గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముస్తఫా, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు
సీఎం వైఎస్ జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో 19 నియోజకవర్గాల్లో విజయవంతంగా సాగాయి. వీటికి వస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు, జగనే కావాలి – జగనే రావాలి’ అంటూ నినదిస్తున్నారు. యాత్రలో భాగంగా పలు చోట్ల బైక్, కారు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తోన్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదలివస్తుండటంతో సభా ప్రాంగణాలు జనసంద్రాలుగా మారుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవానికి తెరతీశారని రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున చెప్పారు. దేశంలో గరీబీ హటావో వంటి నినాదాలు ఎన్ని వచ్చినా పేదవాడి తలరాతని మార్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. దళితులు, బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పాలనకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలనకు తేడా గమనించాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మాయాబజారు సెంటర్‌లో స్థానిక ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కుల, మత, ప్రాంత, పార్టీల వివక్ష చూపకుండా సామాజిక న్యాయం పాటించి ప్రతి ఒక్కరికీ మేలు చేశారని మంత్రి సురేష్ చెప్పారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే కలగలిపితే అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. డాక్టర్ వైఎస్సార్ మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్‌ల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ప్రతి అంశంలోనూ వారికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కనీసం మైనార్టీలను పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేవన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
2019లో 22వ స్థానంలో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి వైఎస్ జగన్ పాలనలో మొదటి స్థానానికి రావడం అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భావజాలమే ప్రజలను మోసం చేయడమన్నారు. చంద్రబాబు ఆఖరికి న్యాయమూర్తికి కూడా అబద్ధాలు చెప్పి ఒక్క రోజు ఆసుపత్రిలో ఉండి, రెండో రోజే ఇంటికి వచ్చి కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సభకు హాజరైన అశేష జన సందోహంలో ఓ భాగం
చంద్రబాబు అంటే అబద్ధం.. వైఎస్ జగన్ అంటే నిజం
రాష్ట్రంలో అధిక భాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులానే చూశాయని, సీఎం వైఎస్ జగన్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి, బలహీన వర్గాల పక్షమని చాటి చెప్పారని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు అంటేనే అబద్ధమని, సీఎం జగన్ అంటే నిజమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ పునాది వేశారన్నారు.
సమ సమాజ స్థాపన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అణగారిన వర్గాలను అవమానించి, అణచివేశారని, సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రూ. 2.35 లక్షల కోట్లు నేరుగా అందజేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు.
సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో పేదరిక నిర్మూలనకు, పేదలకు ఆస్తుల కల్పనకు కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. సీఎం జగన్ పాలన దేశంలోనే ఓ చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏసీల్లో కూర్చొని మాట్లాడుకునే చంద్రబాబు, పవన్, లోకేశ్‌లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. వైఎస్ జగన్ చేసిన మేలును చూశారు కాబట్టే ఆయన కటౌట్ చూసి ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
2024 ఎన్నికల్లో సీఎం జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన వైద్యం, విద్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరిఫాతిమా చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment