డిజిటల్‌ పాలసీ ఎంతో చౌక | Details of Digital Vehicle Insurance Policy | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ పాలసీ ఎంతో చౌక

Published Mon, Mar 2 2020 4:38 AM | Last Updated on Mon, Mar 2 2020 5:15 AM

Details of Digital Vehicle Insurance Policy - Sakshi

వాహనానికి బీమా తీసుకోవడం నిబంధనల రీత్యా తప్పనిసరి. ఏటేటా వాహన ప్రీమియం ఖరీదయిపోతోంది. ఈ క్రమంలో ప్రీమియం భారం కాస్త తగ్గించుకునేందుకు డిజిటల్‌ పాలసీలపై దృష్టి సారించొచ్చు. ఆన్‌లైన్‌లోనే సేవలతో దూసుకుపోతున్న అకో, గో డిజిట్‌ సంస్థలు పోటా పోటీగా మంచి ఫీచర్లతో పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో యువతలో ఈ బీమా సంస్థలకు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పెరిగింది. కొనుగోలు ఎంతో సులభం కావడం, ప్రీమియం తక్కువగా ఉండడం వారికి ఎంతో సౌకర్యాన్నిస్తున్నాయి. అకో, గో డిజిట్‌ సంస్థలు నూరు శాతం ఆన్‌లైన్‌ కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. భౌతికంగా వీటికి శాఖలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వీటికి పరిపాలన, నిర్వహణ చార్జీలు ఇతర ప్రధాన బీమా సంస్థలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.

కనుక ఈ సంస్థలు 20–30 శాతం తక్కువ ప్రీమియానికే మోటార్‌ పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు మోటారు ఇన్సూరెన్స్‌ మార్కెట్లో ప్రస్తుతానికి 3–4 శాతం వాటా ఉంది. కానీ, ఇతర సంస్థలతో పోలిస్తే ఇవి ఎంతో వేగంగా తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నాయి. పాలసీ రెన్యువల్‌ చేసుకునే సమయం వస్తే, ఈ సంస్థలను ఆశ్రయించొచ్చా..? ఈ ప్రశ్న మీకు ఎదురైతే.. సమాధానం వెతుక్కునేందుకు ఇక్కడున్న వివరాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిందే. మోటారు ఇన్సూరెన్స్‌లో అతిపెద్ద సంస్థగా ఉన్న ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్, అకో, గో డిజిట్‌ సంస్థల మధ్య కొన్ని సేవల పరంగా అంతరాన్ని పరిశీలించొచ్చు..

అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌
సాధారణ బీమా వ్యాపార కంపెనీ అయిన అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌ 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. మోటార్, హెల్త్, మొబైల్, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను ఈ సంస్థ అందిస్తోంది. అమెజాన్, కేటమరాన్‌ వెంచర్స్, సైఫ్‌ పార్ట్‌నర్స్‌ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థ అందించే మోటార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో.. రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, ప్రకృతి విపత్తుల కారణంగా సొంత వాహనానికి, మూడో పార్టీ వాహనానికి నష్టం జరిగితే కవరేజీ ఉంటుంది. వాహనం చోరీకి గురైనా బీమా లభిస్తుంది. అలాగే, వాహనదారుడికి వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. జీరో డిప్రీసియేషన్‌ను యాడాన్‌ కవర్‌గా తీసుకోవచ్చు. అంటే వాహనంలోని రబ్బర్, ప్లాస్టిక్‌ తదితర కొన్ని విడిభాగాలకు నష్టం జరిగితే బీమా సంస్థ వాస్తవ విలువలో నిర్ణీత శాతమే పరిహారం చెల్లిస్తుంది. జీరో డిప్రీషియేషన్‌ కవర్‌ తీసుకుంటే 100 శాతం విలువను పరిహారంగా చెల్లిస్తుంది.

వీటికి పరిహారం రాదు...  
ఈ పాలసీలో నిబంధనలు ఇతర మోటారు పాలసీల్లో మాదిరే ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే లేదా కారణమైతే, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదం బారిన పడితే అందుకు జరిగే నష్టానికి కంపెనీ రూపాయి కూడా చెల్లించదు. అలాగే, ప్రమాదం వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల వాహనానికి నష్టం జరిగినా పరిహారం రాదు.  

కొనుగోలు ఇలా...
ఆన్‌లైన్‌ పోర్టల్‌ అకో డాట్‌ కామ్‌కు వెళ్లి మీ కారు నంబర్‌ లేదా బ్రాండ్‌ను ఎంపిక చేసుకుని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత, ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వ్యాల్యూ (ఐడీవీ)ను ఎంచుకోవాలి. తర్వాత ప్రీమియం చెల్లించిన నిమి షాల వ్యవధిలోనే పాలసీ ఈ మెయిల్‌కు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ కేవలం ఐదారు నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోతుంది.  
 
క్లెయిమ్‌ ప్రక్రియ సులభం...
ప్రమాదం కారణంగా వాహనానికి నష్టం జరిగితే దేశవ్యాప్తంగా 1,000కుపైగా గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు పొందొచ్చు. క్లెయిమ్‌ కోసం కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఉన్న వారికి రిపేర్‌ కోసం వాహనాన్ని 60 నిమిషాల వ్యవధిలోనే పిక్‌ చేసుకుంటారు. కంపెనీ సర్వేయర్‌ వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. ఇతర పట్టణాల్లోని వారు తామే స్వయంగా వాహనాన్ని కంపెనీ నిర్దేశించిన గ్యారేజ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కారు ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, బీమా పాలసీ జిరాక్స్‌ కాపీ అవసరపడతాయి. క్లెయిమ్‌ను కంపెనీ ఆమోదిస్తే నగదు రహితంగా గ్యారేజ్‌లో రిపేర్‌ చేసి డెలివరీ చేస్తారు. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొత్తం క్లెయిమ్‌లలో 72.4 శాతం 15 రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి. 90 రోజుల వ్యవధిలో ఇది 99.5 శాతంగా ఉంది. వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటల పాటు కస్టమర్‌ సపోర్ట్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.  

 గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌
ఈ సంస్థ కూడా 2017లోనే ఆరంభమైంది. కార్లు, బైక్‌లు, సైకిళ్లు, ట్రావెల్, హోమ్, మొబైల్‌ ఫోన్లకు ఇన్సూరెన్స్‌ పాలసీలను ఆఫర్‌ చేస్తోంది. జీరో డిప్రీసియేషన్‌ కవర్, ఇంజన్‌ ప్రొటెక్షన్‌ కవర్, రిటర్న్‌ టూ ఇన్‌వాయిస్‌ కవరేజీలు ఇందులో ఉన్నాయి. థర్డ్‌ పార్టీ లయబిలిటీ కవర్‌ను కూడా విడిగా తీసుకోవచ్చు. అకో జనరల్‌ ఇన్సూరెన్స్‌ మాదిరిగానే సాధారణ మినహాయింపులు ఇందులోనూ ఉన్నాయి.  

కొనుగోలు...
కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి కారు లేదా బైక్‌ వీటిల్లో వాహనం ఏద న్నది ఎంచుకుని,బ్రాండ్, మోడల్‌ను సెలక్ట్‌ చేసిన తర్వాత, పూర్వపు బీమా సంస్థ వివరాలను ఇవ్వాలి. దాంతో ప్రీమియం ఎంతన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి.ప్రీమియం చెల్లించిన అనంతరం మెయిల్‌కు పాలసీ జారీ అయిపోతుంది.  

క్లెయిమ్‌ ప్రక్రియ...
దేశవ్యాప్తంగా 1,400 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి క్లెయిమ్‌ వివరాలను రికార్డ్‌ చేసుకోవాలి. దాంతో మీ మొబైల్‌కు స్వీయ తనిఖీ పత్రం లింక్‌ ద్వారా వస్తుంది. వాహనానికి నష్టం జరిగితే మొబైల్‌ ద్వారా ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఈ ఇమేజ్‌లను గో డిజిట్‌ టీమ్‌ పరిశీలించిన అనంతరం ఎంత మొత్తాన్ని క్లెయిమ్‌ చేయవచ్చన్న సమాచారాన్ని అందిస్తుంది. అవసరమైతే సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి వస్తుంది. అనంతరం నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్న గ్యారేజ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వాహనం మీ నుంచి పిక్‌ చేసుకుని, రీపెయిర్‌ తర్వాత తిరిగి అందించే సేవలను కూడా కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ పరిహారం చెల్లింపుల రేషియో 94.84 శాతం.  ద్విచక్ర వాహన క్లెయిమ్‌కు సగటున 11 రోజుల సమయం తీసుకుంటుంది.  

ఐసీఐసీఐ లాంబార్డ్‌
మోటారు వాహన పాలసీల విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ చాలా పెద్ద సంస్థ. కేవలం మోటారు పాలసీల నుంచే 2018–19లో ఈ సంస్థ రూ.6,400 కోట్ల ప్రీమియం రాబట్టింది. అకో జనరల్‌ రూ.75 కోట్ల ప్రీమియం పొందగా, గో డిజిట్‌ రూ.854 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించాయి. ఇతర సంస్థల మాదిరే ఐసీఐసీఐ లాంబార్డ్‌ మోటారు బీమాలోనూ అన్ని రకాల ఫీచర్లు, యాడాన్‌ కవరేజీలు అందుబాటులో ఉన్నాయి.  

కొనుగోలు...  
    కారు నంబర్‌ లేదా బ్రాండ్‌ పేరు, ఏ సంవత్సరం మోడల్‌ తదితర వివరాలను ఇవ్వడం ద్వారా ఐసీఐసీఐ లాంబర్డ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి మోటారు పాలసీ తీసుకోవచ్చు. అన్ని రకాల వాహన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాహనం వివరాలను పేర్కొన్న తర్వాత ప్రీమియం వివరాలు కనిపిస్తాయి. భిన్న ఫీచర్లతో తీసుకుంటే ప్రీమియం ఏ మేరకు అన్న వివరాలు కూడా కనిపిస్తాయి. నచ్చిన దానిని ఎంపిక చేసుకుని ప్రీమియం చెల్లించాలి. ఆ సమయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. జీరో డిప్రీసియేషన్, ఇంజన్‌ ప్రొటెక్షన్, కీ ప్రొటెక్ట్, కన్జ్యూమబుల్స్‌ కవరేజీలను ప్రధాన పాలసీకి జత చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే కాకుండా కంపెనీకి దేశవ్యాప్తంగా విస్తృత సంఖ్యలో శాఖలు కూడా ఉన్నాయి. సమీపంలోని శాఖకు వెళ్లి కూడా పాలసీ తీసుకోవచ్చు.  

క్లెయిమ్‌ ప్రక్రియ...
దేశవ్యాప్తంగా 8,300 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని శాఖకు వెళ్లి క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో అయితే ‘ఇన్సూర్‌యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. లైవ్‌ వీడియో స్ట్రీమింగ్‌ సదుపాయం ‘ఇన్‌స్టాస్పెక్ట్‌’ ఈ యాప్‌లో ఉంటుంది. దీని ద్వారా క్లెయిమ్‌ను నమోదు చేసుకోవడం ద్వారా సర్వేయర్‌ నుంచి వేగంగా క్లెయిమ్‌కు అనుమతి పొందొచ్చు. అవసరమైన పత్రాలను కూడా యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉచితంగా మీ నుంచి వాహనాన్ని స్వీకరించి గ్యారేజీకి తీసుకెళ్లే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. సమీపంలో ఉన్న కంపెనీ నెట్‌వర్క్‌ గ్యారేజ్‌కు తీసుకెళ్లి రీపెయిర్‌ చేసి వాహనదారుడికి తిరిగి అందిస్తారు. 2018–19 సంవత్సరంలో క్లెయిమ్‌ చెల్లింపుల నిష్పత్తి 98.8 శాతంగా ఉందని కంపెనీ సమాచారం తెలియజేస్తోంది. 24 గంటల పాటు కస్టమర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఎంపిక ఏది..?
► ఆన్‌లైన్లో డిజిటల్‌ పాలసీలు తీసుకోవడం ద్వారా ప్రీమియం రూపంలో భారీ ఆదా చేసుకోవచ్చు. అమేజాన్‌ కస్టమర్లు అకో నుంచి ఇంకా చౌకకే పాలసీ పొందే అవకాశం ఉంది.  
► గో డిజిట్‌లో యాడాన్‌ కవరేజీలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. థర్డ్‌ పార్టీ స్టాండలోన్‌ కవరేజీ కూడా ఉంది. కానీ, అకో వద్ద ఇవి లేవు.  
► అకో, గో డిజిట్‌ చెల్లింపుల రేషియో 99 శాతం దగ్గరగానే ఉండడం గమనార్హం.  

► ముఖ్యంగా పాలసీ కొనుగోలు చేసే ముందు, ఆయా సంస్థ ఆఫర్‌ చేస్తున్న నెట్‌వర్క్‌ గ్యారేజీలు మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయా..? అన్నది  గమనించాలి.  
► అదే ఐసీఐసీఐ లాంబార్డ్‌ నుంచి అయితే ప్రీమియం ఎక్కువ. కానీ, నెట్‌వర్క్‌ గ్యారేజీలు విస్తృతంగా ఉన్నాయి. ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్‌లైన్‌లోనూ పాలసీ, క్లెయిమ్‌లకు అవకాశం ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌ సౌకర్యంగా అనిపించని వారికి అనుకూలం.  
► ఒక నిర్ణయానికి ముందు నిపుణుల సలహా మంచిది.


ప్రీమియం అంతరాన్ని పరిశీలిస్తే...  
రెండు సంవత్సరాల వయసున్న మారుతి సుజుకీ బాలెనో, ఐడీవీ విలువ రూ.5.03 లక్షలకు సమగ్ర కవరేజీతో (వ్యక్తిగత ప్రమాద బీమాతో కూడిన) ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నుంచి పాలసీ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,604. ఇందులో రోడ్డు సైడ్‌ అసిస్టెన్స్‌కు రూ.199 కూడా కలిసి ఉంది. అదే గో డిజిట్‌లో అయితే ఇదే వాహనానికి ప్రీమియం రూ.11,015, అకోలో రూ.9,276గా ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement