MOTOR INSURANCE
-
(అ)సాధారణ బీమా
కోల్‌కతా: సాధారణ బీమా (జీవిత బీమా కాకుండా) రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని చూడనుంది. నియంత్రణపరమైన అనుకూల వాతావరణానికి తోడు, వినూత్నమైన ఉత్పత్తుల ఆవిష్కరణ వృద్ధిని నడిపిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు కల్పించడం, మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్ల సమీక్ష నిర్ణయాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ రానున్న సంవత్సరాల్లోనూ వృద్ధిని నడిపించనుంది. నాన్ మోటార్, పెట్ ఇన్సూరెన్స్, లయబిలిటీ, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ, హౌసింగ్ ఇన్సూరెన్స్ వంటి నాన్ హెల్త్ విభాగాల్లోనూ బీమా వ్యాప్తి గణనీయంగా పెరగనుంది’’అని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ రావు తెలిపారు. 14 శాతం మేర వృద్ధిని పరిశ్రమ అంచనా వేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, మోటార్ థర్డ్ పార్టీ రేట్ల విషయంలో పరిశ్రమకు సహకారం అవసరమన్నారు. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని తొలగిస్తే వాటి ధరలు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎక్కువ మందికి బీమా చేరువ అవుతుంది. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఐదేళ్లుగా ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. వీటిని తక్షణమే సవరించాల్సి ఉంది’’అని రావు వివరించారు. వ్యయాలను తగ్గించుకుని, అత్యవసర బీమా ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్స్ చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయన్నారు. అందరికీ అందుబాటు.. బీమాను అందుబాటు ధరలకు తీసుకురావాల్సిన అవసరాన్ని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుజ్ త్యాగి ప్రస్తావించారు. ‘‘ఉత్పత్తుల అభివృద్ధి, అండర్ రైటింగ్, కస్టమర్ సేవల్లో నూతనత్వం అన్నది బీమాను పౌరులకు మరింత చేరువ చేస్తుంది’’అని చెప్పారు. బీమా పరిశ్రమ పరిమాణాత్మక మార్పు వైపు అడుగులు వేస్తోందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తులను అందించడాన్ని ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పారామెట్రిక్ ఇన్సూరెన్స్‌తోపాటు సైబర్ ఇన్సూరెన్స్ సైతం ప్రాముఖ్యతను సంతరించుకోనున్నట్టు చెప్పారు. -
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఏ వాహనానికి ఎంతెంత?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) వివిధ రకాల వాహనాల థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి కేంద్రం కొత్త బేస్ ప్రీమియం రేట్లను ప్రతిపాదించింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐతో సంప్రదించిన మీదట 1,000 సీసీ సామర్థ్యం లోపు గల ప్రైవేట్ కార్లకు రూ. 2,094, 1000–1,500 సీసీ కార్లకు రూ. 3,416, అంతకు మించిన వాటికి రూ. 7,897 బేస్ ప్రీమియంను సూచించింది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పరిశ్రమ వర్గాలు 30 రోజుల్లోగా దీనిపై అభిప్రాయాలు చెప్పాలి. నోటిఫికేషన్ ప్రకారం.. 75 సీసీ లోపు సామర్ధ్యమున్న టూ–వీలర్లకు రేటు రూ. 538గాను, అంతకు మించి 350 సీసీ వరకు రూ. 714–2,804 శ్రేణిలోనూ బేస్ ప్రీమియం ఉండనుంది. గూడ్స్ రవాణా చేసే వాణిజ్య వాహనాలకు సంబంధించి (త్రిచక్ర వాహనాలు కాకుండా) 7,500 కేజీలలోపు వైతే రూ. 16,049, అది దాటి 40,000 కేజీలు.. అంతకు పైన వాటికి రూ. 27,186–44,242 శ్రేణిలో బేస్ ప్రీమియం రేటు ఉంటుంది. ఈ–కార్టులు మినహా మోటార్ త్రీ–వీలర్లకు బేస్ ప్రీమియంను రూ. 4,492గా ప్రతిపాదించారు. అటు ప్రైవేట్ ఈ–కార్ల విషయానికొస్తే.. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాటికి రూ. 1,780, అంతకు మించి 65 కేడబ్ల్యూ వరకు రూ. 2,904, దాన్ని దాటితే రూ. 6,712 గాను బేస్ ప్రీమియం ఉండనుంది. -
విపత్తుల్లోనూ బీమా ధీమా!
వరద నీటికి బెంగళూరులోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోవడం చూశాం. సంపన్నులు ఉండే ప్రాంతాలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్ల రూపాయలు పలికే ఖరీదైన విల్లాలు, కార్లు సగం మేర నీటిలో మునగడం కనిపించింది. ప్రకృతి విపత్తుల వల్ల ఆస్తులకు కలిగే నష్టాన్ని మనం అంచనా వేయలేం. కరోనా మహమ్మారి ఆరోగ్య బీమా ప్రాధాన్యతను తెలియజేసినట్టే.. బెంగళూరు వరదలు హోమ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యాన్ని గుర్తు చేశాయని చెప్పుకోవాలి. కొంచెం ప్రీమియంతోనే ఇలాంటి అనుకోని ఉపద్రవాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. మోటారు బీమా థర్డ్ పార్టీ కవరేజీకే పరిమితం కాకుండా సమగ్ర కవరేజీ తీసుకోవాలి. అలాగే, హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది. వీటి గురించి వివరించే కథనం ఇది... కాంప్రహెన్సివ్... మోటారు బీమా చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. సమగ్ర కవరేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, సొంత వాహనానికి నష్టం జరిగితే పరిహారం రావాలంటే సమగ్ర కవరేజీ ఉండాల్సిందే. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలు, తుఫానుల వల్ల తమ వాహనాలకు జరిగే నష్టానికి కాంప్రహెన్సివ్ పాలసీలోనే పరిహారం లభిస్తుంది. అలాగే, వాహనం చోరీ, ప్రమాదంలో నష్టం, అగ్ని ప్రమాదం వల్ల జరిగే నష్టానికి పరిహారం కోరొచ్చు. వరదల వల్ల కార్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కారు విలువ కూడా పడిపోతుంది. ఖరీదైన రీపేర్లు అవసరం పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రిపేర్ చేసినా దెబ్బతిన్న కారు బాగు కాకపోవచ్చు. సమగ్ర కారు బీమా ప్రీమియం కొంచెం ఎక్కువ ఉన్నా వెనుకాడొద్దని.. ఇలాంటి ఊహించని నష్టాలను గట్టెక్కడానికి ఎంతో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాంప్రహెన్సివ్ ప్లాన్లలో మళ్లీ ఇంజన్, గేర్ బాక్స్‌కు ఎక్కువ కంపెనీలు కవరేజీ ఇవ్వడం లేదు. ఇలాంటి సందర్భాల్లో విడిగా యాడాన్ కవరేజీలు తీసుకోవాల్సి వస్తుంది. ఆయా అంశాలపై నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజన్ ప్రొటెక్షన్ కవర్: కారు ఇంజన్ వాడకపోయినా పాడవుతుంది. వరద నీటి కారణంగానూ దెబ్బతింటుంది. ఇంజన్‌ను పూర్తిగా మార్చేయాలన్నా లేక ఇంజన్లో విడిభాగాలను మార్చాలన్నా అలాంటి సందర్భాల్లో ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ అక్కరకు వస్తుంది. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్: వరద నీరు కారణంగా రిపేర్ చేయడానికి వీలు లేకుండా కారు దెబ్బతింటే లేదా కారు చోరీకి గురైనా.. రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ ఉన్న వారు కారు కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని (బిల్లులో ఉన్న మేర) క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. జీరో డిప్రీసియేషన్ కవర్: వాడుకలో కాలం గడిచే కొద్దీ వాహనం, అందులోని విడిభాగాల విలువ తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుల నుంచి క్లెయిమ్ వస్తే, బీమా కంపెనీలు తరిగిపోయిన విలువ మినహాయించి, మిగిలిన మేరే చెల్లిస్తాయి. కానీ, జీరో డిప్రీసియేషన్ కవర్ తీసుకుంటే ఇలాంటి కోతలు ఏవీ లేకుండా బీమా సంస్థలు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇతర కవరేజీలు: లూబ్రికెంట్లు, గేర్‌బాక్స్, ఇంజన్ ఆయిల్, గ్రీజ్ తదితర వాటికి చెల్లింపులు చేసే కన్జ్యూమబుల్ కవర్, రోడ్డు సైడ్ అసిస్టెన్స్ అందించే కవర్ కూడా అందుబాటులో ఉన్నాయి. క్లెయిమ్ దాఖలు ఎలా... వరదల వల్ల కారు కానీ, ద్విచక్ర వాహనం కానీ నీటిలో మునిగిపోతే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా, స్టార్ట్ చేసినా కానీ, అవి ఆన్ కాకపోవచ్చు. కానీ, వాహనాన్ని కదిలించినట్టయితే మరింత నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. వాహనదారు చర్యలతో మరింత నష్టం జరిగితే బీమా సంస్థ నుంచి తిరస్కారం ఎదురుకావచ్చు. దీనికి బదులు బీమా సంస్థకు వాస్తవ సమాచారాన్ని తెలియజేయడమే మంచి నిర్ణయం అవుతుంది. తమ వాహనానికి జరిగిన నష్టాన్ని తేల్చాలని కోరొచ్చు. దాంతో బీమా సంస్థ సర్వేయర్‌ను, మెకానిక్‌ను సంఘటన స్థలానికి పంపిస్తుంది. వరదనీరు తగ్గిపోయిన తర్వాత వారు వచ్చి జరిగిన నష్టంపై అంచనాకు వస్తారు. లేదంటే వాహనాన్ని సమీపంలోని వర్క్‌షాప్‌కు తరలిస్తారు. అనంతరం ఇంజన్‌ను తనిఖీ చేయడం, ఇంజన్ ఫ్లషింగ్, క్లీనింగ్ చేయించొచ్చు. ఇంజన్‌కు జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి. లేదంటే నష్టాన్ని వాహనదారుడే మోయాల్సి వస్తుంది. అందుకనే వరద నీటిలో చిక్కుకున్న వాహనాన్ని స్టార్ట్ చేయడానికి బదులు టోయింగ్ వ్యాన్‌తో తరలించి, నష్టాన్ని మదింపు చేయించడమే సరైనది అవుతుంది. బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో జాప్యం లేకుండా జాగ్రత్తపడాలి. బెంగళూరులో వరదల వల్ల వస్తున్న క్లెయిమ్‌లలో 80 శాతం విడిభాగాలకు నష్టానికి సంబంధించినవి అయితే, మరో 20 శాతం పూర్తి డ్యామేజీ క్లెయిమ్‌లు ఉంటున్నట్టు బీమా సంస్థలు తెలిపాయి. హోమ్ ఇన్సూరెన్స్ సంగతేంటి? సొంతిల్లు పట్ల ఎంతో మమకారం ఉంటుంది. ఈ రోజుల్లో భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తే కానీ సొంతిల్లు సమకూరడం లేదు. అంతటి విలువైన ఇంటికి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ముంబై, చెన్నై, ఇప్పుడు బెంగళూరు నగరాలు వరద ముప్పును ఏ స్థాయిలో ఎదుర్కొన్నదీ చూశాం. కనుక విలువైన ఇంటికి, ఇంట్లోని విలువైన సామగ్రికి బీమా రక్షణ తీసుకోవడం ఎంతో లాభం. ఇంటి యజమానులే అని కాదు, అద్దెకు ఉన్న వారు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అద్దెకు ఉండే వారు ఇంట్లోని వాటికి మాత్రమే కవరేజీ తీసుకుంటే చాలు. అదే ఇంటి యజమాని అన్ని రకాల కవరేజీతో కూడిన కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా తాము నివసిస్తున్న ప్రాంతానికి ఉండే రిస్క్‌ల గురించి పూర్తి అవగాహనతో ఉంటే, ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తేల్చుకోవచ్చు. ప్రకృతి విపత్తులు (అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడడం) లేదా ప్రమాదవశాత్తూ వాటిల్లిన నష్టాలకు సైతం కవరేజీ లభిస్తుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వారికే ఇది అవసరం అనుకోవద్దు. ఎత్తయిన అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో ఉండేవారికీ హోమ్ ఇన్సూరెన్స్ ఎన్నో రూపాల్లో ఆదుకుంటుంది. ఇంటి విలువ, ఇంట్లోని వస్తువువల విలువ ఆధారంగానే ప్రీమియం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. ప్రయోజనాలు.. హోమ్ ఇన్సూరెన్స్ అంటే ఇంటి నిర్మాణానికి వాటిల్లే నష్టానికే పరిహారం అనుకోకండి. గ్యారేజ్, కాంపౌండ్, ఫెన్సింగ్‌కు నష్టం ఎదురైనా కవరేజీ లభిస్తుంది. బేస్ పాలసీలకి యాడాన్‌గా, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఇంట్లోని ఆభరణాలు, నగదుకు కూడా రక్షణనిచ్చే కవరేజీలు ఉన్నాయి. లేదంటే సమగ్ర బీమా ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీనివల్ల ఏ రూపంలో దేనికి నష్టం వాటిల్లినా పరిహారం అందుతుంది. ఇంట్లోని వస్తువులకు నష్టం జరిగితే, వాటి రీపేర్‌కు అయ్యేంత కాకుండా.. వాస్తవ విలువ మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా బీమా రక్షణ కల్పించుకోవడం ద్వారా భూకంపాలు, వరదల వంటి భారీ నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో దొంగలు పడి విలువైన సొత్తు ఎత్తుకుపోయినా, ఈ ప్లాన్‌లో కవరేజీ లభిస్తుంది. ముఖ్యంగా హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అందుబాటులోనే ఉంటుంది. రూ.2,000 ప్రీమియంకే కవరేజీనిచ్చే ప్లాన్లు కూడా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, దోపిడీల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల్లోని వారు భారీగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడదు. పైగా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీ ఇంటి కారణంగా ఎదురయ్యే న్యాయ వివాదాల్లోనూ రక్షణనిస్తుంది. ఎలా అంటే.. ఇంట్లో పనిచేసే వారు మరణించినా పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. అగ్ని ప్రమాదాల వల్ల ఇతర ప్రాపర్టీకి నష్టానికి కారణమైనా, అతిథులు కానీ, ఇతర వ్యక్తుల మరణానికి దారితీసినా కవరేజీ లభిస్తుంది. ఇవి గుర్తుంచుకోండి.. ► హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ఇంట్లో ఉన్న అన్నింటికీ ఆధారాలు ఉంచుకోవాలి. లేదంటే క్లెయిమ్ సమయంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ► అనధికారిక కట్టడం అయితే బీమా కవరేజీ ల భించదు. చట్టబద్ధమైన నిర్మాణాలు, చట్టపరమై న అనుమతులు ఉన్న వాటికే కవరేజీ లభిస్తుంది. ► ఇంట్లో అద్దెకు ఉండే వారు, తమ నివాసంలోని విలువైన అన్ని ఉత్పత్తులకు కవరేజీ తీసుకోవచ్చు. ► వరదల సమయంలో ఇంట్లోని ఎలక్ట్రిక్ ఉత్పత్తులన్నింటికీ కరెంట్ కరెక్షన్ తొలగించాలి (అన్ ప్లగ్ చేయాలి). ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌ను కూడా తొలగించాలి. ► వరద ముప్పు నుంచి తప్పించుకోవడానికి తమ వంతు ముందు జాగ్రత్తలూ తీసుకోవచ్చు. నిర్మా ణ సమయంలోనే ఇంటి బేస్మెంట్ను రోడ్డు నుంచి వీలైన మేర ఎత్తున నిర్మించుకోవాలి. ► సీవరేజీ పైపులకు చెక్ వాల్వులు ఏర్పాటు చేసుకోవాలి. వరదల సమయంలో బయటి నీరు సీవరేజీ పైపుల నుంచి మీ ఇంటిని ముంచెత్తకుండా చెక్‌వాల్వ్‌లు సాయపడతాయి. ► వరద నీరు ఇంట్లోకి చేరుతుందని గుర్తించిన వెంటనే విలువైన వస్తువులను ఎత్తయిన ప్రదేశానికి చేర్చాలి. లేదంటే దిగువ అంతస్తుల్లోని వారు ఎగువ అంతుస్తులోని వారి సాయం కోరి పై అంతస్తులకు తరలించాలి. ► ముఖ్యంగా కీలకమైన డాక్యుమెంట్లను, నగలను ముందుగా తీసేసి జాగ్రత్త పరుచుకోవాలి. ► కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు నిర్మాణం చేసుకున్న వారు మేడపైకి వాటిని తరలించొచ్చు. వరద నీరు మరింత పైకి చేరుతుందని తెలిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలి. ► వరద హెచ్చరిక వచ్చిన వెంటనే అమలు చేసే విధంగా ముందస్తు కార్యాచరణ దగ్గర ఉంచుకోవాలి. -
థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పైపైకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సవరించిన ధరల ప్రకారం.. 1,000 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ప్రైవేట్ కార్లకు ప్రీమియం రూ.2,094గా నిర్ణయించారు. 2019–20లో ఇది రూ.2,072 వసూలు చేశారు. 1,500 సీసీ వరకు రూ.3,416 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.3,221 వసూలు చేశారు. 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న కార్లకు ప్రీమియం రూ.7,897 నుంచి రూ.7,890కు వచ్చి చేరింది. 150–350 సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 ఉంది. ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు 30 కిలోవాట్ అవర్ లోపు రూ.1,780, అలాగే 30–65 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉంటే రూ.2,904 చెల్లించాలి. ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. 12–30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి చేరింది. 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242కు సవరించారు. సాధారణంగా థర్డ్ పార్టీ రేట్లను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ప్రకటించేది. ఐఆర్‌డీఏఐతో సంప్రదింపుల అనంతరం తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలను నోటిఫై చేసింది. -
మూడేళ్లలో 30% మార్కెట్ గోవిందా!
ముంబై: కరోనా మహమ్మారి చూపిన ప్రభావంతో మోటారు బీమా వ్యాపారం గతేడాది కుదేలై తిరిగి కోలుకుంటుండగా.. మరోవైపు ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలు మాత్రం పోటీనివ్వలేకపోతున్నాయి. క్రమక్రమంగా మార్కెట్ వాటాను ప్రైవేటు సంస్థలకు కోల్పోతున్నాయి. మోటారు బీమా మార్కెట్లో ఏడాది క్రితం ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు 36.6 శాతం వాటా ఉంటే, ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 32.6 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు రంగ సాధారణ బీమా కంపెనీలు తమ వాటాను 63.4 శాతం నుంచి 67.4 శాతానికి పెంచుకున్నాయి. కానీ, 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 13.9 శాతం (30 శాతం క్షీణత) మార్కెట్ వాటాను మూడేళ్ల కాలంలో కోల్పోయినట్టు తెలుస్తోంది. 2018 మార్చి నాటికి మొత్తమ మోటార్ బీమా విభాగంలో ప్రభుత్వరంగ సంస్థలకు 46.5శాతం వాటా ఉంటే, ప్రైవేటు సంస్థల చేతుల్లో 53.5 శాతం వాటా ఉండేది. 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థల వాటా 40.7 శాతానికి తగ్గిపోయి, ప్రైవేటు బీమా కంపెనీల వాటా 59.3 శాతానికి పెరిగింది. 2020 మార్చి నాటికి ప్రభుత్వరంగ బీమా సంస్థల వాటా 34.2 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ఈ వాటా 32.6 శాతానికి దిగిపోవడం గమనార్హం. విడిగా చూస్తే.. మోటార్ ఓడీ (ఓన్ డ్యామేజ్/వాహనదారుకు వాటిల్లేనష్టం) విభాగంలో 2018 మార్చి నాటికి ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 37.5 శాతం వాటా, ప్రైవేటు బీమా సంస్థలు 62.5 శాతం వాటా చొప్పున కలిగి ఉన్నాయి. కానీ, 2021కు వచ్చే సరికి ప్రభుత్వరంగ కంపెనీల వాటా 25.5 శాతానికి పరిమితమైతే.. ప్రైవేటు కంపెనీల వాటా 74.5 శాతానికి పుంజుకున్నది. థర్డ్ పార్టీ (వాహనదారు కాకుండా ఎదుటి వారికి కలిగే నష్టం) మోటారు బీమాలో ప్రభుత్వరంగ సంస్థలకు 2018 మార్చి నాటికి 52.7 శాతం ఉంటే, అది తాజాగా 39.7 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 46.3 శాతం నుంచి 60.3 శాతానికి పుంజుకున్నది. శాఖలను క్రమబద్ధీకరించుకోండి ► ఖర్చులు తగ్గించుకోండి ► పీఎస్‌యూ సాధారణ బీమా కంపెనీలకు సూచనలు ఆర్థిక పనితీరు మెరుగుపడేందుకు వీలుగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలకు కేంద్ర ఆర్థిక శాఖ పలు సూచనలు చేసింది. శాఖలను క్రమబదీ్ధకరించుకోవాలని, అనవసర వ్యయాలను నియంత్రించుకోవాలని కోరింది. ప్రభుత్వరంగంలో నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తుండగా.. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఒక్కటే లాభాలతో నడుస్తోంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నష్టాలతో కొనసాగుతున్నాయి. వీటి ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బిల్లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందడం గమనార్హం. తక్కువ వ్యయాలతో కూడిన డిజిటల్ మాధ్యమంలో వ్యాపారాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలని కూడా బీమా కంపెనీలను కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాకపోతే దీనిపై ఉద్యోగుల సంఘం భిన్నంగా స్పందించింది. ‘‘ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాయి. శాఖల క్రమబద్ధీకరణ అన్నది పేదలకు భారంగా మారకూడదు. ఎందుకంటే చిన్నపాటి క్లెయిమ్ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావచ్చు. ఉదాహరణకు క్యాటిల్ ఇన్సూరెన్స్ లేదా ఫసల్ బీమా’’ అని జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే గోవిందన్ అన్నారు. ప్రతీ జిల్లాకు ఒక శాఖ కచి్చతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లను యాజమాన్యాలకు తెలియజేసినట్టు చెప్పారు. 2021–22 బడ్జెట్లో ఒక సాధారణ బీమా కంపెనీ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి ప్రస్తావించడం తెలిసిందే. -
కరోనా : పాలసీదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ, దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో పాలసీ దారులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు , ఆరోగ్య బీమా చెల్లుబాటును ఏప్రిల్ 21 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో ఈ బీమా చెల్లింపుల పునరుద్ధరణ తేదీలు వచ్చే వ్యక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. 2020 మార్చి 25 - ఏప్రిల్ 14 (లాక్ డౌన్ సమయం) మధ్యకాలంలో చెల్లింపులు చేయాల్సిన వాహన, ఆరోగ్య పాలసీ దారులకు భారీ ఉపశమనం కల్పించింది.ఈ ఉత్తర్వు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. పాలసీ దారులు ప్రీమియం బకాయిలు మొత్తాన్ని ఏప్రిల్ 21 న లేదా అంతకన్నా ముందుగానీ చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి పునరుద్ధరణ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్ పార్టీ భీమా కవరేజీని కొనసాగించాలని పేర్కొంది. 2020 ఏప్రిల్ 21 ని పాలసీ పునరుద్ధరణ తేదీగా పరిగణించాలని చెప్పింది. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని ప్రకటించింది. చదవండి : (హెచ్డీఎఫ్సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం) చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం (కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం) The government has provided relief for third-party auto insurance policy holders and health insurance policy holders in light of the #Covid19 situation. The relevant notifications are attached below. #IndiaFightsCorona pic.twitter.com/5YK86vdXBw — NSitharamanOffice (@nsitharamanoffc) April 2, 2020 -
డిజిటల్ పాలసీ ఎంతో చౌక
వాహనానికి బీమా తీసుకోవడం నిబంధనల రీత్యా తప్పనిసరి. ఏటేటా వాహన ప్రీమియం ఖరీదయిపోతోంది. ఈ క్రమంలో ప్రీమియం భారం కాస్త తగ్గించుకునేందుకు డిజిటల్ పాలసీలపై దృష్టి సారించొచ్చు. ఆన్లైన్లోనే సేవలతో దూసుకుపోతున్న అకో, గో డిజిట్ సంస్థలు పోటా పోటీగా మంచి ఫీచర్లతో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో యువతలో ఈ బీమా సంస్థలకు ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పెరిగింది. కొనుగోలు ఎంతో సులభం కావడం, ప్రీమియం తక్కువగా ఉండడం వారికి ఎంతో సౌకర్యాన్నిస్తున్నాయి. అకో, గో డిజిట్ సంస్థలు నూరు శాతం ఆన్లైన్ కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. భౌతికంగా వీటికి శాఖలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో వీటికి పరిపాలన, నిర్వహణ చార్జీలు ఇతర ప్రధాన బీమా సంస్థలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కనుక ఈ సంస్థలు 20–30 శాతం తక్కువ ప్రీమియానికే మోటార్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు మోటారు ఇన్సూరెన్స్ మార్కెట్లో ప్రస్తుతానికి 3–4 శాతం వాటా ఉంది. కానీ, ఇతర సంస్థలతో పోలిస్తే ఇవి ఎంతో వేగంగా తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నాయి. పాలసీ రెన్యువల్ చేసుకునే సమయం వస్తే, ఈ సంస్థలను ఆశ్రయించొచ్చా..? ఈ ప్రశ్న మీకు ఎదురైతే.. సమాధానం వెతుక్కునేందుకు ఇక్కడున్న వివరాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిందే. మోటారు ఇన్సూరెన్స్‌లో అతిపెద్ద సంస్థగా ఉన్న ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, అకో, గో డిజిట్ సంస్థల మధ్య కొన్ని సేవల పరంగా అంతరాన్ని పరిశీలించొచ్చు.. అకో జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమా వ్యాపార కంపెనీ అయిన అకో జనరల్ ఇన్సూరెన్స్ 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. మోటార్, హెల్త్, మొబైల్, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఈ సంస్థ అందిస్తోంది. అమెజాన్, కేటమరాన్ వెంచర్స్, సైఫ్ పార్ట్నర్స్ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థ అందించే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో.. రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, ప్రకృతి విపత్తుల కారణంగా సొంత వాహనానికి, మూడో పార్టీ వాహనానికి నష్టం జరిగితే కవరేజీ ఉంటుంది. వాహనం చోరీకి గురైనా బీమా లభిస్తుంది. అలాగే, వాహనదారుడికి వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. జీరో డిప్రీసియేషన్ను యాడాన్ కవర్‌గా తీసుకోవచ్చు. అంటే వాహనంలోని రబ్బర్, ప్లాస్టిక్ తదితర కొన్ని విడిభాగాలకు నష్టం జరిగితే బీమా సంస్థ వాస్తవ విలువలో నిర్ణీత శాతమే పరిహారం చెల్లిస్తుంది. జీరో డిప్రీషియేషన్ కవర్ తీసుకుంటే 100 శాతం విలువను పరిహారంగా చెల్లిస్తుంది. వీటికి పరిహారం రాదు... ఈ పాలసీలో నిబంధనలు ఇతర మోటారు పాలసీల్లో మాదిరే ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే లేదా కారణమైతే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదం బారిన పడితే అందుకు జరిగే నష్టానికి కంపెనీ రూపాయి కూడా చెల్లించదు. అలాగే, ప్రమాదం వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల వాహనానికి నష్టం జరిగినా పరిహారం రాదు. కొనుగోలు ఇలా... ఆన్లైన్ పోర్టల్ అకో డాట్ కామ్‌కు వెళ్లి మీ కారు నంబర్ లేదా బ్రాండ్‌ను ఎంపిక చేసుకుని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ (ఐడీవీ)ను ఎంచుకోవాలి. తర్వాత ప్రీమియం చెల్లించిన నిమి షాల వ్యవధిలోనే పాలసీ ఈ మెయిల్‌కు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ కేవలం ఐదారు నిమిషాల వ్యవధిలోనే పూర్తయిపోతుంది. క్లెయిమ్ ప్రక్రియ సులభం... ప్రమాదం కారణంగా వాహనానికి నష్టం జరిగితే దేశవ్యాప్తంగా 1,000కుపైగా గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు పొందొచ్చు. క్లెయిమ్ కోసం కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా కంపెనీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఉన్న వారికి రిపేర్ కోసం వాహనాన్ని 60 నిమిషాల వ్యవధిలోనే పిక్ చేసుకుంటారు. కంపెనీ సర్వేయర్ వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. ఇతర పట్టణాల్లోని వారు తామే స్వయంగా వాహనాన్ని కంపెనీ నిర్దేశించిన గ్యారేజ్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కారు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బీమా పాలసీ జిరాక్స్ కాపీ అవసరపడతాయి. క్లెయిమ్‌ను కంపెనీ ఆమోదిస్తే నగదు రహితంగా గ్యారేజ్‌లో రిపేర్ చేసి డెలివరీ చేస్తారు. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొత్తం క్లెయిమ్‌లలో 72.4 శాతం 15 రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి. 90 రోజుల వ్యవధిలో ఇది 99.5 శాతంగా ఉంది. వారంలో అన్ని రోజులూ, రోజులో 24 గంటల పాటు కస్టమర్ సపోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. గో డిజిట్ ఇన్సూరెన్స్ ఈ సంస్థ కూడా 2017లోనే ఆరంభమైంది. కార్లు, బైక్‌లు, సైకిళ్లు, ట్రావెల్, హోమ్, మొబైల్ ఫోన్లకు ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తోంది. జీరో డిప్రీసియేషన్ కవర్, ఇంజన్ ప్రొటెక్షన్ కవర్, రిటర్న్ టూ ఇన్వాయిస్ కవరేజీలు ఇందులో ఉన్నాయి. థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్‌ను కూడా విడిగా తీసుకోవచ్చు. అకో జనరల్ ఇన్సూరెన్స్ మాదిరిగానే సాధారణ మినహాయింపులు ఇందులోనూ ఉన్నాయి. కొనుగోలు... కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి కారు లేదా బైక్ వీటిల్లో వాహనం ఏద న్నది ఎంచుకుని,బ్రాండ్, మోడల్‌ను సెలక్ట్ చేసిన తర్వాత, పూర్వపు బీమా సంస్థ వివరాలను ఇవ్వాలి. దాంతో ప్రీమియం ఎంతన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి.ప్రీమియం చెల్లించిన అనంతరం మెయిల్‌కు పాలసీ జారీ అయిపోతుంది. క్లెయిమ్ ప్రక్రియ... దేశవ్యాప్తంగా 1,400 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి క్లెయిమ్ వివరాలను రికార్డ్ చేసుకోవాలి. దాంతో మీ మొబైల్‌కు స్వీయ తనిఖీ పత్రం లింక్ ద్వారా వస్తుంది. వాహనానికి నష్టం జరిగితే మొబైల్ ద్వారా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఈ ఇమేజ్‌లను గో డిజిట్ టీమ్ పరిశీలించిన అనంతరం ఎంత మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చన్న సమాచారాన్ని అందిస్తుంది. అవసరమైతే సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అనంతరం నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్న గ్యారేజ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వాహనం మీ నుంచి పిక్ చేసుకుని, రీపెయిర్ తర్వాత తిరిగి అందించే సేవలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ పరిహారం చెల్లింపుల రేషియో 94.84 శాతం. ద్విచక్ర వాహన క్లెయిమ్‌కు సగటున 11 రోజుల సమయం తీసుకుంటుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ మోటారు వాహన పాలసీల విభాగంలో ఐసీఐసీఐ లాంబార్డ్ చాలా పెద్ద సంస్థ. కేవలం మోటారు పాలసీల నుంచే 2018–19లో ఈ సంస్థ రూ.6,400 కోట్ల ప్రీమియం రాబట్టింది. అకో జనరల్ రూ.75 కోట్ల ప్రీమియం పొందగా, గో డిజిట్ రూ.854 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించాయి. ఇతర సంస్థల మాదిరే ఐసీఐసీఐ లాంబార్డ్ మోటారు బీమాలోనూ అన్ని రకాల ఫీచర్లు, యాడాన్ కవరేజీలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు... కారు నంబర్ లేదా బ్రాండ్ పేరు, ఏ సంవత్సరం మోడల్ తదితర వివరాలను ఇవ్వడం ద్వారా ఐసీఐసీఐ లాంబర్డ్ ఆన్లైన్ పోర్టల్ నుంచి మోటారు పాలసీ తీసుకోవచ్చు. అన్ని రకాల వాహన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాహనం వివరాలను పేర్కొన్న తర్వాత ప్రీమియం వివరాలు కనిపిస్తాయి. భిన్న ఫీచర్లతో తీసుకుంటే ప్రీమియం ఏ మేరకు అన్న వివరాలు కూడా కనిపిస్తాయి. నచ్చిన దానిని ఎంపిక చేసుకుని ప్రీమియం చెల్లించాలి. ఆ సమయంలో ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్, కీ ప్రొటెక్ట్, కన్జ్యూమబుల్స్ కవరేజీలను ప్రధాన పాలసీకి జత చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే కాకుండా కంపెనీకి దేశవ్యాప్తంగా విస్తృత సంఖ్యలో శాఖలు కూడా ఉన్నాయి. సమీపంలోని శాఖకు వెళ్లి కూడా పాలసీ తీసుకోవచ్చు. క్లెయిమ్ ప్రక్రియ... దేశవ్యాప్తంగా 8,300 గ్యారేజ్‌లలో నగదు రహిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో లేదా సమీపంలోని శాఖకు వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అయితే ‘ఇన్సూర్యాప్’ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. లైవ్ వీడియో స్ట్రీమింగ్ సదుపాయం ‘ఇన్స్టాస్పెక్ట్’ ఈ యాప్‌లో ఉంటుంది. దీని ద్వారా క్లెయిమ్‌ను నమోదు చేసుకోవడం ద్వారా సర్వేయర్ నుంచి వేగంగా క్లెయిమ్‌కు అనుమతి పొందొచ్చు. అవసరమైన పత్రాలను కూడా యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉచితంగా మీ నుంచి వాహనాన్ని స్వీకరించి గ్యారేజీకి తీసుకెళ్లే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. సమీపంలో ఉన్న కంపెనీ నెట్వర్క్ గ్యారేజ్‌కు తీసుకెళ్లి రీపెయిర్ చేసి వాహనదారుడికి తిరిగి అందిస్తారు. 2018–19 సంవత్సరంలో క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి 98.8 శాతంగా ఉందని కంపెనీ సమాచారం తెలియజేస్తోంది. 24 గంటల పాటు కస్టమర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎంపిక ఏది..? ► ఆన్లైన్లో డిజిటల్ పాలసీలు తీసుకోవడం ద్వారా ప్రీమియం రూపంలో భారీ ఆదా చేసుకోవచ్చు. అమేజాన్ కస్టమర్లు అకో నుంచి ఇంకా చౌకకే పాలసీ పొందే అవకాశం ఉంది. ► గో డిజిట్లో యాడాన్ కవరేజీలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. థర్డ్ పార్టీ స్టాండలోన్ కవరేజీ కూడా ఉంది. కానీ, అకో వద్ద ఇవి లేవు. ► అకో, గో డిజిట్ చెల్లింపుల రేషియో 99 శాతం దగ్గరగానే ఉండడం గమనార్హం. ► ముఖ్యంగా పాలసీ కొనుగోలు చేసే ముందు, ఆయా సంస్థ ఆఫర్ చేస్తున్న నెట్వర్క్ గ్యారేజీలు మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయా..? అన్నది గమనించాలి. ► అదే ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి అయితే ప్రీమియం ఎక్కువ. కానీ, నెట్వర్క్ గ్యారేజీలు విస్తృతంగా ఉన్నాయి. ఆన్‌లైన్‌తోపాటు, ఆఫ్లైన్లోనూ పాలసీ, క్లెయిమ్‌లకు అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్ సౌకర్యంగా అనిపించని వారికి అనుకూలం. ► ఒక నిర్ణయానికి ముందు నిపుణుల సలహా మంచిది. ప్రీమియం అంతరాన్ని పరిశీలిస్తే... రెండు సంవత్సరాల వయసున్న మారుతి సుజుకీ బాలెనో, ఐడీవీ విలువ రూ.5.03 లక్షలకు సమగ్ర కవరేజీతో (వ్యక్తిగత ప్రమాద బీమాతో కూడిన) ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి పాలసీ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,604. ఇందులో రోడ్డు సైడ్ అసిస్టెన్స్కు రూ.199 కూడా కలిసి ఉంది. అదే గో డిజిట్లో అయితే ఇదే వాహనానికి ప్రీమియం రూ.11,015, అకోలో రూ.9,276గా ఉన్నాయి. -
ఇక మోత మోగనున్న వాహన ప్రీమియం
న్యూఢిల్లీ : మిడ్ సైజ్డ్ కార్లకు, ఎస్‌యూవీలకు, మోటార్ సైకిళ్లకు, కమర్షియల్ వెహికిల్స్ కు ఇక ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు మోత మోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ వాహనాలపై 50 శాతం ప్రీమియం పెంచాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది. అయితే చిన్న కార్లకున్న(1,000సీసీ వరకున్న) థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఐఆర్డీఏఐ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కార్లకు ప్రస్తుతమున్న రూ.2,055 ప్రీమియంనే కొనసాగించనుంది. మిడ్ సైజ్డ్ కార్లు(1000-1500సీసీ), ఎస్‌యూవీలు, పెద్ద కార్లకు మాత్రమే 50 శాతం ప్రీమియంను పెంచాలని ఐఆర్డీఏఐ నిర్ణయించింది. 1000సీసీ వరకున్న కార్లకు రూ.3,355, పెద్ద వాటికి రూ.9,246 వరకు ప్రీమియం రేట్లను ఐఆర్డీఏఐ పెంచనుంది. అదేవిధంగా స్పోర్ట్స్ బైక్, సూపర్ బైక్స్ 350సీసీ కంటే ఎక్కువున్న వాటికి ప్రీమియం ప్రస్తుతమున్న రూ.796 నుంచి రూ.1,194కు పెరగనుంది. ఎంట్రీ లెవల్ బైక్స్(77-150 సీసీ) కూడా ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్రతిపాదించింది. 6హెచ్‌పీ వరకున్న ట్రాక్టర్స్ కు ఇక ప్రీమియం రూ.765. ఈ-రిక్షాల ప్రీమియం రేట్లను పెంచాలని ఐఆర్డీఏఐ ప్లాన్ చేస్తోంది. -
బేసిక్ సరిపోదు.. అదనం అవసరం!!
వాహన బీమాకు ఎన్నో యాడ్ ఆన్ కవర్లు... చాలా మందికి కారు కొనాలనే ఆశ ఉంటుంది. కానీ కొనాలంటే లక్షల్లో వ్యవహారం. ఎలాగో తంటాలు పడి అంత మొత్తమూ వెచ్చించి కొనుగోలు చేసిన వాహనానికి... తప్పనిసరి కనక బేసిక్ ఇన్సూరెన్స్ ఎలాగూ తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఎంత మొత్తంలో బీమా తీసుకోవాలనే అంశంపై సరైన స్పష్టత ఉండదు. ఒక వాహనం దెబ్బతిన్నపుడు బేసిక్ ఇన్సూరెన్స్ అనేది అన్నింటికీ వర్తించకపోవచ్చు. ఇలాంటి సమయాల్లోనే మనకు అదనపు ప్లాన్స్ ఉపయుక్తంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మనం పెద్దగా భయపడాల్సిన పని ఉండదు. లేకపోతే జేబుకు పెద్ద చిల్లు పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి పలు ప్రత్యేకమైన యాడ్-ఆన్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం... ఇంజిన్ ప్రొటెక్ట్ కవర్: కొత్తగా/మూడేళ్లలోపు కొనుగోలు చేసిన హై ఎండ్ కార్లకు ఈ కవర్‌ను తీసుకోవడం మంచిది. ప్రమాదం జరిగి నప్పుడు వాటిల్లే నష్టాన్ని మాత్రమే కాకుండా ఇంజిన్‌కు సంబంధించి ఏవైనా రిపేర్లు వస్తే వాటినీ కవర్ చేస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు నీరు ఎక్కువగా నిల్వ ఉండే పట్టణాలు/లోతట్టు ప్రాంతాల్లోని వాహనదారులు ఇలాంటి కవర్ తీసుకోవడం ఉత్తమం. హైడ్రో స్టాటిక్ లాక్ కవర్: ఇంజిన్లోకి నీరు ప్రవేశించడం వల్ల తలెత్తే సమస్యల పరిష్కారానికి ఈ కవర్ ఉపయోగపడుతుంది. నీళ్లు/వరదల్లో నడపడం వల్ల ఇంజిన్లోకి నీరు వెళ్లే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఇంజిన్ పనిచేయకుండా పోవచ్చు. ఇలాంటి పరిస్థితినే హైడ్రోస్టాటిక్ లాక్‌గా పిలుస్తారు. దీనికి బేసిక్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తించకపోవచ్చు. ఈ కవర్ అదనంగా తీసుకుంటే బాగుంటుంది. జీరో డిప్రిసియేషన్ కవర్: వాహనదారులకు మరొక ఉపయోగకరమైన కవర్ ఇది. దీని ద్వారా ప్రమాదం జరిగినప్పుడు పాడయిన వాహన భాగాలకు పూర్తిగా పరిహారం పొందొచ్చు. అంటే పాత భాగాలను తీసేసి వాటి స్థానంలో అమర్చే కొత్త వాహన భాగాలకు ఎంత ఖర్చవుతుందో అంతటినీ ఎలాంటి తగ్గుదల లేకుండా తీసుకోవచ్చు. ఈ కవర్ సాధారణంగా కొత్తగా కొనుగోలు చేసిన మోడళ్లకి మాత్రమే వర్తిస్తుంది. కారు కొనుగోలు చేసి ఐదేళ్లు దాటితే ఈ కవర్ పనిచేయదు. జీరో డిప్రిసియేషన్ కవర్ తీసుకోకపోతే వాహన భాగాల మార్పుకు అయ్యే వ్యయంలో దాదాపు 50% భరించాల్సి వస్తుంది. పాలసీ కొనుగోలు/రెన్యూవల్లో ఈ కవర్ తీసుకోవచ్చు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్: మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనం రోడ్డుపై అనుకోకుండా పాడయితే అప్పుడు ఈ కవర్ మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ కవర్ తీసుకోవడం వల్ల వాహనం చె డిపోతే సమీపంలోని ప్రాంతాల్లో బీమా కంపెనీ భస ఏర్పాటు చేస్తుంది. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ట్యాక్సీని సమకూరుస్తుంది. మెకానిక్స్ వచ్చి కారును రిపేర్ చేస్తారు. లేకపోతే దగ్గరిలోని గ్యారేజ్ వారితో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం మరువొద్దు: వాహన బీమా పాలసీని తీసుకునే ముందు అన్ని విషయాలను కులంకుషంగా తెలుసుకోవాలి. పాలసీ వేటికి వర్తిస్తుంది, వేటికి వర్తించదు.. అనేదానిపై సమగ్ర అవగాహనకు రా వాలి. ఇంజిన్ కవరేజ్ లేకపోతే యాడ్ ఆన్ కవర్స్ మంచిది. ఇంజిన్ గుండెకాయ లాంటిది. దానికి ఎప్పుడూ సరిపడ కవరేజ్ అవసరం. -
ఆస్తికీ బీమా ధీమా కావాలి..!
తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎంత తీవ్రమైనవి అయినప్పటికీ భారీ ప్రాణ హాని లేకుండా నేడు రక్షణ పొందగలుగుతున్నాం. సాంకేతిక రంగంలో అభివృద్ధి ఇందుకు ఎంతగానో దోహదపడుతోంది. ఇటీవలి హుద్‌హుద్ ఇందుకు ఉదాహరణ. అయితే భారీ ఆస్తి నష్టాన్ని మాత్రం నివారించలేకపోయాం. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తులకూ బీమా ద్వారా రక్షణ పొందారు. విపత్తు సమయాల్లో ఆస్తి నష్టం పరిహారాలకు సంబంధించి బీమా రంగం విస్తృత స్థాయిలో పథకాలను అందిస్తోంది. ఈ అంశంపై అవగాహన పెంపొందించుకోవడం అవసరం. మోటార్ ఇన్సూరెన్స్... మోటార్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి రెండు అంశాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి హైడ్రోస్టాటిక్ కవర్. మరొకటి రోడ్ సైడ్ అసిస్టెన్స్. హైడ్రోస్టాటిక్ కవర్‌ను తీసుకుంటే- వర్షపు నీటి గుంతల్లో కారు చిక్కుకుపోయి... దానిని అక్కడ నుంచి గేర్లు మారుస్తూ, బలవంతంగా బయటకు తీసే క్రమంలో ‘ఇంజిన్ ఫోర్స్’ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇదే ‘హైడ్రోస్టాటిక్ నష్టం’. ఈ తరహా నష్టాన్ని మోటార్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ భాషలో ‘కాన్సిక్వెంటల్’ నష్టంగా పేర్కొంటారు. మామూలుగా తీసుకునే రెగ్యులర్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ తరహా నష్టం కవరవ్వదు. ఒక నిర్దిష్ట చర్య వల్ల సంభవించిన నష్టం కావడమే దీనికి కారణం. అనుకోని సంఘటన వల్ల ఈ నష్టం జరగదు. ఈ నష్ట నివారణకు భారీ వ్యయం తప్పదు. మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు, ఈ మొత్తానికి అదనంగా ‘ముందు జాగ్రత్తగా’ కొంత చెల్లిస్తే కాన్సిక్వెంటల్ నష్టానికి కొండంత అండనిస్తుంది. ఇదే విధంగా పలు కంపెనీలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవరేజ్ పాలసీలనూ అందిస్తున్నాయి. గృహాలకు బీమా... పలు కంపెనీలు ప్రస్తుతం గృహాల నష్ట పరిహారాలకు సంబంధించి బీమా పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. గృహాలకే కాకుండా ఆయా భవనాల్లోని వస్తువులకు సైతం బీమా పథకాలు ఉన్నాయి. అగ్నిప్రమాదాలుసహా ఎటువంటి ప్రకృతి వైపరీత్యానికైనా బీమా సదుపాయం లభిస్తోంది. ప్రయాణాల సమయంలో ఆభరణాలు పోవడం, విపత్తు సమయాల్లో టీవీ, ఏసీ,రిఫ్రిజిరేటర్ వంటి గృహోపకరణాల నష్ట పరిహారాలు, కుటుంబం మొత్తానికి వర్తించే ప్రమాద బీమా, నివాస గృహానికి నష్టం వాటిల్లినట్లయితే, ప్రత్యామ్నాయంగా అద్దెకు ఉండే నివాసానికి సంబంధించి చేసే వ్యయాలు, ముఖ్య డాక్యుమెంట్లు ఏవైనా పోతే తిరిగి వాటికి సంబంధించి ‘డూప్లికేట్’ పత్రాలు పొందేందుకు చేసే వ్యయాలు, ట్రాన్స్‌పోర్టింగ్ సమయాల్లో జరిగే ప్రమాద నష్టాలు... ఇలా ప్రతి అంశానికీ నేడు బీమా పథకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇళ్లకే కాదు షాపులు, కార్యాలయాలు, హోటెల్స్, పరిశ్రమలన్నింటికీ బీమా ధీమా పొందవచ్చు. వీటన్నింటిపై అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. -
బజాజ్ అలయంజ్ మహిళా బ్రాంచ్
న్యూఢిల్లీ: మహిళా బ్యాంక్ స్ఫూర్తితో బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ మహిళలుండే శాఖను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. అందరూ మహిళా ఉద్యోగులు ఉండే బీమా కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తొలి బీమా కంపెనీ తమదేనని బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, తపన్ సింఘాల్ తెలిపారు. ఈ బ్రాంచ్ కోసం త్వరలో మహిళా ఏజెంట్లను, ఉద్యోగులను నియమించుకుని, వారికి తగిన శిక్షణనిస్తామని వివరించారు. కుటుంబ బాధ్యత కోసం తమ వృత్తిగత బాధ్యతలను త్యాగం చేసిన మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని, వారి కెరీర్‌కు మళ్లీ ప్రారంభాన్నిస్తామని పేర్కొన్నారు. మొదటగా 5గురు మహిళా ఉద్యోగులు, 10 మహిళ ఏజెంట్లతో పుణే బ్రాంచ్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే మహిళ ఏజెంట్ల సంఖ్యను 60కు పెంచుతామని వివరించారు. అన్ని మెట్రో నగరాల్లో కూడా త్వరలో ఇలాంటి మహిళా బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని తపన్ సింఘాల్ పేర్కొన్నారు.