హెల్త్ ప్లాన్లపై పన్ను ఉపశమనం సానుకూలం
మోటార్ థర్డ్ పార్టీ రేట్ల సవరణ
పరిశ్రమ వర్గాల అంచనా
కోల్‌కతా: సాధారణ బీమా (జీవిత బీమా కాకుండా) రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని చూడనుంది. నియంత్రణపరమైన అనుకూల వాతావరణానికి తోడు, వినూత్నమైన ఉత్పత్తుల ఆవిష్కరణ వృద్ధిని నడిపిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్‌టీ మినహాయింపు కల్పించడం, మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్ల సమీక్ష నిర్ణయాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది.
‘‘హెల్త్ ఇన్సూరెన్స్ రానున్న సంవత్సరాల్లోనూ వృద్ధిని నడిపించనుంది. నాన్ మోటార్, పెట్ ఇన్సూరెన్స్, లయబిలిటీ, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ, హౌసింగ్ ఇన్సూరెన్స్ వంటి నాన్ హెల్త్ విభాగాల్లోనూ బీమా వ్యాప్తి గణనీయంగా పెరగనుంది’’అని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ రావు తెలిపారు. 14 శాతం మేర వృద్ధిని పరిశ్రమ అంచనా వేస్తున్నట్టు చెప్పారు. జీఎస్‌టీ, మోటార్ థర్డ్ పార్టీ రేట్ల విషయంలో పరిశ్రమకు సహకారం అవసరమన్నారు.
‘‘హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్‌టీని తొలగిస్తే వాటి ధరలు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎక్కువ మందికి బీమా చేరువ అవుతుంది. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఐదేళ్లుగా ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. వీటిని తక్షణమే సవరించాల్సి ఉంది’’అని రావు వివరించారు. వ్యయాలను తగ్గించుకుని, అత్యవసర బీమా ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్స్ చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయన్నారు.
అందరికీ అందుబాటు..
బీమాను అందుబాటు ధరలకు తీసుకురావాల్సిన అవసరాన్ని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుజ్ త్యాగి ప్రస్తావించారు. ‘‘ఉత్పత్తుల అభివృద్ధి, అండర్ రైటింగ్, కస్టమర్ సేవల్లో నూతనత్వం అన్నది బీమాను పౌరులకు మరింత చేరువ చేస్తుంది’’అని చెప్పారు. బీమా పరిశ్రమ పరిమాణాత్మక మార్పు వైపు అడుగులు వేస్తోందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తులను అందించడాన్ని ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పారామెట్రిక్ ఇన్సూరెన్స్‌తోపాటు సైబర్ ఇన్సూరెన్స్ సైతం ప్రాముఖ్యతను సంతరించుకోనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment