వాహన బీమా మరింత భారం.. | No-fault system and compensation for road accidents | Sakshi
Sakshi News home page

వాహన బీమా మరింత భారం..

Published Tue, May 21 2019 12:00 AM | Last Updated on Tue, May 21 2019 12:00 AM

No-fault system and compensation for road accidents - Sakshi

న్యూఢిల్లీ: వాహనదారులపై బీమా భారం మరింత పెరిగేలా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు చేసింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాల థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20)గణనీయంగా పెంచే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం 2019–20కి గాను 1,000 సీసీ లోపు సామర్ధ్యమున్న కార్లపై థర్డ్‌ పార్టీ (టీపీ) ప్రీమియం రేటు ప్రస్తుతమున్న రూ. 1,850 నుంచి రూ. 2,120కి పెరగనుంది (రూ. 270 మేర పెంపు). అలాగే 1,000 సీసీ నుంచి 1,500 సీసీ దాకా సామర్థ్యమున్న కార్లపై టీపీ ప్రీమియం రూ. 437 అధికంగా రూ. 3,300కి పెరగనుంది. ఇది ఇప్పుడు రూ. 2,863గా ఉంది. అయితే, 1,500 సీసీకి మించిన ఇంజిన్‌ సామర్థ్యం ఉండే లగ్జరీ కార్ల టీపీ ప్రీమియంలలో ఎలాంటి మార్పులు లేకుండా రూ. 7,890 స్థాయి యథాతథంగా కొనసాగుతుంది.

మరోవైపు, ద్విచక్రవాహనాల విషయానికొస్తే..75 సీసీ లోపు సామర్ధ్యమున్న వాటిపై టీపీ ప్రీమియం రూ. 427 (ప్రస్తుతం) నుంచి రూ. 482కి పెరగనుంది. అలాగే 75 సీసీ నుంచి 350 సీసీ దాకా సామర్ధ్యమున్న ద్విచక్ర వాహనాలపైనా ప్రీమియం పెంచాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. కానీ సూపర్‌బైక్స్‌ (350 సీసీకి మించి సామర్ధ్యమున్నవి) పై రేట్ల పెంపు ఉండదు. ఇక సింగిల్‌ ప్రీమియంలో ఎలాంటి మార్పులు ఉండవు. కొత్త కార్లకు మూడేళ్ల పాటు, కొత్త ద్విచక్ర వాహనాలకు 5 ఏళ్ల పాటు ఇప్పుడున్న రేటు యథాతథంగా ఉంటుంది. సాధారణంగా ఏటా ఏప్రిల్‌ 1 నుంచి టీపీ రేట్లు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా పాత రేట్లే కొనసాగించాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు మే 29లోగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. 

విద్యుత్‌ వాహనాలకు డిస్కౌంటు.. 
ఎలక్ట్రిక్‌ ప్రైవేట్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల థర్డ్‌ పార్టీ ప్రీమియం రేటుపై 15 శాతం డిస్కౌంటు ఇవ్వాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. ఈ–రిక్షాల టీపీ ప్రీమియం పెంపు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ స్కూల్‌ బస్సులపై మాత్రం రేటు పెరిగే అవకాశం ఉంది. ట్యాక్సీలు, బస్సులు, ట్రక్కులతో పాటు ట్రాక్టర్లపై కూడా థర్డ్‌ పార్టీ ప్రీమియం పెరగనుంది. 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో ప్రీమియంలు, క్లెయిమ్స్‌ చెల్లింపులకు సంబంధించి ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (ఐఐబీఐ) గణాంకాల ఆధారంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఐఆర్‌డీఏఐ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement