insurers
-
బజాజ్ అలియాంజ్ లైఫ్ సరికొత్త మైలురాయి
ముంబై: బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.లక్ష కోట్ల మైలు రాయిని అధిగమించాయి. దేశంలో టాప్–10 బీమా సంస్థలో వేగంగా వృద్ధిని సాధిస్తున్న కంపెనీల్లో ఒకటని తెలిపింది. 2019–20 నాటికి నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రూ.56,085 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. కంపెనీ పట్ల కస్టమర్లలో ఉన్న విశ్వాసానికి తాజా మైలురాయి నిదర్శనమని సంస్థ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ అభివరి్ణంచారు. గడిచిన మూడేళ్లుగా వ్యక్తిగత నూతన వ్యాపార ప్రీమియంలో ఏటా 41 శాతం చొప్పున వృద్ధిని సాధించినట్టు చెప్పారు. జీవిత బీమా పరిశ్రమలో బజాజ్ అలియాంజ్ లైఫ్ మార్కెట్ వాటా 2019–20 నాటికి 2.6 శాతంగా ఉంటే, 2022–23 నాటికి 5 శాతానికి పెరిగినట్టు తెలిపారు. ప్రైవేటు జీవిత బీమా మార్కెట్లో తమ వాటా 4.6 శాతం నుంచి 7.6 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. -
సాధారణ బీమా మరింత విస్తరించాలి
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలు మరింత విస్తృతం కావాల్సిన ఆవశ్యకతపై ఇక్కడ జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశం చర్చించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. బీమా వ్యాప్తి, కవరేజీని పెంచడానికి రాష్ట్ర బీమా ప్రణాళికల కింద రాష్ట్రాలతో నిరంతర పరస్పర చర్యలు, చర్చల ద్వారా అవగాహన పెంపొందించడం అవసరమని సమావేశం భావించింది. సాధారణ బీమా రంగానికి సంబంధించిన అనేక క్లిష్టమైన అంశాలను వివరంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా, ఆరోగ్య బీమా వృద్ధిని పెంచడానికి నగదు రహిత సదుపాయాలను విస్తరించాలని, చికిత్స ఖర్చులను ప్రామాణీకరించడం కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమన్వయం పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాలను తగ్గించడానికి ఆస్తి, పారామెట్రిక్ బీమా కవర్ల స్వీకరణను ప్రోత్సహించడం... అలాగే సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని కవర్ చేయడానికి తగిన యంత్రాంగాన్ని రూపొందించడం కీలకమని ఆర్థిక సేవల కార్యదర్శి ఉద్ఘాటించారు. బీమా మోసాలను నిరోధించడానికి సిబిల్ స్కోర్‌తో అనుసంధానించే అవకాశంపై కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఆయా అంశాల అమలుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ సేవల అధికారులకు కార్యదర్శి సూచించారు. నిరంతర సహకారం, ప్రయత్నాలతో బీమా రంగం వృద్ధి సులభతరం కావడానికి చర్యలు అవసరమని పేర్కొన్న ఆయన, ఈ బాటలో ప్రైవేట్– ప్రభుత్వ రంగ పరిశ్రమలతో తరచూ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. -
బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఔట్ పేషెంట్ (ఓపీడీ), ఇతర సేవలను అందించేందుకు డాక్టర్ల నెట్వర్క్ లేదా ఇతర ఆరోగ్య రంగ నిపుణులతో రిజిస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలని.. బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కోరింది. ‘‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీ ‘ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ’ (హెచ్‌పీఆర్)ని ఏర్పాటు చేసింది. ఇందులో నమోదిత డాక్టర్లు, ఇతర ఆరోగ్య రంగ నిపుణుల వివరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆధునిక, సంప్రదాయ ఆరోగ్య సేవలను అందించేందుకు ఇది సాయపడుతుంది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు సైతం పాలసీదారులకు ఓపీడీ, ఇతర సేవలు అందించేందుకు వీలుగా.. ఈ హెచ్‌పీఆర్ సాయంతో డాక్టర్లు/ఫిజీషియన్లు లేదా ఆరోగ్య రంగ నిపుణులతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి’’అని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. మెడికల్ ప్రాక్టీషనర్ల గుర్తింపు, ధ్రువీకరణకు హెచ్‌పీఆర్ ఐడీని ఉపయోగించుకోవాలని సూచించింది. -
అరగంటలో ఎల్ఐసీకి రూ.7,000కోట్లు మటాష్
న్యూఢిల్లీ : సిగరెట్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా ఉన్న ఐటీసీ దెబ్బకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఢమాల్‌మన్నాయి. దాదాపు 26 ఏళ్ల కనిష్టస్థాయిల వద్ద ఐటీసీ స్టాక్ అతిపెద్ద పతనాన్ని నమోదుచేస్తుండటంతో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో అగ్రగామిగా ఉన్న ఎల్ఐసీ అరగంటలో రూ.7000 కోట్లను కోల్పోయింది. ఈ సిగరెట్ కంపెనీలో 2017 జూన్30 నాటికి ఎల్ఐసీ 16.29 శాతం స్టేక్‌ను కలిగి ఉంది. దీని ప్రభావంతో ఎల్ఐసీ భారీ మొత్తంలో నష్టాలను ఎదుర్కొంటోంది. అంతేకాక అరగంట వ్యవధిలోనే 7వేల కోట్ల నష్టాలను నమోదుచేయడం ఇదే మొదటిసారి. ఈ నష్టాలంతటికీ ప్రధాన కారణం సోమవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో సిగరెట్ ఉత్పత్తులపై సెస్‌ను పెంచుతున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడమే. 28 శాతం జీఎస్టీతో పాటు, అదనంగా 5 శాతం సెస్‌ను విధిస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. దీంతో ఐటీసీ కంపెనీ షేర్లు మంగళవారం మార్నింగ్ ట్రేడింగ్‌లో 15 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ నష్టాలు ఎల్ఐసీకి దెబ్బకొట్టాయి. ఒక్క ఎల్ఐసీ మాత్రమే కాక, ఐటీసీలో పెట్టుబడులు పెట్టిన ఇతర ఇన్సూరర్స్‌కు కూడా నష్టాలు వాటిల్లాయి. మొత్తంగా ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.10వేల కోట్లను కోల్పోయాయి. గత నాలుగేళ్ల క్రితం నుంచి ఎల్ఐసీ, ఐటీసీలో తన వాటాను పెంచుకుంటూ వస్తోంది. దీంతో ఎల్ఐసీకి ఈ దెబ్బ అధికంగా కొట్టింది. నాలుగేళ్ల క్రితం ఐటీసీలో ఎల్ఐసీ వాటా 12.63 శాతంగా ఉండగా.. 2016 జూన్ నాటికి 14.34 శాతానికి ఎగిసింది. ఇటీవలే ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ కూడా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు టుబాకో మేజర్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని సపోర్టుచేశారు. కంపెనీలో షేర్లను కలిగి ఉండటం, కలిగి ఉండకపోవడం అనేది స్మోకింగ్ సమస్యపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. సిగరెట్ ఉత్పత్తుల కంపెనీల్లో ఎల్ఐసీ, ఇతర నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బొంబై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం నమోదైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా ఎల్ఐసీ ఈ విధంగా వాదించింది. కాగ, జీఎస్టీ కౌన్సిల్ పెంచిన సెస్‌తో సిగరెట్ ఉత్పత్తుల తయారీదారులు, ఎల్ఐసీ, ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా నష్టాలను ఎదుర్కోనున్నాయి. సిగరెట్ ఉత్పత్తుల తయారీదారులైతే వార్షికంగా రూ.5000 కోట్లను కోల్పోనున్నారు. -
ఎయిడ్స్ రోగులకూ బీమా పాలసీలు!
న్యూఢిల్లీ: హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల (పీఎల్హెచ్ఏ) కోసం కూడా బీమా కవరేజి లభించేలా చూడాలని జీవిత బీమా సంస్థలను బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ ఆదేశించింది. ఇందుకోసం తగిన పాలసీలను రూపొందించాలంటూ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. నిబంధనలను బట్టి అర్హత ఉన్న ఏ ఒక్క పీఎల్హెచ్ఏకి కూడా బీమా కవరేజిని నిరాకరించరాదంటూ ఐఆర్డీఏ పేర్కొంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా..లోక్‌సభకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలు వివ రించారు. సర్క్యులర్ ప్రకారం.. పాలసీ తీసుకునే సమయంలో పాలసీదారుకి హెచ్ఐవీ లేకున్నా .. ఆ తర్వాత అది సంక్రమించిన పక్షంలో క్లెయిమ్‌లను నిరాకరించరాదు. బీమా సంస్థల నుంచి ఈ ప్రతిపాదనలపై ఐఆర్డీఏ అభిప్రాయాలు ఆహ్వానించింది.