Vehicle insurance
-
ధీమాగా బీమా.. ఇలా!
'ఇన్సూరెన్స్'.. ఈ పదం మన నిత్యజీవితంలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులకు, జంతువులకు, వాహనాలకు ఇన్సూరెన్స్ చాలా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు అనేక ఆఫర్లను అందిస్తూనే ఉన్నాయి. అయితే మీరు వాహనాలను కొనుగోలు చేసినప్పుడు.. దానికి ఇన్సూరెన్స్ పొందాలనుకున్నప్పుడు, తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ కథనంలో చూసేద్దాం..బీమా కవరేజ్వాహనాలను ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ పాలసీ అందించే కవరేజ్ గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో మోటారు బీమా పాలసీ రెండు ప్రధాన రకాల కవరేజీలను అందిస్తుంది. అవి థర్డ్-పార్టీ లయబిలిటీ, సమగ్ర కవరేజ్ (Comprehensive Coverage).కొత్త కారును కొనుగోలు చేసే సమయంలోనే కారు డీలర్ ద్వారా థర్డ్-పార్టీ బీమా అందిస్తారు. ఇది ఒక బేసిక్ ఇన్సూరెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. శారీరక గాయాలు, వైకల్యం, మూడో వ్యక్తి యొక్క వాహనం లేదా ఆస్తికి సంభవించే నష్టాలను మాత్రమే ఇది భర్తీ చేస్తుంది. థర్డ్-పార్టీ బీమా పాలసీ నిబంధనల ప్రకారం, మీ వాహనానికి జరిగిన నష్టానికి ఈ కవరేజి ద్వారా క్లెయిమ్ చేసుకోలేరు.ఇక సమగ్ర కవరేజ్ విషయానికి వస్తే.. రోడ్డు ప్రమాదం వంటి ఏదైనా ఊహించని సంఘటనల్లో కారుకు సంభవించే నష్టాలకు ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి మోటారు బీమా పాలసీని ఎంచుకునే ముందు మీకు కావలసిన కవరేజీ గురించి తెలుసుకుని ఎంచుకోవాలి.ప్రీమియం & ఐడీవీబీమా పాలసీని ఎంచుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా ప్రీమియం లేదా ఐడీవీ (Insured Declared Value) గురించి కూడా తెలుసుకోవాలి. మీ కారు ఏదైనా రిపేరుకు మించి లేదా ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోయినప్పుడు ప్రీమియం కవరేజీ నష్టాన్ని భర్తీ చేస్తుంది.ఐడీవీ విషయానికి వస్తే.. దీనిని ఎంచుకునే ముందు మీరు కారు ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేసుకోవాలి. కారు బీమా పాలసీని ఆన్లైన్లో సరిపోల్చేటప్పుడు, కారు మార్కెట్ విలువకు దగ్గరగా ఉండే IDVని ఎంచుకోవచ్చు. అనుకోని ప్రమాదంలో మొత్తం కారు ధ్వంసమైనప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు ఈ కవరేజీ పనికొస్తుంది.యాడ్ ఆన్ కవర్స్మెరుగైన కవరేజ్ కోసం యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయవచ్చు. సమగ్ర మోటారు బీమా పాలసీలో కవర్ చేయని కొన్ని నష్టాలను దీని ద్వారా కవర్ చేసుకోవచ్చు.ఉదాహరణకు.. ప్రమాదం సమయంలో కారు టైర్లకు డ్యామేజ్ జరిగితే.. ఆ నష్టాన్ని సాధారణ బీమా ద్వారా భర్తీ చేసుకోలేరు. కానీ ఈ యాడ్ ఆన్ కవర్స్ కొనుగోలు చేసి ఉంటే.. ఆ నష్టాన్ని కూడా భర్తీ చేసుకోవచ్చు. కొత్త కారును కలిగి ఉన్నప్పుడు టైర్ కవర్, ఇంజిన్ కవర్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్టర్, ఇన్వాయిస్ కవర్ వంటి వాటికోసం యాడ్ ఆన్ కవర్స్ ఎంచుకోవాలి.నో క్లెయిమ్ బోనస్నో క్లెయిమ్ బోనస్ (NCB) అనేది ఒక సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయనందుకు బీమా కంపెనీలు అందించే రివార్డ్. మీరు కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసినప్పుడు ప్రీమియంపై తగ్గింపు రూపంలో రివార్డ్ పొందవచ్చు. వరుసగా 5 సంవత్సరాలు క్లెయిమ్ చేయని పక్షంలో.. మీరు మీ రెన్యూవల్ ప్రీమియంపై50 శాతం వరకు NCB తగ్గింపును పొందవచ్చు.ఇదీ చదవండి: కారు ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ ఇలా క్లెయిమ్ చేసుకోండిఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలిఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాష్‌లెస్ క్లెయిమ్.. రెండు రీయింబర్స్మెంట్ క్లెయిమ్. ఇందులో క్యాష్‌లెస్ క్లెయిమ్ అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కారుకు ప్రమాదం జరిగితే.. దాన్ని రిపేర్ చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చు సదరు కంపెనీ భరిస్తుంది.రీయింబర్స్మెంట్ క్లెయిమ్ అయితే.. ముందుగా కారును రిపేర్ చేసుకుని, ఆ తరువాత బిల్స్‌ను కంపెనీలకు చూపించి క్లెయిమ్ చేసుకోవాలి ఉంటుంది. ఆ బిల్స్ అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తే.. మీ డబ్బు మీకు వస్తుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకుని మీ అవసరాలకు సరిపోయే బీమా పాలసీని ఎంచుకోవచ్చు. -
వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
షోరూమ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా బీమా తీసుకోవాల్సిందే. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా లాంగ్‌టర్మ్ బీమా ఎంచుకుంటే ఐదేళ్లు బీమా వెసులుబాటు ఉంటుంది. అయితే బీమా అయిపోయాక చాలామంది దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం లేదు. తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో కేవలం 19 శాతం టూ వీలర్ యజమానులు మాత్రమే బీమా రెన్యువల్ చేయిస్తున్నారు. వాహనం తీసుకున్న కొత్తలో అనివార్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీమా తీసుకోవాల్సిందే. కానీ బీమా సమయం పూర్తయిన తర్వాత కూడా వాహనదారులు ఇన్సూరెన్స్ చేయించాలి.మార్కెట్లో ఆప్లైన్తోపాటు ఆన్లైన్లో చాలా వెబ్పోర్టళ్ల ద్వారా టూవీలర్ బీమాను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా తీసుకునేప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీమాలున్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైన జరిగితే పరిహారం ఇచ్చేలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. శారీరక గాయాలు, ఆస్తి నష్టం, మరణం.. వంటివి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు.విస్తృత బీమావిస్తృత బీమా ప్రయోజనాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.ఇవి తెలుసుకోండి..కవరేజీ: బీమా పాలసీ ఎంచుకునేప్పుడు మొత్తం ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోవాలి. నిత్యం వాహనాన్ని ఉపయోగిస్తుంటే దాని విలువ ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే మేలు. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినా పూర్తి భద్రత ఉంటుంది.ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ: వాహనం తీవ్రంగా దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా కంపెనీలు అత్యధికంగా చెల్లించే పరిహారమే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ). వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులైతే క్రమంగా దాని విలువ తగ్గిపోతోంది. ఐడీవీ మార్కెట్లో వాహన ప్రస్తుత ధరను తెలియజేస్తుంది.బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియా(సీఎస్ఆర్) తెలుసుకోవాలి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.కొన్ని కంపెనీలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం కొంత మొత్తంలో బీమా తీసుకునే సమయంలోనే వసూలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుపై నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్ వరకు భద్రంగా చేరవేసేందుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ఆన్ ఉపయోగపడుతుంది.బీమా రెన్యువల్ చేసిన ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తర్వాత సంవత్సరం కట్టే ప్రీమియంకు కొన్ని కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి.ఇదీ చదవండి: ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపుఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన రిపేర్ల కోసం ఎలాంటి నగదు చెల్లించకుండా ఉండే పాలసీను ఎంచుకోవాలి. పాలసీ నెట్వర్క్ గ్యారేజీల్లో ఉచితంగానే రిపేర్ చేస్తారు. మీరు ఉంటున్న ప్రదేశాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ గ్యారేజీలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
91 శాతం వాహనాలు బీమాకు దూరం
బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2018లో తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం షోరూం నుంచి కొత్త కారు రోడ్డెక్కాలంటే ఒక ఏడాది ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, మూడేళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఐఆర్డీఏఐ 2019లో తెచ్చిన రూల్స్ ప్రకారం ద్విచక్ర వాహనాల విషయంలో ఇది 1+5 ఏళ్లు ఉంది. ఇదంతా సరే. మరి రెన్యువల్స్ సంగతి ఏంటి? తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో ఎంత మంది తమ వాహనాలను రెన్యువల్ చేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 19 శాతం టూ వీలర్లు, 47 శాతం కార్లు మాత్రమే రెన్యువల్ అవుతున్నాయట. మొత్తంగా దేశంలో అన్ని వాహనాలకు కలిపి బీమా విస్తృతి 9 శాతమే ఉంది. అంటే రోడ్డుమీద తిరుగుతున్న 100 వాహనాల్లో తొమ్మిదికి మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్నట్టు లెక్క. 2015కు ముందు ఇది కేవలం 3 శాతమే. వాహనానికి ఏమీ కాదు.. అనవసరంగా డబ్బులు ఖర్చు అన్న నిర్లక్ష్యపు భావనే ఇందుకు కారణమని బీమా కంపెనీలు అంటున్నాయి. బీమా లేకుంటే వాహనానికి జరగరానిది జరిగితే జేబులోంచి ఖర్చు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టమూ తప్పదు. సమగ్ర బీమా ఉంటే ప్రకృతి విపత్తుల నుంచీ వాహనానికి రక్షణ లభిస్తుంది.డిజిటల్ పాలసీలదే హవా.. వ్యయాలను తగ్గించుకోవడానికి, పాలసీల జారీని వేగవంతం చేయడానికి బీమా కంపెనీలు డిజిటల్ వైపు మళ్లుతున్నాయి. 10 నిమిషాల్లోనే పాలసీలను కస్టమర్ల చేతుల్లో పెడుతున్నాయి. ఆన్లైన్లో జారీ అవుతున్న పాలసీల సంఖ్య ఏకంగా 65 శాతం ఉందంటే డిజిటల్ వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) అడ్వైజర్లు సైతం కస్టమర్లను నేరుగా చేరుకుని డిజిటల్ రూపంలో పాలసీలను అందిస్తున్నారు. 2029–30 నాటికి జారీ అవుతున్న పాలసీల్లో డిజిటల్ వాటా 75 శాతానికి చేరుతుందని పరిశ్రమ భావిస్తోంది. కస్టమర్లలో 15 శాతం మంది జీరో డిప్రీసియేషన్ కోరుకుంటున్నారు. నడిపే దూరానికి బీమా చెల్లించే ‘పే యాజ్ యూ డ్రైవ్’ ప్లాన్స్‌ను 6 శాతం మంది ఎంచుకుంటున్నారని పాలసీబజార్‌కు చెందిన పీబీపార్ట్నర్స్ మోటార్ ఇన్సూరెన్స్ అసోసియేట్ డైరెక్టర్, సేల్స్ హెడ్ అమిత్ భడోరియా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీల మధ్య పోటీ కారణంగానే ప్రీమియంలో వ్యత్యాసం ఉంటోందని అన్నారు. రూ.1.60 లక్షల కోట్లకు.. దేశంలో వాహన బీమాను 27 సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. పాలసీల జారీలో 57 బ్రోకింగ్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. భారత్‌లో మోటార్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2023–24లో 12.9 శాతం దూసుకెళ్లి రూ.91,781 కోట్లు నమోదు చేసింది. 2029 నాటికి ఇది సుమారు రూ.1.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. వాహనాలన్నింటికీ బీమా కలిగి ఉండాలన్నదే ఐఆర్డీఏఐ లక్ష్యం. అంతేగాక బీమా ప్రీమియం వినియోగదార్లకు అందుబాటులో ఉంచేందుకు ఐఆర్డీఏఐ కృషి చేస్తోంది. బీమా పాలసీలను విస్తృతం చేసే లక్ష్యంతో 2015లో పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ (పీవోఎస్‌పీ) కాన్సెప్ట్‌కు ఐఆర్డీఏఐ శ్రీకారం చుట్టడం పరిశ్రమ వృద్ధికి ఆజ్యం పోసింది. జారీ అవుతున్న పాలసీల్లో 60 శాతం బ్రోకింగ్ కంపెనీల నుంచే ఉండడం గమనార్హం. 40 శాతం పాలసీలు నేరుగా బీమా కంపెనీల నుంచి జారీ చేస్తున్నారు. 75 శాతం చౌక ప్రీమియం పాలసీలే..దేశంలో 2018కి ముందు రెన్యువల్స్ ద్విచక్ర వాహనాలకు 31 శాతం, కార్లకు 37 శాతం నమోదైంది. ఐఆర్డీఏఐ చొరవతో ఇన్సూరెన్స్ విస్తృతి పెరిగింది. పాలసీబజార్.కామ్ ప్రకారం టాప్–20 నగరాల్లో 50 శాతం టూ వీలర్స్, 60 శాతం కార్లకు బీమా ఉంది. తృతీయ, ఆపై తరగతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో 40 శాతం ద్విచక్ర వాహనాలు, 45 శాతం ఫోర్ వీలర్స్‌కు ఇన్సూరెన్స్ ఉంది. టాప్–20 నగరాల్లో సమగ్ర బీమా (కాంప్రహెన్సివ్) పాలసీని 55 శాతం మంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 70 శాతం మంది ఎంచుకుంటున్నారు. ఈ నగరాల వెలుపల 30 శాతం మంది సమగ్ర పాలసీ, 50 శాతం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ప్రీమియంలో లభించే పాలసీలను 75 శాతం మంది తీసుకుంటున్నారు. ఇక ప్రమాదానికి గురైన వాహనాల్లో 40 శాతం వాటికి బీమా ఉండడం లేదట. -
వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!
ఇష్టపడి కారు కొంటున్నారా.. భవిష్యత్తు ప్రమాదాల దృష్ట్యా వాహనబీమా కూడా చేయిస్తుంటారు కదా. ప్రమాదశాత్తు మీ కారు కీ పోయిందనుకోండి. ఏం చేస్తారు.. ‘ఏముంది నకిలీ కీ తయారు చేయిస్తాం’ అంటారా.. అయితే మీకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ వర్తించదనే సంగతి తెలుసా? నకిలీ కీ ఉంటే బీమా ఎందుకు రాదో.. కీ పోయినా బీమా వర్తించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.ముప్పే ఏళ్ల కిందట సైకిల్ వినియోగిస్తే మహాగొప్ప. బైక్ ఉందంటే సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం ఉండేది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం సైకిల్, బైక్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదు. దాదాపు చాలామంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. కారు కొనే సమయంలో కంపెనీలు వాహనబీమా ఇస్తుంటాయి. అయితే అనుకోకుండా కారు కీ పోయిందనుకోండి. వెంటనే దాని నకిలీ తయారు చేయించి వాడుతుంటారు. కారు ఏదైనా ప్రమాదంబారిన పడినప్పుడు బీమా క్లెయిమ్ చేయడానికి వెళ్తారు. కానీ బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను రెజెక్ట్ చేస్తుంది. మీరు నకిలీ కీ వాడుతున్నట్లు రుజువవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటుంది.ఇదీ చదవండి: పెరుగుతున్న ప్రైవేట్ మూలధన వ్యయంవాహన బీమా తీసుకునేప్పుడే ‘కారు కీ రీప్లేస్మెంట్’ యాడ్ఆన్ సర్వీసును తీసుకోవాలి. అందుకోసం కంపెనీను బట్టి రూ.250-రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసును ఎంచుకుని ఉంటే ఒకవేళ భవిష్యత్తులో కారు కీ పోయినా దాన్ని కంపెనీ రీప్లేస్ చేస్తుంది. అలా రీప్లేస్ చేసిన కీ వాడుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కంపెనీ బీమాను క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కీ రీప్లేస్మెంట్ యాడ్ఆన్ సర్వీసును ఎంచుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. -
నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: వాహన బీమాలో కొన్ని సంస్థలు మాయాజాలం చేస్తున్నాయి. ఏకంగా ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టిస్తున్నాయి. సదరు సంస్థల బీమాకు వాహన్ పోర్టల్లోనూ ఆమోదం లభించడం గమనార్హం. సాధారణంగా ఎలాంటి వాహనాలకైనా ఏడాదికోసారి బీమాను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి. బీమా సంస్థలు కనీసం ఏడాది ప్రీమియాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం కొన్ని బీమా సంస్థలు నెల రోజుల వ్యవధితో పత్రాలను అందజేస్తున్నాయి. వీటి ఆధారంగానే కొందరు అధికారులు వాహనాలకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్, బదిలీ, అమ్మకాలు, చిరునామా మార్పు వంటి అంశాల్లో అన్ని రకాల డాక్యుమెంట్లతో పాటు సదరు వాహనానికి ఉన్న బీమా కాలపరిమితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. కనీసం ఏడాది పాటు బీమా గడువు ఉన్న వాహనాలకే ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించి వాహన సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణా వాహనాల్లో ఇది బేఖాతరు అవుతోంది. ప్రయాణికులు, వాహనాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో కీలకంగా భావించే బీమాపత్రాల్లో ఎలాంటి పారదర్శకతను పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి బీమా పత్రాలకు వాహన్ పోర్టల్‌లో సైతం ఆమోదం లభించడం విచిత్రంగా ఉంది’ అని ఇబ్రహీంపట్నానికి చెందిన మోహన్ అనే వాహన యజమాని విస్మయం వ్యక్తం చేశారు. తప్పించుకొనేందుకే... నెల రోజుల గడువుతో ఇస్తున్న బీమా పత్రాలు ఇటు వాహనదారులకు, అటు సదరు బీమా సంస్థలకు ఉభయ తారకంగా మారాయి. కొందరు వాహన యజమానులు బీమా భారాన్ని తప్పించుకొనేందుకు కేవలం రూ.1500 చెల్లించి నెల గడువు కలిగిన బీమాను పొందుతున్నారు. ఇది ఆ సంస్థలకు చక్కటి ఆదాయ మార్గంగా మారింది. నిజానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, తదితర వాహనాలకు ఏడాది ప్రీమియం కలిగిన థర్డ్‌పార్టీ బీమా పొందాలంటే రూ.7000 నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. వ్యక్తిగత కార్లకు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ భారాన్ని తప్పించుకొనేందుకే బీమా సంస్థలు, వాహనదారులు కొత్త ఎత్తుగడను ఎంచుకొన్నాయి. బీమా ప్రీమియం గడువును ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ ఇచ్చేస్తున్నారు. యాజమాన్య మార్పిడి, చిరునామా మార్పు, తదితర రవాణా సేవలను అందజేస్తూ తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. నకిలీల వెల్లువ.. మరోవైపు వాహన బీమాలో నకిలీ పత్రాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాల రెన్యువల్స్‌లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కొందరు ఏజెంట్లు ఏడాది విలువ కలిగిన నకిలీ పత్రాలను సృష్టించి రూ.1000 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఇలాంటి పత్రాల ఆధారంగానే వాహనదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. కొన్ని చోట్ల అవి నకిలీవో, అసలువో నిర్ధారించుకోకుండానే ఏజెంట్లపై ఆధారపడి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం గమనార్హం. చదవండి వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు! -
వాహన 'ధీమా'
సాక్షి, అమరావతి: ఓ వాహనం ప్రమాదానికి గురై ఆ వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆ వాహనానికి చెల్లించిన ఇన్సూరెన్స్ పత్రాలను జతచేసి పరిహారం కోసం దరఖాస్తు చేస్తే.. ఆ వాహనానికి చేసిన బీమా నకిలీదని తేలింది. దాంతో బాధిత కుటుంబానికి ఎలాంటి పరిహారం లభించలేదు. వాహన బీమా నకిలీ దందా ఉచ్చులో పడి ఆ కుటుంబం మోసపోయింది. ఏటా ఇలాంటి కేసులు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 లక్షల వాహనాలకు నకిలీ బీమా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రంగంలోకి దిగిన రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీ డీఆర్ఐ), రవాణా శాఖ సంయుక్తంగా ‘వాహన బీమా మిత్ర’ అనే వెబ్ అప్లికేషన్ రూపొందించాయి. అందుకోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు చెందిన ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ)తో ఏపీ డీఆర్ఐ ఇటీవల ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ అప్లికేషన్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. దశాబ్దాలుగా దందా రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న వాహన నకిలీ బీమా దందాపై గతేడాది ‘వాహన బీమాకు నకిలీ మకిలీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కొందరు నకిలీ ఏజెంట్లు, వాహన కాలుష్య తనిఖీ వాహనాల కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై రాష్ట్ర డీఆర్ఐ రెండు దశల్లో జరిపిన దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. 15 బీమా కంపెనీల పేరిట జారీ చేసిన 2,80,873 వాహనాల బీమా పాలసీలను పరిశీలించగా.. వాటిలో ఏకంగా 1,20,623 పాలసీలు బీమా కంపెనీల డేటాతో మ్యాచ్ కాలేదు. రెండో దశలో రాష్ట్ర రవాణా శాఖ డేటాబేస్‌లో ఉన్న 1,111 వాహన బీమా ప్రీమియంలను పరిశీలించారు. వాటిలో ఏకంగా 468 బీమా పాలసీలు నకిలీవని, మరో 80 పాలసీలు అర్హతలేని కంపెనీలవని తేలింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 1.25 కోట్ల వాహనాలకు బీమా చేస్తున్నారు. వాటిలో దాదాపు 40 లక్షల పాలసీలు నకిలీవేనని డీఆర్ఐ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 5వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. నకిలీ పాలసీలు చేయించిన వారికి పరిహారం అందడం లేదు. ఇకపై నకిలీలకు తావుండదు ‘వాహన బీమా మిత్ర’ వెబ్ అప్లికేషన్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ప్రభుత్వం విస్తరిస్తోంది. ఐఐబీ తమ వద్ద ఉన్న దేశంలోని వాహన బీమా కంపెనీల డేటాబేస్‌ను ఈ అప్లికేషన్లో అందుబాటులో ఉంచుతుంది. ఏ వాహనదారుడైన తన వాహనం నంబర్, బీమా పాలసీ నంబర్లను ఆ వెబ్ అప్లికేషన్లో నమోదు చేస్తే.. వెంటనే ఆ బీమా పాలసీ అసలైనదా కాదా అన్నది తెలుసుకోవచ్చు. నకిలీ బీమా పాలసీ అని తేలితే ఆ పాలసీ చేయించిన ఏజెంట్‌పై వెంటనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో పోలీసులు ఆ ఏజెంట్‌పై చర్యలు తీసుకుంటారు. దాంతో నకిలీ బీమా పాలసీలు చేయించే ఏజెంట్ల ఆటకట్టించడం సాధ్యమవుతుంది. తాము చేయించింది నకిలీ బీమా అని నిర్ధారణ అయితే వాహనదారులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సరైన బీమా పాలసీని ఆన్లైన్ ద్వారా గానీ బీమా కంపెనీ అధికారికంగా గుర్తించిన ఏజెంట్ ద్వారా గానీ తీసుకోవచ్చు. దాంతో ఆ వాహనం ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే బీమా రక్షణ లభిస్తుంది. ఈ వెబ్ అప్లికేషన్‌ను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆ గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో ఉన్న వాహనాల బీమా పాలసీలను పరిశీలించి వాటిలో నకిలీవి ఉంటే వెంటనే సదరు వాహనదారులను అప్రమత్తం చేస్తారు. డిస్కౌంట్ ఇచ్చేలా చర్చలు ‘వాహన బీమా మిత్ర’ వెబ్ అప్లికేషన్ ద్వారా వాహన బీమా చేయించుకునే సౌలభ్యం కల్పించాలని డీఆర్ఐ భావిస్తోంది. అందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఆ వెబ్ అప్లికేషన్ ద్వారా పాలసీ తీసుకుంటే కొంత డిస్కౌంట్ ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తోంది. వాహన బీమా పాలసీ కాల పరిమితి ముగుస్తుందనగా ఆ వాహనదారు మొబైల్‌కు మెసేజ్ పంపి అప్రమత్తం చేస్తారు. గడువులోగా పాలసీని రెన్యువల్ చేసుకునేలా చూస్తారు. -
వాహనదారులకు షాకింగ్ న్యూస్..! పెరగనున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు..!
న్యూఢిల్లీ: వాహనాలకు థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. 1,000 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్ల ప్రీమియం రూ.2,074 నుంచి రూ.2,094కు పెరగనుంది. 1,000–1,500 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్లకు రూ.3,221 నుంచి రూ.3,416కు, 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉంటే ప్రీమియం రూ.7,890 నుంచి రూ.7,897కు చేరనుంది. 150–350 సీసీ ద్విచక్ర వాహనాలు రూ.1,366, 350 సీసీపైన ఉంటే రూ.2,804 చెల్లించాల్సి ఉంటుంది. గూడ్స్ వాహనాలు 12–20 వేల కిలోల సామర్థ్యముంటే రూ.33,414 నుంచి రూ.35,313కు, 40 వేల కిలోల పైన సామర్థ్యముంటే రూ.41,561 నుంచి రూ.44,242కు చేరనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు 15 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. థర్డ్ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ గతంలో నోటిఫై చేసేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం రోడ్డు రవాణా శాఖ టీపీ రేట్లను ప్రకటించడం ఇదే తొలిసారి. -
అనంతపురం జిల్లాలో బట్టబయలైన వెహికిల్ ఇన్సూరెన్సు బాగోతం
-
టూ వీలర్ ప్రీమియంతో భారీ వాహనాలకు ఇన్సూరెన్స్.. బాగోతం బట్టబయలు
సాక్షి, అనంతపురం: జిల్లాలో వెహికిల్ ఇన్సూరెన్స్ బాగోతం బట్టబయలైంది. టూవీలర్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లతో ఆటోలు, కార్లు, లారీలు, బస్సులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రవాణా శాఖ అధికారులకు అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. టూవీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కేవలం రూ. 1,500 లోపే ఉంటుంది. అదే ఆటోలు, కార్లు, లారీలకు అయితే రూ.10 వేల నుంచి రూ.80 వేల దాకా ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్దమొత్తంలో ఎందుకు చెల్లించాలనుకున్న కొందరు వాహనదారులు.. అక్రమార్కులను ఆశ్రయిస్తున్నారు. దీంతో టూవీలర్ ప్రీమియంతోనే భారీ వాహనాలకు దళారులు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనిపై అనంతపురం రవాణాశాఖ అధికారులకు అనుమానం రావడంతో ఇన్సూరెన్స్ అక్రమాలు బయటపడ్డాయి. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు సమర్పించిన 252 మందికి అనంతపురం డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ శివరాంప్రసాద్ నోటీసులు జారీ చేశారు. -
వాహన బీమాలకు 'నకిలీ' మకిలి
రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక భరోసా ఇస్తుంది. వాహనాలకు ఇంతటి అవసరమైన బీమాలను కూడా నకిలీవి తయారు చేస్తున్నాయి. ప్రముఖ బీమా కంపెనీల పేరిట నకిలీ పాలసీలు విచ్చలవిడిగా చేస్తూ అటు ప్రజలకు..ఇటు ప్రభుత్వ జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. సాక్షి, అమరావతి: విజయవాడ–హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై ఐదేళ్ల క్రితం జరిగిన ఓ లారీ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఆ లారీకి వాహన బీమా ఉండటంతో థర్డ్‌పార్టీ పరిహారం కోసం దరఖాస్తు చేశారు. కానీ సదరు బీమా కంపెనీ తాము అసలు ఆ లారీకి బీమానే చేయలేదని చెప్పడంతో అటు లారీ యజమాని, ఇటు బాధిత కుటుంబం అవాక్కయ్యారు. తాము బీమా చేశాము కదా అని సంబంధిత పత్రాలు చూపిస్తే అసలు అవి తమ కంపెనీవే కావని ఆ సంస్థ తేల్చిచెప్పింది. లారీ యజమాని, బాధిత కుటుంబం కోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో తమ కంపెనీ పేరిట నకిలీ బీమా దందా సాగుతోందని గ్రహించిన ఆ సంస్థ అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ తరువాత ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో నకిలీ వాహన బీమా రాకెట్ దర్జాగా విస్తరించింది. ఏకంగా 12 కంపెనీల పేరిట నకిలీ వాహన బీమాలు చేయిస్తూ యథేచ్ఛగా మోసం చేస్తోంది. ఇదీ రాష్ట్రంలో నకిలీ వాహన బీమా దందా బాగోతం. అటు ప్రజలను నష్టపరుస్తూ ఇటు ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్న ఈ దందాపై తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు దృష్టి సారించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించడంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీమా కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. దాదాపు 25% నకిలీ పాలసీలే.. రాష్ట్రంలో నకిలీ బీమా పాలసీల దందాపై డీఆర్ఐ అధికారులు దృష్టి సారించారు. ఈ బాగోతాన్ని అరికట్టేందుకు కార్యాచరణకు ఉపక్రమించారు. ర్యాండమ్‌గా 12 బీమా కంపెనీలకు చెందిన 3 లక్షల వాహన పాలసీలను పరిశీలించారు. వాటిలో 25 శాతం బీమా పాలసీలు నకిలివేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్న పాలసీలను పరిశీలిస్తే మరెన్ని నకిలీ బీమా పాలసీలు బయటపడతాయో అంతుచిక్కడం లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కట్టడికి తగిన విధివిధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు బీమా కంపెనీల ప్రతినిధులు కూడా ఈ వ్యవహారంపై డీఆర్ఐ అధికారులను కలిసి పరిస్థితిని వివరించారు. ఇది క్రిమినల్ చర్య కూడా కావడంతో దీనిపై పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని డీఆర్ఐ అధికారులు వారికి సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బీమా కంపెనీలు కూడా నిర్ణయించాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ‘మా కంపెనీ పేరిట నకిలీ బీమా పాలసీలు చేస్తున్నట్లుగా గుర్తించాం. దీనిపై మా కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయంలో దర్యాప్తునకు డీఆర్ఐ, పోలీసు అధికారులకు సహకరిస్తాం. – జితేంద్ర సాహూ, జనరల్ మేనేజర్, మాగ్మా ఇన్సూరెన్స్ కంపెనీ, ముంబై కాలుష్య తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహన షోరూమ్‌లే కేంద్రంగా... రాష్ట్రంలో దాదాపు ఏడేళ్లుగా నకిలీ వాహన బీమా రాకెట్ వేళ్లూనుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతినిచ్చిన కాలుష్య తనిఖీ వాహనాలు కేంద్రంగా ఈ దందా కేంద్రీకృతమైంది. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలు విక్రయించే షోరూమ్‌ల నుంచి కూడా ఈ బాగోతం సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అండదండలతో ఈ రాకెట్ బలోపేతమైంది. వాహన బీమాలు అందించే అధీకృత ఏజెంట్ల కంటే ఈ కాలుష్య నియంత్రణ తనిఖీ వాహనాలు, సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయ షోరూమ్‌లలో తక్కువ మొత్తానికే బీమా పాలసీలు అందుబాటులో ఉంచారు. కాలుష్య తనిఖీల కోసం తమ వాహనాలను తీసుకువచ్చిన వాహనదారులకు అదే పనిగా బీమా పాలసీలు చేయిస్తారు. ఆ విధంగా అధీకృత ఏజంట్ వద్ద కంటే 50% తక్కువకే అందిస్తుండటంతో వాహనదారులు ఆకర్షితులై నకిలీ బీమా పాలసీలు చేసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కో నకిలీ బీమా పాలసీ చేసే కాలుష్య పరీక్షలు/సెకండ్ హ్యాండ్ షోరూమ్ సిబ్బందికి రూ.500వరకు కమీషన్ ముట్టజెబుతారు. దాంతో ఈ నకిలీ వాహన బీమా పాలసీల దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోయింది. -
వాహన బీమా మరింత భారం..
న్యూఢిల్లీ: వాహనదారులపై బీమా భారం మరింత పెరిగేలా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ ప్రతిపాదనలు చేసింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20)గణనీయంగా పెంచే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం 2019–20కి గాను 1,000 సీసీ లోపు సామర్ధ్యమున్న కార్లపై థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేటు ప్రస్తుతమున్న రూ. 1,850 నుంచి రూ. 2,120కి పెరగనుంది (రూ. 270 మేర పెంపు). అలాగే 1,000 సీసీ నుంచి 1,500 సీసీ దాకా సామర్థ్యమున్న కార్లపై టీపీ ప్రీమియం రూ. 437 అధికంగా రూ. 3,300కి పెరగనుంది. ఇది ఇప్పుడు రూ. 2,863గా ఉంది. అయితే, 1,500 సీసీకి మించిన ఇంజిన్ సామర్థ్యం ఉండే లగ్జరీ కార్ల టీపీ ప్రీమియంలలో ఎలాంటి మార్పులు లేకుండా రూ. 7,890 స్థాయి యథాతథంగా కొనసాగుతుంది. మరోవైపు, ద్విచక్రవాహనాల విషయానికొస్తే..75 సీసీ లోపు సామర్ధ్యమున్న వాటిపై టీపీ ప్రీమియం రూ. 427 (ప్రస్తుతం) నుంచి రూ. 482కి పెరగనుంది. అలాగే 75 సీసీ నుంచి 350 సీసీ దాకా సామర్ధ్యమున్న ద్విచక్ర వాహనాలపైనా ప్రీమియం పెంచాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. కానీ సూపర్‌బైక్స్ (350 సీసీకి మించి సామర్ధ్యమున్నవి) పై రేట్ల పెంపు ఉండదు. ఇక సింగిల్ ప్రీమియంలో ఎలాంటి మార్పులు ఉండవు. కొత్త కార్లకు మూడేళ్ల పాటు, కొత్త ద్విచక్ర వాహనాలకు 5 ఏళ్ల పాటు ఇప్పుడున్న రేటు యథాతథంగా ఉంటుంది. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి టీపీ రేట్లు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా పాత రేట్లే కొనసాగించాలని ఐఆర్డీఏఐ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు మే 29లోగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. విద్యుత్ వాహనాలకు డిస్కౌంటు.. ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల థర్డ్ పార్టీ ప్రీమియం రేటుపై 15 శాతం డిస్కౌంటు ఇవ్వాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. ఈ–రిక్షాల టీపీ ప్రీమియం పెంపు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ స్కూల్ బస్సులపై మాత్రం రేటు పెరిగే అవకాశం ఉంది. ట్యాక్సీలు, బస్సులు, ట్రక్కులతో పాటు ట్రాక్టర్లపై కూడా థర్డ్ పార్టీ ప్రీమియం పెరగనుంది. 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో ప్రీమియంలు, క్లెయిమ్స్ చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఐఐబీఐ) గణాంకాల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఐఆర్డీఏఐ తెలిపింది. -
వాహన బీమా..భవితకు ధీమా
ఖిలా వరంగల్ : ఏదైనా కొత్త వాహనం కొనాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఇక ముందు మరింత ఆలోచించాల్సిందే.. బీమా విధానంలో వచ్చిన కొత్త నిబంధనలు సామాన్యులకు కొంత భారంగా పరిణమించాయి. ఎందుకంటే ప్రతి ద్విచక్ర వాహానానికి ఐదేళ్లు, ఇతర వాహనాలకు మూడేళ్లు బీమా తప్పనిసరి చేశారు. ఇది వినియోగదారులకు భారమే అయినా.. భవిష్యత్‌లో వాహనదారులకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వాహన కంపెనీలు చెబుతున్నాయి. వాస్తవంగా కొత్త వాహనం కొనేముందు దాని ఖరీదు ఎంత.? రిజిస్టేషన్, ట్యాక్స్‌లు, బీమా ప్రీమియం ఎంత అని చాలా మంది వందరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఏరకంగా ఆయినా వాహనంపైన రూ.100, రూ.500 తగ్గతుందేమోనని ఆశతో అన్ని రకాలుగా పరిశీలిస్తారు. అయితే ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు సుప్రీం కోర్టు ఆదేశాలతో వాహన కొనుగోలు దారులకు కోలుకోలేని షాక్ ఇస్తూ కొత్త విధివిధానాలను అమల్లోకి తెచ్చాయి. ఒకేసారి బీమా చేయించాల్సిందే.. వాహనదారుల నిర్లక్ష్యంపై సుప్రీం కోర్టు గత నెల మోటారు యాక్ట్ ప్రకారం 29వ తేదీన ఇన్సూరెన్స్ విధానాల్లో ఆనేక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జూలై 20న థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్, కాల పరిమితి పెంచుతూ వాదోపవాదాల అనంతరం నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. నూతన ఇన్సూరెన్స్ అమలు.. వాహన చోదకులకు భారమైనా కూడా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది. ఇక నుంచి ఎటువంటి ద్విచక్రవాహనం కొన్నా , ఒకేసారి ఐదేళ్ల కాలానికి బీమా సొమ్ము కట్టాల్సిందే. కారు కొనే వారు కూడా మూడేళ్ల కాలానికి ఒకేసారి బీమా సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించడం తలకు మించిన భారం అని వినియోగదారులు వాపోతున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల నడ్డీ విరుగుతుందని చెబుతున్నారు. వాహనాల ధర యధాతథం.. ప్రస్తుతం వాహనాల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. కానీ వాటిని కొనుగోలు చేసే సమయంలో గతంలో అయితే ఒక ఏడాదికి బీమా చేయిస్తే సరిపోయేది. అయితే ప్రస్తుతం ఆలా కుదరదు. ఇంజన్ సామర్థ్యం ఆధారంగా బీమా బాదుడు ఉంటుంది. ద్విచక్ర వాహనంపై రూ.15వేలు, కారుపై అయితే రూ.20వేల వరకు ఆదనంగా భారం పడనుంది. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనచోదకులకు ప్రమాదం జరిగితే వాహనదారుడికి, వాహనానికి, రక్షణ కల్పించడమే థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉద్దేశం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కారు, ద్విచక్రవాహనానికి తప్పని సరి చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. ఈవిధానం సెప్టెంబర్1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. నిర్లక్ష్య వైఖరి కారణంగానే .. వాహనదారుల్లో చాలా మంది ఒక ఏడాది బీమా ప్రీమియం కట్టిన తర్వాత మరో ఏడాది బీమా చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇంకొంత మంది వాహనం కొన్న తర్వాత బీమా చేయించడం మానేశారు. దీంతో రోడ్డు ప్రమాదాల సమయాల్లో బీమా పరిహారం అందకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నష్ట పరిహారం అందజేసేందుకురోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, బండి చోరీకి గురైనప్పుడు నష్టపోయిన వారికి కచ్చితంగా పరిæహారం అందించాలనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు బీమా కంపెనీలకు తాజాగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అందుకే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఐదేళ్లు, మూడేళ్లు బీమాను తప్పని సరి చేసింది. దీని ద్వారా ప్రతి ఒక్క వాహనదారుడు ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే వెసులుబాటు కల్పించింది. ఐదేళ్లకు ఒకేసారి అంటే చాలా కష్టం వాహనం కొనుగోలు చేసే సమయంలో ఐదేళ్లకు బీమా చేయాలంటే చాలా కష్టం. అసలే మధ్య తరగతి కుటుంబాలు.. ఎన్నో అవస్థలు పడి బండి కొంటాం.. ఒక ఏడాది ఇన్సూరెన్స్ అంటే ఏదో కింద మీదా పడి చెల్లిస్తాం. అటువంటిది ఐదేళ్లకు ఒకేసారి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఇబ్బందే. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. – గాదె స్వరూప్‌రెడ్డి, వాహనదారుడు ఇది చాలా మంచి నిర్ణయం ప్రస్తుతం వాహనాలు కొంటున్న వారు ఒక ఏడాదికే ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. అయితే సుప్రీం కోర్టు ఐదేళ్లు, మూడేళ్లు ఇన్సూరెన్స్ తప్పని సరి చేయడంతో వాహనదారులకు భద్రత ఉంటుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది . – బొలుగొడ్డు శ్రీనివాస్, వాహనదారుడు -
గడువు తీరిన పాలసీలూ పునరుద్ధరణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడువు ముగిసిన వాహన బీమాలను పునరుద్దరించాలంటే వ్యయ ప్రయాసలు తప్పవు. వ్యక్తిగత పరీక్షలు, తనిఖీ ఇతరత్రా వాటికి 5–7 రోజుల సమయం పడుతుండటంతో చాలా మంది కస్టమర్లు వెనకాడుతున్నారు. దీనికి పరిష్కారం చూపించేందుకు పాలసీ బజార్ ‘సెల్ఫ్ ఇన్స్పెక్షన్’ యాప్‌ను తెచ్చింది. ఇదేంటంటే.. స్వయంగా పాలసీదారే బీమాను పునరుద్ధరించుకోవచ్చు. యాప్ ద్వారా పాలసీ చేయాల్సిన వాహనాన్ని వీడియో తీసి, కావాల్సిన పత్రాలను జత చేసి అప్లోడ్ చేస్తే చాలు.. జస్ట్ 2 గంటల్లో పాలసీ చేతికొచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ సేవల కోసం ఓరియంటల్, జనరల్, బజాజ్, టాటా, రాయల్ సుందరం వంటి 12 బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని పాలసీ బజార్ మోటార్ ఇన్సూరెన్స్ హెడ్ సజ్జ ప్రవీణ్ చౌదరి తెలిపారు. రూ.1,100 కోట్లకు ఆన్లైన్ ప్రీమియంలు.. దేశంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల ప్రైవేట్ కారు పాలసీలు తీసుకున్నారు. వీటి ప్రీమియం రూ.18 వేల కోట్లు. ఇందులో ఆన్లైన్ వాటా 12 లక్షలు. వీటి ప్రీమియం రూ.1,100 కోట్లుగా ఉంటుందని ప్రవీణ్ తెలిపారు. మొత్తం ఆన్లైన్ వ్యాపారంలో పాలసీ బజార్ వాటా 50 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. ‘‘మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది వాటా 19.5 శాతం. తెలంగాణ వాటా 3.2 శాతం, ఆంధ్రప్రదేశ్ వాటా 1.2 శాతం ఉన్నాయి. తెలంగాణలో ఏటా 40 వేల పాలసీలు తీసుకుంటారు. ఏపీలో 15 వేలు తీసుకుంటున్నారు’’ అని చెప్పారాయన. దక్షిణాదిలో ఆఫీస్..: ప్రస్తుతం పాలసీ బజార్‌కు గుర్గావ్లో కార్యాలయం ఉంది. ఇందులో 4 వేల మంది పనిచేస్తున్నారు. ‘‘ఈ ఏడాది దక్షిణాదిలోని ఒక రాష్ట్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఎక్కడనేది ఇంకా ఖరారు కాలేదు. తెలుగుతో పాటు తమిళం, కర్ణాటక భాషలకు సేవలందించే ప్రాంతాన్ని ఎంచుకుంటాం. తొలి దశలో 400 మంది ఉద్యోగులను నియమించుకోనున్నాం. ఏడాదిలో ఈ సంఖ్యను 2 వేలకు చేరుస్తాం’’ అని చెప్పారాయన. -
టర్మ్ ప్లాన్‌తో మరింత ధీమా!!
సొంతిల్లు లేదా వాహనం కొనుక్కోవడం, పిల్లల చదువులు.. పెళ్లిళ్లు మొదలైన లక్ష్యాలకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు మనం ఎంతగానో ఆలోచిస్తాం. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు.. పెట్టుబడుల కోసం మనం ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, పోస్టల్ స్కీమ్స్ లాంటి అనేక సాధనాలు ఎంచుకుంటూ ఉంటాం. వీటితో పాటు జీవిత బీమా కూడా కీలకమైనదే. ఇంటిల్లిపాదీ ఆధారపడిన ఇంటిపెద్దకు అనుకోనిదేదైనా జరిగినా.. కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకుండా బీమా భరోసానిస్తుంది. జీవిత బీమాకు సంబంధించి అత్యంత తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీని అందించేవి టర్మ్ ప్లాన్లు. వీటి గురించి అవగాహన కల్పించేదే ఈ కథనం.. ఓ రూ. 10 లక్షలు పెట్టి ఒక కొత్త కారు కొన్నామనుకోండి. దానికేమీ కాకుండా ముందుగా తగినంత కవరేజీ ఉండేలా వాహన బీమా తీసుకోవాలని ఆలోచిస్తాం. ఇందుకోసం ఏటా రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా ప్రీమియం కడతాం. వాహనం గురించే ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు ఎంతో విలువైన మన జీవితం గురించి, మనమీద ఆధారపడిన కుటుంబ సభ్యుల గురించి ఇంకెంత ఆలోచించాల్సి ఉంటుంది. కారు భద్రత కోసం భారీ ప్రీమియం కట్టేందుకు సిద్ధపడే మనం .. అంతకన్నా ఎక్కువ విలువైన జీవితానికి బీమా తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇందుకోసం తోడ్పడే టర్మ్ పాలసీలు చాలా చౌకైనవి.. అత్యంత విలువైన మన జీవితాలకు, మనం ఎంతగానో ప్రేమించే కుటుంబానికీ భరోసానిచ్చే వి. వీటితో ఏటా అత్యంత తక్కువగా రూ. 8,000 నుంచి రూ. 10,000 దాకా ప్రీమియంతో ఏకంగా రూ. 1 కోటి దాకా కవరేజీని పొందవచ్చు (సిగరెట్ అలవాటు లేని ముప్పయ్ ఏళ్ల వ్యక్తికి). కవరేజీ లెక్క ఇలా.. సరే.. టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఎంత కవరేజీ ఉండేలా చూసుకోవాలన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రధానంగా మూడు అంశాలు ఈ విషయానికి సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. ♦ బేస్ లైఫ్ కవర్: సుమారు 40 ఏళ్ల దాకా వయస్సు ఉన్న వేతన జీవులు తమ వార్షికాదాయానికి కనీసం 20–30 రెట్లు సమానమైన కవరేజీ ఉండేలా చూసుకోవడం మంచిది. ఇక నలభైలలో ఉన్నవారు వార్షికాదాయానికి 10–20 రెట్లు, యాభైలలో ఉన్న వారు 5–10 రెట్లు కవరేజీ ఉండేలా చూసుకోవాలి. టర్మ్ లైఫ్ కవరేజీ.. పదవీ విరమణ చేసే దాకా కొనసాగేలా ఉండాలి. ♦ రుణాలు: ఇతరత్రా చెల్లించాల్సిన రుణాలు మొదలైనవేమైనా ఉంటే టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు... బేస్ లైఫ్ కవరేజీకి ఆ మొత్తాన్ని కూడా జోడించి లెక్కేయాలి. ఒకవేళ పాలసీదారుకు అర్ధంతరంగా ఏదైనా జరిగినా.. రుణభారంతో వారి కుటుంబం ఇబ్బందుల పాలు కాకుండా ఇది ఆదుకుంటుంది. ♦ క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనం: మన జీవన విధానాలు ఒక్కోసారి తీవ్ర అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదముంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనాలు కూడా అందించే టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ పాలసీదారు.. ప్లాన్‌లో పేర్కొన్న తీవ్రమైన అనారోగ్యాల బారిన పడిన పక్షంలో బీమా మొత్తాన్ని ఒకేసారి అందుకునే వీలు ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు వాస్తవాలు దాచిపెట్టొద్దు .. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థకు తప్పనిసరిగా కొన్ని వివరాలు తెలియజేయాలి. ముఖ్యంగా జీవన విధానాలు, వ్యక్తిగత.. కుటుంబ ఆరోగ్యం తదితర అంశాల్లో ఏదీ దాచిపెట్టే ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఇక పాలసీదారు ఆరోగ్యాన్ని మదింపు చేయడానికి బీమా సంస్థ వైద్య పరీక్షల నివేదికలను కోరే అవకాశంఉంది. కస్టమర్‌కి ఎంత మేర కవరేజీ ఇవ్వొచ్చన్నది అంచనా వేసుకునేందుకు బీమా సంస్థకు ఇవి ఉపయోగపడతాయి. ఏ విషయంలోనూ తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా.. వాస్తవాలను తొక్కిపెట్టి ఉంచడం లాంటిది చేస్తే క్లెయిమ్ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ,లైఫ్ ఇన్సూరెన్స్ -
స్టీరింగే కాదు...బీమానూ బదిలీ చేయాలి!
పాత వాహనం కొంటే బీమా మార్చుకోవాలి సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌లు ఏటా లక్షల్లో విక్రయమవుతున్నాయి. వాహనాలు చేతులు మారుతున్నాయి గానీ, వాహన పత్రాల్లో యజమానుల పేర్లు మారేవి కొన్నే. కొనుగోలు చేసిన వారు రవాణా కార్యాలయాలకు వెళ్లి ఆర్సీ పత్రాలను మార్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఇక, బీమా పాలసీని కూడా మార్చుకోవాలన్న విషయం తెలిసిన వారు అతికొద్ది మంది. కానీ, ఇలా మార్చుకోనివారు కనక ఒకవేళ బీమా క్లెయిమ్ చేయాల్సి వస్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకని ఆ పని ముందే చేయాలి. అంతేకాదు, వాహనాన్ని విక్రయించిన వారు కూడా బీమా పాలసీలో తమ పేరు రద్దయ్యేలా చూసుకోవాలి. లేదంటే ఇరు వైపుల వారికీ చిక్కులే. సెకండ్ హ్యాండ్ కారు ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి క్లెయిమ్‌లు వచ్చినపుడు బీమా కంపెనీలు యజమాని ఎవరన్నది పరిశీలిస్తాయి. కారును అసలు యజమాని నుంచి వేరొక వ్యక్తి కొనుగోలు చేసినట్టయితే పాలసీని కొత్తగా కొన్న వ్యక్తి తన పేరు మీదకు మార్చుకుందీ, లేనిదీ చూస్తాయి. బీమా కంపెనీకి, ఆ వాహనం కొత్త యజమానికి మధ్య చట్టబద్ధమైన ఎటువంటి కాంట్రాక్టు లేనందున క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి. న్యాయస్థానాల్లోనూ వినియోగదారులకు ప్రతికూలతలు రావచ్చు. కానీ, దీనిపై అవగాహన ఉన్న వారు చాలా తక్కువ మందే. విక్రయించినవారూ మార్చుకోవాలి... వాహన యజమానులు సైతం తమ వాహనాలను ఇతరులకు విక్రయించడంతో పనైపోయిందనుకుంటే సరిపోదు. కొన్న వారి పేరు మీదకు వాహన బీమా పాలసీ మారిందో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే చట్టపరమైన తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహన బీమా చేయాలంటే... కాంప్రహెన్సివ్ మోటారు బీమా పాలసీలో 2 భాగాలుంటాయి. ఒకటి ఓన్ డ్యామేజ్. రెండు థర్డ్ పార్టీ. మీ వాహనం, మీరు కాకుండా మూడో వ్యక్తికి కలిగించిన నష్టానికి థర్డ్ పార్టీ కవరేజీ వర్తిస్తుంది. ఓన్ డ్యామేజీ అన్నది ప్రమాదం కారణంగా మీ కారుకు వాటిల్లిన నష్టానికి పరిహారాన్నిచ్చేది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 157... ఓ వ్యక్తి మరొకరి నుంచి కారును కొనుగోలు చేసిన 14 రోజుల్లోపు బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాలసీని తన పేరు మీదకు బదిలీ చేసుకోవాలని చెబుతోంది. 14 రోజుల గడువులోపు కొత్త యజమాని వాహన బీమాను తన పేరు మీదకు మార్చుకోవడంలో విఫలమైతే ఆ తర్వాత కొత్త యజమాని కారణంగా వాటిల్లే ఓన్ డ్యామేజ్, థర్డ్‌పార్టీ నష్టానికి పరిహారం చెల్లించే బాధ్యత బీమా కంపెనీపై ఉండదు. బీమా పాలసీ నూతన యజమాని పేరు మీదకు మారకుండా పాత యజమాని పేరు మీదే కొనసాగుతున్నట్టయితే... ప్రమాదాల కారణంగా వాటిల్లే నష్టాలకు బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. అంతేకాదు, ఆ పరిహార బాధ్యత పాత యజమాని నెత్తిన పడే ప్రమాదం ఉంది. కొత్త యజమాని ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీకి నష్టం కలిగిస్తే అందుకు పరిహారం చెల్లించాలంటూ కోర్టు పాత యజమానికి నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీమా పాలసీ పాత యజమాని పేరిటే ఉంది గనుక. పాలసీ బదిలీ ఇలా... ► పాత కారును కొన్న వెంటనే 14 రోజుల్లోగా దాన్ని కొనుగోలు దారులు తమ పేరు మీదకు బదిలీ చేసుకోవాలి. ► బీమా పాలసీని బదిలీ చేసేందుకు వీలుగా... తాజా ప్రపోజల్ పత్రాన్ని నింపాల్సి ఉంటుంది. దానికి తోడుగా అమ్మకం పత్రం, ఆర్సీ బదిలీ పత్రం, పాత యజమాని సంతకం చేసిన ఫామ్ 29, 30 జత చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు పాత పాలసీ పత్రం, బదిలీ ఫీజు చెల్లిస్తే బీమా కంపెనీ కొత్త యజమాని పేరు మీదకు పాలసీని మారుస్తుంది. ► వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లో పేరు మార్పు అన్నది కొంచెం సమయం తీసుకుంటుంది. కనుక ముందు పైన చెప్పుకున్న అన్ని పత్రాలతో ముందు బీమా పాలసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్సీలో పేరు మారిన తర్వాత దాని కాపీ కూడా సమర్పిస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. ► బీమా పాలసీ కొత్త యజమాని పేరు మీదకు మారిపోయి, మారిన ఆర్సీ కాపీని బీమా కంపెనీకి అందజేయకపోయి ఉంటే, ఒకవేళ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తే ఆ సమయంలో ఆర్సీ కాపీని బీమా కంపెనీకి ఇస్తే సరిపోతుంది. ► ఒకవేళ ఆర్సీ బదిలీ ప్రక్రియలో ఉన్న సమయంలో క్లెయిమ్ చేసుకుంటే బీమా కంపెనీ పరిహారాన్ని నిరాకరించదు. కాకపోతే కొత్త యజమాని పేరు మీదకు ఆర్సీ బదలాయింపు పూర్తయిన తర్వాత, దాని ఆధారాన్ని సమర్పించిన తర్వాతే బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. నిజానికి బీమా పాలసీ బదలాయించుకోకపోతే ఈ విధమైన సమస్యలు ఎదురవుతాయని తెలియక మనలో చాలా మంది వాహన బీమాను తమ పేరిట బదలాయించుకోకుండా అలక్ష్యం చేస్తుంటారు. కానీ, ప్రమాదం జరిగి భారీ నష్టం వాటిల్లితే మాత్రం ఆర్థికంగా కుదేలు కావాల్సి వస్తుంది. -
వాహనాలకు ‘నకిలీ’ బీమా!
⇒ ప్రైవేట్ ఫైనాన్స్ కేంద్రంగా కొనసాగుతున్న అక్రమాలు ⇒ ఆటోలు, ద్విచక్ర వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల అందజేత ⇒ ఈజీగా వాహన పర్మిట్ల పునరుద్ధరణ ⇒ మూడేళ్ల నుంచి గుట్టుగా సాగుతున్న వ్యవహారం సిటీబ్యూరో: వాహన బీమాపై నగరంలో నకిలీ దందా కొనసాగుతోంది. బీమా సంస్థలకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే, సదరు సంస్థలతో ఎలాంటి ప్రమేయం లేకుండానే కొందరు వ్యక్తులు ఆయా సంస్థల పేరిట పెద్ద ఎత్తున నకిలీ బీమా సర్టిఫికెట్లను తయారు చేసి వాహనదారులకు కట్టబెడుతున్నారు. బీమా ప్రీమియంల కంటే తక్కువ మొత్తంకే ఈ సర్టిఫికెట్లు లభించడంతో ఆటో పర్మిట్ల పునరుద్ధరణలో ఆర్టీఏ ఏజెంట్లు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు చెందిన ఉద్యోగులు నకిలీ దందా కొనసాగిస్తున్నారు. రవాణాశాఖకు సైతం ఏ మాత్రం అనుమానం రాకుండా నకిలీ నోట్ల తరహాలో నకిలీ బీమా సర్టిఫికెట్ల వ్యవహారం చాపకింద నీరులా సాగిపోతోంది. కొన్ని బీమా సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు, ఫైనాన్స్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నగరంలో నకిలీ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. పర్మిట్ల పునరుద్ధరణలో కీలకం... గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త ఆటోరిక్షాలపై నియంత్రణ కొనసాగుతున్న దృష్ట్యా పాతవాటి స్థానంలో తిరిగి కొత్తవి కొనుగోలు చేసుకొనేందుకు రవాణాశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆటోరిక్షా యజమాని తన పాత ఆటోను ఆర్టీఏ అధికారుల సమక్షంలో తుక్కుగా మార్చి అదే పర్మిట్పైన కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం పాత ఆటో పర్మిట్‌కు కాలపరిమితి ఉండాలి. అలాగే ఫిట్నెస్ సర్టిఫికెట్లను, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను అధికారులకు అందజేయాలి. ఈ ఇన్సూరెన్స్ కాలపరిమితి కనీసం ఏడాది ఉండాలి. అప్పుడు మాత్రమే పాతవాటిని తుక్కుగా మార్చి వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసుకొనేందుకు అనుమతి లభిస్తుంది. ఇలా నగరంలోని రెండు ప్రధాన షోరూమ్‌ల నుంచి ప్రతి నెలా సుమారు 500 కొత్త ఆటోరిక్షాలు రోడ్డెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే గోషామహల్ కేంద్రంగా వ్యాపారం చేస్తోన్న ఒక ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగి, ఇన్సూరెన్స్ సంస్థలకు చెందిన కొందరు మాజీ ఉద్యోగులతో చేతులు కలిపి నకిలీ సర్టిఫికెట్లకు తెరలేపారు. కొత్త ఆటోల కొనుగోలు కోసం ఫైనాన్స్ కంపెనీని ఆశ్రయించే ఆటోడ్రైవర్లకు ఈ నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో అటు నకిలీ సృష్టికర్తలకు, ఇటు ఆటోడ్రైవర్లకు మధ్య ఆర్టీఏ ఏజెంట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం గుర్తుపట్టేందుకు అవకాశం లేకుండా, గుట్టుగా సాగిపోతున్న ఈ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే ఆర్టీఏ అధికారులు పాత ఆటోల పర్మిట్లను పునరుద్ధరించడం గమనార్హం. గుట్టుగా దందా... ప్రస్తుతం సాధారణ బీమా ప్రీమియం రూ.6000 నుంచి రూ.8000 వరకు ఉంది. కానీ నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను కట్టబెడుతున్న ముఠా తాము తక్కువ మొత్తానికే అందజేయనున్నట్లు చెప్పి ఆటోడ్రైవర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రధాన బీమా సంస్థలకు చెందిన సర్టిఫికెట్ల నమూనాలను కంప్యూటర్‌పైన రూపొందించి, ప్రింటర్లు, స్కానర్ల సహాయంతో బయటకు తెస్తున్నారు. నాలుగు రోజుల క్రితం టాటా బీమా సంస్థకు చెందిన ఒక నకిలీ సర్టిఫికెట్‌ను ఒక ఆటోడ్రైవర్ గుర్తించి సదరు ఫైనాన్స్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఉదంతంపై పోలీసులకు కూడా ఫిర్యాదులు రావడంతో ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అక్రమ వడ్డీలతో ఆటోడ్రైవర్ల నడ్డి విరుస్తున్న ఫైనాన్స్ సంస్థల్లోనే ఇలాంటి మోసాలు కూడా చోటుచేసుకోవడం పట్ల ఆటో, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
నష్టపరిహారం కేసు వేయవచ్చు
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో... కేస్ స్టడీ సారధి ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. అతని వయస్సు 26 సంవత్సరాలు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు వున్నారు. తండ్రి చనిపోయి 5 సంవత్సరాలైంది. కుటుంబ భారమంతా ఇకనుండి అతనిదే. తల్లి అప్పూసప్పూ చేసి చదివించింది. భవిష్యత్‌పై ఎంతో ఆశతో, తల్లినీ, చెల్లెళ్లనూ బాగా చూసుకోవాలనే ఆశయంతో ఉద్యోగంలో చేరాడు. విధి వక్రీకరించి డ్యూటీ ముగించుకొని వస్తుండగా రాత్రి 10 గంటల టైంలో సారధి బైక్‌ను ఒక లారీ డీకొట్టింది. అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. కళ్లు తెరిచే సరికి ఒక కాలు తొలగించబడి వుంది. అమ్మా, చెల్లెళ్లు విషాద వదనాలతో కనిపించారు. స్నేహితులు నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లమన్నారు. దారిన వెళ్లేవాళ్లు స్పందించారనీ, పోలీసు కంప్లయింట్ ఇచ్చారనీ, లారీ వివరాలు తెలిశాయని మిత్రులు తెలిపారు. అసలు నష్టపరిహారం ఎలా అడగాలి? దానికి సంబంధించిన వివరాలకై న్యాయవాదిని సారధి తల్లి, చెల్లెళ్లు సంప్రదించారు. వారు చెప్పిన వివరాలు ఇవి: ఒక వ్యక్తి ప్రమాదానికి లోనై తీవ్ర గాయాలపాలైనా, శారీరక వైకల్యం ఏర్పడినా, దురదష్టవశాత్తు చనిపోయినా, కోర్టును ఆశ్రయించి, వాహన డ్రైవర్, యజమాని, ఇన్సూరెన్స్ కంపెనీల నుండి (వాహనం ఇన్సూరెన్స్ చేసిన కంపెనీ) నష్టపరిహారం క్లెయిమ్ చేయవచ్చును. జిల్లా కోర్టులలో వుండే ‘మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్’ ట్రిబ్యునల్స్‌లో కేసులు వేయాలి. కోర్టులో 1) ప్రమాదం చేసిన వాహనం గుర్తింపు, 2) ప్రమాదం చేసిన వ్యక్తి, అతని వివరాలు, చిరునామా, 3) వాహన యజమాని వివరాలు, 4) ప్రమాదం జరిగిన తేదీ, టైమ్, ప్లేస్, 5) ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్), 6) మెడికల్ సర్టిఫికెట్, 7)ప్రమాదం చూసిన వ్యక్తుల సాక్ష్యాలు, 8) బాధితుని పుట్టిన తేదీ వివరాలు, శాలరీ సర్టిఫికెట్స్, 9) మెడికల్ బిల్స్, 10)ప్రమాదం చేసిన డ్రైవర్ డ్రైవింగ్ లెసైన్స్, 11) ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు మొదలైనవి పొందుపరచాలి. అదృష్టవశాత్తు లాయర్‌గారు చెప్పిన డాక్యుమెంట్స్ దాదాపు అన్నీ వారివద్ద వున్నాయి. నష్టపరిహారం కేసు వేయడానికి సిద్ధపడ్డారు. -
వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం
అందరికీ వాహనం అవసరమే. కాకపోతే మనుషుల్ని బట్టి వారి అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. పెద్ద కుటుంబమైతే విశాలమైన పెద్ద కారు కావాల్సి రావొచ్చు. అదే చిన్న కుటుంబం, సింగిల్‌గా ఉన్న ప్రొఫెషనల్స్ లాంటి వారికయితే ఇటు పార్కింగ్‌కు అటు మెయింటెనెన్స్‌కు సులువుగా ఉండే చిన్న కారు బెటరని అనిపించొచ్చు. ఇక గృహిణులైతే.. చిన్నా, చిత్రకా పనులు చుట్టబెట్టేందుకు తేలికపాటి స్కూటర్‌లాంటి దాన్ని ఇష్టపడొచ్చు. ఇలా ఒకరికి అనువైన వాహనం మరొకరికి అనువైనది కాకపోవచ్చు. అలాగే, వాహన బీమా కూడా!!. అల్లాటప్పాగా ఏదో ఒక పాలసీ తీసుకోవడం కాకుండా... వాహనం, దాని వాడకాన్ని బట్టి సరైన పాలసీ, తగిన యాడ్-ఆన్లు తీసుకుంటేనే బీమా ప్రయోజనాలు పూర్తిగా పొందవచ్చు. అందుకే వివిధ సందర్భాల్లో ఉపయోగపడే యాడ్-ఆన్ల గురించి తెలుసుకోవాలి. బంపర్ టు బంపర్ డ్రైవింగ్.. ప్రస్తుతం చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. దాదాపు ఒకదానికి మరొకటి తాకేంత దగ్గరగా బంపర్ టు బంపర్ డ్రైవింగ్ పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు కారు ఫైబర్ , మెటల్ వగైరా పార్టులు ఇట్టే దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, దెబ్బతిన్న ఫైబర్, ప్లాస్టిక్, మెటల్ వంటి భాగాల రిపేర్లకు అయ్యే ఖర్చులో వాహనం తరుగుదలను బట్టి దాదాపు 50 శాతం దాకా మాత్రమే సాధారణ పాలసీల్లో పరిహారం దక్కవచ్చు. ఇలాంటప్పుడు డిప్రిసియేషన్ కవరేజీ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. రీప్లేస్ చేసిన భాగాల విలువలో డిడక్ట్ చేసిన తరుగుదల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు రెండు పర్యాయాలు అవకాశం లభిస్తుంది. దీనితో ప్లాస్టిక్, ఫైబర్ పార్టులకు మరింత సమగ్ర కవరేజీ ఉన్నట్లవుతుంది. కన్జూమబుల్ కవరేజి.. మీరు పూర్తి బీమా క్లెయిమ్ కోరుకునే వారయితే దీన్ని తీసుకోవచ్చు. వాహనంలో నట్లు, బోల్టులు, బ్రేక్ ఫ్లూయిడ్స్ మొదలైన వాటిని కన్జూమబుల్స్ భాగాలుగా వ్యవహరిస్తారు. చాలా మటుకు పాలసీల్లో ఇలాంటి వాటికి కవరేజీ ఉండదు. కాబట్టి ఇలాంటి కన్జూమబుల్ భాగాలకు కూడా బీమా రక్షణ ఉండేలా యాడ్-ఆన్ కవర్ తీసుకోవచ్చు. తాళం చెవులు పోతే.. మతిమరుపు వల్ల కావొచ్చు మరొకటి కావొచ్చు తరచూ తాళాలు పోగొట్టుకోవడం సమస్యయితే ఇందుకోసం కూడా ప్రత్యేకంగా కార్ కీ రీప్లేస్మెంట్ కవరేజీ లభిస్తుంది. కారు తాళం చెవి పోతే డూప్లికేట్ కీ తయారీకి, ఒకవేళ తాళం కూడా పాడైతే దాన్ని కూడా మార్చేందుకు అయ్యే ఖర్చును దీని కింద పొందవచ్చు. ఈ యాడ్-ఆన్ తీసుకుంటే రూ. 50,000 దాకా కవరేజీ ఉంటుంది. పాలసీ వ్యవధిలో ఒకో దఫాకి గరిష్టంగా రూ. 25,000 దాకా క్లెయిమ్‌కు అవకాశముంటుంది. భారీ వర్షాలు, వరదల నుంచి వాహనానికి రక్షణ.. చిన్నదైనా, పెద్దదైనా వర్షమొస్తే చాలు రోడ్లూ, ఇళ్లూ జలమయమైపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల వాహనాల్లోకి నీళ్లు వెళ్లిపోయి అవి కదలకుండా మొరాయిస్తుంటాయి. పోనీ అని నిండా నీళ్ల నుంచి దాన్ని బైటికి లాగేందుకు స్టార్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంజిన్ దెబ్బతింటే బీమా కంపెనీలు దాన్ని స్వయంకృతం కిందే పరిగణిస్తాయి. దీనికి ఎలాంటి పరిహారం ఇవ్వవు. పోనీ సొంత డబ్బు పెట్టుకుని ఇంజిన్‌ను రిపేరు చేసుకోవాలనుకుంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కేందుకు హైడ్రోస్టాటిక్ లాక్ యాడ్ ఆన్ కవరేజీ ఉపయోగపడుతుంది. నీరు చొరబడటం వల్ల ఇంజిన్ భాగాలు పాడైతే వాటిని రిపేర్ చేసేందుకు లేదా రీప్లేస్ చేసేందుకు అయ్యే ఖర్చును ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ మీరు నివసించే ప్రాంతంలో వర్షమొస్తే మునిగిపోయే పరిస్థితులుంటే ఇలాంటి యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్‌కు రక్షణ .. మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసేవారై ఉండి ఇన్సూరెన్స్‌ను ఇప్పటిదాకా క్లెయిమ్ చేయని పక్షంలో మీకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) భారీగానే లభించవచ్చు. అయితే, మీ టీనేజీ పిల్లలో లేదా సమీప బంధువులో మీ కారును తీసుకెళ్లి ఏ డ్యామేజీనో చేసి తీసుకొస్తే బీమా పరిహారం తీసుకోవాల్సి రావొచ్చు. ఫలితంగా ఎన్సీబీ ప్రయోజనాలను నష్టపోవాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భం ఎదురు కాకుండా ఎన్సీబీ ప్రొటెక్టర్ కవర్ తీసుకుంటే పాలసీ వ్యవధిలో రెండు పర్యాయాల దాకా నో క్లెయిమ్ బోనస్ పర్సంటేజీకి రక్షణ ఉంటుంది. దాదాపు 25 శాతం పైగా ఎన్సీబీ జమయిన వాహనదారులకు ఈ కవరేజీ ఉపయోగ కరంగా ఉంటుంది. ప్రయాణించే వారికి అదనపు భద్రత వాహనంలో ప్రయాణించే వారి వ్యక్తిగత భద్రతకు కూడా మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవరేజీలు ఉన్నాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్: వాహనంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదవశాత్తు పాక్షికంగా లేదా పూర్తిగా వికలాంగులైనా లేదా ప్రమాదంలో మరణించినా .. ఈ కవరేజీతో గరిష్టంగా ఒక్కొక్కరికి రూ. 2 లక్షల దాకా పరిహారం లభిస్తుంది. హాస్పిటల్ క్యాష్: ఈ యాడ్-ఆన్ ఉంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షంలో రోజుకు రూ. 1,000 దాకా గరిష్టంగా 30 రోజుల వరకు నగదు పరిహారం లభిస్తుంది. అంబులెన్స్ చార్జెస్ కవర్: వాహనంలో ప్రయాణిస్తుండగా గానీ ఎక్కుతుండగా లేదా దిగుతుండగా గానీ ప్రమాదవశాత్తు పాలసీదారుకు తీవ్రగాయాలైతే ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్కయ్యే ఖర్చులు ఈ యాడ్ ఉంటే పొందవచ్చు. ఇలా..వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే పాలసీలను, యాడ్ ఆన్ కవరేజీలు తీసుకుంటే నిశ్చింతగా.. దూసుకుపోవచ్చు. -
ఫొటో తీస్తే... కోట్ వస్తుంది
ఐసీఐసీఐ యాప్‌లో వినూత్న సేవ ముంబై: వాహన బీమా తీసుకునేటపుడు ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ నింపటమంటే మామూలు మాటలు కాదు. వ్యక్తిగత వివరాలతో పాటు వాహనం తాలూకు వివరాలూ పూర్తిగా నింపాలి. ప్రత్యేకించి ఒక బీమా కంపెనీ నుంచి వేరొక దానికి మారాలనుకున్నపుడు... ఆ కంపెనీ ప్రీమియం ఎంతుందో తెలుసుకోవాలన్నా సరే... ఇవన్నీ నింపక తప్పదు. ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో కూడా ఇవన్నీ ఉండాలా...? ఇదే ఆలోచన ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకి కూడా వచ్చింది. దీంతో పాలసీని స్మార్ట్ ఫోన్‌తో ఫొటో తీసి పంపిస్తే చాలు... కొత్త పాలసీ ప్రీమియం తాలూకు కోట్‌ను మన మొబైల్‌కే ఎస్ఎంఎస్ చేసే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐసీఐసీఐ లాంబార్డ్ వాహన బీమా కావాలనుకున్నవారు ఐసీఐసీఐ మొబైల్ ఫోన్ యాప్‌లో ‘ఫొటో కోట్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేయటం ద్వారా ఈ సేవను పొందవచ్చు. ఫొటో కోట్తో పాటు ఐసీఐసీఐ మొబైల్ యాప్ ద్వారా ఆరోగ్య, వాహన, ట్రావెల్ బీమా పాలసీలను కొనుగోలు చేయటం, రెన్యువల్ చేసుకోవటం వంటివన్నీ చేయొచ్చు. దగ్గర్లోని నెట్వర్క్ ఆసుపత్రిని, ఓపీడీ కేంద్రాన్ని, పాథాలజీ లాబ్లను గుర్తించటమే కాక... వాహన బీమాకు సంబంధించి దగ్గర్లోని గ్యారేజీని కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. క్లెయిమ్ స్థితిగతులను ట్రాక్ చేయొచ్చు కూడా. ఈ స్మార్ట్ యుగంలో కస్టమర్లకు అత్యుత్తమ సాంకేతిక సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఇక వాహన బీమా మూడేళ్ళకోసారి..
వాహన బీమా అంటే ఏడాదికోసారి తీసుకోవాల్సిందే. అదే పెద్ద తలనొప్పి. అయితే ద్విచక్ర వాహనదారులకు కొంతవరకూ ఈ తలనొప్పి తొలగుతోంది. ఎందుకంటే ఇక మూడేళ్లకోసారి వారు తమ వాహనానికి బీమా తీసుకుంటే సరిపోతుంది. ఈ సరికొత్త దీర్ఘకాలిక కాంప్రిహెన్సివ్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఇటీవలే ‘న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ’కి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అనుమతినిచ్చింది. దీన్లో బాగా సంతోషించదగ్గ అంశమేమిటంటే ఇటువంటి పాలసీలపై ఏకంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘‘వినియోగదారుడికి నో క్లెయిమ్ బోనస్, అండర్ రైటింగ్ ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. దానికి అదనంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది’’ అని చెప్పారు. ఇలాంటి పథకాల వల్ల బీమా కంపెనీలకు పాలన పరమైన ఖర్చులు చాలావరకూ తగ్గుతాయి. ఈ పాలసీని అతిత్వరలో ప్రారంభించే అవకాశముంది. ఇంకో ముఖ్యమైన ప్రయోజనమేంటంటే పాలసీ మధ్యలో ఉండగా బీమా కంపెనీ ప్రీమియం ధరలను సవ రించటం చేయజాలదు. క్లెయిమ్ చేసినా కూడా అదే ప్రీమియం కొనసాగుతుంది. అదీ విషయం. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కదూ!! కాస్త వేచి చూడండి మరి.! -
వాహన బీమా మరింత భారం
చెన్నై: వాహన బీమా పాలసీలు మరింత భారమయ్యేలా కనిపిస్తున్నాయి. బీమా ప్రీమియంలను పెంచుతూ ఈ మేరకు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) పలు ప్రతిపాదనలు చేసింది. 1,000 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉండే చిన్న కార్లపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 107.79 శాతం పెంచాలని ప్రతిపాదించింది. దీన్ని బట్టి టాటా బోల్ట్ లాంటి కార్ల యజమానుల కన్నా టాటా నానో వంటి చిన్న కార్ల యజమానులు అదనంగా రూ.426 మేర థర్డ్ పార్టీ ప్రీమియం కట్టాల్సి వచ్చేలా ఉంది. ఇక 75-350 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలపై ప్రీమియం పెరుగుదల 14-32 శాతం మేర ఉండనుంది. 350 సీసీ పైబడిన ద్విచక్ర వాహనాలపై మాత్రం 61 శాతం తగ్గనుంది. అలాగే, స్థూలంగా 7,500 కేజీల కన్నా తక్కువ బరువుండే (జీఎంవీ) ట్రక్కులపై 14 శాతం, 7,500-12,000 కేజీల మధ్య జీఎంవీ ఉండే వాటిపై 20 శాతం మేర థర్డ్ పార్టీ ప్రీమియం తగ్గనుంది. ఐఆర్డీఏ మంగళవారం ఆవిష్కరించిన ప్రతిపాదనలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి 20 లోగా దీనికి సంబంధించిన వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను ఐఆర్డీఏకి తెలియజేయాల్సి ఉంది. పెరుగుతున్న డెత్ క్లెయిమ్‌లు..: ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం డెత్ క్లెయిమ్‌లపై బీమా కంపెనీలు చెల్లిస్తున్న పరిహారాలు సగటున ప్రతి ఏటా పెరుగుతున్నాయి. 2012-13లో సగటున రూ.5,45,174 చెల్లించగా, 2013-14లో ఇది రూ.6,09,152కి పెరిగింది. ఇక 2014-15, 2015-16లో జారీ అయ్యి, 8-10 సంవత్సరాల్లో క్లెయిమ్‌కి వచ్చే పాలసీలపై పరిహారాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐఆర్డీఏ తెలిపింది. చిత్రమేంటంటే డెత్ క్లెయిమ్ సగటు లెక్కించడానికి ఐఆర్డీఏ తీసుకున్న లెక్కల్లో రూ.లక్ష కన్నా తక్కువ చెల్లించిన క్లెయిమ్‌లను చేర్చలేదు. పెపైచ్చు థర్డ్ పార్టీ ప్రీమియం రూపంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆదాయాన్ని గానీ, దీర్ఘకాలంగా ఉన్న క్లెయిమ్‌ల కోసమని పక్కనబెట్టిన మొత్తాన్ని గానీ లెక్కలోకి తీసుకోలేదు. -
కారు రెన్యూవల్ మరవద్దు...
కరెంటు బిల్లో, క్రెడిట్ కార్డు కనీస బకాయిలో చెల్లించడం మర్చిపోతే జరిగే పరిణామాలు మనకు తెలుసు. పెనాల్టీలు పడతాయి. సేవలు ఆగిపోతాయి. మోటారు వాహన బీమా రెన్యూవల్ కూడా ఇలాంటిదే. వెహికల్ ఇన్సూరెన్సును ప్రతి ఏటా రెన్యూవల్ చేయాల్సిందే. పాలసీ తీసుకున్న రోజు అర్ధరాత్రి నుంచే వాహన బీమా అమల్లోకి వస్తుంది. రెన్యూవల్ చేయించకపోతే ఆగిపోతుంది. ఆ తర్వాత మీ వాహనానికి బీమా కావాలంటే అందుకు సుముఖంగా ఉండే కంపెనీ వద్ద కొత్త పాలసీని కొనాల్సిందే. ఏవో పనుల ఒత్తిడిలో కొందరు మోటారు ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను మర్చిపోతారు. కానీ, చాలామంది వాహన యజమానులు కొన్ని వందల రూపాయలు ఆదా అవుతాయనే ఉద్దేశంతో రెన్యూవల్‌ను నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత ఊహించనిదేదైనా జరిగి వాహనానికి మరమ్మతులు చేయించాలంటే సొంత సొమ్ము వదిలించుకోవాల్సిందే. అంతేకాదు, నో క్లెయిమ్ బోనస్‌నూ కోల్పోతారు. వాహన ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కూడా వాహన యజమానిపై పడుతుంది. వాహన బీమా రెన్యూవల్ ఒక్కరోజు ఆలస్యమైనా పాలసీ మురిగిపోతుంది. తర్వాత అదే పాలసీని పొందాలంటే, కొత్త పాలసీ తీసుకున్నంత పనవుతుంది. వాహనాలకు సమగ్ర (కాంప్రిహెన్సివ్) పాలసీ తీసుకోవడం మేలు. ఇలాంటి పాలసీకి ప్రీమియం చెల్లించాల్సిన గడువు ముగిసిపోయాక రెన్యూవల్ చేయించాలనుకుంటే సంబంధిత బీమా కంపెనీ మీ వాహనాన్ని తనిఖీ చేస్తుంది. వాహనం ఎక్కడైనా దెబ్బతిందా, ఏ భాగమైనా ధ్వంసమైందా అనే అంశాలను పరిశీలిస్తుంది. వాహనానికి డామేజీలుంటే, వాటికి బీమా కవరేజీ ఉండదు. మురిగిపోయిన పాలసీల రెన్యూవల్‌కు బీమా కంపెనీలు అధిక ప్రీమియం వసూలు చేయవచ్చు. లేదంటే బీమా ప్రతిపాదననే తిరస్కరించవచ్చు. వాహన పాలసీని ఏటా రెన్యూవల్ చేయిస్తూ, ఎలాంటి క్లెయిమ్‌లూ దాఖలు చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) వస్తుంది. తర్వాతి ఏడాది మీరు చెల్లించాల్సిన ప్రీమియంను కంపెనీ తగ్గిస్తుంది. క్లెయిమ్‌లు చేయని సంవత్సరాలు ఎక్కువగా ఉంటే ప్రీమియంలో డిస్కౌంటు 50 శాతం వరకూ ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినపుడు ఎన్సీబీ ప్రయోజనాలను బదిలీ చేసుకోవచ్చు. వాహనం ఎలాంటి బీమా లేకుండా 90 రోజులకు పైగా ఉంటే ఎన్సీబీ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. పాత వాహనాలతో పోలిస్తే కొత్త వాటిపై బీమా ప్రీమియం చాలా హెచ్చుగా ఉంటుంది. ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలంటే వాహనాల పాలసీలను క్రమం తప్పకుండా రెన్యూవల్ చేయించాలి. -
బండికి... ఉండాలివి...
గత కొన్ని సంవత్సరాలుగా మోటార్ ఇన్సూరెన్స్‌లో అనేక సరికొత్త బీమా పథకాలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కాని వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇవి పూర్తిస్థాయిలో వినియోగదారులను చేరువ కాలేదు. ఏదైనా కారు కొనగానే చట్టప్రకారం తీసుకోవాల్సిన థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకుంటున్నారు. కాని ఈ ఒక్క పాలసీయే అన్ని రకాల బీమా రక్షణను అందించలేదు. అందుకనే ఇప్పుడు బీమా కంపెనీలు ‘యాడ్ ఆన్’ పేరుతో వివిధ రైడర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రధాన పాలసీకి మరికొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వీటిని పొందవచ్చు. యాడ్ ఆన్ కవర్లు, వాటి ప్రయోజనాలను తెలుసుకుందాం... ఫోన్ ద్వారా సాంకేతిక సహాయం: కార్లపై దూర ప్రయాణాలు చేసేవారికి ఇంజిన్‌లో వచ్చే సాంకేతిక లోపంతో బ్రేక్ డౌన్ అవడం వంటి సంఘటనలు తరుచుగా చూస్తూనే ఉంటాం. తెలియని ప్రాంతంలో కారు బ్రేక్‌డౌన్ అయ్యి, దగ్గర్లో మెకానిక్ లేకపోతే... పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న సాంకేతిక సమస్యలైతే మనం చేసుకోవచ్చు.. కాని అదే తెలియనిది అయితే... ఇలాంటి సమయంలో ఈ యాడ్ ఆన్ కవర్ అక్కరకు వస్తుంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇలాంటి చిన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నది ఫోన్ ద్వారా సూచనలు అందించడం జరుగుతుంది. తక్షణం రిపేర్లు: ఒకవేళ బ్యాటరీ అయిపోయి కారు ఆగిపోయిందనుకుందాం. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ లేకుండా కారును స్టార్ట్ చేయాలంటే శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు అవసరం. ఇలాంటప్పుడు కావల్సిన ఎక్స్టర్నల్ పవర్‌ను బీమా కంపెనీ తక్షణమే ఏర్పాటు చేస్తుంది. అవసరమైతే అద్దె కారు: ఒకవేళ కారును తక్షణం రిపేరు చేసే పరిస్థితి లేకపోతే బీమా కంపెనీ అద్దె కారును ఏర్పాటు చేసి గమ్యానికి క్షేమంగా చేరుస్తుంది. టోయింగ్ వెహికల్: ఇలా కారు మధ్యలో ఆగిపోతే దాన్ని షెడ్డుకు చేర్చడమన్నది అన్నిటికంటే చాలా క్లిష్టమైన, వ్యయంతో కూడిన పని. ఇందుకు టోయింగ్ మెషిన్ అవసరం. అదే యాడ్ ఆన్ రైడర్ తీసుకుంటే ఈ ఏర్పాట్లను బీమా కంపెనీ ఉచితంగా అందిస్తుంది. వసతి ఏర్పాటు: అవసరమైన పక్షంలో సమీప ప్రాంతంలో వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది. వాన నీటిలో ఆగిపోతే: ఇంజిన్లోకి నీరు వెళ్లి కారు ఆగిపోతే... అటువంటి వాటికి సాధారణ పాలసీలో కవరేజ్ ఉండదు. అదే యాడ్ ఆన్ కవర్ తీసుకుంటే ఇలాంటి సమస్యలకి కూడా బీమా రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది అక్కరకు వస్తుంది. మారు తాళం: ఒకవేళ కారు తాళాలు పోగొట్టుకుంటే... మీరున్న చోటుకు బీమా కంపెనీ డూప్లికేట్ తాళాలను పంపించడం లేదా, నిపుణులతో అన్‌లాక్ చేసి కారును తెరిపించే వెసులుబాటు చేస్తుంది.