బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ తరుణ్ చుగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా కలిగి ఉండటమనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తమ అధ్యయనంలో తేలిందని బజాజ్ అలియాంజ్ లైఫ్ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా లైఫ్ గోల్స్ పేరుతో పలు నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 1,681 మంది సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో 60 శాతం మంది జీవిత బీమాను అత్యంత ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ తరుణ్ చుగ్ మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘‘సర్వే ప్రకారం.. పిల్లల విద్య, ప్రశాంత జీవనం, సొంత ఇల్లు కీలకంగా ఉన్నాయి. 10 శాతం మంది సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. పది మందిలో ఒకరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంతోపాటు అదనపు సంపాదన కోసం చూస్తున్నారు. రిటైర్‌మెంట్ తర్వాత జీవితం గురించి అయిదుగురిలో ఇద్దరు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు’’ అని తరుణ్ చుగ్ వివరించారు.
సోషల్ మీడియా ప్రభావం..
పలు విదేశీ పర్యాటక కేంద్రాలను చుట్టి రావాలని 28 శాతం మంది లక్ష్యంగా చేసుకున్నట్లు చుగ్ చెప్పారు. ‘‘దక్షిణాది వారిలో ఇది 35 శాతంగా ఉంది. ముగ్గురు మహిళల్లో ఒకరికి ట్రావెల్ గోల్స్ ఉన్నాయి. 40 శాతం మంది హెల్త్, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. సగం మంది బ్యాలెన్స్ లైఫ్ ఉండాలని కోరుకున్నారు. సామాజికంగా తాము ప్రభావం చూపాలని 10 శాతం మంది ఉత్సాహం కనబరుస్తున్నారు. జీవిత లక్ష్యాలు నిర్దేశించుకోవడంలో సోషల్ మీడియా ప్రభావం ఉందని అయిదుగురిలో ఒకరు తెలిపారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిపడ చేయలేకపోయామని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. 62 శాతం మంది తమ లక్ష్యాలను చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు’’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment