మంగళవారం నల్లగొండలో కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రంగనాథ్
సాక్షి, నల్లగొండ క్రైం: అదో కరడుగట్టిన ముఠా. సులువుగా డబ్బు సంపాదించేందుకు పెద్ద పన్నాగమే వేసింది. అమాయకుల పేరిట జీవిత బీమా పాలసీలు కట్టి, తర్వాత వారిని చంపేసి.. బీమా డబ్బు కాజేస్తోంది. ఒక్కరిద్దరు కాదు.. ఇప్పటివరకు ఎనిమిది మందిని ఇలా చంపి, రూ.కోటిన్నర మేర క్లెయిమ్ చేసుకుంది. ఈ దుర్మార్గంలో ఆ అమాయకుల కుటుంబ సభ్యులతోపాటు బీమా కంపెనీల ప్రతినిధుల భాగస్వామ్యం కూడా ఉండడం విస్మయం కలిగిస్తోంది. బీమా సొమ్ము పంపకాల్లో తలెత్తిన వివాదం చివరికి ఈ ముఠా గుట్టును రట్టు చేసింది. పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నల్లగొండ ఎస్పీ రంగనాథ్ మంగళవారం తన కార్యాలయంలో ఈ వివరాలు వెల్లడించారు.
సులువుగా డబ్బు వస్తుందని..
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగుతండాకు చెందిన ధీరావత్ రాజునాయక్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ట్రస్టు ఫైనాన్స్ సర్వీస్‌లో ఏజెంట్‌గా పనిచేస్తుండేవాడు. 2013లో అతడి సమీప బంధువు శూన్యపహాడ్‌కు చెందిన సబావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. అతని భార్య పేరిట రూ.1.40 లక్షల బీమా పాలసీ పొందడంలో రాజునాయక్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో బీమా సొమ్మును కాజేసేందుకు ఓ పథకాన్ని రచించాడు. తన స్నేహితులైన కంచి శివ, మందారి సాయిసంపత్, వేముల కొండల్‌ను సభ్యులుగా ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, వివాహేతర సంబంధాల గొడవలతో సతమతమవుతున్న వారిని టార్గెట్ చేసుకుని కార్యకలాపాలను ప్రారంభించాడు.
ఒప్పందం చేసుకుని.. బీమా చేయించి..
ఈ ముఠా మిర్యాలగూడ, దామరచర్ల మండలాల పరిధిలో అనారోగ్య సమస్యలున్న వారిని, వివాహేతర సంబంధాలను అడ్డు తొలగించుకునే ఉద్దేశంతో ఉన్న వారిని సంప్రదిస్తుంది. హత్య చేయాల్సిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఒప్పందం చేసుకుంటుంది. సదరు వ్యక్తి పేరిట ముఠా సభ్యులే వివిధ కంపెనీల బీమా పాలసీలు కడతారు. కొద్దినెలల తర్వాతో, ఏడాది తర్వాతనో ఆ వ్యక్తిని చంపేస్తారు. వచ్చిన బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటారు.
ముఠా దారుణాల్లో కొన్ని..
►అనారోగ్యంతో బాధపడుతున్న మిర్యాలగూడ మండలం జటావత్ తండాకు చెందిన రూపావత్ దేవాను ఈ ముఠానే మట్టుబెట్టింది. ఈ దారుణంలో దేవా భార్య ధనమ్మ కూడా పాత్రధారే. దేవా పేరిట రూ.12లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నారు.
►దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన పరంగి సోమయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా.. అతడి పేరిట బీమా పాలసీ చేయించి, చంపేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రూ.10 లక్షలు వెనకేసుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన దైద హుస్సేన్‌ను హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. రూ.53 లక్షలు క్లెయిమ్ చేసి, పంచుకున్నారు.
►దామరచర్ల మండలం కల్లెపల్లికి చెందిన ధీరావత్ లాల్‌సింగ్‌ను కూడా అతడి భార్య సహకారంతో హత్య చేశారు. రూ.23 లక్షల ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకున్నారు.
►రాళ్లవాగు తండాకు చెందిన సబావత్ తుల్య అనారోగ్యంతో ఉండడంతో.. అతడి భార్య ఇద్దరు పిల్లలను ఒప్పించి చంపేశారు. రూ.60 లక్షలు ఇన్సూరెన్స్ పొందారు.
►గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెం గ్రామానికి చెందిన బూక్యా నాగులునాయక్ ను కూడా ఇదే తరహాలో హత్య చేసి బీమా సొమ్ము కాజేశారు.
బయటపడిందిలా..
దామరచర్ల మండలానికి చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి, హారిక దంపతులు. హారిక అదే గ్రామానికి చెందిన మరొకరితో సన్నిహితంగా మెలుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ముఠా సభ్యులు ఆమెను సంప్రదించి.. కోటిరెడ్డిని హత్య చేసేందుకు పథకం రచించారు. బీమా పాలసీలు కట్టారు. ఫిబ్రవరి 24న ముఠా సభ్యులే అతడిని హత్య చేశారు. తర్వాత బొత్తలపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారు. అతడి పేరిట రూ.12 లక్షల ఇన్సూరెన్స్ క్లయిమ్ చేశారు. అయితే ఈ డబ్బు పంపకాల్లో తలెత్తిన వివాదం పోలీసుల వరకు చేరింది. అనుమానంతో హారికను అదుపులోకి తీసుకుని విచారించగా బీమా మాఫియా గుట్టు బయటపడింది. విషయం తెలిసిన ముఠా సభ్యులు రాజునాయక్, కంచి శివ, మందారి సాయిసంపత్, వేముల కొండల్ పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బీమా మాఫియా వ్యవహారంపై ఏఎస్పీ నేతృత్వంలో సమగ్ర విచారణ జరిపిస్తామని ఎస్పీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment