స్టీరింగే కాదు...బీమానూ బదిలీ చేయాలి! | how to make policy transfer | Sakshi
Sakshi News home page

స్టీరింగే కాదు...బీమానూ బదిలీ చేయాలి!

Published Mon, May 1 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

స్టీరింగే కాదు...బీమానూ బదిలీ చేయాలి!

స్టీరింగే కాదు...బీమానూ బదిలీ చేయాలి!

పాత వాహనం కొంటే బీమా మార్చుకోవాలి
సెకండ్‌ హ్యాండ్‌ కార్లు, బైక్‌లు ఏటా లక్షల్లో విక్రయమవుతున్నాయి. వాహనాలు చేతులు మారుతున్నాయి గానీ, వాహన పత్రాల్లో యజమానుల పేర్లు మారేవి కొన్నే. కొనుగోలు చేసిన వారు రవాణా కార్యాలయాలకు వెళ్లి ఆర్సీ పత్రాలను మార్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఇక, బీమా పాలసీని కూడా మార్చుకోవాలన్న విషయం తెలిసిన వారు అతికొద్ది మంది. కానీ, ఇలా మార్చుకోనివారు కనక ఒకవేళ బీమా క్లెయిమ్‌ చేయాల్సి వస్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకని ఆ పని ముందే చేయాలి. అంతేకాదు, వాహనాన్ని విక్రయించిన వారు కూడా బీమా పాలసీలో తమ పేరు రద్దయ్యేలా చూసుకోవాలి. లేదంటే ఇరు వైపుల వారికీ చిక్కులే.  

సెకండ్‌ హ్యాండ్‌ కారు ఇన్సూరెన్స్‌ పాలసీలకు సంబంధించి క్లెయిమ్‌లు వచ్చినపుడు బీమా కంపెనీలు యజమాని ఎవరన్నది పరిశీలిస్తాయి. కారును అసలు యజమాని నుంచి వేరొక వ్యక్తి కొనుగోలు చేసినట్టయితే పాలసీని కొత్తగా కొన్న వ్యక్తి తన పేరు మీదకు మార్చుకుందీ, లేనిదీ చూస్తాయి. బీమా కంపెనీకి, ఆ వాహనం కొత్త యజమానికి మధ్య చట్టబద్ధమైన ఎటువంటి కాంట్రాక్టు లేనందున క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి.  న్యాయస్థానాల్లోనూ వినియోగదారులకు ప్రతికూలతలు రావచ్చు. కానీ, దీనిపై అవగాహన ఉన్న వారు చాలా తక్కువ మందే.

విక్రయించినవారూ మార్చుకోవాలి...
వాహన యజమానులు సైతం తమ వాహనాలను ఇతరులకు విక్రయించడంతో పనైపోయిందనుకుంటే సరిపోదు. కొన్న వారి పేరు మీదకు వాహన బీమా పాలసీ మారిందో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే చట్టపరమైన తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  

వాహన బీమా చేయాలంటే...
కాంప్రహెన్సివ్‌ మోటారు బీమా పాలసీలో 2 భాగాలుంటాయి. ఒకటి ఓన్‌ డ్యామేజ్‌. రెండు థర్డ్‌ పార్టీ. మీ వాహనం, మీరు కాకుండా మూడో వ్యక్తికి కలిగించిన నష్టానికి థర్డ్‌ పార్టీ కవరేజీ వర్తిస్తుంది. ఓన్‌ డ్యామేజీ అన్నది ప్రమాదం కారణంగా మీ కారుకు వాటిల్లిన నష్టానికి పరిహారాన్నిచ్చేది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 157... ఓ వ్యక్తి మరొకరి నుంచి కారును కొనుగోలు చేసిన 14 రోజుల్లోపు బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోవడం ద్వారా పాలసీని తన పేరు మీదకు బదిలీ చేసుకోవాలని చెబుతోంది.

14 రోజుల గడువులోపు కొత్త యజమాని వాహన బీమాను తన పేరు మీదకు మార్చుకోవడంలో విఫలమైతే ఆ తర్వాత కొత్త యజమాని కారణంగా వాటిల్లే ఓన్‌ డ్యామేజ్, థర్డ్‌పార్టీ నష్టానికి పరిహారం చెల్లించే బాధ్యత బీమా కంపెనీపై ఉండదు. బీమా పాలసీ నూతన యజమాని పేరు మీదకు మారకుండా పాత యజమాని పేరు మీదే కొనసాగుతున్నట్టయితే... ప్రమాదాల కారణంగా వాటిల్లే నష్టాలకు బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. అంతేకాదు, ఆ పరిహార బాధ్యత పాత యజమాని నెత్తిన పడే ప్రమాదం ఉంది. కొత్త యజమాని ప్రమాదం కారణంగా థర్డ్‌ పార్టీకి నష్టం కలిగిస్తే అందుకు పరిహారం చెల్లించాలంటూ కోర్టు పాత యజమానికి నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీమా పాలసీ పాత యజమాని పేరిటే ఉంది గనుక.

పాలసీ బదిలీ ఇలా...
► పాత కారును కొన్న వెంటనే 14 రోజుల్లోగా దాన్ని కొనుగోలు దారులు తమ పేరు మీదకు బదిలీ చేసుకోవాలి.
► బీమా పాలసీని బదిలీ చేసేందుకు వీలుగా... తాజా ప్రపోజల్‌ పత్రాన్ని నింపాల్సి ఉంటుంది. దానికి తోడుగా అమ్మకం పత్రం, ఆర్సీ బదిలీ పత్రం, పాత యజమాని సంతకం చేసిన ఫామ్‌ 29, 30 జత చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు పాత పాలసీ పత్రం, బదిలీ ఫీజు చెల్లిస్తే బీమా కంపెనీ కొత్త యజమాని పేరు మీదకు పాలసీని మారుస్తుంది.
► వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ)లో పేరు మార్పు అన్నది కొంచెం సమయం తీసుకుంటుంది. కనుక ముందు పైన చెప్పుకున్న అన్ని పత్రాలతో ముందు బీమా పాలసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్సీలో పేరు మారిన తర్వాత దాని కాపీ కూడా సమర్పిస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి.
► బీమా పాలసీ కొత్త యజమాని పేరు మీదకు మారిపోయి, మారిన ఆర్సీ కాపీని బీమా కంపెనీకి అందజేయకపోయి ఉంటే, ఒకవేళ క్లెయిమ్‌ చేసుకోవాల్సి వస్తే ఆ సమయంలో ఆర్సీ కాపీని బీమా కంపెనీకి ఇస్తే సరిపోతుంది.
► ఒకవేళ ఆర్సీ బదిలీ ప్రక్రియలో ఉన్న సమయంలో క్లెయిమ్‌ చేసుకుంటే బీమా కంపెనీ పరిహారాన్ని నిరాకరించదు. కాకపోతే కొత్త యజమాని పేరు మీదకు ఆర్సీ బదలాయింపు పూర్తయిన తర్వాత, దాని ఆధారాన్ని సమర్పించిన తర్వాతే బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. నిజానికి బీమా పాలసీ బదలాయించుకోకపోతే ఈ విధమైన సమస్యలు ఎదురవుతాయని తెలియక మనలో చాలా మంది వాహన బీమాను తమ పేరిట బదలాయించుకోకుండా అలక్ష్యం చేస్తుంటారు. కానీ, ప్రమాదం జరిగి భారీ నష్టం వాటిల్లితే మాత్రం ఆర్థికంగా కుదేలు కావాల్సి వస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement