IMF Chief Kristalina Georgieva Praises India Over Dealing With Coronavirus | కరోనా కట్టడి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భారత్‌ చర్యలు భేష్‌ - Sakshi
Sakshi News home page

కరోనా కట్టడి: భారత్‌పై ఐఎంఎఫ్‌ ప్రశంసలు

Published Fri, Jan 15 2021 12:18 PM | Last Updated on Fri, Jan 15 2021 12:41 PM

IMF Chief Praises India Over Dealing With Coronavirus - Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కట్టడితో పాటు దానివల్ల కుంటుపడిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భారత్‌ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఫ్‌) ప్రశంసించింది. అంతేకాకుండా ఆర్థికవ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని సూచించింది. అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్‌ సమావేశం సందర్భంగా ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా మాట్లాడుతూ.. ‘కరోనా కాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని మా అభిప్రాయం. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అప్‌డేట్‌ ఆవిష్కరణలో ఇదే విషయాన్ని ప్రముఖంగా వెల్లడించబోతున్నాం. వరల్డ్‌ ఎకనమిక్‌ అప్‌డేట్‌ను ఈ నెల 26న విడుదల చేస్తాం. దీన్ని ప్రతి ఒక్కరు శ్రద్దగా గమనించాలి’ అంటూ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. (చదవండి: రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం)

ఇక ఈ సమావేశం సందర్భంగా భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ గురించి జార్జీవా ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్‌ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పని చేసినట్లు ప్రశంసించారు. అంతేకాక భారత్‌ ఈ ఏడాది 2021ని తన ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవడం కోసం వినియోగించుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్‌లో చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించి మరింత ముందుకు వెళ్లాలని క్రిస్టాలినా జార్జీవా సూచించారు.

సాగు చట్టాలపై ఐఎంఎఫ్‌ స్పందన
ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఐఎంఎఫ్‌ స్పందించింది. వ్యవసాయ సంస్కరణల్లో సాగు చట్టాలు ఓ ముందడుగని తెలిపింది. వీటి వల్ల మధ్యవర్తుల అవసరం లేకుండానే రైతులు నేరుగా తమ పంటను అమ్ముకోవచ్చన్నది. అయితే ఈ నూతన చట్టాల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నవారికి సామాజకి భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఐఎంఎఫ్‌ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement