షోరూమ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా బీమా తీసుకోవాల్సిందే. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా లాంగ్‌టర్మ్ బీమా ఎంచుకుంటే ఐదేళ్లు బీమా వెసులుబాటు ఉంటుంది. అయితే బీమా అయిపోయాక చాలామంది దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం లేదు. తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో కేవలం 19 శాతం టూ వీలర్ యజమానులు మాత్రమే బీమా రెన్యువల్ చేయిస్తున్నారు. వాహనం తీసుకున్న కొత్తలో అనివార్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీమా తీసుకోవాల్సిందే. కానీ బీమా సమయం పూర్తయిన తర్వాత కూడా వాహనదారులు ఇన్సూరెన్స్ చేయించాలి.
మార్కెట్‌లో ఆప్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లో చాలా వెబ్‌పోర్టళ్ల ద్వారా టూవీలర్ బీమాను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా తీసుకునేప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల బీమాలున్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైన జరిగితే పరిహారం ఇచ్చేలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. శారీరక గాయాలు, ఆస్తి నష్టం, మరణం.. వంటివి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు.
విస్తృత బీమా
విస్తృత బీమా ప్రయోజనాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.
ఇవి తెలుసుకోండి..
కవరేజీ: బీమా పాలసీ ఎంచుకునేప్పుడు మొత్తం ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోవాలి. నిత్యం వాహనాన్ని ఉపయోగిస్తుంటే దాని విలువ ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే మేలు. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినా పూర్తి భద్రత ఉంటుంది.
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ: వాహనం తీవ్రంగా దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా కంపెనీలు అత్యధికంగా చెల్లించే పరిహారమే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ). వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులైతే క్రమంగా దాని విలువ తగ్గిపోతోంది. ఐడీవీ మార్కెట్‌లో వాహన ప్రస్తుత ధరను తెలియజేస్తుంది.
బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియా(సీఎస్‌ఆర్) తెలుసుకోవాలి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.
కొన్ని కంపెనీలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం కొంత మొత్తంలో బీమా తీసుకునే సమయంలోనే వసూలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుపై నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్ వరకు భద్రంగా చేరవేసేందుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్‌ఆన్ ఉపయోగపడుతుంది.
బీమా రెన్యువల్ చేసిన ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తర్వాత సంవత్సరం కట్టే ప్రీమియంకు కొన్ని కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి.
ఇదీ చదవండి: ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపు
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన రిపేర్ల కోసం ఎలాంటి నగదు చెల్లించకుండా ఉండే పాలసీను ఎంచుకోవాలి. పాలసీ నెట్‌వర్క్ గ్యారేజీల్లో ఉచితంగానే రిపేర్ చేస్తారు. మీరు ఉంటున్న ప్రదేశాల్లో బీమా కంపెనీ నెట్‌వర్క్ గ్యారేజీలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment