్పి కొనుగోలుదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రతిపాదిత హెచ్ఎండీఏ అనుమతులు అని బ్రోచర్లో ముద్రించి యూడీఎస్ కింద విక్రయాలనే చేస్తోంది కరోనా సమయంలో పుట్టుకొచ్చిన ఓ నిర్మాణ సంస్థ. మేడ్చల్‌లో 3.04 ఎకరాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నామని ప్రకటించింది. 1,100 నుంచి 1,525 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 273 రెండు, మూడు పడక గదులను నిర్మిస్తున్నామని సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు నిర్మాణ అనుమతులు రాలేదు, టీఎస్ రెరాలో నమోదు కాకుండానే 60–80 వరకు గృహాలను విక్రయించడం గమనార్హం. విక్రయ ధర కూడా వేర్వేరుగా ఉంటుందట. రెగ్యులర్ ధర రూ.3,499 కాగా.. ఆఫర్ కింద రూ.2,200కే విక్రయిస్తుందంట. అంటే 2 బీహెచ్‌కే ధర రూ.24.20 లక్షలు. అదే బ్యాంక్ రుణం ద్వారా కొనుగోలు చేస్తే.. చ.అ.కు రూ.2,600 అంట. 2 బీహెచ్కేకు రూ.28.60 లక్షలు అవుతుంది. ఇందులోను 50 శాతం ముందస్తు సొమ్ము చెల్లించాలని, మిగిలిన సొమ్ముకు మాత్రమే లోన్‌కు వెళ్లాలనే షరతు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. -
ప్రతి రోజు రూ.200 పొదుపు చేస్తే రూ.28 లక్షలు మీ సొంతం
సురక్షితమైన రాబడిని అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అనేక కొత్త పాలసీలను తీసుకువస్తుంది. అందులో జీవన్ ప్రగతి పాలసీ ఒకటి. పెట్టుబడిదారులు తమ రిటైర్ మెంట్ లేదా వృద్ధాప్యం కొరకు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది ఉతమమైన పాలసీ. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు ప్రతి నెలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించడంతో పాటు పెట్టుబడిదారులకు డెత్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పాలసీని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఎఐ) ఆమోదించింది. సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు రోజుకు కనీసం రూ.200 ఆదా చేయాల్సి ఉంటుంది. ఒకవేల పెట్టుబడిదారుడు మరణించినట్లయితే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లయితే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు.(చదవండి: థర్మామీటర్ గడియారాలొస్తున్నాయ్!) రిస్క్ కవర్ ఈ పాలసీలో రిస్క్ కవర్ ప్రతి ఐదేళ్లకోసారి పెరుగుతుంది. మొదటి ఐదేళ్ల పెట్టుబడికి రిస్క్ కవర్ అదే ఉంటుంది. 6 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి, 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి, మీరు 20 ఏళ్ల వరకూ చెల్లిస్తూ మధ్యలో మనీ తీసుకోకపోతే మీకు రిస్క్ కవర్ 200 శాతానికి పెరుగుతుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే.. మొదటి ఐదేళ్ల వరకూ బీమా కవరేజీ అంతే ఉంటుంది. ఆ తర్వాత 6-10 మధ్య అది రూ.17.5 లక్షలు ఉంటుంది. అలాగే 11-15 ఏళ్ల మధ్య అది రూ.21 లక్షలు ఉంటుంది. 16-20 ఏళ్ల మధ్య బీమా కవరేజీ రూ.28 లక్షలు ఉంటుంది.(చదవండి: రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ!) గరిష్ట వయోపరిమితి ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టాలంటే గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు వరకు ఉంది. ఈ పాలసీ కింద గరిష్ట ప్రయోజనాలను పొందడానికి పెట్టుబడిదారులు కనీసం 12 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మంచిది. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు గరిష్టంగా 20 ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టవచ్చు. మీరు 20 ఏళ్ల తర్వాత రూ.28 లక్షలు పొందాలంటే రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మంచిది. ఈ పాలసీ కింద ప్రతి రోజు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. -
లైఫ్ ఈజీ చేసుకుందాం ఇలా...
కొత్తగా ఏదో ఒకటి చేయాలి.. ఏటా నూతన సంవత్సరంలోకి ప్రవేశించే సమయంలో చాలా మంది అనుకునే సంకల్పమే ఇది. కానీ, కొద్ది మందే అనుకున్నవి ఆచరణలో పెడుతుంటారు. 2020 ఎన్నో పాఠాలు చెప్పి వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం పనికిరావన్న హెచ్చరికలు కూడా ఇచ్చి వెళ్లింది. అందుకే 2021లో అయినా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రణాళికలపై దృష్టి పెట్టి.. అమల్లో పెట్టడం ద్వారా ఎంతో స్థైర్యాన్ని, మానసిక ప్రశాంతతను పొందే అవకాశాన్ని కోల్పోవద్దు. ఇందుకు ఏం చేయవచ్చంటే..? ఆపద్బాంధవ.. బీమా ఆరోగ్య బీమా, జీవిత బీమా తమకు అంతగా అవసరం లేదనుకునే వారు ఎందరో ఉన్నారు. వీటి ప్రాధాన్యం ఎంతన్నది కరోనా వైరస్ చాలా మందికి తెలిసేలా చేసింది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన వారు రూ.లక్షల్లో ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. బీమా పాలసీ లేని వారు తమ కష్టార్జితాన్ని వైద్య చికిత్సల కోసం ధారపోయాల్సి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వారి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఎటువంటి జీవిత బీమా పాలసీ లేకుండా కరోనాతో మరణించినట్టయితే.. పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించాలి. ఒకవేళ జీవిత బీమా పాలసీ ఉన్నా తగినంత కవరేజీ లేని కుటుంబాలకు వాస్తవంలో రక్షణ లేనట్టుగానే భావించాలి. కట్టిన ప్రీమియం రాదన్న ప్రతికూల ధోరణితో టర్మ్ ప్లాన్లకు బదులు.. మరణించినా లేదా మెచ్యూరిటీ తీరినా రాబడులతో వెనక్కిచ్చే ఎండోమెంట్ ప్లాన్లు తీసుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ, రూ.1–5 లక్షల ఎండోమెంట్ ప్లాన్ ఓ కుటుంబ అవసరాలను ఏ మాత్రం తీర్చగలదో ఆలోచించండి. అందుకే హెల్త్, లైఫ్ ప్లాన్లు లేని వారు వెంటనే వాటిని తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్న వారు.. వీలు చేసుకుని టర్మ్ ప్లాన్ తీసుకునేందుకు ప్రయత్నించాలి. తమ వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ 10 రెట్ల మేర అయినా బీమా తీసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు ఉంటే ఆ మొత్తాన్ని కూడా కవరేజీకి కలిపి అధిక మొత్తంలో బీమా తీసుకోవడం మంచిది. దీనివల్ల కుటుంబానికి తాము లేని లోటును తీర్చే రక్షణ ఏర్పాటు చేసిన వారు అవుతారు. అనారోగ్యం, ప్రమాదాలు చెప్పి రావు. వయసులో ఉన్న వారికి కూడా ఇటువంటివి ఎదురుకావచ్చు. ఒకవేళ హెల్త్ పాలసీ ఉన్నా కేవలం రూ.2–3లక్షల కవరేజీయే ఉంటే.. దానికి టాపప్ తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాలి. టాపప్‌కు ప్రీమియం తక్కువే ఉంటుంది. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల హెల్త్ కవరేజీ అయినా ఉండాలి. దీనికి అదనంగా టాపప్ కూడా జోడించుకోవాలన్నది నిపుణుల సూచన. సాయం కోసం ఎదురుచూడొద్దు అనుకోని అవసరం ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక సాయం కోసం బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఆశ్రయించడం కంటే.. ఒక ప్రత్యేక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మనశ్శాంతిని, ధైర్యాన్నిస్తుంది. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ప్రమాదానికి గురి కావడం ఇటువంటివన్నీ అత్యవసర పరిస్థితులే. అందుకే కనీసం 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇందులో రుణాలకు చేసే చెల్లింపులు కూడా భాగంగా ఉండాలి. ఈ మొత్తాన్ని బ్యాంకు ఎఫ్డీలు లేదా లిక్విడ్ ఫండ్స్ రూపంలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అవసరం ఏర్పడినప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఇలా ప్రత్యేక నిధిని సమకూర్చుకోవడమే కాదు.. అత్యవసరాలు ఎదురైతే తప్పించి చిన్న అవసరాలకు కదపకూడదు. భిన్న సాధనాలకు కేటాయింపులు పెట్టుబడులన్నింటినీ ఒకటే సాధనంలో కాకుండా భిన్న సాధనాలకు కేటాయించుకోవడం కూడా ఆర్థిక ప్రణాళికలో ఒక భాగమే. ఉదాహరణకు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అప్పుడు మీరు చాలా రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. పెట్టుబడుల పరంగా మీ నిర్ణయాల్లో తప్పిదం చోటు చేసుకుంటే అసలుకే ఎసరు వస్తుంది. అందుకే ఈక్విటీలు, డెట్, బంగారం ఇలా వీలైనన్ని సాధనాల మధ్య పెట్టుబడులను వేరు చేసుకోవాలి. దీనివల్ల రిస్క్‌ను మించి రాబడులు వస్తాయి. మీ రిస్క్ సామర్థ్యం, ఆశిస్తున్న రాబడులు, పెట్టుబడులకు ఉన్న వ్యవధి వీటి ఆధారంగా ఏ విభాగంలో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్నది ఆర్థిక సలహాదారుల సాయంతో నిర్ణయిం చుకోవాలి. ఒక్కో విభాగం అద్భుత పనితీరుతో అందులోని పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగిపోతే.. అందుకు తగ్గట్టు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవాలి. ఈక్విటీలకు 50% కేటాయించాలన్నది మీ ప్రణాళిక అయితే.. మార్కెట్ల ర్యాలీ కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 60 శాతానికి చేరితే.. అప్పుడు 10% మేర ఈక్విటీలకు కేటాయింపులు తగ్గించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఆగొద్దు పెట్టుబడులు ఎప్పుడూ లక్ష్యాలకు అనుగుణంగా సాగిపోవాలి. మధ్యలో వచ్చే ఆటుపోట్లను చూసి పెట్టుబడుల ప్రణాళికలు ఆగిపోకూడదు. గతేడాది మార్చి చివరికి మార్కెట్లు కనిష్టాలకు పడిపోయినప్పుడు కంగారుపడిపోయి స్టాక్స్‌ను అమ్ముకున్న వారు.. డిసెంబర్ వచ్చే సరికి ఎంతో విచారించి ఉంటారు. ఎందుకంటే తొమ్మిది నెలల్లో మార్కెట్లు కొత్త గరిష్టాలకు వెళ్లిపోయాయి. మార్కెట్లు ఎప్పుడూ పడి లేచే కెరటాలు. అలాగే, స్టాక్స్ విక్రయించకుండా.. అదనంగా ఇన్వెస్ట్ చేసిన వారు భారీ లాభాలను కళ్లచూసి ఉంటారు. అందుకే ఈక్విటీ పెట్టుబడులు కనీసం ఐదేళ్లకు మించిన కాలానికే సముచితం. అందులోనూ నేరుగా స్టాక్స్‌లో కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో, అందులోనూ ప్రతీ నెలా ఇంతచొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం.. సగటున అధిక రాబడులను సమకూర్చుకునేందుకు, రిస్క్‌ను తట్టుకునేందుకు సాయపడుతుంది. ఇరువైపులా ప్రయోజనాలను తెచ్చిపెట్టే సాధనమే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). ఇక బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఎక్కువ మొత్తాలను అలాగే ఉంచేయవద్దు. సేవింగ్స్ వడ్డీ రేటు 4–5 శాతం అన్నది ద్రవ్యోల్బణానికే సరిపోతుంది. కనుక అదనపు బ్యాలన్స్‌ను డిపాజిట్లుగా మార్చే ఆటోస్వీప్ సదుపాయాన్ని ఎంచుకోవాలి. నామినీని, విల్లును మర్చిపోవద్దు ఒక వ్యక్తి మరణానంతరం అతని పేరిట ఉన్న ఆస్తులు, పెట్టుబడులు కుటుంబ సభ్యులకు సులభంగా అందేలా చేసేదే విల్లు. ఎవరికి ఏవి, ఏ మేరకు చెందాలన్నదీ విల్లులో నిర్దేశించుకోవచ్చు. తమ పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు, బీమా పాలసీల వివరాలు కుటుంబ సభ్యులకు తప్పకుండా తెలియజేయాలి. బీమా ప్లాన్లు, పెట్టుబడుల్లో నామినీని చేర్చాలి. ఖర్చు/పొదుపు కరోనా, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా గతంతో పోలిస్తే కొన్ని అనవసర వ్యయాలు తగ్గాయి. వీకెండ్లో బయటకు వెళ్లి రెస్టారెంట్లలో తినడం, సినిమాలు, పర్యటనలు వంటివి చాలా వరకు తగ్గాయి. వేతనాల్లో కోతలు పడిన వారికి ఈ విధంగా తగ్గిన వ్యయాలు కాస్త ఊరటనిచ్చాయి. అదే సమయంలో వేతన కోతల్లేని వారికి మిగిలిన మేర అదనంగా ఇన్వెస్ట్ చేసుకునే మంచి అవకాశం లభించిందనే చెప్పుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా.. ఎంత పొదుపు చేశారన్నదే మీ ఆర్థిక పరిస్థితులను మార్చే సూత్రం అవుతుంది. కనుక పరిమితుల్లోపే ఖర్చు చేసుకోవాలి. అందుకే నెలవారీ బడ్జెట్ రూపొందించుకుని దాని ప్రకారం ఖర్చు, ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ వ్యయాలపై మీకు నియంత్రణ సాధ్యమవుతుంది. అంతగా అవసరం లేని వాటి కోసం రుణాలపై కొనుగోళ్లకు వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదు. ఈ తరహా అనవసర వ్యయాలకు దూరంగా ఉండాలి. కొత్త ఏడాది ప్లానింగ్ ► జనవరి: బీమా కవరేజీ మీకు సరిపడా ఉన్నదీ, లేనిదీ ఒక్కసారి సరిచూసుకోవాలి. అలాగే, బీమా ప్రీమియం, ఈఎంఐ చెల్లింపుల తేదీల కోసం రిమైండర్ పెట్టుకోవాలి. ► ఫిబ్రవరి: కేంద్ర బడ్జెట్లో కొత్త నిబంధనల వల్ల మీ ఆదాయం, పన్నులు, పెట్టుబడుల ప్రణాళికలను మార్చుకోవాలేమో సరిచూసుకోవాలి. ► మార్చి: 2020–21 సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగో విడత చెల్లింపుల గడువు మార్చి 15తో ముగుస్తుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఈలోపు ఆ పనిచేసేయాలి. పన్ను ఆదా కోసం పెట్టుబడులకు మార్చితో గడువు ముగిసిపోతుంది. ఫాస్టాగ్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ► ఏప్రిల్: 2021–22 నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభం కనుక.. ఆర్థిక నిపుణుల సాయంతో పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుని లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. సొంతంగా ఆ పరిజ్ఞానం ఉంటే తామే ఆ పనిచేసుకోవచ్చు. ► మే: ఈ నెలలో 14న అక్షయ తృతీయ ఉంది. ఆ రోజు బంగారం కొనుగోలు చేసుకోవాలని అనుకుంటే అందుకు కావాల్సిన మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి. ► జూన్: 2021–22 మొదటి అడ్వాన్స్ ట్యాక్స్ గడువు జూన్ 15. ఇక 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్నులు వేసేందుకు గాను పనిచేస్తున్న సంస్థ వద్ద ఫామ్ 16 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ► జూలై: ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 వరకు గడువు. ఆ లోపు రిటర్నులు ఫైల్ చేయాలి. ► ఆగస్టు: పెట్టుబడులపై మధ్యంతర సమీక్ష మంచిది. ► సెప్టెంబర్: 2021–22 రెండో విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ను 15వ తేదీలోపు చెల్లించాలి. ► అక్టోబర్: దసరా పండుగ భారీ ఆఫర్ల సమయంలో కొనుగోళ్లకు ముందుగానే సన్నద్ధం అయితే మంచిది. ► నవంబర్: ఈ నెలలో దీపావళి పండుగ 4న వస్తోంది. ఆ సందర్భంలో కొనుగోళ్లకు సన్నద్ధులు కావాలి. ► డిసెంబర్: మూడో విడత అడ్వాన్స్ ట్యాక్స్ (2021–22)కు 15 వరకు గడువు ఉంది. 25న క్రిస్మస్ పండుగ వేడుకలకు బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలి. -
పన్ను ఆదాకు చక్కని పథకం
పెట్టుబడులపై అధిక రాబడులను పొందే అవకాశం.. అదే సమయంలో సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను ఆదా.. ఈ ప్రయోజనాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల నుంచి పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో మంచి పనితీరు చూపిస్తున్న టాప్ పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ కూడా ఒకటి. ఈఎల్‌ఎస్‌ఎల్ పథకాల్లో చేసే పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే ఆ లోపు వాటిని వెనక్కి తీసుకు నే అవకాశం ఉండదు. దీర్ఘకాల లక్ష్యాల కోసం, పిల్లల ఉన్నత చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం ఈ పథకాల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. రాబడులు..: ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు మెరుగైన రాబడులనే ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 13.1 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షిక రాబడులు 17.7 శాతంగా ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 200 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్) రాబడులు ఏడాదిలో కేవలం 9 శాతంగా, మూడేళ్లలో వార్షికంగా 14.1 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రారంభించిన రోజు నుంచి చూస్తే ఇప్పటి వరకు సగటున వార్షికంగా 18.69 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ పథకంలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి రూ.1.65 లక్షలు సమకూరేది. 2016, 2017లో పన్ను ఆదా విభాగం సగటు రాబడులను మించి పనితీరు చూపించిన ఈ పథకం, 2018 మార్కెట్ కరెక్షన్ సమయంలో నష్టాలను పరిమితం చేసింది. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో నష్టాలు సగటున 6 శాతంగా ఉండగా, మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ పథకంలో నష్టాలు 2.3 శాతానికే పరిమితమయ్యాయి. పెట్టుబడుల విధానం..: 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 99 శాతం పెట్టుబడులకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ ఉంది. నగదు నిల్వలు కేవలం ఒక శాతం లోపునే ఉన్నాయి. ఈ పథకం బ్యాంకింగ్ రంగానికి పెద్ద పీట వేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలోని స్టాక్స్‌లో 37 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత 12 శాతం మేర ఎనర్జీ రంగంలో, ఎఫ్ఎంసీజీలో 10 శాతం, హెల్త్‌కేర్‌లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. కన్స్ట్రక్షన్, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మార్కెట్ విలువ పరంగా ఎటువంటి స్టాక్స్‌లో అయినా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈఎల్ఎస్ఎస్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 54 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారీ లార్జ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 70% వరకు పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్‌క్యాప్ 25%, స్మాల్ క్యాప్‌నకు 5 శాతం వరకు పెట్టుబడులు కేటాయించింది. -
బ్యాలెన్సా..? లేక డైనమిక్కా..?
తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు మ్యూచువల్ ఫండ్స్ వాటి ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని బట్టి విభిన్న రూపాల్లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకునే అగ్రసివ్ ఫండ్స్‌తో పాటు... ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేయాల్సినఅవసరం లేని ఇండెక్స్ ఫండ్లూ ఉన్నాయి. ఇండెక్స్‌లోని షేర్ల వెయిటేజీ ఆధారంగా ఇవి ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటాయి. అదే డైనమిక్, డైవర్సిఫైడ్ ఈక్విటీ వంటి అగ్రసివ్ ఫండ్స్ వ్యూహాలు మాత్రం మార్కెట్ కదలికలను బట్టి వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందిన ఇలాంటి రెండు రకాల ఫండ్స్ బ్యాలెన్స్డ్, డైనమిక్ ఫండ్స్ గురించి చూద్దాం. మార్పులు అక్కర్లేని బ్యాలెన్స్డ్... పేరుకి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ విధానంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65-70 శాతం ఈక్విటీలకు కేటాయిస్తారు. మిగిలిన మొత్తం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వీటి పోర్ట్‌ఫోలియోలో ఎప్పటికప్పుడు పెద్దగా మార్పులు చేయాల్సిన పని ఉండదు. ఈక్విటీ, డెట్ పథకాలతో పోలిస్తే వీటిలో నిర్వహణ వ్యయం తక్కువ. కానీ ఇదే సమయంలో ఇండెక్స్ ఫండ్స్ కంటే నిర్వహణ వ్యయం ఎక్కువ. ఇక వీటి రాబడులు చూస్తే... ఈక్విటీ, డెట్ పథకాల రాబడులకు మధ్యలో ఉంటాయి. గడిచిన ఏడాదిలో డెట్ ఫండ్స్ 11 శాతం, ఈక్విటీ ఫండ్స్ 25 నుంచి 30 శాతం రాబడినందించాయి. కానీ ఇదే సమయంలో బ్యాలెన్స్డ్ ఫండ్స్ 17 నుంచి 20 శాతం లాభాలనిచ్చాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియోలో 60 శాతం పైగా ఈక్విటీలకే కేటాయిస్తారు కాబట్టి పన్ను విషయాల్లో వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. అంటే వీటిలో ఇన్వెస్ట్ చేసి ఏడాది దాటితే ఎలాంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు. డెట్, ఈక్విటీ రెండింట్లో ఇన్వెస్ట్ చేస్తారు కనక తక్కువ రిస్క్‌తో మధ్యస్థాయిలో లాభాలను అందిస్తాయి. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ విధానమే ఉత్తమం. డైనమిక్ ఫండ్స్ వివిధ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో సహజ సిద్ధంగా ఉండే ఒడిదుడుకులను డైనమిక్ ఫండ్స్ స్వల్ప కాలానికి ఒడిసి పట్టుకుంటాయి. ఇవి తప్పనిసరిగా ఈక్విటీ, డెట్ పథకాల నుంచి మారుతుండాలి. అంటే.. ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయిస్తే నెలరోజుల్లో ఈ మొత్తాన్ని విక్రయించి డెట్ పథకాల్లోకి తప్పకుండా మార్చాలి. ఈ మార్పు అనేది ప్రతి ఫండ్ హౌస్‌కి మారుతుంటుంది. కొన్ని ఫండ్ హౌస్‌లు చాలా అగ్రసివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మారుస్తాయి. మరికొన్ని ఇండెక్స్ ఫండ్స్‌లా చాలా నెమ్మదిగా మారుస్తాయి. అందుకే డైనమిక్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్‌ను పూర్తిగా చదవాలి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు నిబంధనల ప్రకారం ఈక్విటీల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్ కంటే రాబడి తక్కువగా ఉంటుంది. కానీ తిరిగి ప్రవేశించడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తారు. మిగిలిన పథకాలతో పోలిస్తే డైనమిక్ ఫండ్స్‌లో రిస్క్ అధికమే అయినా అధిక రాబడి పొందే అవకాశముంది. ఇవి దీర్ఘకాలానికి అంటే కనీసం 5 ఏళ్ల దృష్టిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిప్ విధానం కంటే మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం మంచింది. ఈ అంశాలు గుర్తుంచుకోండి... ⇒ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ పథకాలు రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. ⇒ బ్యాలెన్స్డ్ ఫండ్స్ తక్కువ రిస్క్‌ను, తక్కువ రాబడిని కలిగి ఉంటాయి. ⇒ డైనమిక్ ఫండ్స్ పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే పూర్తిగా వైదొలగుతాయి కూడా. ⇒ డైనమిక్ ఫండ్స్‌కు అధిక రిస్క్, అధిక రాబడిని అందించే లక్షణాలున్నాయి ⇒ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో సిప్ విధానంలో, డైనమిక్ ఫండ్స్‌లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం మంచిది. - అనిల్ రెగో సీఈవో,రైట్ హొరెజైన్స్