ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం | YSRCP Leaders comments At Samajika Sadhikara Bus Yatra | Sakshi
Sakshi News home page

ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం

Published Thu, Nov 9 2023 4:22 AM | Last Updated on Thu, Nov 9 2023 8:33 AM

YSRCP Leaders comments At Samajika Sadhikara Bus Yatra - Sakshi

కనిగిరిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. సామాన్యుల సంక్షేమమే సీఎం జగన్‌ ధ్యేయమని, సామాజిక సాధికారత మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పెద్దన్నలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు.

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చారని, దేశంలో ఇప్పటివరకు మరే ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు, వారి బాధలు స్వయంగా తెలుసుకుని సీఎం జగన్‌ న్యాయం చేశారని కొనియాడారు. అనేక పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.53 లక్షల కోట్లు ప్రజలకు సంక్షేమం అందించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రూ.1.76 లక్షల కోట్లు లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని అన్నారు. 
కనిగిరిలో జరిగిన బహిరంగసభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం 

బడుగుల ఆత్మ బంధువు సీఎం జగన్‌: మంత్రి సురేష్‌
బడుగు, బలహీనవర్గాల ఆత్మ బంధువు సీఎం జగన్‌ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. పేదరికం పిల్లలకు విద్యను దూరం చేయకూడదనే సంకల్పంతో సీఎం జగన్‌ నిరుపేదలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. దళితుడినైన తనను విద్యా శాఖ మంత్రిని చేయడం సాధికారత కాదా అని ప్రశ్నించారు. ఇంగ్లిష్‌ మీడియంపై గొడవ పెట్టిన టీడీపీ, జనసేన నేతలకు పేద బిడ్డలు మంచి చదువులు చదవడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌కు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని సవాల్‌ చేశారు.

ఇంత మేలు మరే రాష్ట్రంలో జరగలేదు: ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలు ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చెప్పారు. మొట్టమొదటిసారి దేశంలో మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నియమించడం, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నాలుగు పదవులు ఇవే సామాజిక వర్గాల వారికివ్వడం సీఎం జగన్‌కే సాధ్యమైందన్నారు.  నాలుగు ఎమ్మెల్సీ, 12 రాష్ట్రస్థాయి చైర్మన్‌ పోస్టులు ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌కే దక్కుతోందన్నారు. ఏకంగా ముస్లిం మహిళను మండలి డిప్యూటీ చైర్మన్‌గా నియమించి చరిత్ర సృష్టించారన్నారు.

బీసీలను అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతం: ఎంపీ బీద మస్తాన్‌రావు
బీసీలను ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని, అధికారంలోకి వచ్చాక అణగదొక్కడమే చంద్రబాబు సిద్ధాంతమని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు చెప్పారు. 30 ఏళ్లు టీడీపీలో పనిచేసిన తనకు అనేకమార్లు రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్‌ నలుగురు బీసీలకు రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారని, దేశ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయమని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తాను, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు వంటి తామే సీఎం జగన్‌ సామాజిక సాధికారత తెచ్చారనడానికి ఉదాహరణ అని చెప్పారు.

కనిగిరిలో రూ.3,471 కోట్లతో అభివృద్ధి :  ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు
సామాన్యుడినైన తనను శాసన సభ్యుడిగా చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ అండతో కనిగిరిలో రూ. 3,471 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా చేసి వెనుకబడిన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. 18 వేల ఇళ్లకు ఇంటింటి కుళాయిలు ఇచ్చేందుకు రూ. 125 కోట్లతో పనులు వేగంగా జరుగు­తున్నాయని, రూ. 150 కోట్లతో జేజేఎం ద్వారా పనులు చేపడుతున్నామని తెలిపారు. కనిగిరిలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కనిగిరి ప్రజలకు మంచి నీటిని అందించేందుకు రూ.1,250 కోట్లతో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు టెండర్ల దశలో ఉందని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement