ఫొటో తీస్తే... కోట్ వస్తుంది
ఐసీఐసీఐ యాప్‌లో వినూత్న సేవ
ముంబై: వాహన బీమా తీసుకునేటపుడు ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ నింపటమంటే మామూలు మాటలు కాదు. వ్యక్తిగత వివరాలతో పాటు వాహనం తాలూకు వివరాలూ పూర్తిగా నింపాలి. ప్రత్యేకించి ఒక బీమా కంపెనీ నుంచి వేరొక దానికి మారాలనుకున్నపుడు... ఆ కంపెనీ ప్రీమియం ఎంతుందో తెలుసుకోవాలన్నా సరే... ఇవన్నీ నింపక తప్పదు. ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో కూడా ఇవన్నీ ఉండాలా...? ఇదే ఆలోచన ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకి కూడా వచ్చింది.
దీంతో పాలసీని స్మార్ట్ ఫోన్‌తో ఫొటో తీసి పంపిస్తే చాలు... కొత్త పాలసీ ప్రీమియం తాలూకు కోట్‌ను మన మొబైల్‌కే ఎస్‌ఎంఎస్ చేసే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐసీఐసీఐ లాంబార్డ్ వాహన బీమా కావాలనుకున్నవారు ఐసీఐసీఐ మొబైల్ ఫోన్ యాప్‌లో ‘ఫొటో కోట్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేయటం ద్వారా ఈ సేవను పొందవచ్చు. ఫొటో కోట్‌తో పాటు ఐసీఐసీఐ మొబైల్ యాప్ ద్వారా ఆరోగ్య, వాహన, ట్రావెల్ బీమా పాలసీలను కొనుగోలు చేయటం, రెన్యువల్ చేసుకోవటం వంటివన్నీ చేయొచ్చు.
దగ్గర్లోని నెట్‌వర్క్ ఆసుపత్రిని, ఓపీడీ కేంద్రాన్ని, పాథాలజీ లాబ్‌లను గుర్తించటమే కాక... వాహన బీమాకు సంబంధించి దగ్గర్లోని గ్యారేజీని కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. క్లెయిమ్ స్థితిగతులను ట్రాక్ చేయొచ్చు కూడా. ఈ స్మార్ట్ యుగంలో కస్టమర్లకు అత్యుత్తమ సాంకేతిక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.