general insurance
-
తెలుగు రాష్ట్రాల పాలసీదార్లకు ఐసీఐసీఐ లాంబార్డ్ హెల్ప్‌డెస్క్
తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంతో నష్టపోయిన పాలసీదారులకు సత్వరం సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారి కోసం ప్రత్యేక హెల్ప్‌డెస్‌్కను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇది ప్రతి రోజూ, ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. పాలసీదారులు టోల్ ఫ్రీ నంబరు 1800–2666 ద్వారా లేదా customersupport@icicilombard. com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. -
ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్‌ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పీజీఐఎల్) సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.దీంతో ఇకపై పీజీఐఎల్ ఇన్సూరెన్స్ నేరుగా తన కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మేందుకు వీలు లేదు. థర్డ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. అంటే ఇతర ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణ, అమ్మకాలు చేయొచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్సు కోసం దరఖాస్తును ఉపసంహరించుకోవడం ద్వారా మాతృ సంస్థ రూ. 950 కోట్ల నగదును ఆదా చేసుకునేందుకు వీలు అవుతుందని పేటీఎం తెలిపింది. ఆ మొత్తాన్ని పీజీఐఎల్‌లో పెట్టుబడి పెట్టేందుకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. మరో అనుబంధ సంస్థ పేటీఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం వినియోగదారులకు, చిరు వ్యాపారులకు ఇతర పరిశ్రమలకు ఇన్సూరెన్స్ సేవల్ని అందించడంపై దృష్టి సారిస్తామని తెలిపింది. -
టాటా ఏఐజీ నుంచి హెల్త్ సూపర్ చార్జ్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్.. ‘హెల్త్ సూపర్ చార్జ్’ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని కింద పాలసీదారులు ఐదు రెట్లు అధికంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని పొందొచ్చు. ఏటా 50 శాతం రెన్యువల్ బోనస్ చొప్పున గరిష్టంగా 500 శాతం (ఐదు రెట్లు) కవరేజీని పెంచుకోవచ్చు. టైర్–1 నుంచి టైర్–4 వరకు పట్టణాల్లో నివసించే వారి భిన్న రకాల ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు సంస్థ తెలిపింది. ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్, సమ్ ఇన్సూర్డ్ అపరిమిత రీస్టోరేషన్ సదుపాయం, ముందు నుంచి ఉన్న వ్యాధుల వేచి ఉండే కాలాన్ని నాలుగేళ్ల నుంచి 30 రోజులకు తగ్గించుకునే ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద రూ.5–20 లక్షల కవరేజీని పొందొచ్చు. ఏటా ఉచిత హెల్త్ చెకప్ సదుపాయం కూడా ఉంది. -
కోటక్ ఇన్సూరెన్స్‌లో ‘జ్యూరిక్’కు వాటాలు
ముంబై: సాధారణ బీమా సంస్థ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో (కేజీఐ) స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం రూ. 4,051 కోట్లు వెచి్చంచనుంది. తదుపరి అదనంగా మూడేళ్లలో అదనంగా 19 శాతం వాటాలు కూడా జ్యూరిక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్లు కేజీఐ మాతృ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, కేజీఐ తమకు పటిష్టమైన భాగస్వామి కాగలదని జ్యూరిక్ సీఈవో (ఆసియా పసిఫిక్) తులసి నాయుడు తెలిపారు. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇరు సంస్థల వనరులు, అనుభవం తోడ్పడగలవని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ప్రీమియంలపరంగా నాన్–లైఫ్ మార్కెట్లో సెపె్టంబర్లో కేజీఐకి 0.52 శాతం వాటా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1,148 కోట్ల మేర స్థూల ప్రీమియం సాధించింది. కొత్త పెట్టుబడుల అనంతరం సంస్థ విలువ రూ. 7,943 కోట్లుగా ఉండనుంది. -
సాధారణ బీమా మరింత విస్తరించాలి
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలు మరింత విస్తృతం కావాల్సిన ఆవశ్యకతపై ఇక్కడ జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశం చర్చించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. బీమా వ్యాప్తి, కవరేజీని పెంచడానికి రాష్ట్ర బీమా ప్రణాళికల కింద రాష్ట్రాలతో నిరంతర పరస్పర చర్యలు, చర్చల ద్వారా అవగాహన పెంపొందించడం అవసరమని సమావేశం భావించింది. సాధారణ బీమా రంగానికి సంబంధించిన అనేక క్లిష్టమైన అంశాలను వివరంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య బీమా వృద్ధిని పెంచడానికి నగదు రహిత సదుపాయాలను విస్తరించాలని, చికిత్స ఖర్చులను ప్రామాణీకరించడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయం పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఆస్తి, పారామెట్రిక్ బీమా కవర్ల స్వీకరణను ప్రోత్సహించడం... అలాగే సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని కవర్ చేయడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించడం కీలకమని ఆర్థిక సేవల కార్యదర్శి ఉద్ఘాటించారు. బీమా మోసాలను నిరోధించడానికి సిబిల్ స్కోర్‌తో అనుసంధానించే అవకాశంపై కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఆయా అంశాల అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ సేవల అధికారులకు కార్యదర్శి సూచించారు. నిరంతర సహకారం, ప్రయత్నాలతో బీమా రంగం వృద్ధి సులభతరం కావడానికి చర్యలు అవసరమని పేర్కొన్న ఆయన, ఈ బాటలో ప్రైవేట్– ప్రభుత్వ రంగ పరిశ్రమలతో తరచూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. -
రైతు భరోసా కేంద్రాల సేవలు భేష్
జరుగుమల్లి (టంగుటూరు): ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, అగ్రి బిజినెస్ హెడ్ ఆశిష్ అగర్వాల్‌లు ప్రశంసించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని రైతు భరోసా కేంద్రాన్ని అగ్రి నేషనల్ ఇన్సూరెన్స్ మేనేజర్ సుదేష్ణ, బజాజ్ ఇన్సూరెన్స్ స్టేట్ మేనేజర్ శాంతి భూషణ్, ఒంగోలు ఏడీఏ బి.రమేష్ బాబుతో కలిసి గురువారం వారు సందర్శించారు. రబీ సీజన్ పంటల బీమాకు సంబంధించి (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ–క్రాప్ నమోదు, పంట కోత ప్రయోగాలు తదితర వివరాల గురించి వ్యవసాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటల్లో ఏ ఏ పంటలు లాభదాయకంగా ఉంటాయని రైతులను ఆరా తీశారు. పంట సాగు చేసిన వెంటనే ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించుకుంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టం సంభవిస్తే బీమా వర్తిస్తుందని రైతులకు వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను పంపిణీ చేస్తున్న తీరు, గత సంవంత్సరం రబీలో ఈ–క్రాప్ నమోదు చేయించుకున్న రైతుల రశీదులను ఈ సందర్భంగా వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని వారు కొనియాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిష్ అగర్వాల్ తదితరులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి స్వర్ణలత, ఏఈవో ఎన్.వెంకటేశ్వర్లు, వీఏఏ ఎల్.ప్రైసీ రీమల్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఇవి తెలుసుకోకుండా ఆరోగ్య బీమా కంపెనీ ఎంచుకోకండి
కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరంపై అవగాహన పెరిగింది. అయితే దేశీయంగా 24 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, 5 ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నందున సరైన బీమా సంస్థను ఎంచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అయిదు ముఖ్య అంశాల గురించి వివరించేదే ఈ కథనం. ► క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి: బీమా సంస్థకు ఎన్ని క్లెయిమ్స్ వస్తే అది ఎన్నింటిని సెటిల్ చేసిందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. 93–94 శాతం లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తి ఉన్న సంస్థలను మాత్రమే ఎంచుకోవడం మంచిది. ► వినియోగదారుల ఫిర్యాదులు: ఇది వరకే ఉన్న వినియోగదారులు సదరు బీమా సంస్థపై ఏమైనా ఫిర్యాదులు చేశారా అనేది కూడా చూసుకోవాలి. క్లెయిమ్ ఫిర్యాదులు, పాలసీ ఫిర్యాదుల వివరాలు ‘Nఔ–45 (గ్రీవెన్స్ డిస్పోజల్) ఫారం’లో ఉంటాయి. దీన్ని ప్రతి బీమా కంపెనీ అందుబాటులో ఉంచాలి. ఫిర్యాదులు తక్కువగా ఉండటం మెరుగైన కస్టమర్ అనుభవాన్ని సూచిస్తుంది. ► ఆన్లైన్ కస్టమర్ రేటింగ్స్: గూగుల్, ఫేస్బుక్లో లభించే కస్టమర్ రేటింగ్స్ వల్ల కూడా కస్టమర్లు ఎంత సంతృప్తిగా ఉన్నారనేది తెలుసుకోవచ్చు. రేటింగ్ ఎక్కువగా ఉన్న బీమా సంస్థలు మెరుగై న సర్వీసులు అందిస్తున్నాయని భావించవచ్చు. ► ప్రీమియం చార్జీలు, ప్రయోజనాలు: మనం తీసుకునే పాలసీకి ఎంత ప్రీమియం వసూలు చేస్తున్నారనేది అందరూ ఎక్కువగా గమనించే అంశం. అయితే, ప్రీమియం తక్కువగా ఉందనే ప్రాతిపదికన పాలసీలను ఎంచుకోవడం అన్ని వేళలా సరి కాకపోవచ్చు. బీమా సంస్థ అందించే ఆరు కీలక ప్రయోజనాలతో ప్రీమియంను పోల్చి చూసుకోండి. గది అద్దెపై పరిమితి లేకపోవడం, సమ్ ఇన్సూర్డ్ బ్యాకప్ లేదా పునరుద్ధరణ బెనిఫిట్ (ఎటువంటి మినహాయింపుల నిబంధనలు లేకుండా), ఆఫర్ చేసే క్యుములేటివ్ బోనస్ పర్సంటేజీ (కనిష్టంగా 50 శాతం, అంతకంటే ఎక్కువ), కో–పేమెంట్ లేకుండా, కన్జూమబుల్స్కు కూడా మంచి కవరేజీ, ప్రీ–పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రయోజనం (కనీసం 60/90 రోజుల వరకు), అలాగే అవయవదాత ఖర్చులు వీటిలో ఉంటాయి. ► డిస్కౌంట్లు: మీరు ఎంచుకున్న పాలసీ ఖరీదైనది అయితే ప్రీమియంను తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. నేడు మార్కెట్లో ఉన్న చాలా బీమా సంస్థలు 5–20 శాతం తగ్గింపు అందిస్తున్నాయి. అధిక వెయిటింగ్ పీరియడ్ కోసం తగ్గింపు, డిడక్టబుల్స్, ధూమపానం చేయని వారికి డిస్కౌంట్, ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి (750 అంతకంటే ఎక్కువ), పాత కస్టమర్‌గా ఉండటం, సిటీ డిస్కౌంట్లు (మీరు జోన్–2లో నివసిస్తుంటే) వంటి అంశాలు వీటిలో ఉంటాయి. ► ఆరోగ్య బీమా సంస్థను ఎంచుకునేటప్పుడు ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే తుది నిర్ణయం తీసుకునే ముందు పాలసీ నిబంధనలు, షరతులను తప్పకుండా చదవాలని గుర్తుంచుకోండి. -
ఐసీఐసీఐ లాంబార్డ్ ‘నడిపిన మేరకు’ బీమా
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ.. ‘పే యాజ్ యూ డ్రైవ్’ పాలసీని కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్న పాలసీదారు తన వాహనాన్ని నడిపినంత దూరం మేరకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పైగా పాలసీదారుకు ఒకటికి మించిన వాహనాలు ఉంటే వాటన్నింటికీ ఈ ఒక్క ఫ్లోటర్ ప్లాన్ కవరేజీ ఆఫర్ చేస్తుంది. సంప్రదాయ మోటారు బీమా పాలసీలో ఉండే అన్ని కవరేజీలు.. ప్రమాద కవరేజీ, మూడో పక్షానికి నష్టం వాటిల్లితే పరిహారం, వాహనదారుకి వ్యక్తిగత ప్రమాద కవరేజీ ఇందులోనూ ఉంటాయి. ఈ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్లో పాలసీదారు వాహనాన్ని నడిపిన మేరకు కవరేజీ లభిస్తుంది. రెండో ఆప్షన్లో వాహనాన్ని ఏ విధంగా నడుపుతున్నారనే దాని ఆధారంగా ప్రీమియం ఉంటుంది. మంచి డ్రైవింగ్ చేసే వారికి ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ఇండింపెడెంట్ పాలసీలు కలిగి ఉన్న వారు ఈ ఫ్లోటర్ ప్లాన్‌లోకి మారిపోయే అవకాశాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది. -
సాధారణ బీమా కోసం పేటీఎం జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: సాధారణ బీమా కోసం ‘పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్’ (పీజీఐఎల్) పేరుతో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం మాతృ సంస్థ) నిర్ణయం తీసుకుంది. ఆరంభంలో వన్ 97 కమ్యూనికేషన్స్‌కు పీజీఐఎల్‌లో 49 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 51 శాతం వాటా సంస్థ ఎండీ శేఖర్ శర్మకు చెందిన వీఎస్ఎస్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ కలిగి ఉంటుందని స్టాక్ ఎక్సేంజ్‌లకు వన్ 97 కమ్యూనికేషన్స్ తెలియజేసింది. పీజీఐఎల్‌లో పదేళ్లలో రూ.950 కోట్లను వన్ 97 కమ్యూనికేషన్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పెట్టుబడుల తర్వాత జాయింట్ వెంచర్ కంపెనీలో వన్ 97 వాటా 74 శాతానికి పెరుగుతుంది. శేఖర్ శర్మ సొంత సంస్థ వాటా 26 శాతానికి తగ్గుతుంది. ఐఆర్డీఏఐ నుంచి వచ్చే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌కు లోబడి పీజీఐఎల్ కార్యకలాపాల ప్రారంభం ఆధారపడి ఉంటుందని వన్ 97 కమ్యూనికేషన్స్ తెలిపింది. -
స్థూల ప్రీమియం ఆదాయం 12 శాతం అప్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 10–12 శాతం మేర వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య బీమాపై అవగాహన పెరుగుతుండటం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటూ ఉండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థల (పీఎస్‌యూ) జీడీపీఐ వృద్ధి 4–6 శాతానికి పరిమితం కావచ్చని, ప్రైవేట్ రంగ ఇన్సూరెన్స్ సంస్థలు 13–15 శాతం మేర వృద్ధి చెందవచ్చని .. తద్వారా మార్కెట్ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 2022లో ప్రైవేట్ రయ్.. 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీఐ వృద్ధి 4 శాతానికే పరిమితం కాగా కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో 2022 ఆర్థిక సంవత్సరంలో జీడీపీఐ మెరుగుపడి 11 శాతానికి చేరిందని అంచనా వేస్తున్నట్లు ఇక్రా పేర్కొంది. పీఎస్‌యూ బీమా సంస్థల జీడీపీఐ వృద్ధి అయిదు శాతంగా ఉండొచ్చని, ప్రైవేట్ రంగ బీమా సంస్థల ప్రీమియం ఆదాయం మాత్రం 14 శాతం మేర పెరిగి ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా పాక్షికంగా లాక్డౌన్లు ఉన్నప్పటికీ 2021–22 తొలి 11 నెలల్లో హెల్త్ సెగ్మెంట్లో స్థూల ప్రీమియం ఆదాయాలు ఏకంగా 26 శాతం పెరగ్గా, అగ్నిప్రమాదాల బీమా విభాగం ప్రీమియం ఆదాయాలు 8 శాతం స్థాయిలో పెరిగాయని ఇక్రా వివరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం హెల్త్ క్లెయిమ్స్‌లో కోవిడ్ క్లెయిమ్‌ల వాటా 6 శాతంగా నమోదైంది. 2021–22లో ఇది 11–12 శాతంగా ఉంటుందని అంచనా. -
వాహనదారులకు ఇన్సూరెన్స్,రిలయన్స్‌తో వన్ మోటో ఇండియా జట్టు!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థ వన్ మోటో ఇండియా తమ కస్టమర్లకు వాహన బీమా సదుపాయం కల్పించేందుకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో చేతులు కలిపింది. కస్టమర్లకు సులభతరంగా ఇన్సూరెన్స్ సర్వీసులు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని వన్ మోటో ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రక్రియలో తాము కూడా పాలుపంచుకోనున్నట్లు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ఆనంద్ సింఘి తెలిపారు. బైకా, ఎలెక్టా, కమ్యూటా పేరిట వన్ మోటో ఇండియా మొత్తం మూడు స్కూటర్లను ఆవిష్కరించింది. తొలి దశలో రూ. 250 కోట్లతో 40,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. -
పేటీఎం చేతికి రహేజ క్యూబీఈ
ముంబై : పేటీఎం ఆర్థిక సేవలను విస్తరించేందుకు సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ముంబైకి చెందిన ప్రైవేట్ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రహేజ క్యూబీఈని కొనుగోలు చేయనున్నారు. రహేజ క్యూబీఈలో నూరు శాతం వాటాను పేటీఎం కొనుగోలు చేస్తుందని, ముంబై సహా వివిధ ప్రాంతాల్లో పనిచేసే క్యూబీఈ ఉద్యోగులు యథావిథిగా కొనసాగుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఒప్పందం విలువ రూ 568 కోట్లుగా భావిస్తున్నారు. పేటీఎం మాతృసంస్థ ఒన్97 రహేజా క్యూబీఈ కొనుగోలును వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. పేటీఎం ఆర్థిక సేవల ప్రయాణంలో ఇది కీలక మైలురాయని, పేటీఎం కుటుంబంలోకి రహేజా క్యూబీఈని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని పేటీఎం ప్రెసిడెంట్ అమిత్ నయ్యర్ పేర్కొన్నారు. పటిష్టమైన నిర్వహణ బృందం కలిగిన రహేజా క్యూబీఈ కొనుగోలుతో జనరల్ ఇన్సూరెన్స్‌ను పెద్దసంఖ్యలో భారతీయుల చెంతకు చేర్చేందుకు తమకు ఉపకరిస్తుందని అన్నారు. రహేజా క్యూబీఈలో ప్రిస్మ్ జాన్సన్‌కు 51 శాతం వాటా ఉండగా క్యూబీఈ ఆస్ర్టేలియా 49 శాతం వాటా కలిగిఉంది. చదవండి : జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు -
బజాజ్ నుంచి ‘హెల్త్, లైఫ్’ పాలసీ
హైదరాబాద్: వైద్య బీమా, జీవిత బీమా రెండు రకాల ప్రయోజనాలతో కలిసిన కాంబో పాలసీని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా తీసుకొచ్చాయి. బజాజ్ అలియాంజ్ టోటల్ హెల్త్ సెక్యూర్ గోల్ పేరుతో ఉన్న ఈ పాలసీ ద్వారా హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సల వ్యయాలతో పాటు, జీవితానికీ కవరేజీ లభిస్తుంది. రెండు వేర్వేరు పాలసీలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. ప్రస్తుతం బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఉన్న హెల్త్‌గార్డ్ పాలసీ, బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లోని బజాజ్ అలియాంజ్ ఐ సెక్యూర్ పాలసీ కాంబినేషన్ ఈ నూతన కాంబో పాలసీ. విడిగా రెండు పాలసీలు తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియంతో పోలిస్తే కాంబో పాలసీపై ప్రీమియం 5% తగ్గింపు ఉంటుందని ఈ కంపెనీలు ప్రకటించాయి. -
ప్రీమియం ఏడాదికే... కవరేజీ రెండేళ్లు!
హైదరాబాద్: ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఓ వినూత్నమైన యాడ్ ఆన్ ఫీచర్ ‘హెల్త్ 241’ని ప్రవేశపెట్టింది. కంపెనీ నుంచి కొత్తగా వైద్య బీమా పాలసీ తీసుకునే వారు, ఈ యాడ్ ఆన్‌ను జోడించుకోవచ్చు. దీని వల్ల మొదటి ఏడాది పాలసీ కాల వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం చెల్లించక్కర్లేదు. రెండో ఏడాది పూర్తి ఉచితంగా వైద్య బీమా కవరేజీ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దేశంలో ఈ తరహా సదుపాయాన్ని తీసుకొచ్చిన తొలి బీమా సంస్థ ఇదే. ‘‘మన దేశంలో బీమాను ఇప్పటికీ అదనపు వ్యయంగానే చూస్తున్నారు. యుక్త వయసులో ఉన్న వారు తాము ఆరోగ్యవంతులమని, క్లెయిమ్ అవసరం పడదు కనుక బీమా పాలసీ అక్కర్లేదనే భావనలో ఉన్నారు. ఈ తరహా కస్టమర్లకు హెల్త్ 241 యాడ్ ఆన్ విలువను అందిస్తుంది. మొదటి ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే, రెండో ఏడాది కూడా మాతోనే కొనసాగుతారు’’అని ఎడెల్వీజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో అనూప్ తెలిపారు. ఇక రీస్టోరేషన్, క్లెయిమ్ లేకపోతే తదుపరి ఏడాది బీమా మొత్తాన్ని 100 శాతం వరకు పెంచుకునే ఆప్షన్లు కూడా ఉన్నాయి. -
లాభాల్లోకి భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్
ముంబై: భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ (భారతీ ఎంటర్ప్రైజెస్, ఆక్సా గ్రూపు జాయింట్ వెంచర్) 2018–19వ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ సంవత్సర కాలానికి లాభాలార్జించినట్లు ప్రకటించింది. 2018 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య ప్రీమియం ఆదాయం 38 శాతం పెరిగి రూ.1,087 కోట్లుగా నమోదయిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఇది రూ.788 కోట్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. కంబైన్డ్ రేషియో (మొత్తం ప్రీమియం ఆదాయంలో క్లెయిమ్స్, ఖర్చులు పోను లాభదాయకతను తెలియజేసేది) 15 శాతం మెరుగుపడి అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 131.6 శాతం నుంచి 116.5 శాతానికి చేరినట్టు భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సంజీవ్ శ్రీనివాసన్ తెలిపారు. -
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో 4% వాటా విక్రయం
ముంబై: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4 శాతం వాటాను విక్రయించాలని ఎస్బీఐ నిర్ణయించింది. యాక్సిస్ ఏఎమ్‌సీ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థలు ప్రమోట్ చేస్తున్న ఫండ్స్ ఈ వాటాను కొనుగోలు చేయనున్నాయి. ఈ డీల్ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్ పరంగా చూస్తే, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ విలువ రూ.12,000 కోట్లని అంచనా. ఈ ఒప్పందంలో భాగంగా యాక్సిస్ ఏఎమ్‌సీ తరపున యాక్సిస్ న్యూ ఆపర్చునిటీస్ ఏఐఎఫ్–వన్ ఫండ్ 1.65 శాతం వాటాను, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన పీఐ ఆపర్చునిటీస్ ఫండ్–వన్ 2.35 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ వాటా విక్రయానంతరం ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఎస్బీఐకు 70 శాతం, జాయింట్ వెంచర్ భాగస్వామి ఐఏజీ ఇంటÆ -
ఇక బీమా ఐపీవోలు!
⇒ క్యూ కడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ⇒ త్వరలో ఎస్బీఐ, న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ ⇒ ఐపీవో యత్నాల్లో హెచ్డీఎఫ్సీ లైఫ్ న్యూఢిల్లీ: దిగ్గజ బీమా కంపెనీలు ఈ ఏడాది వరసగా పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. జాబితాలో ముందు వరసలో ఎస్బీఐ లైఫ్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఐ మ్యూచువల్ ఫండ్ నిలుస్తుండగా... ప్రైవేటు రంగానికి చెందిన మరో ప్రముఖ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ సైతం ఐపీవో సన్నాహాలు చేసుకుంటోంది. ఇవి ఐపీవోల ద్వారా రూ.20,000 కోట్ల నిధులను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీటిలో కొన్ని కంపెనీలు ఐపీవో ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించాయి కూడా. ఐపీవో ద్వారా షేర్ల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని ఎస్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఐపీవో ద్వారా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 10 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించే ప్రతిపాదనకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది కూడా. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గతేడాది రూ.6,000 కోట్లు సమీకరించడం ద్వారా స్టాక్ మార్కెట్లో నమోదైన విషయం తెలిసిందే. ఐపీవోకు వచ్చిన తొలి బీమా కంపెనీ ఇదే. హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 10 శాతం వాటా విక్రయించనున్నట్టు హెచ్డీఎఫ్సీ గతేడాది ఏప్రిల్‌లోనే ప్రకటించింది. అయితే మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తనలో విలీనం చేసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్లో నమోదవ్వాలని ఆ తర్వాత భావించింది. కానీ, ఈ ఒప్పందానికి ఐఆర్డీఏ అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో ఈ సంస్థ తిరిగి ఐపీవో ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత సాధారణ బీమా కంపెనీలే! ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.72,500 కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీలో 25 శాతం చొప్పున వాటాలను ప్రభుత్వం విక్రయించనుంది. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించిన ఐపీవోలకు మంచి స్పందన లభిస్తుందని, లిస్టింగ్ రోజే లాభాలకు అవకాశం ఉంటుందని క్వాంటమ్ ఏఎంసీ డైరెక్టర్ ఐవీ సుబ్రహ్మణ్యం చెప్పారు. అధిక ధరను ఖరారు చేసిన కంపెనీలు ఆకర్షణీయమైన ధరల వద్ద లిస్ట్ కాకపోవచ్చన్నారు. యూటీఐ ఐపీవో ఇక యూటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఐపీవోకు రావాలని ఎప్పటి నుంచో సన్నాహాల్లో ఉంది. దీన్లో ఎస్బీఐ, ఎల్ఐసీ, బీవోబీ, పీఎన్బీలకు 18.5 శాతం చొప్పున మొత్తం 74 శాతం వాటా ఉంది. తాజా ఐపీవో ద్వారా ఇవి తమ వాటాలో కొంత విక్రయించనున్నాయి. మిగిలిన 26 శాతం వాటా అమెరికాకు చెందిన టీరోవ్ ప్రైస్ సంస్థ చేతిలో ఉంది. ఐపీవోకు రానున్న తొలి మ్యూచువల్ ఫండ్ కంపెనీగా యూటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ నిలవనుంది. ఐపీవో మార్కెట్లో ఈ ఏడాది సందడి నెలకొననుందని, దాదాపు సగం కంపెనీలు ఇప్పటికే ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసి, అనుమతి కోసం వేచి ఉన్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. గతేడాది 26 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ.26,000 కోట్ల నిధులన్నీ సమీకరించాయి. గత ఆరు సంవత్సరాల్లో ఇదే రికార్డు. -
హెచ్డీఎఫ్సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ
హైదరాబాద్: దేశీ మూడో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా రూ.350 కోట్లను సమీకరించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) జారీ ద్వారా ఈ నిధులను సమీకరించినట్లు సంస్థ పేర్కొంది. వీటి కూపన్ రేటు 7.6%గా ఉందని తెలిపింది. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలు తర్వాత ఈ నిధుల సమీకరణ చేపట్టామని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రితేశ్ కుమార్ తెలిపారు. భవిష్యత్ వృద్ధి, మూలధన పెంపు, కంపెనీ ఆర్థిక పటిష్టత కోసం ఈ నిధులను సమీకరించామని పేర్కొన్నారు. ప్రముఖ దేశీ గృహ రుణాల సంస్థ ‘హెచ్డీఎఫ్సీ’, జర్మనీకి చెందిన మ్యూనిచ్ రె గ్రూప్ ప్రధాన ఇన్సూరెన్స్ సంస్థ ‘ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీ’ల జాయింట్ వెంచరే హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్. -
1,500 కోట్లతో అణు ప్రమాద నిధి
జనరల్ ఇన్సూరెన్స్ సహా 12 సంస్థలతో ఏర్పాటు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడి విదేశీ అణు సంస్థలకు నష్టపరిహారం బాధ్యత లేనట్లే! {పమాదం జరిగితే ఈ నిధి నుంచే పరిహారం న్యూఢిల్లీ: దేశంలో అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించే అంతర్జాతీయ అణు సంస్థలకు ప్రయోజనం కలిగించేలా... రూ.1,500 కోట్లతో అణు ప్రమాద బీమా నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఒకవేళ ఆయా అణు విద్యుత్ కేంద్రాల్లో ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఈ నిధి నుంచే నష్టపరిహారాన్ని చెల్లిస్తారు. తద్వారా విదేశీ అణు సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకున్నట్లే! ఈ విషయాన్ని అణు ఇంధన శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ శనివారం ఢిల్లీలో వెల్లడించారు. అణు ప్రమాద పరిహారం అంశం కారణంగానే ‘గోరఖ్‌పూర్ హరియాణా అణువిద్యుత్ పరియోజన’ వంటి పలు ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయాయని.. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేగాకుండా దేశంలో కొత్త అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తాయన్నారు. ఐదేళ్లలో విద్యుదుత్పత్తిని మూడింతలు చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పతుందని పేర్కొన్నారు. కాగా అణుశక్తిపై అపోహలను తొలగించేందుకు, అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని జాతీయ సైన్స్ సెంటర్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదాల బాధ్యత నుంచి అణు రియాక్టర్లు, పరికరాల సరఫరాదారులకు ఉపశమనం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేశారని అణుశక్తి విభాగం కార్యదర్శి ఆర్కే సిన్హా చెప్పారు. 12 సంస్థల ఆధ్వర్యంలో.. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)తో పాటు న్యూ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ తదితర 11 ఇతర జీవితబీమాయేతర సంస్థల ఆధ్వర్యంలో అణు ప్రమాద బీమా నిధిని ఏర్పాటు చేశారు. దీనికి కింద ‘న్యూక్లియర్ ఆపరేటర్స్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ’, ‘న్యూక్లియర్ సప్లయర్స్ స్పెషల్ కంటింజెన్సీ పాలసీ’లను అందిస్తారు. అయితే ఈ కంపెనీలన్నీ కలసినా ఇంకా రూ.600 కోట్లు తగ్గాయని.. అందులో వంద కోట్లను ఒక దేశీయ బీమా కంపెనీ, మిగతా రూ.500 కోట్లను బ్రిటిష్ అణు బీమా నిధితో భర్తీ చేస్తారని జీఐసీ జనరల్ మేనేజర్ వై.రాములు చెప్పారు. ట ఎందుకీ ఏర్పాటు..? యూపీఏ హయాంలో తెచ్చిన అణు ప్రమాదాల జవాబుదారీ చట్టం (సీఎల్‌ఎన్‌డీ) ప్రకారం... అణు విద్యుత్ కేంద్రాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ అణు రియాక్టర్లను సరఫరా చేసిన సంస్థల నుంచి నష్టపరిహారాన్ని పొందవచ్చు. ఈ నష్టపరిహారం అత్యంత భారీగా ఉండే నేపథ్యంలో విదేశీ సంస్థలు అణు రియాక్టర్ల సరఫరా, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై వెనుకడుగు వేశాయి. దీంతో ఒకవేళ అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగితే బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రత్యేకంగా ఒక బీమా నిధిని ఏర్పాటు చేస్తామని, కంపెనీలకు బాధ్యత లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అణు సంస్థలకు హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం రూ.1,500 కోట్లతో ‘అణు ప్రమాద బీమా నిధి’ని ఏర్పాటు చేసింది. -
సాధారణ బీమా రంగంలోకి కొటక్ గ్రూప్
ముంబై: కొటక్ మహీంద్రా బ్యాంక్ మంగళవారం సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించింది. ఈ రంగంలో సంస్థ రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టనుందని బ్యాంక్ ప్రెసిడెంట్ (అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్) గౌరంగ్ షా ఇక్కడ తెలిపారు. ‘‘సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించడానికి ఇప్పటికే రెగ్యులేటర్ ఐఆర్డీఏ నుంచి అనుమతి పొందాము. ఇందుకు సంబంధించి అనుబంధ సంస్థ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి తాజాగా అనుమతి లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచీ సంస్థ సాధారణ బీమా సేవలు ప్రారంభమవుతాయని భావిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. కొటక్ ప్రవేశంతో సార్వత్రిక బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం వెంచర్లో విదేశీ భాగస్వామ్యం కోసం చూడబోమని, భవిష్యత్తులో అవసరమైతే ఆలోచిస్తామని ఈ సందర్భంగా గౌరంగ్ అన్నారు.తాజా అనుబంధ విభాగం ద్వారా మొదటి ఐదేళ్లలో రూ.900 కోట్ల ప్రీమియంలు సమీకరించాలన్నది లక్ష్యమని షా తెలిపారు. కాగా 250 మంది సిబ్బందిని కొత్త వెంచర్ కార్యకలాపాల కోసం ఎంపిక చేసుకోనున్నట్లు జనరల్ ఇన్సూరెన్స్ వెంచర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ బాలసుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు. -
తుపాన్ క్లెయిమ్స్ కోసం..
హుదూద్ తుపాన్ వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి బీమా కంపెనీలు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి. బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హుదూద్ తుపాన్ బాధితుల కోసం 1800 209 7072 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను బజాజ్ అలయంజ్ ఏర్పాటు చేసింది. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు, క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఐసీఐసీఐ లాంబార్డ్ జరిగిన నష్టం వివరాలకు సంబంధించి తక్కువ కాగితాలను సమర్పించడం ద్వారా క్లెయిమ్‌ను వేగవంతంగా పరిష్కరించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు, సర్వేయర్ అంచనా, కేవైసీ నిబంధనలు ఇస్తే సరిపోతుంది. అలాగే వాహనానికి సంబంధించి ఆర్సీతో పాటు మరమ్మత్తులకు సంబంధించి మెకానిక్ ఇన్వాయిస్ బిల్ ఇస్తే సరిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీలైఫ్ జీవిత బీమా క్లెయిమ్‌లకు సంబంధించి హెచ్డీఎఫ్సీ లైఫ్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్లు 9885097340 అనే నెంబర్లో మహేశ్‌ని, విశాఖపట్నంలో 9848283713 అనే నంబర్లో రామ్.కే, ఒరిస్సా బరంపురంలో శ్రీధర్ పాండాని 9853257626 అనే నంబర్లలో సంప్రదించవచ్చు. ఇది కాకుండా 18602679999 అనే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సేవలు పొందవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కేవలం మూడు డాక్యుమెంట్లతో జీవిత బీమా క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ కోరుతూ రాత పూర్వక సమాచారంతో పాటు నామినీ ఫోటో గుర్తింపు కార్డు, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. 24 గంటలు సేవలు అందించడానికి 18602667766 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలను కలిపేయాలి
ముంబై: ఇప్పుడున్న నాలుగు ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) సాధారణ బీమా కంపెనీలన్నింటినీ విలీనం చేసి ఒకే కంపెనీగా ఏర్పాటు చేయాలని ఆయా సంస్థల ఉద్యోగ సంఘాలు(యూనియన్లు) డిమాండ్ చేశాయి. ప్రస్తుతం దేశంలో న్యూ ఇండియా ఎష్యూరెన్స్(ముంబై), నేషనల్ ఇన్సూరెన్స్(కోల్‌కతా), యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్(చెన్నై), ఓరియెంటల్ ఇన్సూరెన్స్(న్యూఢిల్లీ) పీఎస్‌యూలు సాధారణ బీమా(నాన్-లైఫ్ఇన్సూరెన్స్) కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మార్కెట్ వాటాను పటిష్టం చేయడం, లాభదాయకత పెంపునకు విలీనమే ఉత్తమమని యూనియన్లు పే ర్కొన్నాయి. ఈ 4 కంపెనీల బీమా ఆస్తుల (అసెట్స్) విలువ రూ.1,02,000 కోట్లుగా అంచనా. రూ.15,000 కోట్ల నగదు నిల్వలు, రూ.550 కోట్ల మూలధనం వీటికి ఉన్నాయి. ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా భారతీయ వీమా కామ్‌గార్ సేన(బీవీకేఎస్) ప్రతి నిధులు ఈ డిమాండ్‌ను వినిపిం చారు. ఈ 4 కంపెనీ ల యూనియన్లకూ బీవీకేఎస్లో ప్రాతినిధ్యం ఉంది. -
బీమాలో 49% ఎఫ్‌డీఐకి ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. తద్వారా ఈ రంగంలోకి రూ.25 వేల కోట్ల విదేశీ నిధుల రాకకు మార్గం సుగమం చేసింది. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదన 2008 నుంచి పెండింగులో ఉంది. ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిందని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ రంగంలో 26 శాతానికి మించిన పెట్టుబడి ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతి అవసరమనీ, యాజమాన్య అజమాయిషీ మాత్రం భారతీయ ప్రమోటర్ల చేతుల్లోని ఉంటుందనీ పేర్కొన్నాయి. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి ప్రధాన సంస్కరణ ఇదే. రక్షణ, రైల్వేల వంటి రంగాల్లోని ఎఫ్‌డీఐ పరిమితులను సడలిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేబినెట్ ఆమోదించిన బీమా చట్టాల (సవరణ) బిల్లును ఇక పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఇవే నిబంధనలు పెన్షన్ రంగానికి కూడా వర్తిస్తాయి. దేశంలో లైఫ్, నాన్ లైఫ్ రంగాల్లో ప్రస్తుతం రెండు డజన్లకు పైగా ప్రైవేట్ రంగ బీమా కంపెనీలు ఉన్నాయి. బీమా రంగానికి పెట్టుబడులు అవసరమనీ, కనుక ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచుతామనీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. సర్వత్రా హర్షం... యాజమాన్యాన్ని భారతీయుల చేతిలో ఉంచుతూనే ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడంవల్ల ఈ రంగానికి అత్యంత అవసరమైన దీర్ఘకాలిక నిధులు వస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం బహుముఖ ప్రభావం చూపుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ బీమా రంగ అభివృద్ధి పునరుద్ధరణకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీ మెరుగుపడుతుంది. - అమితాబ్ చౌదరి, ఫిక్కీ ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ బీమా రంగ సరళీకరణతో మోడీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు కట్టుబడి ఉందనే సందేశం గ్లోబల్ ఇన్వెస్టర్లకు వెళ్తుంది. దేశంలో ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంటు పునరుద్ధరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుంది. - రాణా కపూర్, అసోచామ్ అధ్యక్షుడు భారతీయ ప్రమోటర్ల యాజమాన్య అజమాయిషీపై తగినంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో మరో రూ.25 వేల కోట్ల వరకు అదనపు విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంది. - శశ్వత్ శర్మ, కేపీఎంజీ (ఇండియా) భాగస్వామి పెట్టుబడుల సెంటిమెంటు పునరుద్ధరణకు ఎఫ్‌డీఐ పరిమితి పెంపు ఎంతగానో దోహదపడుతుంది. - శరద్ జైపురియా, పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు ఎఫ్‌డీఐ పెంపునకు కేబినెట్ ఆమోదముద్రతో బీమా రంగానికి ఎంతో అవసరమైన దీర్ఘకాలిక మూలధనం సమకూరుతుంది. - రాజేశ్ సూద్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ -
బజాజ్ అలయంజ్ మహిళా బ్రాంచ్
న్యూఢిల్లీ: మహిళా బ్యాంక్ స్ఫూర్తితో బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ మహిళలుండే శాఖను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. అందరూ మహిళా ఉద్యోగులు ఉండే బీమా కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తొలి బీమా కంపెనీ తమదేనని బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, తపన్ సింఘాల్ తెలిపారు. ఈ బ్రాంచ్ కోసం త్వరలో మహిళా ఏజెంట్లను, ఉద్యోగులను నియమించుకుని, వారికి తగిన శిక్షణనిస్తామని వివరించారు. కుటుంబ బాధ్యత కోసం తమ వృత్తిగత బాధ్యతలను త్యాగం చేసిన మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని, వారి కెరీర్‌కు మళ్లీ ప్రారంభాన్నిస్తామని పేర్కొన్నారు. మొదటగా 5గురు మహిళా ఉద్యోగులు, 10 మహిళ ఏజెంట్లతో పుణే బ్రాంచ్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే మహిళ ఏజెంట్ల సంఖ్యను 60కు పెంచుతామని వివరించారు. అన్ని మెట్రో నగరాల్లో కూడా త్వరలో ఇలాంటి మహిళా బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని తపన్ సింఘాల్ పేర్కొన్నారు.