న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలు మరింత విస్తృతం కావాల్సిన ఆవశ్యకతపై ఇక్కడ జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశం చర్చించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. బీమా వ్యాప్తి, కవరేజీని పెంచడానికి రాష్ట్ర బీమా ప్రణాళికల కింద రాష్ట్రాలతో నిరంతర పరస్పర చర్యలు, చర్చల ద్వారా అవగాహన పెంపొందించడం అవసరమని సమావేశం భావించింది.
సాధారణ బీమా రంగానికి సంబంధించిన అనేక క్లిష్టమైన అంశాలను వివరంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య బీమా వృద్ధిని పెంచడానికి నగదు రహిత సదుపాయాలను విస్తరించాలని, చికిత్స ఖర్చులను ప్రామాణీకరించడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయం పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఆస్తి, పారామెట్రిక్ బీమా కవర్‌ల స్వీకరణను ప్రోత్సహించడం... అలాగే సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని కవర్ చేయడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించడం కీలకమని ఆర్థిక సేవల కార్యదర్శి ఉద్ఘాటించారు.
బీమా మోసాలను నిరోధించడానికి సిబిల్ స్కోర్‌తో అనుసంధానించే అవకాశంపై కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఆయా అంశాల అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ సేవల అధికారులకు కార్యదర్శి సూచించారు. నిరంతర సహకారం, ప్రయత్నాలతో బీమా రంగం వృద్ధి సులభతరం కావడానికి చర్యలు అవసరమని పేర్కొన్న ఆయన, ఈ బాటలో ప్రైవేట్– ప్రభుత్వ రంగ పరిశ్రమలతో తరచూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment