
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ పోవడమనేది ఆర్థిక వినాశనానికి దారితీస్తుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైద్యపరంగా మరో సంక్షోభం కూడా తలెత్తుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధాన నిర్ణేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువే ఉన్నాయని, కానీ లాక్‌డౌన్ పొడిగించడం వల్ల ప్రయోజనం మాత్రం ఉండబోదని మహీంద్రా అభిప్రాయపడ్డారు.
‘గతంలో నేను ట్వీట్ చేసినట్లుగా లాక్‌డౌన్ పొడిగింపులు ఆర్థికంగా వినాశకరం మాత్రమే కాదు మరో వైద్యపరమైన సంక్షోభానికి కూడా దారితీసే ప్రమాదముంది‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో మహీంద్రా ట్వీట్ చేశారు. మానసిక ఆరోగ్యంపై లాక్‌డౌన్ ప్రతికూల ప్రభావాలు, కోవిడ్‌యేతర రోగులు నిర్లక్ష్యానికి గురయ్యే భారీ రిస్కులను గురించి తాను గతంలో ప్రస్తావించిన కథనాన్ని గుర్తు చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉంటాయని, ఆస్పత్రులలో ఆక్సిజన్ అందుబాటులో ఉండే పడకల సంఖ్య వేగంగా, గణనీయంగా పెంచాల్సి ఉంటుందని మహీంద్రా తెలిపారు. ఆర్మీకి ఈ విషయంలో అపార అనుభవం ఉందని పేర్కొన్నారు. 49 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ను సమగ్రమైన విధంగా ఎత్తివేయాలంటూ మహీంద్రా గతంలో కూడా ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment