Vehicle insurance policy
-
వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?
షోరూమ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా బీమా తీసుకోవాల్సిందే. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఇది అందరికీ వర్తిస్తుంది. సాధారణంగా లాంగ్‌టర్మ్ బీమా ఎంచుకుంటే ఐదేళ్లు బీమా వెసులుబాటు ఉంటుంది. అయితే బీమా అయిపోయాక చాలామంది దాన్ని తిరిగి రెన్యువల్ చేయడం లేదు. తొలి పాలసీ గడువు ముగిసిన తర్వాత భారత్‌లో కేవలం 19 శాతం టూ వీలర్ యజమానులు మాత్రమే బీమా రెన్యువల్ చేయిస్తున్నారు. వాహనం తీసుకున్న కొత్తలో అనివార్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బీమా తీసుకోవాల్సిందే. కానీ బీమా సమయం పూర్తయిన తర్వాత కూడా వాహనదారులు ఇన్సూరెన్స్ చేయించాలి.మార్కెట్లో ఆప్లైన్తోపాటు ఆన్లైన్లో చాలా వెబ్పోర్టళ్ల ద్వారా టూవీలర్ బీమాను రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీమా తీసుకునేప్పుడు గమనించాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీమాలున్నాయి. మొదటిది థర్డ్ పార్టీ బీమా, రెండోది సమగ్ర బీమా. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా ఇతరులకు ఏదైన జరిగితే పరిహారం ఇచ్చేలా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. శారీరక గాయాలు, ఆస్తి నష్టం, మరణం.. వంటివి ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంత వాహనానికి జరిగే నష్టం మాత్రం దీనిలోకి రాదు.విస్తృత బీమావిస్తృత బీమా ప్రయోజనాలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రమాదం, దొంగతనం, వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఇది భర్తీ చేస్తుంది.ఇవి తెలుసుకోండి..కవరేజీ: బీమా పాలసీ ఎంచుకునేప్పుడు మొత్తం ఎంత కవరేజీ అవసరమో తెలుసుకోవాలి. నిత్యం వాహనాన్ని ఉపయోగిస్తుంటే దాని విలువ ఆధారంగా కవరేజీని అంచనా వేయాలి. థర్డ్-పార్టీ చేయించినప్పటికీ.. సమగ్ర బీమా ఉండటమే మేలు. ఏదైనా అనుకోని ప్రమాదం వాటిల్లినా పూర్తి భద్రత ఉంటుంది.ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ: వాహనం తీవ్రంగా దెబ్బతిన్నా లేదా దొంగతనానికి గురైనా కంపెనీలు అత్యధికంగా చెల్లించే పరిహారమే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ). వాహనాన్ని కొనుగోలు చేసి చాలా రోజులైతే క్రమంగా దాని విలువ తగ్గిపోతోంది. ఐడీవీ మార్కెట్లో వాహన ప్రస్తుత ధరను తెలియజేస్తుంది.బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియా(సీఎస్ఆర్) తెలుసుకోవాలి. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మేలు.కొన్ని కంపెనీలు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం కొంత మొత్తంలో బీమా తీసుకునే సమయంలోనే వసూలు చేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగి వాహనం రోడ్డుపై నిలిచిపోతే దాన్ని సర్వీస్ సెంటర్ వరకు భద్రంగా చేరవేసేందుకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ఆన్ ఉపయోగపడుతుంది.బీమా రెన్యువల్ చేసిన ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే తర్వాత సంవత్సరం కట్టే ప్రీమియంకు కొన్ని కంపెనీలు రాయితీలు ఇస్తుంటాయి.ఇదీ చదవండి: ఉక్కు ఉత్పత్తుల దిగుమతి సుంకం పెంపుఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహన రిపేర్ల కోసం ఎలాంటి నగదు చెల్లించకుండా ఉండే పాలసీను ఎంచుకోవాలి. పాలసీ నెట్వర్క్ గ్యారేజీల్లో ఉచితంగానే రిపేర్ చేస్తారు. మీరు ఉంటున్న ప్రదేశాల్లో బీమా కంపెనీ నెట్వర్క్ గ్యారేజీలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
ఈవీ జోరు.. బీమా లేదంటే బేజారు!
అతని పేరు శివకుమార్ (40). 2022 ఏప్రిల్‌లో ఓ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముచ్చటపడి కొనుగోలు చేశాడు. ఆ స్కూటర్ డిటాచబుల్ బ్యాటరీ ఆప్షన్‌తో ఉంది. దాంతో బ్యాటరీని తీసి తన బెడ్రూమ్లోనే రాత్రి చార్జింగ్ పెట్టాడు. అదే బెడ్ రూమ్‌లో శివకుమార్, అతడి భార్యాపిల్లలు నిద్రించారు. అర్ధరాత్రి బ్యాటరీ నుంచి మంటలు వచ్చి గది అంతటా వ్యాపించాయి. ఈ మంటలకు శివకుమార్ ప్రాణాలు కోల్పోగా, భార్యా పిల్లలు గాయాలపాలయ్యారు. ఆ మధ్య ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటలకు ఆహుతి కావడం తెలిసిందే. అంతెందుకు ముంబైలో ఓ ప్రముఖ కంపెనీ కారు పార్క్ చేసి ఉండగా, ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నిజానికి కంబషన్ ఇంజన్‌తో కూడిన వాహనాల్లో అగ్ని ప్రమాదం జరగదని కాదు. కానీ, చాలా చాలా అరుదు. అదే ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీలు) అయితే బ్యాటరీ సిస్టమ్‌లో లోపాల వల్ల అగ్ని ప్రమాద రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ అగ్ని ప్రమాదాలకు వాహన బీమాలో కవరేజీ ఉంటుందా? వేటికి అసలు కవరేజీ వస్తుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ప్రస్తుతం మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్‌ను తప్పకుండా తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల)కు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌కు కొత్త. ఇంత కాలం ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలే ఉండడంతో బీమా ఉత్పత్తులు వీటికి అనుగుణంగానే తయారయ్యాయి. వీటినే బీమా సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లకు సైతం జారీ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు రెండు రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ కాంప్రహెన్సివ్ పాలసీలు ఒక రకం. ఓన్ డ్యామేజ్ తోపాటు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌తో కూడిన సమగ్ర బీమా ఇది. మోటారు ఇన్సూరెన్స్ విభాగంలోకి రాని తక్కువ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలకు అస్సెట్ ఇన్సూరెన్స్ పాలసీలను బీమా సంస్థలు విక్రయిస్తున్నాయి. ఇవి ప్రమాద నష్టాలను భర్తీ చేస్తాయి. ‘‘25 కిలోమీటర్లకు పైగా వేగంతో నడిచే అన్ని రకాల ఈవీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఓన్ డ్యామేజీ కవరేజీ అనేది కేవలం వాహనదారు ఇష్టం మేరకు తీసుకోవచ్చు. అదే 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగం కలిగిన ఈవీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి కాదు. కానీ, వాహనదారులు తమ వాహనాలకు సరైన రక్షణ కలి్పంచుకునేందుకు వీలుగా సరిపడా బీమా రక్షణను తీసుకోవాలని మేము సూచిస్తాం’’అని డిజిట్ ఇన్సూరెన్స్ చీఫ్ డి్రస్టిబ్యూషన్ ఆఫీసర్ ఆదర్శ్ అగర్వాల్ తెలిపారు. అన్నింటికీ కాదు.. బీమా ఉన్నంత మాత్రాన వాహనంలో ఏ నష్టం జరిగినా బీమా వస్తుందని భావించడానికి లేదు. ఈవీకి ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) కంటే ఈవీలు భిన్నంగా తయారవుతాయి. ముఖ్యంగా ఈవీలో ఒక్క బ్యాటరీ ధరే మొత్తం వాహనం ధరలో 40 శాతం మేర ఉంటుంది. ‘‘ఇప్పటికీ మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా చాలా తక్కువ. భారీ సంఖ్యలో అమ్మకాలు పెరిగితే తప్ప వాటికి ఎదురయ్యే నష్టాలను విశ్లేషించలేము. తగినంత డేటా, క్లెయిమ్స్ అనుభవం ఉన్నప్పుడే ఈవీలకంటూ ప్రత్యేకమైన పాలసీలను తీసుకురావడం సాధ్యపడుతుంది’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ టీఏ రామలింగం తెలిపారు. టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కొంత కాలం క్రితం ఈవీల కోసమే ప్రత్యేకమైన పాలసీని రూపొందించినట్టు ప్రకటించింది. ‘ఆటో సెక్యూర్ ఈ వెహికల్ కాంప్రహెన్సివ్ పాలసీ’ పేరుతో తీసుకొచ్చిన ప్లాన్‌లో ఓన్ డ్యామేజీతోపాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినా కవరేజీ అందులో భాగంగా ఉంది. కానీ, ఇప్పటికీ ఇది మార్కెట్లోకి రాలేదు. బ్యాటరీకి లేదు రక్షణ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈవీ పాలసీల్లో పెద్ద లోపం ఉంది. బ్యాటరీ ఒక్కటే డ్యామేజ్ అయితే పరిహారం రాదు. మొత్తం వాహనం డ్యామేజ్ అయితేనే బీమా సంస్థలు క్లెయిమ్‌లు ఆమోదించి పరిహారం చెల్లిస్తున్నాయి. ‘‘వాహన విడిభాగాలు విఫలమైతే మోటారు ఇన్సూరెన్స్ పాలసీల్లో కవరేజీ ఉండదు. సంప్రదాయ పాలసీల్లో అయితే ప్రమాదం వల్ల, అల్లర్లు, దోపిడీలు, వరదల వల్ల వాహనం, దాని విడిభాగాలకు నష్టం జరిగితే పరిహారం వస్తోంది’’అని గల్లాగర్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రాక్టీస్ లీడర్ ఎన్ భోజరాజన్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనంలో ఖరీదైన బ్యాటరీని ఎవరైనా ఎత్తుకుపోయాంటే క్లెయిమ్‌ను బీమా సంస్థలు ఆమోదించకపోవచ్చు. ఈవీలకు బ్యాటరీ అత్యంత కీలకం కనుక బ్యాటరీ ఒక్కదానికే కవరేజీ ఇచ్చే పాలసీల అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘బ్యాటరీలు, చార్జింగ్ ఎక్విప్మెంట్కు ఉద్దేశించిన ప్రత్యేకమైన పాలసీలు అవసరం. ఈవీ చార్జింగ్ సదుపాయాలతో ముడిపడిన రిస్క్‌ల కారణంగా ఈవీలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదాల వల్లే నష్టం జరగాలని లేదు. బ్యాటరీ చార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం వాటిల్లితే బ్యాటరీతోపాటు, కనెక్టర్కూ నష్టం జరుగుతుంది. సంప్రదాయ పాలసీలో బ్యాటరీతోపాటు వాహనం కూడా అగి్నకి ఆహుతి అయితే తప్ప క్లెయిమ్‌ను ఆమోదించవు’ అని భోజరాజన్ వివరించారు. అందుకే ఈవీలకే ఉద్దేశించిన ప్రత్యేక పాలసీల అవసరం ఉందని అన్నారు. మనం ఏమి చేయగలం? బీమా సంస్థలు పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను అర్థం చేసుకుంటున్నాయి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల తరమే కనుక ఈవీల కోసం ప్రత్యేక పాలసీలకు రూపకల్పన చేస్తున్నాయి. కనుక వాహనదారులు అన్ని బీమా సంస్థలను సంప్రదించిన తర్వాతే పాలసీని ఎంపిక చేసుకోవాలి. బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను ఏదైనా సంస్థ ఆఫర్ చేస్తే ఎంపిక చేసుకోవడం మెరుగు. ప్రీమియం కొంచెం ఎక్కువైనా, బ్యాటరీ కవరేజీతో కూడిన ప్లాన్‌ను తప్పక తీసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా ఈవీల కోసమే ఉద్దేశించిన ఎన్నో ఫీచర్లతో పాలసీలను అందుబాటులోకి తెస్తాయి. కేవలం థర్డ్ పార్టీ డ్యామేజ్ కాకుండా ఓన్ డ్యామేజ్ కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ పాలసీకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైడర్లను కూడా యాడ్ చేసుకోవడాన్ని పరిశీలించాలి. డిప్రీసియేషన్ కవర్, గ్యాప్ వ్యాల్యూ కవర్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ తీసుకోవాలని లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రెసిడెంట్ ఉదయన్ జోషి సూచించారు. ముఖ్యంగా ఈవీ వాహనదారులు రిటర్న్ టు ఇన్వాయిస్ రైడర్‌ను తీసుకోవాలని పాలసీబజార్ మోటార్ రెన్యువల్స్ హెడ్ అశ్విని దూబే సూచించారు. ఈ రైడర్‌తో వాహనం ఇన్వాయిస్ విలువ మేర పరిహారం పొందొచ్చన్నారు. కారు చోరీకి గురైనా లేక రిపేర్ చేయడానికి అనుకూలంగా లేని రీతితో దెబ్బతిన్నా లేక అగ్ని ప్రమాదంతో మొత్తం నష్టం వాటిల్లినప్పుడు ఈ రైడర్ కింద పరిహారం వస్తుందన్నారు. పాలసీ కొనుగోలుకు ముందే వేటికి కవరేజీ వస్తుంది, వేటికి మినహాయింపు ఉన్నదీ తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. ప్రీమియం భారం అనుకోవద్దు.. ఈవీలకు ఇచ్చే బీమా పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాల కంటే ఈవీలకు థర్డ్ పార్టీ కవర్ 15% వరకు తక్కువ. ‘‘ఐసీఈ వాహనాలతో పోలిస్తే ఈవీ కార్లు, బైక్‌లకు కాంప్రహెన్సివ్ కవరేజీ ప్రీమియం 5–20% వ్యత్యాసంతో ఉంటోంది. ఓన్ డ్యామేజ్ కవరేజీలోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటోంది. ఏడాది కాలానికి 30 కిలోవాట్ అవర్ ఎలక్ట్రిక్ కారుకు థర్డ్ పార్టీ ప్రీమియం రూ.2,000 స్థాయిలో ఉంది. అదే ఐఈసీ వాహనాలకు (1,000 సీసీ మించని) ప్రీమియం మరో రూ.200 వరకు అటూ ఇటూగా ఉంటోంది. ‘ఈవీలకు ప్రీమియం, బీమా సంస్థ ధరల విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఈవీ తయారీ, మోడల్, బ్యాటరీ సామర్థ్యం, ప్రాంతం, వాహనం వయసు వంటి అంశాలు ప్రీమియం ధరపై ప్రభావం చూపిస్తాయి’ అని ఉదయన్ జోషి వెల్లడించారు. ఈవీలకు సంబంధించి మరిన్ని క్లెయిమ్‌లు వస్తే కానీ, ప్రీమియం మెరుగ్గా మారగలదన్నారు. ఈవీలకు ఉన్న రిస్‌్కల నేపథ్యంలో వాటికంటూ ప్రత్యేకమైన ఉత్పత్తులు తీసుకువచ్చేందుకు ఐఆర్డీఏఐ సైతం బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్!
హైదరాబాద్: రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిశ్రమలోనే మొదటిసారిగా వాహన బీమాకు సంబంధించి మూడు యాడాన్ కవర్లను ప్రవేశపెట్టింది. ప్రైవేటు కార్లకు ‘స్మార్ట్ సేవ్’ పేరుతో యాడాన్ కవరేజీని విడుదల చేసింది. రోడ్‌సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్ పేరుతో ద్విచక్ర వాహనాలకు రెండు కవర్లను తీసుకొచ్చింది. ఇదీ చదవండి: హోం లోన్ వద్దు.. పర్సనల్ లోనే కావాలి! స్మార్ట్సేవ్ అనే ఉచిత యాడాన్ కవర్ కింద కార్లను యజమానులు రాయల్ సుందరం గుర్తించిన ట్రస్టెడ్ రిపేర్ షాపులు, గ్యారేజీల్లో సర్వీస్ చేయించినట్టయితే, ఓన్ డ్యామేజ్ కవర్ ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ద్విచక్ర వాహనం ఏదైనా కారణం వల్ల మార్గమధ్యంలో కదల్లేని స్థితిలోకి వెళితే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కింద సాయాన్ని పొందొచ్చు. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్లో వాహనానికి నష్టం జరిగితే పూర్తి విలువ మేర చెల్లింపులు ఉంటాయి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
వాహన బీమా వ్యయం తగ్గించుకుందామా...
అన్‌లాక్ తుది దశకు చేరినప్పటికీ... కోవిడ్ సెకండ్ వేవ్ మళ్లీ బలంగా పుంజుకుంటోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపధ్యంలో దాదాపుగా 40శాతం తమ ఉద్యోగులను ఇకపై ఇంటి నుంచే పనిచేసేందుకు వీలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి అవకాశం ఇవ్వాలని అత్యధిక సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయని వర్క్‌ప్లేస్ ఆఫ్ ద ఫ్యూచర్ అనే అంశపై బిసిజి వెలువరించిన నివేదిక వెల్లడించింది. ఉద్యోగులు సైతం ఈ విధానానికే మొగ్గు చూపుతున్నారని, అత్యవసరమైతే తప్ప ఇంటికే పరిమితం కావాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వాహన బీమా ఖర్చు వీరికి అనవసర అదనపు వ్యయంగా పరిణమించింది. దీనిపై పాలసీ బజార్ డాట్ కామ్ హెడ్ సజ్జా ప్రవీణ్ చౌదరి ఏమంటున్నారంటే... వర్క్ ఫ్రమ్‌హోమ్...నో కార్ ఆన్ రోడ్... వచ్చే 7 నుంచి 8 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని చాలా సంస్థలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో చేసే ఉద్యోగులు... తమ వాహన బీమా విషయంలో కొంత గందరగోళానికి లోనవుతున్నారు. ఎక్కువ మంది కార్పొరేట్ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారంటే రోడ్లపై ఎక్కువగా కార్లు ఉండవని అర్ధం.మరి మన వాహనాన్ని మనం ఎక్కువగా వినియోగించనప్పుడు... కారు భధ్రత కోసం అధిక ఖర్చుతో కూడిన బీమా పాలసీలు అనవసరమని, రోజూ మనం కారును విరివిగా ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ప్రమాదాలు, వాటి కారణంగా వచ్చే డ్యామేజీలు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాని పక్షంలో...బీమా పాలసీలకు పెట్టిన ఖర్చు వృధాయేనని అనుకోవడంలో తప్పులేదు. అలాగని పూర్తిగా బీమాకు దూరమవడం కూడా సరికాదు. వాహనం వినియోగం సగానికిపైగా తగ్గిపోయిన పరిస్థితుల్లో... తక్కువ ఖర్చుతో తగినంత బీమా భధ్రత కల్పించే పాలసీల కోసం చూడాలి.. థర్డ్ పార్టీ తప్పనిసరి... వ్యక్తిగత వాహన భధ్రత కోసం బీమా తీసుకోవడం అనేది వ్యక్తుల ఇష్టాన్ని బట్టి ఆధారపడినా,ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రతి వాహనానికీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్(టిపి కవరేజ్) మాత్రం తప్పనిసరి. ఆఫీసులకు రాకపోకలు లేని పరిస్థితుల్లో యాక్సిడెంటల్ డ్యామేజెస్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే టిపి కవర్ మాత్రం తప్పదు. అలాగే మన వాహనం మన ఇంటి దగ్గర నిలిపి ఉంచినప్పుడు కూడా కొన్ని రకాల డ్యామేజీలు అయ్యే అవకాశం ఉంది. అలాంటి డ్యామేజీలకు పరిహారం వచ్చేలా కూడా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా వాహనాలు ఎక్కడైనా పార్క్ చేసి ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది వాహనాల చోరీ.. దేశంలో రోజుకి దాదాపుగా 100 వాహనాలు చోరీకి గురవుతున్నట్టు అంచనా. ఈ నేపధ్యంలో వాహనాల చోరీ నుంచి రక్షణ కల్పించే బీమా పాలసీ కూడా అవసరమే. అదే విధంగా ఆగి ఉన్న వాహనాలు దగ్థం అంటూ ఈ మధ్య కొన్ని సంఘటనలు తరచు చూస్తున్నాం. కారణాలేవైనా గానీ అగ్ని ప్రమాదం వల్ల కలిగే నష్టాలు కూడా పరిపాటిగా మారాయి. మన కారుకు నష్టం కలిగించిన, దొంగిలించిన వ్యక్తిని కనిపెట్టడం సులభం కాదు కాబట్టి ముందుగానే అందుకు తగిన భధ్రత కల్పించడం ముఖ్యం. త్రీ ఇన్ వన్...గో టిపి, ఫైర్, థెఫ్ట్ కలిపి ఉన్న బీమా పాలసీలు తీసుకోవడం మంచిది. ఈ తరహా ఉత్పత్తులు చాలా తక్కువ వ్యయంతోనే అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే ఇవి 50శాతం పైగా తక్కువ వ్యయం అవుతాయి. జీతం మీద ఆధారపడిన ఉద్యోగులకు ఖర్చులు తగ్గించుకోవడంలో ఇవి సహకరిస్తాయి. అలాగే అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఇంటిపట్టన ఉంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటాయి. కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవడం కన్నా ఈ మూడూ కలిపి అందిస్తున్న పాలసీలను ఎంచుకోవడం మంచిది. –సజ్జా ప్రవీణ్ చౌదరి, పాలసీ బజార్ డాట్ కామ్ -
డిజిటల్ పాలసీ ఎంతో చౌక
వాహనానికి బీమా తీసుకోవడం నిబంధనల రీత్యా తప్పనిసరి. ఏటేటా వాహన ప్రీమియం ఖరీదయిపోతోంది. ఈ క్రమంలో ప్రీమియం భారం కాస్త తగ్గించుకునేందుకు డిజిటల్ పాలసీలపై దృష్టి సారించొచ్చు. ఆన్లైన్లోనే సేవలతో దూసుకుపోతున్న అకో, గో డిజిట్ సంస్థలు పోటా పోటీగా మంచి ఫీచర్లతో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో యువతలో ఈ బీమా సంస్థలకు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పెరిగింది. కొనుగోలు ఎంతో సులభం కావడం, ప్రీమియం తక్కువగా ఉండడం వారికి ఎంతో సౌకర్యాన్నిస్తున్నాయి. అకో, గో డిజిట్ సంస్థలు నూరు శాతం ఆన్లైన్ కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. భౌతికంగా వీటికి శాఖలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వీటికి పరిపాలన, నిర్వహణ చార్జీలు ఇతర ప్రధాన బీమా సంస్థలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కనుక ఈ సంస్థలు 20–30 శాతం తక్కువ ప్రీమియానికే మోటార్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు మోటారు ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రస్తుతానికి 3–4 శాతం వాటా ఉంది. కానీ, ఇతర సంస్థలతో పోలిస్తే ఇవి ఎంతో వేగంగా తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నాయి. పాలసీ రెన్యువల్ చేసుకునే సమయం వస్తే, ఈ సంస్థలను ఆశ్రయించొచ్చా..? ఈ ప్రశ్న మీకు ఎదురైతే.. సమాధానం వెతుక్కునేందుకు ఇక్కడున్న వివరాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిందే. మోటారు ఇన్సూరెన్స్‌లో అతిపెద్ద సంస్థగా ఉన్న ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, అకో, గో డిజిట్ సంస్థల మధ్య కొన్ని సేవల పరంగా అంతరాన్ని పరిశీలించొచ్చు.. అకో జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమా వ్యాపార కంపెనీ అయిన అకో జనరల్ ఇన్సూరెన్స్ 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. మోటార్, హెల్త్, మొబైల్, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఈ సంస్థ అందిస్తోంది. అమెజాన్, కేటమరాన్ వెంచర్స్, సైఫ్ పార్ట్నర్స్ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థ అందించే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో.. రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, ప్రకృతి విపత్తుల కారణంగా సొంత వాహనానికి, మూడో పార్టీ వాహనానికి నష్టం జరిగితే కవరేజీ ఉంటుంది. వాహనం చోరీకి గురైనా బీమా లభిస్తుంది. అలాగే, వాహనదారుడికి వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. జీరో డిప్రీసియేషన్ను యాడాన్ కవర్‌గా తీసుకోవచ్చు. అంటే వాహనంలోని రబ్బర్, ప్లాస్టిక్ తదితర కొన్ని విడిభాగాలకు నష్టం జరిగితే బీమా సంస్థ వాస్తవ విలువలో నిర్ణీత శాతమే పరిహారం చెల్లిస్తుంది. జీరో డిప్రీషియేషన్ కవర్ తీసుకుంటే 100 శాతం విలువను పరిహారంగా చెల్లిస్తుంది. వీటికి పరిహారం రాదు... ఈ పాలసీలో నిబంధనలు ఇతర మోటారు పాలసీల్లో మాదిరే ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే లేదా కారణమైతే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదం బారిన పడితే అందుకు జరిగే నష్టానికి కంపెనీ రూపాయి కూడా చెల్లించదు. అలాగే, ప్రమాదం వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల వాహనానికి నష్టం జరిగినా పరిహారం రాదు. కొనుగోలు ఇలా... ఆన్లైన్ పోర్టల్ అకో డాట్ కామ్‌కు వెళ్లి మీ కారు నంబర్ లేదా బ్రాండ్‌ను ఎంపిక చేసుకుని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ)ను ఎంచుకోవాలి. తర్వాత ప్రీమియం చెల్లించిన నిమి షాల వ్యవధిలోనే పాలసీ ఈ మెయిల్‌కు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ కేవలం ఐదారు నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోతుంది. క్లెయిమ్ ప్రక్రియ సులభం... ప్రమాదం కారణంగా వాహనానికి నష్టం జరిగితే దేశవ్యాప్తంగా 1,000కుపైగా గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు పొందొచ్చు. క్లెయిమ్ కోసం కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా కంపెనీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఉన్న వారికి రిపేర్ కోసం వాహనాన్ని 60 నిమిషాల వ్యవధిలోనే పిక్ చేసుకుంటారు. కంపెనీ సర్వేయర్ వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. ఇతర పట్టణాల్లోని వారు తామే స్వయంగా వాహనాన్ని కంపెనీ నిర్దేశించిన గ్యారేజ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కారు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బీమా పాలసీ జిరాక్స్ కాపీ అవసరపడతాయి. క్లెయిమ్‌ను కంపెనీ ఆమోదిస్తే నగదు రహితంగా గ్యారేజ్‌లో రిపేర్ చేసి డెలివరీ చేస్తారు. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొత్తం క్లెయిమ్‌లలో 72.4 శాతం 15 రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి. 90 రోజుల వ్యవధిలో ఇది 99.5 శాతంగా ఉంది. వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటల పాటు కస్టమర్ సపోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. గో డిజిట్ ఇన్సూరెన్స్ ఈ సంస్థ కూడా 2017లోనే ఆరంభమైంది. కార్లు, బైక్‌లు, సైకిళ్లు, ట్రావెల్, హోమ్, మొబైల్ ఫోన్లకు ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తోంది. జీరో డిప్రీసియేషన్ కవర్, ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రిటర్న్ టూ ఇన్వాయిస్ కవరేజీలు ఇందులో ఉన్నాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్‌ను కూడా విడిగా తీసుకోవచ్చు. అకో జనరల్ ఇన్సూరెన్స్ మాదిరిగానే సాధారణ మినహాయింపులు ఇందులోనూ ఉన్నాయి. కొనుగోలు... కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి కారు లేదా బైక్ వీటిల్లో వాహనం ఏద న్నది ఎంచుకుని,బ్రాండ్, మోడల్‌ను సెలక్ట్ చేసిన తర్వాత, పూర్వపు బీమా సంస్థ వివరాలను ఇవ్వాలి. దాంతో ప్రీమియం ఎంతన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి.ప్రీమియం చెల్లించిన అనంతరం మెయిల్‌కు పాలసీ జారీ అయిపోతుంది. క్లెయిమ్ ప్రక్రియ... దేశవ్యాప్తంగా 1,400 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి క్లెయిమ్ వివరాలను రికార్డ్ చేసుకోవాలి. దాంతో మీ మొబైల్‌కు స్వీయ తనిఖీ పత్రం లింక్ ద్వారా వస్తుంది. వాహనానికి నష్టం జరిగితే మొబైల్ ద్వారా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఈ ఇమేజ్‌లను గో డిజిట్ టీమ్ పరిశీలించిన అనంతరం ఎంత మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చన్న సమాచారాన్ని అందిస్తుంది. అవసరమైతే సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అనంతరం నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్న గ్యారేజ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వాహనం మీ నుంచి పిక్ చేసుకుని, రీపెయిర్ తర్వాత తిరిగి అందించే సేవలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ పరిహారం చెల్లింపుల రేషియో 94.84 శాతం. ద్విచక్ర వాహన క్లెయిమ్‌కు సగటున 11 రోజుల సమయం తీసుకుంటుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ మోటారు వాహన పాలసీల విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ చాలా పెద్ద సంస్థ. కేవలం మోటారు పాలసీల నుంచే 2018–19లో ఈ సంస్థ రూ.6,400 కోట్ల ప్రీమియం రాబట్టింది. అకో జనరల్ రూ.75 కోట్ల ప్రీమియం పొందగా, గో డిజిట్ రూ.854 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించాయి. ఇతర సంస్థల మాదిరే ఐసీఐసీఐ లాంబార్డ్ మోటారు బీమాలోనూ అన్ని రకాల ఫీచర్లు, యాడాన్ కవరేజీలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు... కారు నంబర్ లేదా బ్రాండ్ పేరు, ఏ సంవత్సరం మోడల్ తదితర వివరాలను ఇవ్వడం ద్వారా ఐసీఐసీఐ లాంబర్డ్ ఆన్లైన్ పోర్టల్ నుంచి మోటారు పాలసీ తీసుకోవచ్చు. అన్ని రకాల వాహన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాహనం వివరాలను పేర్కొన్న తర్వాత ప్రీమియం వివరాలు కనిపిస్తాయి. భిన్న ఫీచర్లతో తీసుకుంటే ప్రీమియం ఏ మేరకు అన్న వివరాలు కూడా కనిపిస్తాయి. నచ్చిన దానిని ఎంపిక చేసుకుని ప్రీమియం చెల్లించాలి. ఆ సమయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్, కీ ప్రొటెక్ట్, కన్జ్యూమబుల్స్ కవరేజీలను ప్రధాన పాలసీకి జత చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే కాకుండా కంపెనీకి దేశవ్యాప్తంగా విస్తృత సంఖ్యలో శాఖలు కూడా ఉన్నాయి. సమీపంలోని శాఖకు వెళ్లి కూడా పాలసీ తీసుకోవచ్చు. క్లెయిమ్ ప్రక్రియ... దేశవ్యాప్తంగా 8,300 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో లేదా సమీపంలోని శాఖకు వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అయితే ‘ఇన్సూర్యాప్’ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. లైవ్ వీడియో స్ట్రీమింగ్ సదుపాయం ‘ఇన్స్టాస్పెక్ట్’ ఈ యాప్‌లో ఉంటుంది. దీని ద్వారా క్లెయిమ్‌ను నమోదు చేసుకోవడం ద్వారా సర్వేయర్ నుంచి వేగంగా క్లెయిమ్‌కు అనుమతి పొందొచ్చు. అవసరమైన పత్రాలను కూడా యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉచితంగా మీ నుంచి వాహనాన్ని స్వీకరించి గ్యారేజీకి తీసుకెళ్లే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. సమీపంలో ఉన్న కంపెనీ నెట్వర్క్ గ్యారేజ్‌కు తీసుకెళ్లి రీపెయిర్ చేసి వాహనదారుడికి తిరిగి అందిస్తారు. 2018–19 సంవత్సరంలో క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి 98.8 శాతంగా ఉందని కంపెనీ సమాచారం తెలియజేస్తోంది. 24 గంటల పాటు కస్టమర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎంపిక ఏది..? ► ఆన్లైన్లో డిజిటల్ పాలసీలు తీసుకోవడం ద్వారా ప్రీమియం రూపంలో భారీ ఆదా చేసుకోవచ్చు. అమేజాన్ కస్టమర్లు అకో నుంచి ఇంకా చౌకకే పాలసీ పొందే అవకాశం ఉంది. ► గో డిజిట్లో యాడాన్ కవరేజీలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. థర్డ్ పార్టీ స్టాండలోన్ కవరేజీ కూడా ఉంది. కానీ, అకో వద్ద ఇవి లేవు. ► అకో, గో డిజిట్ చెల్లింపుల రేషియో 99 శాతం దగ్గరగానే ఉండడం గమనార్హం. ► ముఖ్యంగా పాలసీ కొనుగోలు చేసే ముందు, ఆయా సంస్థ ఆఫర్ చేస్తున్న నెట్వర్క్ గ్యారేజీలు మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయా..? అన్నది గమనించాలి. ► అదే ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి అయితే ప్రీమియం ఎక్కువ. కానీ, నెట్వర్క్ గ్యారేజీలు విస్తృతంగా ఉన్నాయి. ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్లైన్లోనూ పాలసీ, క్లెయిమ్‌లకు అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ సౌకర్యంగా అనిపించని వారికి అనుకూలం. ► ఒక నిర్ణయానికి ముందు నిపుణుల సలహా మంచిది. ప్రీమియం అంతరాన్ని పరిశీలిస్తే... రెండు సంవత్సరాల వయసున్న మారుతి సుజుకీ బాలెనో, ఐడీవీ విలువ రూ.5.03 లక్షలకు సమగ్ర కవరేజీతో (వ్యక్తిగత ప్రమాద బీమాతో కూడిన) ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి పాలసీ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,604. ఇందులో రోడ్డు సైడ్ అసిస్టెన్స్కు రూ.199 కూడా కలిసి ఉంది. అదే గో డిజిట్లో అయితే ఇదే వాహనానికి ప్రీమియం రూ.11,015, అకోలో రూ.9,276గా ఉన్నాయి. -
వరదల సమయంలో వాహనానికి రక్షణ..
మన దేశంలోని చాలా పట్టణాల్లో గట్టిగా వర్షం పడితే వరద పారే పరిస్థితి కనిపిస్తుంది. ఆయా సందర్భాల్లో వాహన నష్టాలను ఎదుర్కోవడం కీలకం. ఈ ఏడాది ముంబై నగరంలో 48 గంటల్లోనే 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్డు పక్కన, ఫ్లైవోవర్ల కింద కార్లు నిలిచిపోయాయి. యజమానులు వాటిని విడిచిపెట్టేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాహనాన్ని, మరీ ముఖ్యంగా కారును వరద నీటిలో నడపడం పూర్తిగా సురక్షితం కాదు. ఎప్పుడు నీటి పరిమాణం పెరిగిపోతుందో, సెంట్రల్ డోర్ లాక్ సిస్టమ్ జామ్ అయిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో మీరు, మీతోపాటు కారులో ఉన్న వారు లోపల చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముంబై, ఇతర ప్రాంతాల్లో వర్షపు నీరు కారణంగా వాహనాలకు నష్టం వాటిల్లడంతో, మోటారు బీమా క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది మోటారు ఇంజన్లు దెబ్బతిన్నట్టు, అందుకు సంబంధించి కొన్ని అధిక క్లెయిమ్‌లు వచ్చాయి. అయితే, మోటారు ఇన్సూరెన్స్ పాలసీలో ఇంజిన్‌కు వాటిల్లే నష్టానికి రక్షణ ఉండదు. కనుక వరద నీటిలోనూ మీకు, మీ కారుకు రక్షణ ఉండేలా అదనపు కవరేజీ తీసుకోవాలి. మనుషులకు, వాహనాలకు సమస్యలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఇవి... ► వరదల సమయంలో కారులో ఉండిపోవడం సురక్షితం కాదు. వర్షపు నీటిలో కారును నడుపుతుంటే, విండో అద్దాలను కిందకు దించేసి, డోర్లను అన్‌లాక్ చేసి ఉంచాలి. దీంతో బయట వర్షపునీటి స్థాయి పెరుగుతుంటే ఆ విషయం తెలుస్తుంది. నీటి పరిమాణం పెరిగిపోతుంటే కారు నుంచి దిగిపోయి ఎత్తయిన ప్రదేశానికి చేరుకోవాలి. ఎందుకంటే మనిషి ప్రాణమే విలువైనది. ► బురద నీటిలో కారు ఎంత మేర మునిగిపోయిందో చూడాలి. కారు డోర్ల స్థాయి నుంచి నీరు పెరగకపోతే అప్పుడు కారుకు పెద్దగా నష్టం వాటిల్లనట్టే. డ్యాష్‌బోర్డు స్థాయికి వర్షపునీరు చేరుతుంటే వెంటనే బీమా సంస్థకు లేదా సర్వీసింగ్ యూనిట్‌కు కాల్ చేసి వారు చెప్పినట్టు చేయాలి. ► ఫ్యూయల్ వ్యవస్థను పరిశీలించాలి. పాత కార్లు అయితే వాటి నుంచి ఇంధనం తొలగించడం అవసరం. బ్రేక్, క్లచ్, పవర్ స్టీరింగ్, కూలంట్లు మార్చాల్సి వస్తుంది. ► వరద నీటిలో కారు కొంత సమయం పాటు నిలిచిపోయిన తర్వాత ఇంజిన్‌ను ఆన్ చేయవచ్చు. ముఖ్యంగా కారు పూర్తిగా మునిగిపోయిన సమయంలో ఈ పని చేయకూడదు. ఆన్ చేస్తే ఇంజిన్‌లోని భాగాల్లోకి నీరు చేరిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఇంజిన్‌లోని భాగాలు దెబ్బతింటాయి. దెబ్బతిన్న ఇంజిన్‌ను బాగు చేసేందుకు మోడల్‌ను బట్టి ఖర్చు మారుతుంది. ► వీలైతే కొన్ని రోజుల వరకు కారును స్టార్ట్ చేయకుండా వేచి చూడడం మంచిది. ఎందుకంటే కారులోని ఎయిర్‌డక్టుల్లో నీటి ఆవిరి మిగిలి ఉంటే ఆన్ చేయడం వల్ల ఇంజన్ దెబ్బతింటుంది. ► షార్ట్ సర్క్యూట్ అవకుండా బ్యాటరీని తొలగించాలి. బ్యాటరీని తిరిగి కనెక్ట్ చేస్తున్నట్టు అయితే, ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. హార్న్, హెడ్లైట్లు, ఇండికేటర్లు, ఎయిర్ కండిషనింగ్, స్టీరియో, పవర్‌లాక్‌లు, ఇంటీరియర్ లైట్లను తనిఖీ చేయాలి. ఎక్కడైనా ఫ్లిక్కరింగ్‌ను గుర్తించినట్టయితే మెకానిక్కు కాల్ చేయాలి. ► మీ కారును సమీపంలోని గ్యారేజ్ లేదా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి పూర్తి తనిఖీ చేయించేందుకు గాను టౌసర్వీస్కు కాల్ చేయాలి. టౌవ్యాను వచ్చే లోపు కారులోపల తడి ఉంటే, వస్త్రంతో తొలగించేందుకు ప్రయత్నించాలి. ఉప్పు నీటిలో కారు మునిగిపోయి ఉంటే నష్టం ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. ► సమగ్ర మోటారు వాహన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. తగిన యాడాన్ కవరేజీ తీసుకోవాలి. దాంతో ఆర్థిక భారం తగ్గిపోతుంది. కారుకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అధిక శాతం బీమా కంపెనీయే చెల్లిస్తుంది. కనుక మీ జేబుపై భారం తగ్గుతుంది. పాలసీ తీసుకునే ముందు పత్రాలను క్షుణంగా చదవడం ద్వారా మంచి డీల్ అవునో, కాదో తెలుస్తుంది. మోటారు ఇన్సూరెన్స్ పాలసీలో ఇంజిన్‌కు వాటిల్లే నష్టానికి రక్షణ ఉండదు డ్యాష్‌బోర్డు స్థాయికి వర్షపునీరు చేరుతుంటే సర్వీసింగ్ యూనిట్‌కు కాల్ చేయాలి సంజయ్‌దత్తా అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ చీఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ -
వాహన బీమా పాలసీ రేట్లు భారీ పెంపు
థర్డ్ పార్టీ ప్రీమియంను 41 శాతం పెంచుతూ ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ముంబై: వాహన బీమా థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లను 41 శాతం వరకు పెంచుతూ ఐఆర్డీఏఐ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక లీటర్‌కు మించి ఒకటిన్నర లీటర్ ఇంజన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు థర్డ్ పార్టీ ప్రీమియం ప్రస్తుతం రూ.2,237 ఉండగా తాజా పెంపుతో అది రూ.3,132కు పెరగనుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్డీఏ తెలిపింది. ఒక లీటర్ ఇంజన్ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు పెంపు వర్తించదు. ప్రైవేటు నాలుగు చక్రాల వాహనాలు 1,500 సీసీ సామర్థ్యం కంటే అధికంగా ఉన్న వాటికి ప్రీమియం రూ.6,164 ఉండగా, తాజా పెంపుతో రూ.8,630 కానుంది. రూ.7,500 కిలోల కంటే అధిక లోడ్ సామర్థ్యం గల వాణిజ్య వాహనాలకు ప్రీమియం తగ్గుతుంది. 75 సీసీ వరకు గల ద్విచక్ర వాహనాలకు పెంపు లేదు. ఆపై 150 సీసీ వరకు ఉన్న వాటికి ప్రీమియం రూ.619 నుంచి 720కి పెరుగుతోంది. ఆపై 350 సీసీ వరకు గల వాహనాలకు రూ.970, అంతకు మించితే రూ.1,114 ప్రీమియం ఉంటుంది. త్రిచక్ర వాహనాలకు ప్రీమియం రూ.4,200 నుంచి రూ.5,680కి పెరగనుంది. -
బీమా ఉంటే ధీమాగా ప్రయాణించొచ్చు!
ఉమెన్ ఫైనాన్స్ / వాహన బీమా పాలసీ ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటే, మరికొంతమంది స్వయం ఉపాధి మార్గాలలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి వాహనాలను కూడా విరివిగా వాడుతున్నారు. ఇంటిలో ఉండే హౌస్‌వైఫ్‌లు కూడా తమ పిల్లలను స్కూళ్లకు, ఇతర తరగతులకు పంపడానికి అలాగే తమ ఇంటి అవసరాలకు వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలను నడిపేటప్పుడు రోడ్డు భద్రత, స్వీయభద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1985 ప్రకారం ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి కనుక తీసుకుంటారు కానీ దాని గురించి ఏమీ తెలుసుకోరు. మరికొంతమంది ద్విచక్ర వాహనాలకు అసలు ఇన్సూరెన్స్ తీసుకోరు. ఈ ఇన్సూరెన్స్‌లో వేటివేటికి కవరేజి ఉంటుంది, ఎలా పనిచేస్తుందో చూద్దాం. సాధారణంగా రెండు రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అవి 1. లయబిలిటీ పాలసీ, రెండు ప్యాకేజీ పాలసీ 1. లయబిలిటీ పాలసీ: ఇది మీరు వినియోగిస్తున్న వాహనం వల్ల వేరే వ్యక్తులకు గాని, వారి ఆస్తులకు గాని ఏమైనా నష్టం వాటిల్లితే ఈ పాలసీ ద్వారా వారికి నష్టపరిహారం అందుతుంది. ఈ పాలసీ మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా తీసుకోవలసినది. 2. ప్యాకేజీ పాలసీ: ఈ పాలసీలో లయబిలిటీ రిస్క్తోబాటు ఇన్సూరెన్స్ తీసుకున్న వాహనానికి డ్యామేజీ జరిగినా వాహనం నడిపేవారికి పర్సనల్ యాక్సిడెంట్ జరిగినా కవరేజీ లభిస్తుంది. మోటార్ పాలసీలో ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఐ.డి.వి (ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వ్యాల్యూ) నిర్ణయిస్తారు. ఈ ఐడీవీని వెహికిల్ తయారీదారు విక్రయించిన ధర, దాని మోడల్, తయారు చేసిన సంవత్సరం తదితరాల ఆధారంగా తరుగుదలను తీసివేసి లెక్కకడతారు. ఒకవేళ వెహికిల్ మోడల్ తయారీని నిలిపి వేస్తే, ఐడీవీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ, ఇన్సూరెన్స్ చేయించుకునేవారు వారి నియమ నిబంధనల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకోవలసి ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ద్విచక్ర వాహనాలకు ఒక సంవత్సరానికి మాత్రమే కాకుండా రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకేసారి ఇన్సూరెన్స్‌ని అందజేస్తున్నారు. వీటివల్ల ప్రతి సంవత్సరం గుర్తుంచుకుని రెన్యూ చేయవలసిన పని ఉండదు. అలాగే టారిఫ్ రేట్స్, టాక్స్ పెరిగినా వాటి భారం తగ్గుతుంది. మనిషి జీవితం ఎంతో విలువైనది. మీరు వినియోగించే వాహనం ద్వారా వేరేవారికి నష్టం వాటిల్లితే లేదా మరణం సంభవిస్తే ఆ కుటుంబానికి ఆ లోటును మీరు ఎప్పటికీ భర్తీ చేయలేరు. కాని కొంతలో కొంత వారికి జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసే ఒక సదుపాయమే ఈ ఇన్సూరెన్స్. కనుక తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకుని సేఫ్టీగా ప్రయాణిస్తూ మీ విధులను నిర్వహించండి. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
మీకు ‘ఈ-వాహన బీమా’ ఉందా?
ఇక డిజిటల్ రూపంలోనే వాహన బీమా పాలసీ ⇒ గతనెల నుంచే తొలిసారి అమల్లోకి తెచ్చిన తెలంగాణ ⇒ వచ్చే ఏడాదికల్లా మిగిలిన రాష్ట్రాలూ చేయాలన్న ఐఆర్డీఏ ⇒ డిజిటల్ కాపీని మొబైల్లో స్టోర్ చేసుకుంటే చాలు ⇒ ట్రాఫిక్ పోలీసులు అడిగితే మొబైల్లోనే చూపించొచ్చు ⇒ వారు ధ్రువీకరించుకోవటానికి వీలుగా దాన్లోనే క్యూ.ఆర్. కోడ్ ⇒ అంతటా అమల్లోకి వస్తే బీమా ప్రీమియంలోనూ తగ్గుదల సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం: స్నేహితుడిని ఆసుపత్రిలో చేర్చటంతో సుధీర్ హడావుడిగా తన కార్లో బయల్దేరాడు. దార్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్న పోలీసులు సుధీర్ వాహనాన్ని కూడా ఆపారు. డ్రైవింగ్ లెసైన్స్.. ఆర్సీ రెండూ చూపించటంతో పోలీసులు ఇన్సూరెన్స్ పత్రాలడిగారు. సుధీర్ ఈ ఏడాది వాహన బీమా రెన్యువల్ చేయించాడు గానీ... ఆ పత్రాల్ని కార్లో ఉంచుకోవటం మర్చిపోయాడు. అంతే! కారు ఆపి కిందికి దిగాల్సిందిగా పోలీసులు చెప్పారు. ఇంటికి ఫోన్‌చేసి మొబైల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా తెప్పించుకుంటానని, చూపిస్తానని సుధీర్ చెప్పినా వాళ్లు వినలేదు. తమకు ఒరిజినల్ బీమా పాలసీ పత్రాన్ని చూపించాలని, జిరాక్స్ కూడా పనికిరాదని కచ్చితంగా చెప్పేశారు. అసలే అర్జంటుగా వెళదామనుకున్న సుధీర్‌కు ఈ సంఘటన చాలా చికాకు తెప్పించింది. చివరకు పోలీసులు చెప్పిన జరిమానా చెల్లించి బతుకు జీవుడా... అనుకుంటూ బయటపడ్డాడు. అదండీ సుధీర్ కథ. అయినా సుధీర్ ఒక్కడికే కాదు. మనలో చాలామందికి ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటాయి. అయితే ఫైన్ చెల్లించటమో... లేకపోతే పోలీసుల్ని బతిమాలుకొని వారికే ఎంతో కొంత చెల్లించటమో చేసి ఉంటాం. అయినా! బీమా పాలసీ లేనివారైతే ఇలాంటివి చెయ్యొచ్చు. ఉండి కూడా కేవలం ఆ సమయానికి తన వద్ద ఉంచుకోకపోవటం వల్ల జరిమానా కట్టడమంటే చాలా ఇబ్బందే. అందుకే..!! ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఎదురు కాకుండా ఉండేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) కొత్తగా డిజిటల్ రూపంలో ఉండే ‘ఈ-వాహన బీమా’ పాలసీలను అమల్లోకి తెచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే... గతనెల 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ-వాహన బీమా పాలసీల్ని మొట్టమొదట జారీ చేసింది, గుర్తిస్తున్నది తెలంగాణ రాష్ట్రం కావటం. ప్రస్తుతానికి ఈ రాష్ట్రం ఒక్కటే వీటిని జారీ చేయటం, గుర్తించటం చేస్తుండగా... 2017 నాటికి అన్ని రాష్ట్రాలూ తెలంగాణను అనుసరించాలని ఐఆర్డీఏ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ఈ-వాహన బీమా అర్థమేంటి? 1988 నాటి మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికీ కనీసం థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా ఉండి తీరాలి. థర్డ్ పార్టీ పాలసీ అంటే... మీ వాహనం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినపుడు మీ వల్ల ఎదుటి వాహ నానికో, వ్యక్తులకో ప్రమాదం జరగొచ్చు. అపుడు ఆ వాహనానికో, వ్యక్తులకో అయ్యే ఖర్చు మీరు భరించలేని పరిస్థితి ఉండొచ్చు. దాన్ని థర్డ్ పార్టీ పాలసీ జారీ చేసిన బీమా కంపెనీ చెల్లిస్తుందన్న మాట. మీరు డ్రైవింగ్ చేస్తూ ఏదైనా చెట్టుకో, మరోదానికో యాక్సిడెంట్ చేసినా, లేక మీ వాహనంలోని భాగాలో, వాహనమో దొంగతనానికి గురైనా ఈ థర్డ్ పార్టీ బీమా వర్తించదు. అలాంటివాటికి కూడా కవరేజీ ఉండాలంటే సమగ్ర (కాంప్రిహెన్సివ్) పాలసీ ఉండాలి. ఇపుడు దీన్ని కూడా ఐఆర్డీఏ తప్పనిసరి చేసింది. నిజానికి చట్టం ప్రకారం బీమా తప్పనిసరి. అయినా సరే తీసుకుంటున్న వారు మాత్రం తక్కువే ఉంటున్నారన్నది ఐఆర్డీఏ ఉద్దేశం. ‘‘ఇటీవల భారత బీమా సమాచార బ్యూరో (ఐఐబీ), బీమా పరిశ్రమ కలసి ఓ సర్వే చేశాయి. దీని ప్రకారం 45-55 శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉంది. ప్రయివేటు కార్లలో 50 శాతం వరకూ మొదటి ఏడాది తరవాత బీమా చేయించటం లేదు. చట్టప్రకారం బీమా లేని వాహనాలు రోడ్లపై తిరక్కూడదు. కానీ కొన్ని అక్రమ మార్గాల వల్ల, బీమా తేదీల్ని మార్చి ఫోర్జరీ చేసిన పత్రాలను పోలీసులకు చూపించటం వల్ల ఇలాంటి వాహనాలు స్వేచ్ఛగా రోడ్లపై తిరగ్గలుగుతున్నాయి. వీటిని పట్టుకోవటానికి పోలీసుల దగ్గర కూడా తగిన యంత్రాంగం లేదు’’ అని కామ్స్.. రిపాజిటరీ సర్వీసెస్ సీఈఓ ఎస్.వి.రమణన్ చెప్పారు. బీమా రిపాజిటరీ సర్వీసులంటే పాలసీదారుల పేరిట ఈ-ఖాతాలు తెరిచి అన్ని పాలసీలనూ డిజిటలైజ్ చేసి భద్రంగా దాచే సంస్థలు, ఖాతాదారులు కూడా ఆన్లైన్లో వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి తెలంగాణలో మాత్రమే! గత నెల 2 నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే ఈ-వాహన బీమా పాలసీలను తెలంగాణ రాష్ట్రంలో బీమా కంపెనీలు అమల్లోకి తెచ్చాయి. ప్రస్తుతానికి వీటిని గుర్తిస్తున్నది తెలంగాణ ఒక్కటే. దీనివల్ల స్మార్ట్ఫోన్లలో సాఫ్ట్ కాపీ ఉంటే చాలు. పోలీసులు ఒకవేళ బీమా పాలసీ అడిగితే దాన్ని చూపించాలి. అవసరమనుకుంటే వాళ్లే క్యు.ఆర్. కోడ్ ద్వారా ధ్రువీకరణ చేసుకుంటారు. ‘‘ప్రత్యేకించి తెలంగాణలో ఇకపై కొత్త పాలసీలకు గానీ, రెన్యువల్ చేసుకున్న పాత పాలసీలకు గానీ డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో జారీ చేస్తాం. పాలసీదారుకు భౌతికంగా పాలసీ డాక్యుమెంట్లను పంపటంతో పాటు తన మెయిల్ ఐడీకి పీడీఎఫ్ ఫార్మాట్లో డిజిటల్ కాపీనీ పంపిస్తాం. ధ్రువీకరణకు వీలుగా వాటిపై క్యు.ఆర్. కోడ్ కూడా ఉంటుంది’’ అని రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సీఐఓ టి.ఎం.శ్యాంసుందర్ చెప్పారు. ‘‘ఒకవేళ ఈ-బీమా ఖాతా ఉన్నట్లయితే అన్ని పాలసీలూ అందులోనే స్టోర్ అయి ఉంటాయి. అయితే ఇందుకు ఇన్సూరెన్స్ రిపాజిటరీలతో సదరు బీమా సంస్థ ఒప్పందం చేసుకుని ఉండాలి. ఇలాంటి ఖాతా ఉన్నవారికి బీమా కంపెనీలు భౌతిక పాలసీలను పంపించవు’’ అని ఆయన వివరించారు. మిగతా రాష్ట్రాలింకా దీన్ని అమల్లోకి తేలేదు కనక తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేటపుడు తప్పనిసరిగా భౌతిక రూపంలో పాలసీలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఈ-వాహన బీమా పనిచేసేదిలా... ♦ కొత్త పాలసీ తీసుకున్నా, పాత బీమా పాలసీని రెన్యువల్ చేయించుకున్నా కంపెనీలు పాలసీదారు మెయిల్‌కు పీడీఎఫ్ రూపంలో ఒక పాలసీని పంపిస్తాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్లో స్టోర్ చేసుకుంటే చాలు. ♦ ఎక్కడైనా పోలీసులు ఆపి బీమా పత్రాలను చూపించమని అడిగినపుడు మొబైల్లో స్టోర్ చేసిన డిజిటల్ పాలసీని చూపించాల్సి ఉంటుంది. ఆ పాలసీపై ఉన్న క్విక్ రెస్పాన్స్ (క్యు.ఆర్.) కోడ్‌ను పోలీసులు తమ మొబైల్ ఫోన్ ద్వారా కూడా స్కాన్ చేస్తారు. ♦ ఇపుడు క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసే సాఫ్ట్వేర్ అప్లికేషన్లు చాలా వచ్చాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారైతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ ఫోన్లు వాడేవారైతే యాపిల్ స్టోర్ నుంచి వీటిని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ♦ పోలీసులు ఈ క్యు.ఆర్. కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే మొబైల్ తెరపై ఆ పాలసీకి సంబంధించిన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆ పాలసీ ఎప్పటిదాకా అమల్లో ఉంటుంది? పాలసీదారు పేరు... అది అసలైనదా? నకిలీదా? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ♦ ఈ వివరాలన్నీ నిజానికి బీమా సమాచార బ్యూరో డేటా బేస్ నుంచి గానీ, బీమా కంపెనీ డాటాబేస్ నుంచి గానీ వివరాలన్నీ మొబైల్ తెరపై ప్రత్యక్షమవుతాయి. ఈ క్యూ.ఆర్. కోడ్ ను స్కాన్ చేసే అప్లికేషన్లను మొబైల్ ఫోన్లలోకి సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులందరూ తమ మొబైల్ ఫోన్లలో వీటిని డౌన్లోడ్ చేసుకున్నారు కూడా’’ అని రమణన్ చెప్పారు. ♦ వాటి ఆధారంగా పోలీసులు ఆ పాలసీ సరైనదో కాదో అక్కడికక్కడే ఆన్లైన్లోనే పరిశీలించి ధ్రువీకరించుకునే వీలుంటుంది. డిజిటల్ పాలసీ లాభాలివీ... ♦ వాహనదారులు పాలసీ పత్రాన్ని స్టోర్ చేసుకున్న మొబైల్‌ను వెంట తీసుకెళితే చాలు. ♦ అధికారులు వాహనాల్ని ఆపితే... బీమా పత్రాల్ని ఎక్కడికక్కడ పరిశీలించి ధ్రువీకరించుకోవచ్చు. ♦ డిజిటల్ పాలసీ వల్ల పాలసీదారులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ తగ్గుదల థర్డ్ పార్టీ పాలసీల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటి ప్రీమియంను ఏటా ఐఆర్డీఏ నిర్ణయిస్తూ ఉంటుంది. ♦ కాంప్రిహెన్సివ్ పాలసీల రేట్లను బీమా కంపెనీలే నిర్ణయిస్తాయి. డిజిటల్ వల్ల ఖర్చులు తగ్గుతాయి కనుక ఆ తగ్గుదలను పాలసీదారులకు బదలాయించే అవకాశం ఉంది. ♦ ప్రస్తుతం బీమా సంస్థలు డిజిటల్‌తో పాటు భౌతిక పాలసీలనూ జారీ చేయాల్సి వస్తోంది కనుక కంపెనీలకు ఖర్చుల్లో తగ్గుదల ఉండదు. మున్ముందు అన్ని రాష్ట్రాలూ దీన్ని అమల్లోకి తెచ్చి... డిజిటల్‌ను మాత్రమే తప్పనిసరి చేస్తే తగ్గుదల ప్రయోజనం అందుతుంది. ఐఆర్డీఏ ఉత్తర్వుల్లో ఏముంది? 2015 డిసెంబర్ 1 తరవాత జారీ చేసిన వాహన బీమా పాలసీలన్నిటికీ క్యూ.ఆర్. కోడ్ తప్పనిసరిగా ఉండాలని, పాలసీ అధికారికమైనదో, కాదో ధ్రువీకరించుకోవటానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందని ఐఆర్డీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనివల్ల ఎక్కువ మంది వాహన బీమా పాలసీలు తీసుకుంటారని, అవినీతి కూడా తగ్గుతుందని బీమా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భౌతికంగా పాలసీలున్న వారందరికీ క్యూ.ఆర్. కోడ్ ఉన్న డిజిటల్ పాలసీలు జారీ చేయాలని బీమా కంపెనీలకు కూడా సూచించినట్లు ఐఆర్డీఏ తెలిపింది.