ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులకు ఈ–క్రాప్ విధానాన్ని వివరిస్తున్న వ్యవసాయాధికారులు
జరుగుమల్లి (టంగుటూరు): ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, అగ్రి బిజినెస్ హెడ్ ఆశిష్ అగర్వాల్‌లు ప్రశంసించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని రైతు భరోసా కేంద్రాన్ని అగ్రి నేషనల్ ఇన్సూరెన్స్ మేనేజర్ సుదేష్ణ, బజాజ్ ఇన్సూరెన్స్ స్టేట్ మేనేజర్ శాంతి భూషణ్, ఒంగోలు ఏడీఏ బి.రమేష్ బాబుతో కలిసి గురువారం వారు సందర్శించారు.
రబీ సీజన్ పంటల బీమాకు సంబంధించి (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ–క్రాప్ నమోదు, పంట కోత ప్రయోగాలు తదితర వివరాల గురించి వ్యవసాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటల్లో ఏ ఏ పంటలు లాభదాయకంగా ఉంటాయని రైతులను ఆరా తీశారు. పంట సాగు చేసిన వెంటనే ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించుకుంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టం సంభవిస్తే బీమా వర్తిస్తుందని రైతులకు వివరించారు.
రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను పంపిణీ చేస్తున్న తీరు, గత సంవంత్సరం రబీలో ఈ–క్రాప్ నమోదు చేయించుకున్న రైతుల రశీదులను ఈ సందర్భంగా వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని వారు కొనియాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిష్ అగర్వాల్ తదితరులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి స్వర్ణలత, ఏఈవో ఎన్.వెంకటేశ్వర్లు, వీఏఏ ఎల్.ప్రైసీ రీమల్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment